09_019 కొ.కు. – దిబ్బకథలు 1

మొదటి భాగం

కొడవటిగంటి కుటుంబరావు గారి సాహిత్యాన్ని కొన్ని సంపుటాలు గా విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ అనే సంస్థ వారు ప్రచురించారు. ఈ సంపుటాల లోని ఆరవ సంపుటం లో ఈ కథ ఉంది. దీనితో పాటు  దిబ్బప్రభువు గారితో ఇంటర్వ్యూ ’, ‘ దిబ్బ రాజు గారి ప్రతిష్ట ’, ‘ దిబ్బ రాజ్యంలో ప్రజాస్వామికం ’, ‘ దిబ్బ మతం ’, ‘ జాతి కుక్కలూ నాటుకుక్కలూ ’,’  దిబ్బ రాజ్యంలో స్వాతంత్ర్యం ’, ‘ ఆదర్శ ప్రభువు ’ అనే కథలు కూడా ఉన్నాయి. ఇంకొన్ని కథలలో దిబ్బ ప్రస్తావన ఉంది. ఈ సంపుటం మొత్తం 584 పేజీల తో అనేకమైన కథలను కలిగి ఉంది.

ఈ దిబ్బ కథలన్నీ కలిపితే ఒకటే కథ అవుతుంది. మొత్తంగా కథ వ్యంగ్యంగా సాగుతుంది. ఏ సిద్ధాంతాలను ప్రతిపాదించదు కానీ పాలకుల, పాలితుల తెలివితక్కువతనం యొక్క ఫలితాలను తెలియజేస్తుంది.
ఈ కథలను పరిచయం కోసం ఎన్నుకోవడానికి కారణం – ఈ కథలతో కుటుంబరావు గారు ఏమీ విషయం లేకుండా ఏకబిగిన చదివించగల కధలు రాయవచ్చు అని నిరూపించారు.
కథలలో ప్రస్తావించబడిన కాలం స్వాతంత్ర్య పోరాటం, స్వరాజ్యం సాధించిన కొత్త రోజులు మొదలు ఇందిరాగాంధీ రాజభరణాలను రద్దుచేయడం వరకూ.
స్వాతంత్ర్య సంగ్రామ సమయం లో అప్పటి సంస్థానాధీశులలోని అత్యధికులు బ్రిటిష్ వారికి కొమ్ముకాయడమో లేక మధ్యస్థంగా ఉండడమో చేశారు. స్వాతంత్ర్యానంతరం మాత్రం వీరంతా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయి రాత్రికి రాత్రే దేశ భక్తులుగా మారిపోయి మళ్లీ పాలిత వర్గంలో చేరిపోయారు. ఈ కథల్లో రచయిత ఒక పాత్రికేయుడు. రాజకీయుల తో పరిచయాలూ వారి అండదండలూ ఉన్నవాడు. ఇతను ఒకసారి ఒక వ్యవహారం చేద్దామని ఢిల్లీ వెళ్లగా ఇతను కలుసుకోవలసిన మనిషి ఏదో డెలిగేషన్ లో దూరి విదేశ యాత్రకు వెడతాడు. ఇందిరాగాంధీ రాజభరణాలను రద్దు చేయబోతోంది అనే పిడుగు లాంటి వార్త తెలుస్తుంది. ఇతనికి మిత్రుడైన దిబ్బరాజా వారి పరిస్థితి ఊహించుకోగానే మనసు వికలమై ఉండబట్టలేక వెంటనే దిబ్బ రాజ్యానికి ప్రయాణం కడతాడు. ఐతే అక్కడా చుక్క ఎదురవుతుంది. దిబ్బరాజుగారు వైద్యం నిమిత్తం దేశాంతరం వెడతారు. ఈ సందు చూసుకుని ఇతర ప్రముఖులు రాజ్యాంతరం వెడతారు. శర్మాజీ అనే కురు వృద్ధుడు మాత్రం ఖాళీ గా ఉండి ఇతనిని ఆ రాత్రి దేవతార్చనకి ఆహ్వానిస్తాడు.
