09_020 మన పతాక ప్రస్థానం

ఒక జాతి లేదా దేశం యొక్క అస్తిత్వానికి చిహ్నం ‘ జెండా ‘
భారత జాతి ప్రపంచంలో గర్వంగా చెప్పుకునే చిహ్నం మన మువ్వన్నెల జెండా
ఈ జెండా రూపకల్పనా ప్రస్థానాన్ని ఓసారి పరిశీలిద్దాం……….. 

 

* తొలిసారిగా 1904 లోభారత జాతికి ఒక ప్రత్యేకమైన చిహ్నం ఉండాలనే ఉద్దేశ్యంతో సిస్టర్ నివేదిత ఒక పతాకాన్ని రూపొందించారు. మొదట ఆది ఎరుపు, నలుపు రంగుల్లో ఉండేది. అయితే తర్వాత ఆమె తన విద్యార్థుల సలహాతో కాషాయం, పసుపు రంగుల్లోకి మార్చారు.  1906 లో కలకత్తాలో జరిగినకాంగ్రెస్ మహాసభల్లో ఈ జెండా ఎగురవేశారు.

* 1905 లో బ్రిటిష్ ప్రభుత్వం బెంగాల్ ను విభజించింది. ఆ విభజనను వ్యతిరేకిస్తూ పెద్ద ఉద్యమం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో బెంగాల్ కే చెందిన సచ్చీంద్రప్రసాద్ బోస్, సుకుమార్ లు మొదటిసారి త్రివర్ణ పతాకం రూపొందించారు. హిందూ ముస్లిం సమైక్యతను ప్రతిఫలించే విధంగా ఆ జెండా రూపుదిద్దుకుంది.
* తర్వాత కొన్నాళ్ళకి హోం రూల్ ఉద్యమం ప్రారంభమైంది. దానికి అనీబిసెంట్, బాలగంగాధర తిలక్ లు నాయకత్వం వహించారు. అప్పుడు ఐదు రంగులతో మరో జెండా రూపుదిద్దుకుంది.

 

* మహాత్మాగాంధీ ప్రభావానికి ఉత్తేజితుడైన పింగళి వెంకయ్య గారు మొదట ఒక జెండా నమూనా తయారుచేసారు. తర్వాత దానికి మధ్యలో చరఖాను కలిపారు. అయితే కాంగ్రెస్ కమిటీకిఈ నమూనా నచ్చలేదు.

* అప్పుడు గాంధీగారి సలహాతో వెంకయ్య గారు తయారు చేసిన మరో జెండా అందరి ఆమోదం పొంది 1921 లో అహమ్మదాబాద్ లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ మహాసభలో ఎగిరింది. ఆ జెండా దేశమంతా స్వాతంత్ర్య స్పూర్తిని రగిలించింది. ఎరుపు, తెలుపు, ఆకుపచ్చ రంగులతో మధ్యలో చరఖాతో ఆ జెండా ఉండేది.

 

 

* తెలుగు తేజం పింగళి వెంకయ్య గారు రూపొందించిన ఆ మువ్వన్నెల జెండా స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారతదేశ చిహ్నంగా గుర్తించబడి కొన్ని మార్పులతో ఆమోదించబడింది. కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో బాటు మధ్యలో చరఖా బదులుగా అశోక చక్రం ఉంచబడింది. అప్పటినుంచి ఇప్పటివరకూ ప్రపంచ పటంలో భారతదేశ పతాకం రెపరెపలాడుతోంది.  

 

ఆగష్టు 2 వ తేదీ పింగళి వెంకయ్య గారి జయంతి సందర్భంగా……

***************************************************************

అదిరే లంగి

కాకినాడలో రామదాసు గారు ఒకప్పుడు పేరుపొందిన హరిదాసు. ఆయనకు సంగీత పరికరాల దుకాణం కూడా ఉండేది.

