వ్యావహారిక భాష లో తెలుగు రాస్తే ఎంత మధురం గా ఉంటుందో నిరూపించిన కథక చక్రవర్తులు మన శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. వీరి కథలన్నింటికీ రాజమహేంద్రవరం కేంద్ర బిందువు. వీరేశలింగం గారి ప్రభావం వీరిపై అధికం అన్న విషయం వీరి కథలలో మనకి స్పష్టం గా తెలుస్తుంది.
ఆనాటి బ్రాహ్మణ కుటుంబాలలో ఒకరో ఇద్దరో కుమార్తెలు వితంతువులై పుట్టింటికి చేరడం, వారి పట్ల దయతో జాలితో తల్లిదండ్రులు వారికి ఇంటి పెత్తనం ఇవ్వడం, ఇనుపపెట్టె తాళాలు చేతుల్లో పెట్టడం, ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేస్తూ ఇంటికోడళ్ళను ఈ వితంతువులు పెట్టే బాధలు చెప్పనలవి కానివి. వారిలోని అసూయా ద్వేషాలు కుటుంబాలను ఎలా విఛ్చిన్నం చేస్తాయో చాలా శక్తివంతంగా శ్రీపాదవారు నిరూపిస్తారు అని విమర్శకులు వివరిస్తారు. సామాజిక సమస్యల పట్ల ముఖ్యంగా స్త్రీల సమస్యల పట్ల శ్రీపాదవారి లోతైన అవగాహన, గాఢమైన స్పందన, ముందుచూపు పాఠకులను ఆశ్చర్యచకితులను చేస్తుంది.
వస్తువును ఎంచుకోవడంలోనూ శిల్పసుందరంగా తీర్చిదిద్దడంలోనూ కథాప్రయోజనాన్ని సిద్ధింపజేయడంలోనూ శ్రీపాదవారి ప్రతిభ సమగ్రంగా దర్శనమిస్తుంది.
ఆధునిక భావాలుగల రిటైర్డ్ జడ్జి యాజులుగారి ఏకైక పుత్రిక కృష్ణవేణి. మద్రాసు లో బి.ఏ. చదివింది. కట్నం అడిగేవాడిని ‘కట్నం కావాలిట వాడికి ‘ అని ఈసడించి కట్నంలేని ఆదర్శవివాహం చేసుకోవాలనుకుంటుంది. తండ్రికూడా కూతురి అభిప్రాయాలను గౌరవించి ప్రోత్సహిస్తాడు.
ఇరవైయేళ్లు నిండిన కూతురికి కుదరక కుదరక కుదిరిన సంబంధం తిరిగి పోయిందనేటప్పటికి తల్లి రాధమ్మ తల తిరిగిపోయింది. మనస్సు చెదిరిపోయింది. చాలా నిరాశకు లోనయ్యింది.
ఒక అన్నా, ఒక అక్కానూ ఆపిల్లవాడికి. తండ్రితో పాటు వకీలు. చక్కనివాడూ చురుకైన వాడూ కూడాను. దూరపు చుట్టరికం కూడా ఉంది తమకి. రెండు మేడలున్నాయి వాళ్లకి. భూవసతి కూడా ఎక్కువగానే వుంది. పదివేలైనా యివ్వదగ్గ సంబంధం. తన ఆస్తీ తమ ఆస్తీ కలిస్తే పిల్లజమీందారే అయిపోతాడు. మళ్లీ అలాంటి సంబంధం రావడం మాటలు కాదు అనుకొన్న రాధమ్మ ఉసూరుమన్నట్టయిపోయింది.
‘నువ్వేమన్నావు తల్లీ?’ అని కూతురుని లాలనగా అడిగాడు యాజులు.
‘నీ మొగం చూడకూడదు అవతలకి పొమ్మన్నానండి’ – అంది కృష్ణవేణి.
మంచిపని చేశావన్నాడు తండ్రి. ఇద్దరినీ తిరగబడి పులుకూ పులుకూ చూసింది రాధమ్మ. ‘ఆడదానికంత దురుసుతనం పనికిరాదమ్మా ! ఏమిచేసినా మొగవాడికే చెల్లుతుంది’ అంది తల్లి.