ఆచమనం తో విందు మొదలవుతుంది. మంచి మేలుజాతి స్కాచ్ పానీయం. విందు సమయం లో దిబ్బ రాజ్యం పుట్టుక ను శర్మాజీ వివరిస్తారు. అనేక వేల సంవత్సరాల చరిత్ర ఉన్న తిరుగుండం అనే రాజ్యం కాలక్రమంలో వీర బాహువు అనే ఆయన హయాంలోకి వస్తుంది. వీరి కాలంలో దిబ్బ రాజ్య ఆర్ధిక వ్యవస్థ ఆకాశాన్నంటుతుంది. దానికి కారణం ఆనాటి శూరులు. వారు రాత్రికి రాత్రి అతి తక్కువ మంది మెరికల్లాంటి అనుచరులతో బిడారుగా పక్క రాజ్యాలకి వెళ్ళి అక్కడి వర్తకులతో యుద్ధం చేసి జయించి వారి సంపదనంతా దిబ్బ రాజ్యానికి తరలించేవారు. కొంతమంది రసికులైన శూరులు వర్తకుల భార్యలను వరించి తీసుకుని వచ్చేవారు. వీరి శౌర్య ప్రతాపాలమీదా, శృంగార నైపుణ్యం మీద అనేకమంది కవులు కావ్యాలు రచించారు. ముండన మల్లుడనే శూరుని గురించి చాలా కావ్యాలు రాయబడినాయి.
తిరుగుండం రాజ్యం లో ఆర్ధిక వ్యవస్థ చాలా గొప్పగా ఉండేది. శూరులందరూ రాజా వారి కనుసన్నల్లోనే ఉండేవారు. సైన్యాన్ని పోషించే బాధ్యత వారిదే. రాజోద్యోగులకు జీతాల పద్ధతి లేదు. వారు చేసిన సేవలకు కృతజ్ఞతతో ప్రజలే తృణమో ఫణమో సమర్పించుకునే వారు.  చెలామణీ లో ఉన్న నగదు లో బంగారు నాణాలని వరహాలు/వరాలనీ, వెండి నాణాలని కోరలనీ, రాగి నాణాలని కోరికలనీ వ్యవహరించేవారు. మొదటి వాటిని కలిగిన వారిని వరాలు పొందినవారు అని గౌరవించేవారు. రెండవ వారి గురించి కోరలున్న వారా ? లేని వారా? ఉంటే ఎన్ని కోరలున్నాయి ? అని ఆరాలు తీసేవారు. మూడవ వారి విషయంలో ఎక్కువ కోరికలు ఉండడం మంచిది కాదు అనీ, కోరికలన్నీ త్యజించినవాడు మహర్షి అవుతాడని తీర్మానాలు చేసేవారు!
రాజ్యంలో పన్నులు లేవు. సంవత్సరానికి ఒకసారి రాజా వారి జన్మదినాన్ని పురస్కరించుకుని రాజా వారు ప్రజలకు జన్మదిన నిధి నుంచి భూరి గా ధనాన్ని పంచి పెట్టేవారు. రాజు గారి సైన్యం ఈ నిధికోసం సంవత్సరమంతా శ్రమించి ప్రజల దగ్గరనుంచి విరాళాలు పోగు చేసేవారు.
వీరబాహువు గారి అనంతరం సింహాసనం ఎక్కిన ఏకబాహువు తండ్రి గారి పద్దతులన్నిటినీ తు. చ. తప్పకుండా పాటించాడు. ఇతనికి ఒక్కటే చింత ఉండేది. అది రాజ్యంలోని దరిద్రులు. వారిని ఎలా ఉద్ధరించాలి ?

