హిరణ్యవర్ణాంలక్ష్మీమ్
లక్ష్మీం క్షీరసముద్రరాజతనయామ్
రీరంగధామేశ్వరీం
దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం
శ్రీ మన్మందకటాక్షాలబ్ధ విభవః
బ్రహ్మేంద్రగంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం
సరసిజామ్ వందే ముకుందప్రియామ్
– అని శ్రీ సూక్తంలో లక్ష్మీదేవిని స్తుతించిన విధానం మనకు విదితమే. ఆ తల్లి సరసిజ. అంటే నీటిలోని పద్మం లో నుంచి ఆ తల్లి ఉద్భవించింది. నీటి మీద ఉన్న పద్మం చంచలం. ఆ పువ్వు మీద ఆసీనురాలైన ఆ తల్లి కూడా చంచలాయై లక్ష్మి అని పేరొందింది. అయితే ధర్మనిష్ఠ ను, త్యాగనిరతిని కలిగినవారిని ఆశ్రయించి ఉండే స్వభావం ఆ తల్లిది.
లక్ష్మీదేవి పదహారు రకాల సంపదలను అనుగ్రహించే తల్లి. అవి – జ్ఞానo, తెలివి, బలం, శౌర్యం, వీరం, జయం, కీర్తి, ధృతి, నైతికత, ధనం, ధాన్యం, ఆనందం, ఆయుష్షు, ఆరోగ్యం మరియు సంతానం. అంతే కాకుండా మానవుల కోరికలను తీర్చడానికి, ఎనిమిది రూపాలలో అష్టలక్ష్మి గా
ఆవిర్భవించింది. ఆదిలక్ష్మి, విద్యాలక్ష్మి, ధాన్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, ధనలక్ష్మి.
అష్టలక్ష్మీ స్వరూపమైన వరలక్ష్మి దేవి రూపాన్ని ఋషీశ్వరులు, మహర్షులు, ధ్యానంతో తపస్సు తో దర్శించి తరించారు. ఆ స్వరూపాలను మనకు అందించారు.
డాక్టర్ వక్కలంక లక్ష్మీపతిరావు గారు ఋషితుల్యులు, కవివర్యులు. వారు దర్శించి తరించిన అమ్మవారి స్వరూపాన్ని, మనతో కూడా దర్శింపచేస్తున్నారు. వరలక్ష్మి వ్రత పుణ్య కథ అనే పాటలో…..
లక్ష్మీదేవిని మాతృస్వరూపంగా దర్శించారు. ఆ తల్లి గొప్పతనాన్ని లలితమైన పదాలతో హృదయానికి హత్తుకునేలా స్తుతించారు. కేవలం పూజామందిరం లోనే కాకుండా అన్నిచోట్ల అన్నివేళలా ఆనందంగా హాయిగా పాడుకునేలా రచించారు. భక్తి పారవశ్యంతో అరమోడ్పు కన్నులతో తాదాత్మ్యం చెందిన శ్రోతలు ఆనంద పరవశులు అయ్యేంత చక్కని పాట యిది. శ్రీమతి యస్. జానకి తన తియ్యని గళం తో ఈ పాటకు ప్రాణం పోశారు.
వరలక్ష్మీ వ్రత పుణ్య కథా
వరముల నొసగే తల్లి కథా
పసుపు కుంకుమా సిరిసంపదలూ
పెంపొందించే ప్రేమ సుధా
వరాల నిచ్చే తల్లి ఆ లక్ష్మీదేవి. స్త్రీలకు సౌభాగ్యమును ప్రసాదిస్తుంది. నియమపూర్వకంగా లక్ష్మీ అష్టోత్తరం, శ్రీ
సూక్తం, కనకధారా స్త్రోత్రం పఠిస్తే దారిద్య్రం, అరిష్టాలు నశిస్తాయి అని పెద్దలు చెప్తారు. సుధాసాగర సంభవ అయిన
ఆ మహాలక్ష్మీ దేవి ప్రేమసుధలను పంచే సౌభాగ్య దేవత గా కొనియాడారు. పాలకడలిలో వెలసిన తల్లి కనుక ఆవిడ పాల వలె స్వచ్చమైన మనసు కలిగినది. పద్మంలో ఉదయించింది కనుక ఆమె మెత్తని పూవు వంటి మనసు కలిగినదని కవి చమత్కరించారు.
చల్లని తల్లీ ఓ కల్పవల్లీ
వరలక్ష్మీ నీ ఎద పాలవెల్లీ
శుక్రవారముల నిను పూజింతుము
శుభము లీయవే మా తల్లీ
శుక్రవారం లక్ష్మీపూజ చేయడం లక్ష్మీప్రదం. కనుక కల్పవల్లి అయిన లక్ష్మీదేవిని అందరం పూజిస్తాము. అందరికీ శుభములను ప్రసాదింపుమని భక్తి పురస్సరంగా ఆ తల్లిని వేడుకుంటున్నారు కవి.
క్షీరసాగర మధనం జరిగినప్పుడు చంద్రుడు, అమృతములతో పాటు సోదరిగా లక్ష్మీదేవి కూడా జన్మించింది. కనుక తోడబుట్టిన చంద్రుని ఆహ్లాదకత, శీతలత్వం, అమృతతత్వం లక్ష్మీదేవిలో ఉంటాయి కనుక ఆ తల్లి నిస్సందేహంగా కల్పవల్లి.
ఆ తల్లిలో మాతృత్వాన్ని, మాతృత్వంలో దైవత్వాన్ని, దైవత్వంలో అమృతతత్వాన్ని కవి దర్శించారు.