‘ఎఫ్.ఏ. లు, బి.ఏ. లూ చదవడం కాదు ప్రధానం. సంస్కారం అబ్బాలి. అది లేనప్పుడు ఆడదేమిటి ? మొగవాడేమిటి ? చదువుకున్న మూర్ఖులే అవుతారు’ అన్నాడు తండ్రి యాజులు. ‘అమ్మాయి గొప్ప ఆశయాలున్న పిల్ల ‘ అన్నాడు.
‘ పెళ్లి లేకుండా ఇంట్లో కూర్చుంటావా ? ’ అన్న తల్లితో ‘ పెళ్లాడితే ఇలాంటి దేబెలనా ? అడుక్కుతిన్నట్టుందామగతనం ’ – అన్న కృష్ణవేణిని దిగాలుగా చూసింది తల్లి. దాని చదువింత చేసింది. ‘ చదువుంటే మొగుడక్కర్లేదూ ? చదువుకుంటే మొగవాడికి మాత్రం పెళ్ళాం అక్కర్లేదూ మరీ ? ’ అని కూతురంటుంటే అప్రతిభ అయిపొయింది రాధమ్మ. ‘ ఏమి చేసినా మొగవాడికి చెల్లుతుంది ’ అంది ఆమె చివరికి నీరసంగా. చివరికిదీ ముక్తాయింపు. ‘ బ్రాహ్మణ కొంపలో పుట్టి గొప్ప చదువులున్నూ చదివి సిగ్గూ బిడియమూ లేకుండా ’ అన్నాడు యాజులు.
‘ మాట్లాడితే వుపన్యాసాలు. మీతో వాదించి నేను నెగ్గలేను సుమండీ. ఐతేను అమ్మాయికి పెళ్లి చెయ్యడమంటూ వుందా లేదా చివరికి ? ’ అని నిలదీసింది భర్తను.
‘ కలెక్టర్లే కాదు, గవర్నర్లే వచ్చినా డబ్బిచ్చి నేను మొగుడ్ని కొనుక్కోను సరా ? ’ అని తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పింది కృష్ణవేణి. వరకట్నమిచ్చి తండ్రి స్టేటస్ని బట్టి వచ్చే సంబంధం కాకుండా తనను చూసి తన అభిప్రాయాలను గౌరవించే భర్తను పొందాలనుకున్న పాత్రగా కృష్ణవేణి దర్శనమిస్తుంది.
ఆరోజుల్లోనే ఆధునిక భావాలున్న స్త్రీగా ఈపాత్రను తీర్చిదిద్దడంలో శ్రీపాదవారి ముందుచూపు గోచరిస్తుంది.
తండ్రి పెన్షన్లో సగం 250 రూపాయలు ప్రతీనెలా కూతురికిచ్చి నువ్వేంచేస్కున్నా సరేనంటాడు తండ్రి.
ఆ డబ్బుతో నెలకి 50,30,20 రూపాయల జీతాలకు ముగ్గురు ఉపాధ్యాయులను ఏర్పరిచింది. ముగ్గురూ సర్కారు ట్రయినింగ్ అయినవారే కానీ అది పనికిరాదని కొత్త ట్రయినింగ్ ఇచ్చిందామె.
తెలుగు ఒక్కటే ఆమె పాఠశాలలో భాష. చూసిరాత, ఉక్తలేఖనం, కొంచెం లెక్కలు, కుట్టుపనులు, గృహకృత్యాలు, సంగీతం. – ఇదీ ఆమె ప్రణాళిక. ఇప్పటి విద్యావిధానం బాగాలేదని ఆమె నమ్మకం. అందుకే తను చదివిన కళాశాలలో ఉద్యోగమిస్తానంటే ఆమె తిరస్కరించింది. తన ఆశయాలకూ, ఆదర్శాలకూ అనుగుణంగా పాఠశాల ప్రారంభించింది. ఇప్పటి తెలుగు వనితలు కూపకూర్మాల వంటివారని ఆమె నమ్మకం.
