09_019 యత్ర నార్యస్తు….

                      మనుస్మృతి మహిళల గౌరవమర్యాదలకు ఆధారంగా నిలబడింది. కొన్ని వేల సంవత్సరాల క్రిందటి మనుస్మృతిలో మహిళ ప్రాధాన్యత, ఔన్నత్యం చెప్పబడ్డాయి.

తల్లిదండ్రులకు కొడుకూ, కూతురూ ఒక్కటే అనీ, ఇద్దరికీ ఆస్తిహక్కు సమానమని, మగువను గృహలక్ష్మిగా, ఇంటి శోభను పెంచే అతివగా, సౌభాగ్యవతిగా మనువు వర్ణించాడు.

“ యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా ” – ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు ఆనందనాట్యం చేస్తారు.

మనుస్మృతి నాటికే అదితి, లోపాముద్ర, గార్గి, మైత్రేయి మొదలైన మహిళలు వేదవిద్యల్లో ఆరితేరారు.

చదువుల తల్లి సరస్వతి, సంపదల తల్లి మహాలక్ష్మి, సౌభాగ్యాల తల్లి పార్వతీదేవి – ఇంతెందుకు మనదేశాన్ని కూడ భరతమాత అని తల్లిగా పూజించే సంప్రదాయం మనది.

గృహస్థాశ్రమం చాల బాధ్యతలతో, కర్తవ్యాలతో కూడుకొన్న్ వ్యవస్థ. దానిని సమర్థవంతంగా నిర్వహించాలంటే భార్యాభర్తలిద్దరూ బాధ్యతల్ని సమానంగా పంచుకోవాలి.

గృహస్థాశ్రమ నౌక సక్రమంగా పయనించాలంటే ఆ స్త్రీమూర్తి సహనవంతురాలై, ఉత్తమ సంస్కారంతో ఉండాలి. ఆ శక్తియుక్తులన్నీ ఆమెకే సొంతం. కనుకనే –

“ కార్యేషు దాసీ, కరణేషు మంత్రీ ” – తల్లిగా, దాసిగా, లక్ష్మీ స్వరూపంగా, రంభగా, మంత్రిణిగా, భూమాతగా స్త్రీమూర్తిని శాస్త్రాలు శ్లాఘించాయి.

ఇంటి యజమాని ఆర్జించిన ధనాన్ని సక్రమంగా వినియోగించే బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించి, ఇంటి గౌరవాన్ని నిలబెట్టేది స్త్రీమూర్తి.

ముఖ్యంగా మన వివాహవ్యవస్థ భారతీయుల గౌరవాన్ని ఇనుమడింపజేసింది. మాంగల్యధారణలో వరుడు వేసే మూడుముళ్ళూ ధర్మ, అర్థ, కామాలను వధూవరులు ధర్మబద్ధతతో పొంది మోక్షానికి అర్హులవుతారు.

వధువు తండ్రి తన కూతుర్ని కొడుకులా గౌరవంగా పెంచానంటూ “ ఇదానీం కన్యాం పుత్రవత్ పాలితామయా ” – అని చెప్పడం గమనింపదగింది.

మహాభారత కాలంనాటి మహిళలు విద్యావంతులై పరిపాలనా దక్షతతో ప్రతిభాసంపన్నులై తమ తండ్రుల్ని, భర్తల్ని, బిడ్డల్ని ప్రభావితం చేశారు.

నాటి కుంతి, ద్రౌపది, సుభద్ర వంటి మహిళలు నేటి యువతకు మార్గదర్శకులని చెప్పక తప్పదు.

నన్నయ తీర్చిన శకుంతల వృత్తాంతాన్ని పరిశీలిస్తే – ఆమె ఏడుస్తూ కూర్చోలేదు. కుమారుని వీరునిగా తీర్చిదిద్దింది. సింహాల జూలు పట్టుకుని ఆడుకునేటట్లు పెంచింది. సకల శాస్త్రాలే కాదు, వేదార్థాలతో బాటు యోధునిగా తీర్చిదిద్దింది. వ్యక్తిత్వ వికాసం, సంభాషణా చాతుర్యం, పరేగితజ్ఞత, ఆర్ట్ ఆఫ్ లివింగ్, సెల్ఫ్ మేనేజ్మెంట్ – ఇవన్నీ ఆనాటి శకుంతల మాటల్లో దర్శనమిస్తాయి.

మహాసభలో రాజును ఎదిరించాలంటే ఎంతటి ధైర్యం కావాలి. ఆశ్రమంలో చూపిన ఆదరణ, ఆప్యాయత దుష్యంతుని చూపుల్లో కనబడలేదు. తెలిసీ తెలియనట్లు  నటించాడు. పాత పరిచయాన్ని బట్టి సహాయం చేసే అధికారులుండరని నన్నయ ఆనాడే చెప్పారు.

