09_019 ఆనందవిహారి – తర్క రమణీయం

 

“నెట్” ఇంటి సమావేశాలు ప్రారంభించిన అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి

 

ఎన్నో దైనందిన సమస్యల మధ్య నవ్వుతూ జీవించే భరోసాను తన సాహితీ తర్కంతో  తెలుగువారికి అందించిన ముళ్ళపూడి చిరస్మరణీయుడని శ్రీమతి రామనాథ్ ప్రశంసించారు. 

కరోనా మహమ్మారి కారణంగా విధింపబడిన లాక్ డౌన్ వల్ల స్థానికంగా జరిగే తెలుగు కార్యక్రమాలు కూడా ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో సాహితీప్రియులను అలరించేందుకు అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి యూట్యూబ్ ద్వారా “నెల నెలా వెన్నెల” కార్యక్రమాలను ప్రారంభించింది. శనివారం సాయంత్రం ప్రసారమైన మొదటి కార్యక్రమంలో “ముళ్ళపూడి వారి రచనలలో తర్క రమణీయం” అంశంపై చెన్నైకి చెందిన సాహితీవేత్త బాలాంత్రపు శ్రీమతీ రామనాథ్ ప్రసంగించి ఆద్యంతం కట్టిపడేశారు. 

ప్రముఖ రచయిత ముళ్ళపూడి వెంకట రమణ 89వ జయంతి సందర్భంగా ఏర్పాటైన ఈ కార్యక్రమంలో… వక్త ఆయన రచనలలోని ఇతివృత్తాలను గురించి మాట్లాడుతూ… 

మధ్య తరగతి జీవితాల్లో ఎదురయ్యే సాధారణ సందర్భాలు, సందిగ్ధాలు, సంకటాలు, సంబరాలను తన చిలిపితనపు దృక్కోణంతో, సమయస్ఫూర్తితో చూస్తారని అన్నారు. తద్వారా మనల్ని పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తారని చెప్పారు. అసమాన పాత్రశిల్పిగా చిచ్చరపిడుగు వంటి బుడుగు, ఇంకా  అప్పారావు తదితర పాత్రలను సృష్టించి తెలుగువారి గుండెల్లో శాశ్వతంగా నిలిపారని గుర్తు చేశారు.

కలిసి పుట్టని కవలలుగా బాపూ రమణలని పేర్కొంటూ… చిత్రకారుడైన బాపు కుంచె రమణ సృష్టించిన పాత్రలతో మాట్లాడించగా, రచయిత అయిన రమణ మాటలు పద చిత్రాలను గీస్తాయని, పాఠకులకు, ప్రేక్షకులకు ఇదొక చిత్రమైన రసజ్ఞానుభవమని అభివర్ణించారు. 

ముళ్ళపూడి రచనలలో లాజిక్ (తర్కం) ‘ఔరా!’ అనిపించే మ్యాజిక్ అని ప్రశంసించారు. సమయస్ఫూర్తి, వాక్చాతుర్యం అందులోని మసాలాలైతే, తనదైన ముద్రతో వెలువడే నానుడులు, లోకోక్తులు ఘాటైన పోపు అని, ఆయన చేసిన భాషాసేవకు అవి తలమానికాలని అభివర్ణించారు. తనదైన శైలిలో తెలుగు వ్యవహార భాషకు తిరుగులేని స్వంతదారుడైన వాక్చిత్రకారుడని ప్రశంసించారు.

స్వయంకృషితో సాహిత్య లోకంలో ఎదిగి, వాక్చాతుర్యం, సామాజిక స్పృహ, భాషా ప్రావీణ్యం, మేధస్సులను ఉపయోగించి చిన్న మార్పులతో తెలుగు జాతీయాలు, నుడికారాలను కొత్త అర్థాలు స్ఫూరించేలా తిరగ రాసిన స్రష్టగా  రమణను పేర్కొన్నారు. “పప్పులో కాలు వేయడం”కు బదులుగా “తప్పులో కాలు వేయడం” అనడం, ఒకే అర్థాన్ని చెప్పే తెలుగులోని “కాళ్ళా వేళ్ళా పడడం”, ఆంగ్లంలోని “టు గో ఆన్ వన్స్ బెండెడ్ నీస్” ను కలిపి “మోకాళ్ళా వేళ్ళా పడటం”గా మార్చడం, ఎవరూ పట్టించుకోని ఇజం సోషలిజం అని, ఎవరూ వినిపించుకోని లెక్చర్లని “కంఠసోషలిజం” గా పేర్కొనడం ముళ్ళపూడికే చెల్లిందని వక్త పేర్కొని నవ్వించారు. కవి అనగానే గుర్తొచ్చే పేరు కాళిదాస్ అయితే, కానీకి పనికిరాని కవి “కాళిదోస్” అంటూ చమత్కరించారన్నారు. ఆయన మార్కు పదాలు వ్యాకరణ సూత్రాల నిబంధనల్ని తెంచేసుకొని పరిగెడతాయని, సంభాషణల రచయితగా ఉన్నత స్థానంలో నిలిపాయని వివరించారు. 