మతసంబంధమైన మూర్ఖులు అలా ఉండగా పురుషుల అజ్ఞానం కూడా వారిని పశువులస్థితికి తీసుకువెళ్ళింది. వారికి దేశం, జాతి, భాషా, మతం, సంఘం ఏమీ తెలియదు. ప్రపంచం ఎంత విశాలమైనదో, అందులో ఎన్ని దేశాలున్నాయో వాటి వైలక్షణ్యం ఏమిటో వారికి సుతరామూ తెలియదు. ఈ స్థితిని మార్చాలనుకుంది కృష్ణవేణి. దీనికి తగిన గ్రంధాలను ఎంచుకుని పాఠ్యాంశాలను తయారుచేసింది. కొన్ని తను స్వయంగా రాసింది. పిల్లలకి బోధించింది. గుఱ్ఱపుస్వారీ, సైకిల్ తొక్కటం, గోదావరిలో ఈదడం ఆడపిల్లలకి నేర్పించింది.
ఆడపిల్లలు అన్ని విద్యలలోనూ రాణించాలనే శ్రీపాదవారి ఆశయం వారి ప్రతీ కథలోనూ ఇలా ఏదో ఒక రూపంగా ప్రతిబింబిస్తుంది. స్త్రీకి స్వతంత్రభావాలు, స్వేచ్ఛ ఉండాలనేది వారి ఆశయమనేది పాఠకులందరికీ సుపరిచితం.
స్త్రీలను ఆహ్వానించి అప్పుడప్పుడు కృష్ణవేణి టౌన్ హాల్ లో ఉపన్యాసాలిస్తూ ఉంటుంది. స్త్రీ అభ్యుదయానికీ, అభివృద్ధికీ సంబంధించిన అంశాలే ఆమె ప్రధాన లక్ష్యం. పాఠశాలలో మార్షల్ లా కంటే కఠినమైన నిబంధనలు అమలు జరుపుతుంది.
ఇలా ఉండగా సుసర్ల కోటేశ్వరరావు అనే యువకుడు మొదటి భార్య పోయిందని, చిన్న సంపాదన అని, తల్లి, వితంతువైన సోదరి ఉన్నారనీ అభ్యంతరం లేకపోతే కృష్ణవేణిని వివాహమాడతానని కట్నం, లాంఛనాలూ అవసరం లేదని పెళ్ళికి కూడా నూరు రూపాయలకంటే ఎక్కువ ఖర్చు చేయలేనని యాజులు గారికి ఉత్తరం రాస్తాడు.
కోటేశ్వర శాస్త్రిది మున్సిపాలిటీ లో టీచర్ ఉద్యోగం. ఇంకా పెర్మనెంట్ కాలేదు. రోజుకో పార్టీ, పూటకొక ముఠా, పైగా కులాభిమానులు. మున్సిపాలిటీ ఏమి చేస్తుందో చెప్పలేము – అని కృష్ణవేణితో పలికిస్తారు శ్రీపాదవారు. ఆనాటి సమాజంలో కూడా ఇటువంటి సమస్యలు ఉన్నాయనీ, సమకాలీన సమాజాన్ని ప్రతిబింబింపజేసే సంభాషణలు వ్యక్తం చేస్తున్నాయి.
పెళ్ళిచూపుల్లో కృష్ణవేణి తన భావాలనూ, అభిప్రాయాలనూ స్పష్టంగా తెలియచెప్తుంది. నేనొక పాఠశాలను నడుపుతున్నాను. స్త్రీలలో కొత్త దృక్పథం ప్రవేశపెట్టాలనీ, వారి జీవితాలకు కొత్తవిలువలు కట్టాలనీ నా ప్రయత్నం. నా జీవితలక్ష్యాలివి. ఒకటి నా భర్త, రెండు నా తల్లిదండ్రులు, మూడు నా పాఠశాల. ఇంతే నా ప్రపంచం. నా ప్రేమా, నా శ్రద్ధా ఈ మూడు వస్తువుల మీదా యథార్ధంగా వినియోగపడతాయి. భార్యంటే బానిస కాదు. సమాన భాగస్వామిని. నా హక్కులు నేను పూర్తిగా అమలుపరుచుకుంటాను.