“ నీవెట ? నేనెట ? సుతుడెట ? ”– అన్నప్పటికీ ఆమె వెనక్కి తగ్గలేదు. “ నూరుగురు కుమారుల కంటె సత్యవాక్యం గొప్పదని చెప్పింది. వీడు నూరు వాజపేయ యాగాలు చేస్తాడని సరస్వతి దేవి చెప్పిందని, నీ లెక్కలేదని, వీడు పైకొస్తా ” డని తెగేసి చెప్పింది. Academic Independent Empowerment అంటే ఇంతకంటే ఇంకేముంటుంది ? మోసపోయిన, మోసపోతున్న మహిళలు తమ వ్యక్తిత్వాన్ని కాపాడుకొంటూ సమాజానికి ఎదురీది ఎలా బతకాలో శకుంతల పాత్రద్వారా నన్నయ సమాజనికి చక్కని సందేశాన్నిచ్చారు.           

తన పాత్రివ్రత్య మహిమతో మృత్యువాతపడిన భర్త ప్రాణాలను యమునితో పోరాడి తన భర్తను దక్కించుకున్న ధీర సావిత్రి. రాజ్యలక్ష్మికి దూరమై వనవాసం చేస్తున్న పాండవులకు సావిత్రి కథ ఊరటను కలిపించడమే కాక సావిత్రి వలెనే ద్రౌపది సౌశీల్యమే పాండవులకు రక్ష అనే సందేశాన్నిచ్చాడు వ్యాసుడు.

మద్ర దేశాన్ని పాలించిన అశ్వపతి అనే రాజు పదునెనిమిది సంవత్సరాలు సావిత్రీదేవిని ఉపాసించి సావిత్రిని పుత్రికగా పొందాడు. ఆమెను తండ్రి అల్లారుముద్దుగా కాక, గౌరవంగా పెంచాడు. ‘ సావిత్రియను కూతుంగని యతి గారవంబున పెంచె ’ – అంటాడు ఎఱ్ఱన. అలా పెరిగిన ఆడపిల్లకు ధైర్యస్థైర్యాలు, ఆత్మవిశ్వాసం పుట్టుకతోనే అబ్బుతాయి. ఆమె ‘ గుణవయోరూపములననుకూలుడైన భర్త నెమ్మయి దీనికి బడయువాడ ’ – నని అశ్వపతి ఆలోచించి నీ మనసుకు నచ్చిన వానిని వరించమన్నాడు. ఇలా వేల సంవత్సరాల క్రితమే తన మనసుకు నచ్చిన వానిని వరునిగా ఎన్నుకొనే సామర్థ్యం గల మహిళ సావిత్రి.

సాళ్వ దేశ ప్రభువైన సత్యవంతునితో వివాహాన్ని కోరుకుంది సావిత్రి. అశ్వపతి తండ్రిగా వరుని వివరాలను నారదుని ద్వారా తెలిసికొన్నాడు.

సత్యవంతుడు తేజస్సులో సూర్యుని, తెలివిలో బృహస్పతిని, పరాక్రమంలో ఇంద్రుని, ఓర్పులో భూదేవిని, కాంతిలో చంద్రుని, అందచందాలలో అశ్వనీ దేవతలను తలపింపచేస్తాడని నారదుడు చెప్పి, ముఖ్యంగా సత్యాన్నే పలుకుతాడు కావున సత్యవంతుడుగా ప్రసిద్ధిపొందాడని చెప్పాడు. కాని “ వాని యందు కీడొకటి కలదు. పరిణయంబు మొదలుగా ఒక్క సంవత్సరంబునకు మృతిబొందు ” – అని భవిష్యవాణిని నారదుడు చెప్పాడు. తండ్రి అశ్వపతి వివాహానికి అంగీకరించలేదు.

“ వినుము మనోవాక్కాయము

లను మూడు తెఱగులందు నంతఃకరణం

బనఘ ప్రథానము గావున

మనమున గైకొన్న భర్త మానుటదగునె ? ” –

అని సావిత్రి త్రికరణాలలో ( మనస్సు, వాక్క, కాయం ) మనసు ప్రధానమైనది. కావున సత్యవంతుని తప్ప అన్యులను వివాహమాడనని చెప్పింది. సావిత్రీసత్యవంతులకు వివాహం జరిగింది.

సత్యవంతుని తండ్రి ద్యుమత్సేనుడు రాజ్యాన్ని కోల్పోయి అడవులలో జీవిస్తున్నాడు. సావిత్రి తన భర్తతో కలసి అత్తమామలను సేవిస్తోంది. నారదుడు చెప్పినట్లు సత్యవంతుని ఆయుర్దాయం క్రమంగా ఒక సంవత్సరం నుండి నాలుగు దినాలకు చేరింది. నాలుగవరోజు సావిత్రి సమిధలు తేవడానికి బయలుదేరిన భర్తతో అడవికి వెళ్లింది.