అవి జీవన రహస్యాన్నో, ఆత్మ విమర్శనో, గాఢమైన అవమానాన్నో సుతారంగా వివారిస్తాయని అంటూ ఆయన ఆత్మకథలోని కొన్ని మాటలను ఉదహరించారు. ఈ తర్కమే అద్భుతమైన పద చిత్రాలను వేయిస్తుందని అన్నారు. 

రమణ కథల్లో తర్కం అనూహ్యంగా, అసాధారణంగా మెరుపులు సృష్టిస్తుంది. ఒకచోట నవ్విస్తే, మరొక చోట కన్నీళ్ళు పెట్టిస్తుందని, ఇంకొక చోట వేదాంత సత్యాలను వెల్లడిస్తుందని వివరించారు. ముళ్ళపూడి కథకి కొసమెరుపు ఉంటుందని పేర్కొంటూ.. 

ఒక కథలో ‘కృతజ్ఞత’ అంటే ఏమిటని చర్చిస్తారన్నారు. అందులో చివరగా “ఈ లోకంలో ఎదుటివాడి నుంచి కృతజ్ఞతను ఆశించడం కన్నా ఆంధ్ర రాజకీయ నాయకులలో ఐకమత్యాన్ని, కార్యశూరత్వాన్ని ఆశించవోయ్” అనడంలో ఆయన ఘాటైన వ్యంగ్యం తెలుస్తుందని అన్నారు. 

ఆయన రాసిన కథలలోని కొన్ని సంఘటనలను, వాటిలోని ఆయన తర్కాన్ని వివరించారు. పైకి చిన్నగా కనిపించినా సముద్రం లోపల ఎంతో పెద్దదిగా ఉండే మంచు ఖండాన్ని మొత్తంగా చూసేందుకు గజ ఈతగాళ్ళు కావలసినట్టు ముళ్ళపూడి సాహిత్య రసకేళిని రుచి చూడాలంటే ఎంతో ప్రజ్ఞ కావాలని, చదివినదాన్నే మళ్ళీ మళ్ళీ చదవాలని అభిప్రాయపడ్డారు. ఆయన సాహిత్యానికి, సినిరంగానికి చేసిన సేవ ఒక ఎత్తైతే, ఆయన తర్కం సగటు జీవితంలోని కష్టాలని,  సమస్యలని హుందాగా ఎదుర్కొంటూ నవ్వుతూ జీవించగలిగే భరోసాని తెలుగువారికి ఇవ్వడం మరొక ఎత్తని పేర్కొన్నారు. ఇది మానసిక నిపుణులు కూడా అందించలేని గొప్ప సేవ అని, ఇది రమణీయమైందని కొనియాడుతూ బాలాంత్రపు శ్రీమతీ రామనాథ్ తన ప్రసంగాన్ని ముగించారు. 

సంస్థ వేదిక మీద నిర్వహించిన అనేక  కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన డా. కల్పనా గుప్తా కార్యక్రమాన్ని కూడా సమర్థవంతంగా నిర్వహించారు. తమ మొదటి సాంకేతిక కార్యక్రమాన్ని పేక్షకులు ఆదరించడం ఆనందంగా ఉందని, నగరంలో పరిస్థితి చక్కబడేవరకు ప్రతి నెలా ఆసక్తికరమైన కార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేయగలమని సంస్థ అధ్యక్షులు “అజంతా” కె శంకరరావు తెలిపారు. 

విజయవాడ వాస్తవ్యులు, “శిరాకదంబం” అంతర్జాల పత్రిక వ్యవస్థాపకులు అయిన శిష్ట్లా రామచంద్రరావు ఈ కార్యక్రమానికి సాంకేతిక సహకారాన్ని అందించారు. 

************************** **************************

ఈ కార్యక్రమం ఈ క్రింది వీడియో లో….