09_019 అమెరికా ఇల్లాలి ముచ్చట్లు – మట్టిబొమ్మ

 

మిమ్మల్ని ఓ ప్రశ్న అడిగాను..గుర్తుందా? నా ప్రశ్నకు మీరు సమాధానం చెప్పకపోయినా, పల్లెటూరి పిల్లను ఎందుకు పెళ్ళి చేసుకున్నారో నాకు తెలుసు లేండి!

మీతో నా పెళ్ళి కుదిరిందనగానే మా చుట్టాలే కాదు, మా ఊళ్ళోవాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు తెలుసా?!

మద్రాసులో చదువుకుని, బొంబాయిలో ఉద్యోగం చేస్తూ, అక్కడినుంచి అమెరికా వెళ్ళిన అబ్బాయి ఎక్కడో మారుమూల పల్లెటూరిలో పెరిగిన పిల్లను ఎందుకు చేసుకుంటున్నాడూ అని పెద్ద క్వస్చెన్ మార్క్!

వాళ్ళకే కాదు నాక్కూడా అదే డవుట్ వచ్చింది! ఇంత చదువుకుని, బోలెడంత తెలివి పెట్టుకుని పెళ్ళి  విషయానికొచ్చేసరికి ఇలా పప్పులో కాలేసారేమిటబ్బా అని అనుకునేదాన్ని. కానీ ఆ డవుటు అమెరికా వచ్చిన కొద్ది రోజుల్లోనే తీరిపోయిందిలేండి!

మా చిన్నతనంలో వర్షాకాలంలో బాగా వాన పడితే, బురదలో పిల్లలు నడవలేరని బడి మూసేసే వారు. వెంటనే  పిల్లలందరం చెరువు గట్టు కెళ్ళి  ఇంతింత మట్టిముద్దలు తెచ్చుకుని, పంచ చివర్లో కూర్చుని హాయిగా ఇష్టం వచ్చినన్ని బొమ్మలు చేసుకునేవాళ్ళం. మొదట్లో అవి మట్టిముద్దలుగా ఉన్నా, మా చేతుల్లో పడగానే వాటికి చక్కటి ఆకారం వచ్చేది. వాటన్నిటితో రోజులు తరబడి ఆడుకునేవాళ్ళం! మా పెద్దన్నయ్య మా అందరికీ గురువు. మేమందరం చిన్న చిన్న బొమ్మలు చేసుకుంటే వాడు మాత్రం ఏనుగు అంబారి, కొండమీద హనుమంతుడు లాంటి పెద్ద బొమ్మలు భలేగా చేసేవాడు!

ఏమిటీ..”కమ్ టు ద పాయింట్” అంటారా ?

అబ్బ! వస్తాల్లెండి. మీకు అన్నింటికీ తొందరే! నిదానంగా లైఫ్ ని ఎంజాయ్ చెయ్యటం తెలీదు గదా? నలభై ఏళ్ళు వెనక్కి వెళ్ళి చూసుకుంటే అప్పుడు నేనూ ఒక మట్టి ముద్దనే. మీరు ఆ ముద్దను తెచ్చి ఇక్కడ ఈ అమెరికాలో పడేసారు.

మీకు గుర్తుందా? ఆ రోజుల్లో మీ స్నేహితులందరూ ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేవారు మనింటికి. మీ స్నేహితుల భార్యలందరూ చదువుకున్న వాళ్ళే. వాళ్ళతో మాట్లాడాలంటే నాకు భయంగా ఉండేది. మీ ఫ్రెండ్ రామారావు వైఫ్, ఆయన కంటే ఎక్కువ చదువుకుందని మీరు అంటుండే వారు. చదువుకోడం అయితే చదువుకుంది గాని, పాపం ఆవిడకు కాఫీ చెయ్యడం కూడా రాదు. ఆ పూర్ మాన్ ని చూస్తే నాకు జాలేసేది. రామారావు గారు మనింటికి ఎప్పుడు వచ్చినా ఫుడ్డుకు మొహం వాచినట్లు తినేవారు. నా పల్లెటూరి వంటల్ని ఒకటే మెచ్చుకునే వారు! మీ ఇంకో ఫ్రెండ్ శర్మ గారు గుర్తున్నారా? మీరందరూ లివింగ్ రూమ్ లో టీవీకి అతుక్కుపోయినా, ఆయన మాత్రం “సిస్టర్..సిస్టర్” అంటూ నేను వంట చేస్తున్నంతసేపూ కిచెన్ లో కూర్చుని నాతో కబుర్లు చెబుతూ ఉండేవారు. ఆయనదీ మావైపే కృష్ణాజిల్లా. ఆయన వైఫ్ మాత్రం ఆ టీవీ ముందు నుంచి కదిలేది కాదు. మాగాళ్ళతో సమానంగా ఫైట్స్ తో సహా అన్నీ చూసేది. ఆవిడకు తెలియని విషయం అంటూ లేదు. గొంతెండిపోయినప్పుడల్లా తాగడానికి మొగుడి చేత తెప్పించుకునేది!

శని, ఆదివారాలు వస్తే ఏదో వంకన పార్టీలు చేసుకునే వాళ్ళం! ఇప్పటికీ “పార్టీ” అనగానే నాకు మన రెడ్డిగారి భార్య శోభన గారు గుర్తుకొస్తారు. ఆవిడ పెద్దగా చదువుకోక పోయినా, తన పుట్టింటి వాళ్ళు బాగా ఉన్నవాళ్ళని ఆవిడకు గర్వంగా ఉండేది. ఎవ్వరితో కలిసేది కాదు. కానీ.. పార్టీ అంటే చాలు, పెళ్ళికి వాళ్ళవాళ్ళు చేయించిన నగలన్నీ వేసుకు వచ్చేది!

మీకు గుర్తుందో లేదో అందరం పార్టీల్లో కలుసుకున్నప్పుడు సరదాగా గడిపినా, అప్పుడప్పుడు చిలికి చిలికి గాలివాన అయ్యేది. మీ ఇంకో ఫ్రెండు…అదేనండీ సత్యన్నారాయణ గారు, ఆయన భార్యకు ముక్కుమీద ఉండేది కోపం. ఆవిడ మాట నెగ్గకపోతే మొగుడని కూడా చూడకుండా, నలుగురిలో దులిపి పారేసేది. మాములుగా “ఆష్ భూష్” అంటూ ఎప్పుడూ ఇంగ్లీషులో మాట్లాడే ఆవిడ, కోపం వచ్చినప్పుడు మాత్రం మొగుడ్ని పచ్చి తెలుగులో చెడామడా వాయించేది!వాళ్ళందర్నీ శాంత పరచడానికి మీ తాతలు దిగొచ్చేవారు.

మీరు పైకి చెప్పకపోయినా పెద్దగా చదువుకోని ఈ పల్లెటూరి అమ్మాయిని ఎందుకు చేసుకున్నారో నాకు నెమ్మదిమీద అర్ధమై౦ది లేండి!

ఆ సంగతి తెలీక మొదట్లో “పాపం” అని అనవసరంగా మీ మీద బోలెడు జాలిపడ్డాను!! 

                                                                         **************** ***************                              మరో ముచ్చట వచ్చే సంచికలో….