భర్తవైపు వారిని భక్తితో పూజిస్తాను. అయితే వారు నన్ను ప్రేమిస్తేనే జరుగుతుందది. అవసరం వచ్చినపుడు గృహిణి చలాయించుకోవల్సిన అధికారాలన్నీ నేను దఖలు పరుచుకుంటాను. సభలకు వెళ్ళడమూ, పురుషులతో కలిసి కూర్చోవడమూ నాకలవాటు. ముందున్నూ అది అలా జరుగుతూనే ఉంటుంది. నేను వంటరిగా పొరుగూళ్ళు వెళ్ళడం ఉంది. ముందున్నూ అలా వెళ్తూనే ఉంటాను – అని తన భావాలన్నిటినీ ఏకరువు పెట్టింది కృష్ణవేణి. అన్నింటికీ సరేనన్నాడు శాస్త్రి.
తన ఆశయాలూ, అలవాట్లూ, అభిప్రాయాలూ, జీవితలక్ష్యాలూ అన్ని విషయాలూ నిష్కర్షగా ముందే చెప్పడం కృష్ణవేణి వ్యక్తిత్వాన్ని చాటుతుంది. భర్తను ఎంతగానో ప్రేమించింది. భర్త ఆలస్యంగా నిద్రలేవడం ఆమెకు నచ్చేది కాదు. అత్తగారిని తల్లిలా పూజించింది. ఇంట్లో అందరి మనస్తత్వాలు తెలుసుకోవటానికీ, పరిశీలించటానికీ ఒక యేడాది గడువు పెట్టుకుంది. ఆమె ఏదైనా ఒక నిశ్చయానికి వస్తే మాత్రం ఇంక దానికి తిరుగుండదు. ఆమె వ్రతం కొనసాగవలసిందే.
అత్తగారికి కోడలంటే చాలా అభిమానం. ఆడపడుచు రాజమ్మ ప్రవర్తన, ఆమె చెలాయించే స్వభావం కృష్ణవేణిని మనస్తాపానికి గురిచేస్తుంది. భర్త ఉద్యోగం పోయిన విషయం తనకు చెప్పనందుకు బాధపడింది కృష్ణవేణి.
తన భర్తను ఆడపడుచు రాజమ్మ తనవైపు తిప్పుకుందని తెలుసుకుంటుంది కృష్ణవేణి. భర్తని సరిదిద్దుకోవాలని ప్రయత్నించింది. కానీ అతని మాటలలో నిర్లక్ష్యము, విసుగు కనిపెట్టింది.
“ దాపరికాలు నాకిష్టం లేదు. మనసులోనే కుమిలిపోవడం నా పద్ధతి కాదు. నా సంగతి మొదటే చెప్పాను స్పష్ఠంగా మీకు. ఈ ఇంటి యాజమాన్యంతో ఆవిడకేమిటి పని ? ” అని భర్తను నిలదీసింది. యజమానురాలు కృష్ణవేణే అని అంగీకరించాడు శాస్త్రి. కానీ తనకి దమ్మిడీ సంపాదన లేదనీ, ఆవిడే పోషిస్తోందనీ, ఏ సంగతీ ఆవిడతో చెప్పక తప్పదనీ, ఆవిడ చెప్పినట్లు నడుచుకోక తప్పదనీ తెగేసి చెప్తాడు శాస్త్రి.
” నన్నిప్పుడు పోషిస్తున్నది నా భర్తగారు కాదూ ? ” అని అడిగి సాటి ఆడదాన్ని పెళ్లిచేసుకున్నందుకు సిగ్గుపడుతున్నాననీ చెప్తుంది.
ముక్కుకు సూటిగా పోవడం తప్ప ఎత్తులూ, కుయుక్తులూ ఎరగని పాత్రగా కృష్ణవేణి కనిపిస్తుంది. చదువూ సంస్కారమూ ఉన్నా దురుసుతనం, ఆవేశం వల్ల కాపురాన్ని పాడుచేసుకుంది. “ అమ్మా ! ఇంక మీరెవరో నేనెవరో ” అని అత్తగారి పాదాలను కళ్ళకద్దుకుని ఇంటి నుంచి తెగతెంపులు చేసుకుని బయటకు వచ్చేస్తుంది.
