13

ఆనందవిహారి

దేశ రాజధానిలో ఎన్. ఆర్. చందూర్ జగతి పురస్కార ప్రదానోత్సవం

వివిధ పత్రికలలో పని చేసి సుమారు 55 ఏళ్లపాటు ‘ జగతి ’ పత్రికను నిర్వహించిన ప్రముఖ పాత్రికేయులు ఎన్. ఆర్. చందూర్ స్మారకార్థం వారి కుటుంబ సభ్యులు, అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు స్మారక సమితి సంయుక్తంగా ప్రతి సంవత్సరం అందిస్తున్న పురస్కార ప్రదానోత్సవం ఫిబ్రవరి 21 వ తేదీన దేశ రాజధాని ఢిల్లీ లో ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు నివాసంలో జరిగింది.

ప్రారంభంలో అనేక తెలుగు, ఆంగ్ల పత్రికలలో పని చేసి అనంతరం అమెరికాలో డాటన్ డైలీ న్యూస్, వాల్ స్ట్రీట్ జర్నల్, వాషింగ్టన్ పోస్ట్ పత్రికలలో వివిధ స్థాయిల్లో పని చేసి మానేజింగ్ ఎడిటర్ స్థాయికి చేరి అంతర్జాతీయ స్థాయిలో పేరు పొందిన పాత్రికేయులు, తెలుగు వారైన నరిశెట్టి రాజు ఈ సంవత్సరం ఈ పురస్కారాన్ని ఉప రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. భారత దేశంలో ‘ మింట్ ’ అనే పత్రికను ప్రారంభించి విజయవంతంగా నిర్వహిస్తున్న రాజు ప్రస్తుతం అమెరికాలోని గిజ్ మోడో గ్రూప్ సిఇవో గా బాధ్యతలతో బాటు వికిపీడియా ఫౌండేషన్ ట్రస్టీ గా ఉన్నారు.

ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ రాజకీయ పార్టీలే పత్రికలను నిర్వహించడం వలన పారదర్శకత కొరవడుతుందని, మీడియా కు స్వీయ నియంత్రణ అవసరమని, పాత్రికేయ విలువలు తప్పక పాటించాలని పేర్కొన్నారు. ప్రముఖ సీనియర్ పాత్రికేయులు నరిశెట్టి ఇన్నయ్య కుమారుడైన రాజు అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకోవడం తెలుగువారందరికి గర్వకారణమని ఆయన అన్నారు.

సుప్రీం కోర్ట్ న్యాయమూర్తి లావు నాగేశ్వరరావు మాట్లాడుతూ పత్రికలు విలువలు పాటించాలని అన్నారు. ఎన్నో కష్టాలకోర్చి సుదీర్ఘ కాలం ‘ జగతి ’ పత్రికను నిర్వహించి జర్నలిజానికే వన్నె తెచ్చిన ఎన్. ఆర్. చందూర్ గారి పేరు మీద ఏర్పాటు చేసిన పురస్కారాన్ని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా అందుకోవడం ఆనందంగా ఉందని పురస్కార గ్రహీత నరిశెట్టి రాజు అన్నారు.

 

ఈ కార్యక్రమంలో వెంకయ్య సతీమణి ఉష, ప్రముఖ రచయిత, కేంద్రీయ హిందీ సమితి సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు స్మారక సమితి కార్యదర్శి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కల్పనా గుప్తా తన వ్యాఖ్యానంతో ఈ కార్యక్రమం నిర్వహించారు.

 

 

 

 

 

***********************************************************

నెలవంక – నెమలీక పురస్కార ప్రదానోత్సవం

నెలవంక – నెమలీక సాహిత్య మాస పత్రిక సౌజన్యంతో ఫిబ్రవరి 25 వ తేదీ ఆదివారం ఉదయం హైదరాబాద్ లోని కళా సుబ్బారావు కళా వేదిక – శ్రీ త్యాగరాయ గాన సభ నందు తెలుగు కవిత, విమర్శ – సమీక్ష విభాగాల్లో  శ్రీ జింకా చెన్నరాయ కిశోర్ స్మారక – మహాంధ్రభారతి పురస్కార ప్రదానోత్సవం జరిగింది. నెలవంక – నెమలీక పత్రిక సంపాదకులు లక్కరాజు దేవి, కవి రచయిత యెక్కలూరి శ్రీరాములు సంయుక్తంగా సభకు అధ్యక్షత వహించారు. ప్రముఖ విమర్శకులు, కవి, రచయిత వాడ్రేవు చినవీరభద్రుడు ముఖ్య అతిథిగా, శ్రీ త్యాగరాయ గాన సభ అధ్యక్షులు కళా జనార్ధనమూర్తి గౌరవ అతిథిగా పాల్గొన్నారు.

రాష్ట స్థాయి తెలుగు కవిత ల పోటీలో అత్యుత్తమంగా ఎంపికైన కవితలకు, విమర్శ – సమీక్షా విభాగంలో అత్యుత్తమ వ్యాసాలకు బహుమతులను అందించారు.

విమర్శ – సమీక్ష విభాగంలో చేమకూర వెంకటకవి రచన ‘ సారంగధరచరిత్ర ’ పై యర్రమిల్లి శారద సమీక్షావ్యాసం తో బాటు డా. పి. వి. లక్ష్మణరావు, నాగుముడి లక్ష్మీరాఘవరావు వ్యాసాలు ఎంపికయ్యాయి.

అనంతరం కథా విభాగంలో శ్రీ గోలి వెంకటరామయ్య స్మారక సాహితీ పురస్కారానికి ఎంపికైన అత్యుత్తమ కథలు ఆరింటికి, ప్రత్యేక కథా పురస్కారానికి మరో రెండు కథలకు బహుమతులను అందించారు.

********************************************************

 

12. మందాకిని…                                                                                                            14. వార్తావళి….