సత్యవంతుని ప్రాణాలను హరించిన యముణ్ణి తన పాతివ్రత్యమహిమతో సావిత్రి చూడగలిగింది. ఇక్కడ ఆమె ప్రదర్శించిన భౌతిక, మానసిక శక్తులు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. “ నీవేల వచ్చెదవు లతాంగి, నిలువుమింక ” అన్న యమునితో “ పతులెందు జనిననచటికి, సతులు జనవలదే ” అని ప్రశ్నించింది. తన పాతివ్రత్యమహిమతో యముని దయతో తనకు అరుగరాని చోటులు లేవని చెప్పింది.

సకల మార్గాల్లోకీ ధర్మం ప్రథానమనీ, ధర్మానికి ఆధారం సజ్జనులనీ, నీవు సజ్జనశేఖరుడవనీ, నీ దర్శనం వృధా కాదని చెబుతూ తన సంభాషణా చాతుర్యంతో యముణ్ణి మెప్పించింది. యముడు ఆమెను ఒక వరం కోరుకొమ్మన్నాడు. “ పతి జీవితం తప్ప ” అన్నప్పటికీ ఆమె క్రుంగిపోలేదు. వచ్చిన అవకాశాన్ని వదులుకోలేదు. కోరికలు కోరడంలో ఆమె వివేకం తెలుస్తుంది.

అంధుడైన మామగారికి చూపును ప్రసాదించమనడం, తన తండ్రికి నూరుగురు పుత్రుల్నిమ్మని కోరడం – ఆర్యులు దీనుల్ని కరుణతో చూస్తారనీ, కోరికలను సంపూర్ణంగా నెరవేరుస్తారనీ, యముని ప్రసన్నం చేసికొంటూ ముందుకు సాగింది.

ధర్మదేవత, సమవర్తి కల్మషశమనం వల్ల శమనుడు – సావిత్రి మాటలు దాహార్తితో ఉన్నవానికి తుషారతోయాల్లా అనిపించాయి.

“ ఏడు మాటలాడినంతనెట్టివారు ఆర్యజనులకు చుట్టంబు లగుదురనిన, చిరసమాలాప సంసిద్ధి చేసి నీకు నేను చుట్టమనని వేరె చెప్పనేల ? ” అంటూ యముణ్ణి ప్రసన్నం చేసికొంది.

అభీష్టమగు వరమొక్కటి ఇస్తానని చెప్పిన యముడు భర్త ప్రాణాలీయననే షరతు పెట్టడం మరచిపోయాడు. సావిత్రి వెంటనే భర్త ప్రాణాలను వరంగా పొందింది.

నేడు మనం వేలాదిరూపాయలు పెట్టి నేర్చుకుంటున్న communication skills సావిత్రి కథ ద్వారా మన ఋషులు ముందే మనకు నేర్పారు.

మత్స్యగంధి సత్యవతి తమ కురు వంశాన్ని నిలబెట్టడంలో ప్రదర్శించిన విజ్ఞత ముందు పరాశరుడు, గాంధారి ధర్మపరాయణత ముందు స్వార్థపరుడైన ధృతరాష్ట్రుడు, మహనీయ కుంతి ముందు పాండురాజు, ద్రౌపది తేజస్సుముందు పాండవులు, శకుంతల ధర్మజ్ఞత, సత్య సంధతల ముందు దుష్యంతుల వన్నె తగ్గిందనే చెప్పాలి.

మహాభారతం ఒక వ్యక్తిత్వ వికాస సంస్థ. విజయానికి ఎక్కవలసిన మెట్లను సునాయాసంగా ఎక్కించి శిఖరాగ్రాన కూర్చోబెట్టగల సామర్థ్యం భారతంలోని సత్యవతి, కుంతి, ద్రౌపదుల పాత్రలను ఆకళింపు చేసికొంటే అవగతమవుతోంది.

వందమంది ఉపాధ్యాయులకంటే ఒక ఆచార్యుడు, వందమంది ఆచార్యులకంటే తండ్రి, ఆ తండ్రికంటె తల్లీ పూజనీయురాలని మనుస్మృతి చెబుతుంటే –

‘ అస్తాంతా వడియాం ప్రసూతి సమయే

దుర్వార శూల వ్యథా ’ – “ నాకు జన్మనిస్తున్నప్పుడు అంత నొప్పిని ఎలా భరించావమ్మా ! ” అంటూ ఆదిశంకరులు తల్లిముందు మోకరిల్లారు.

‘ మాతృదేవోభవ ’ అంటూ మన సంస్కృతి తొలి వందనానికి తల్లే అర్హురాలని చెప్పింది.

*************** ***************