అదే కాకినాడలో వున్న యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ అనే సంస్థ తెలుగు రంగస్థలానికి, చిత్ర రంగానికీ ఎందఱో కళాకారుల్ని అందించింది. వాళ్ళు అప్పట్లో ఒకసారి రఘుదేవ రాజకీయం అనే నాటకాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆ నాటకం చూడడానికి వెడుతూ రామదాసు గారు తన కుమారుడ్ని కూడా వెంట తీసుకెళ్ళారు. అప్పటివరకూ నాటకం అంటే ఎరుగని ఆ అబ్బాయి ఆ ప్రదర్శన చూసి అబ్బురపడిపోయాడు. అతనిలో వున్న కళాకారుడు బయిటకొచ్చాడు. అతనికి కూడా వారిలాగ నటించాలనే కోరిక కలిగింది. కానీ అతనికి తెలుసు…. తండ్రి సుతారమూ ఒప్పుకోడని. ఆ భయంతో కొంతకాలం ఊరుకున్నా ఎంతోకాలం ఆగలేకపోయాడు. అదే యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్  ‘ బృహన్నల అనే నాటకం ప్రదర్శించే ప్రయత్నాల్లో వున్నారని తెలిసింది. అంతే ! వాళ్ళ దగ్గర వాలిపోయాడు. వాళ్ళను బతిమిలాడాడు. ఎలాగో ఆ నాటకంలోని  ఓ బృంద నృత్యంలో స్థానం సంపాదించాడు. హుషారుగా ఆ నృత్యం చేసి మహదానందం పొందాడు.

కోరికైతే తీరింది గానీ ఒళ్ళు హూనం అయింది. నాటకం పూర్తయి ఆలస్యంగా ఇంటికి వెళ్ళిన అతనికి తండ్రి బడితె పూజ చేసి తిట్ల పురాణం చదివాడు. నాటకమాడడం మనలాంటి మర్యాదస్తుల పనికాదని, ఆ పని చేసి పరువు తీసాడని, ఇక ఎవరూ పిల్లనివ్వరని…. నానారకాల తిట్లు తిట్టారు. ఇంత జరిగినా అప్పటికే నటన తలకెక్కిన అతనికి ఇవేమీ వినిపించలేదు. వాళ్ళను, వీళ్ళను పట్టుకుని నాటకాల్లో వేషాలు వేసి పేరు తెచ్చుకున్నాడు. అలాగే వచ్చీ రాని ఇంగ్లీష్ లో బొంబాయి, కలకత్తాలలో ఉండే చలనచిత్ర నిర్మాతలకు, దర్శకులకు తనకవకాశం ఇవ్వమని అదేపనిగా ఉత్తరాలు రాస్తూ ఉండేవాడు. చివరికి ఒక నాటకాల మిత్రుని సాయంతో కలకత్తా బయిలుదేరాడు. అక్కడ ఏ వేషం వెయ్యమంటే ఆ వేషం వెయ్యడానికి, అందుకుగాను డబ్భయి అయిదు రూపాయిలు పారితోషికంగా తీసుకోవడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. అలాగే ఆ చిత్రంలో వసుదేవుడు, రజకుడు లాంటి చాలా చిన్న చిన్న పాత్రలు ధరించాడు.

చిత్రం 1935 లో తయారైన శ్రీకృష్ణ తులాభారం ‘. ఆ చిత్రం ద్వారాచిత్రసీమలో ప్రవేశించి ఆ తర్వాత ఊహించని ఎత్తులకు ఎదిగిన నటుడు రేలంగివెంకట్రామయ్య.

 ” వెనుకటి రోజుల్లో పెళ్ళిళ్ళలో అందరి భోజనాలు అయ్యాక భజింత్రీ వాళ్ళకీ, పల్లకీ వాళ్ళకీ, దీపాలు మోసే వాళ్ళకీ ఆ మూల వడ్డించండర్రా ! అనేవారు. నాటకాల్లో హాస్య నటుడి పరిస్థితి కూడా అదే ! కానీ మా వెంకట్రామయ్య చిత్రరంగంలో అడుగుపెట్టాక అప్పటివరకూ అన్ని రసాలకు ఎంత విలువుందో ఒక్క హాస్య రసానికి అంత విలువ తీసుకొచ్చాడు “ అనేవారు పుత్రోత్సాహంతో రేలంగి తండ్రి రామదాసు గారు.

ఆగష్టు 13 వ తేదీ రేలంగి జయంతి సందర్భంగా…….

********************