అత్తగారు మహాలక్ష్మమ్మ కొడుకునీ, కోడలినీ సమానంగానే ప్రేమించింది. కూతురి ఆగడాలను చూసి బాధపడింది. కానీ కూతుర్ని ఎదిరించలేని అశక్తురాలు. ఆడపడుచు రాజమ్మ ఇల్లుబట్టిన విధవాడపడుచు. తమ్ముడూ, మరదలూ అన్యోన్యాన్ని సహించలేని ఈర్ష్యాళువు.
ఆడదానికి లోకువైపోయావంటే గుడ్డిగవ్వకు మారవనీ తమ్ముణ్ణి గుప్పెట్లో పెట్టుకుంటుంది రాజమ్మ. ఆమె దృష్టిలో కట్నం పుచ్చుకోవటం చాలా గొప్పవిషయం. కృష్ణవేణి కట్నం, కానుకలూ తీసుకురాలేదని రాజమ్మకు ఆమె అంటే చిన్నచూపు. రత్నంలాంటి కోడలు దొరికిందని మహాలక్ష్మమ్మ అనందిస్తే రుంజుకుంది రాజమ్మ అంటారు శ్రీపాదవారు.
“ పీటల మీద చదివించరనుకున్నాం కానీ తరువాత ఏదో విధంగా ముట్టచెప్పరనుకున్నామా ఏమిటీ ? ” అని మాటకారితనాన్ని ప్రదర్శిస్తుంది రాజమ్మ. తన మాటకారితనంతో నేర్పుగా తమ్ముణ్ణి వాజమ్మను చేసి లొంగదీసుకుంది. తాను ఇల్లు విడిచిపెట్టి వెళ్లకుండా మరదల్ని ఇంటినుంచి వెళ్లగొట్టడంలో కృతకృత్యురాలైంది. తన ఈర్ష్యతో, అసూయతో తమ్ముడి పండంటికాపురంలో నిప్పులుపోసిన దుర్మార్గపుస్వభావిగా రాజమ్మను చిత్రీకరించారు శ్రీపాదవారు. ఆనాటి సమాజంలోని పరిస్థితులన్నింటినీ అద్దంలో చూపినట్లుగా చిత్రించారు రచయిత.
ఇల్లు పట్టిన విధవాడపడుచు కథలో బుచ్చమ్మ ఎత్తులుపారకా, వేరేదారిలేకా చివరికి తానే ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఈ కథలో రాజమ్మ గయ్యాళి తనంతోనూ, గడుసరితనంతోనూ ప్రవర్తిస్తుంది.
మహాలక్ష్మమ్మ సాత్వికంగా మంచి అత్తగారిగా కనిపిస్తుంది. కూతురి క్షేమం కోరుకునే తల్లిగా, సంప్రదాయాలను గౌరవించే గృహిణిగా రాధమ్మ పాత్రను మలిచారు రచయిత. గొప్ప ఆశయాలున్న పిల్లగా కృష్ణవేణి పాత్ర, ఆమె ఆదర్శాలను గౌరవించే తండ్రిగా యాజులు పాత్రా కనిపిస్తాయి.
కథ మధ్యలో పుల్లంపేట జరీచీర ప్రస్తావనా, యౌవనంలో యాజులూ, రాధమ్మల శృంగారవర్ణనా సంభాషణలతో కథను నడిపిస్తూ పాత్రల హావభావ విలాసాలను నాటకీయంగా వర్ణిస్తూ అలవోకగా కథను చెప్పే శ్రీపాదవారి కథా కథన శైలి ఈ కథలో కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. తర్వాత ఏమి జరుగుతుందోనన్న ఉత్కంఠ పాఠకులలో రేకెత్తిస్తూ చదివించే శక్తి శ్రీపాదవారికి వెన్నతో పెట్టిన విద్య. ‘ కీలెరిగిన వాత ’ శీర్షిక ఈ కథకు పెట్టారు కానీ కృష్ణవేణి కీలెరిగి వాతపెట్టిన దాఖలాలు ఎక్కడా లేవు. తన ఆవేశంతో కాపురాన్ని చేతులారా చెడగొట్టుకుంది. కాకపోతే శ్రీపాదవారి సంస్కార దృక్పథాన్ని ప్రతిబింబించే తిరుగుబాటు పాత్రగా కృష్ణవేణి పాత్ర పాఠకుల హృదయాలలో చెరగని ముద్ర వేస్తుంది.
************************ X ***************************