ఏకబాహువు తనను చిరకాలంగా వేధిస్తున్న దరిద్రులకు, జనాభా లెక్కలతో వారి శాతం తొంభై రెండు మంది, సంబంధించిన సమస్య కు ఎంత వెదకినా పరిష్కారం దొరకకపోవడంతో, దీనికి పరిష్కారం చూపించిన వారికి అర్ధ రాజ్యం ఇస్తానని చాటింపు వేయించి, తన తండ్రి గారి కాలం నుంచీ ఉన్న కలికేశ్వరుడు అనే మంత్రి గారి వద్ద తన బాధను వెళ్ల బోసుకుంటాడు. కలికేశ్వరుడు సమర్థుడే. అతను తనలో నిజంగానే కలి అంశ ఉంది అని బలంగా నమ్మి తన ఆంతరంగికులతో ఆ విషయం చెప్పుకునేవాడు. ఈ సమస్యకి కలికేశ్వరుడు రెండు తరుణోపాయాలు చూపిస్తాడు. దాని ప్రకారం మొదటిది దరిద్రులపై పన్నులు పెంచి అవి చెల్లించని వారి ఆస్తులు అనగా గుడిసెలూ, మేకలూ, కుండా, మలకా, వారి స్త్రీల మెడలో పసుపు తాళ్ళూ మొదలైనవి జప్తు చేసి ఆ పైన కఠిన శిక్షలు విధించి అవి భరించడం ఇష్టం లేని వారికి దేశ బహిష్కరణ విధిస్తే సమస్య పరిష్కారం అవుతుంది. రెండవది దరిద్రులను ఉరి తీసేయ్యడం. అప్పుడిహ దేశంలో దరిద్రులు ఉండరు.
ఈ సలహాలని ఏకబాహువు మెచ్చుకుని అమలు చేస్తాడు. సైనికుల చాటింపు విన్న దరిద్రులందరూ తిరుగుండ రాజ్య సరిహద్దులు దాటి ప్రాణాలు దక్కించుకుంటారు. కొంతమంది ఉరి తీయబడతారు. వీరితో పాటుగా కొందరు ధనవంతులు కూడా తిరుగుండ రాజ్యాన్ని విడిచిపోతారు.ఇది చూసిన ఏకబాహువు నొచ్చుకుని దనికులకు తన రాజ్యంలో అన్ని సౌకర్యాలూ ఏర్పాటు చేయబడినాయనీ, అందుచేత వారెవరూ రాజ్యాన్ని విడిచిపెట్టి పోవలసిన అవసరం లేదని చాటింపు వేయిస్తాడు. ఐనా కూడా కొందరు వరాలు పొందిన వారూ, కోరలు కలవారూ దేశం విడిచి వెళ్ళిపోతారు. ఏకబాహువు వారిని చూసి జాలిపడతాడు.
ఆ విధంగా తిరుగుండ రాజ్యంలో దరిద్రులందరూ పోయి ధనవంతులు మాత్రం మిగులుతారు. దరిద్రులందరూ పని చేసుకుని బతికేవారే. వారు లేని మూలంగా పనివారి కొరత ఏర్పడింది. వృత్తులు, వ్యవసాయం మొదలైనవి ఏమీ లేకపోయాయి. తిరుగుండం లో అన్నిరకాల కరువులూ ఏర్పడి ఆఖరికి చనిపోయిన వారిని తగలేసే ఏర్పాట్లు కూడా లేక పాతెసే వారు. ఆ విధంగా ఆ ప్రాంతానికి శవాల దిబ్బ అని పేరు వచ్చి కొన్నాళ్ళకి దిబ్బ రాజ్యంగా మారింది. పారిపోయిన దరిద్రులు నివశిస్తున్న ప్రాంతం పాడిపంటలతో నిండిపోయింది. కాలక్రమంలో దానికి తిరుగుండమనే పేరు స్థిరపడింది – అని శర్మాజీ కథ ని ముగిస్తారు.

సీసాలో సరుకు ఖాళీ కావడం తో ఇద్దరూ భోజనానికి లేస్తారు. ఇదీ దిబ్బ కథ !
దిబ్బరాజ్యం ఎలా నడచిందో మిగతా కథలలో తెలుసుకుందాం.                                                                      

                                                                                               ************ X ************                                © తరువాయి వచ్చే సంచికలో….