‘కవయః క్రాంత దర్శనః ‘.
******************
సతి చారుమతిని…..
సతియైన చారుమతీ దేవి ని కరుణించిన లక్ష్మీదేవి ఆమెకు కలలో కనిపించింది. వరలక్ష్మీవ్రతం చేయమని ఆజ్ఞాపించింది. వ్రతం చేసిన చారుమతిని సంపదలలో ఓలలాడించింది. సౌభాగ్యమును నిలిపింది.
“ లక్ష్యతే ఇతి లక్ష్మి ” – జనులచేత దర్శింపబడే తల్లి. ఆ శ్రీ మహాలక్ష్మీదేవి పూజించే వారిని అనుగ్రహించే తల్లి. ఆ తల్లి రూపము రంగు ఎంత గొప్పవో శ్రీ సూక్తంలో చెప్తారు.
“ ఓం హిరణ్యవర్ణామ్ హరిణీమ్ సువర్ణ రాజతస్రజామ్ చంద్రామ్ హిరణ్మయీమ్ లక్ష్మీం జాతవేదోమమావహ”
కరుగుతున్న బంగారు రంగు శరీర ఛాయ కలిగిన బంగారు తల్లి. పార్వతీదేవి గురించి చెప్పేటప్పుడు కూడా “ తప్తహేమరుచిరామ్ ” అంటారు. అక్కడ కూడా కరుగుతున్న బంగారు ఛాయ కలిగినది అని అర్ధం. అనగా లక్ష్మీపార్వతులకు భేదము లేదు. ఇద్దరు తల్లులు ఒకటే. కనుకనే మహిషాసురుని మూడు జన్మలలో అమ్మవారు,
పార్వతీదేవి రెండు జన్మలలో అతనిని సంహరిస్తే లక్ష్మీదేవి ఒక జన్మలో శక్తిస్వరూపిణియై మహిషాసుర సంహారం కావించిందని పౌరాణిక గాథ. ఆ ఉగ్ర స్వరూపం తో కొల్హాపురి లో వెలసిన లక్ష్మీదేవి దర్శనమిస్తుందని చెపుతారు. మూల తత్వం ఒకటే కనుక కాళీ లక్ష్మీ సరస్వతుల ప్రధాన లక్షణాలు ఒక్కటే అని చెప్పవచ్చును.
***************************
శ్రావణ మాస శుక్రవారము….
చారుమతీ దేవి శ్రావణ శుక్రవారం రోజున పవిత్రంగా పూజాసామాగ్రి సమకూర్చుకుని భక్తితో ఆ తల్లిని కొలిచిందట. తానేకాక తన చెలులందరకూ కూడా ఆ ఆదృష్టాన్ని ప్రసాదించిందట. షోడశోపచారములతో కలశమును పూజించిన చారుమతిని లక్ష్మీదేవి అనుగ్రహించింది. భక్తితో మనం ఏదైనా సమర్పిస్తే అంతకు వెయ్యిరెట్లు భగవంతుడు మనకు ప్రసాదిస్తాడు. అందుకే చారుమతి పూజకు ప్రసన్నురాలైన లక్ష్మీదేవి ఒక్కొక్క ప్రదక్షిణమునకూ ఒక్కొక్క వైభవమును ఆ చారుమతికి ప్రసాదించింది.
తొలి ప్రదక్షిణముతో ఘలుఘలుఘల్లని గజ్జెలు వెలసె – అనటంలో లక్ష్మీదేవి అందెల ఘలంఘల నాదం, పవిత్రమైన సవ్వడిని మనసుతో విన్న కవి ఆ శబ్దతరంగాలను ఇంపుగా మన చెవులకు కూడా అందించారు. ఆ సవ్వడిని భక్తులు, పుణ్యశీలురు ఐన వారు వినగలరు, ఆనందించగలరు.
**************************
ఐశ్వర్యం కోరుకునే వారు అగ్నిని కూడా ఆరాధించటం ఒక సoప్రదాయం, శాస్త్రవిధి. జాతవేదుని పూజ కూడా మనం వింటుంటాం. జాతవేదుడు అంటే అగ్ని. “శ్రియమిచ్ఛేత్ హుతాశనాత్” అని అమ్మవారి స్వరూపాలలో ’ అగ్ని ’ ని కూడా ఒక అంశగా ఆరాధిస్తాము. కనుకనే చండీసప్తశతి “యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా” అని వివరించింది. ప్రకృతిగతమైన సమస్త స్వరూపాలు లక్ష్మీస్వరూపాలేనని దీనికి భావం. కనుకనే లక్ష్మీ అష్టోత్తరంలో మనం చదువుతాం.
ఓం ప్రకృత్యై నమః
ఓం వికృత్యై నమః
ఓం విద్యాయై నమః
ఇత్యాదులన్నీ లక్ష్మీ స్వరూపాలు గానే మనం తెలుసుకుంటున్నాం.
విద్యాస్వరూపిణి గా లక్ష్మీదేవిని ఆరాధిస్తాం. విద్య రెండు విధాలు. పరా – అపరా. అపరా విద్య లౌకిక జీవనాధారం. పరా విద్య పార లౌకికం. అంటే మోక్షసాధనమైన బ్రహ్మవిద్య. ఈ పరావిద్య మాత్రం అంత సులభమైనది కాదు. ఎంతో శ్రధ్ధ, సాధన అనేవి చాలా ఆవశ్యకమైన విషయాలు. ఎందరో మహనీయులు ఈ తల్లిని ఆశ్రయించి బ్రహ్మజ్ఞానమును పొంది తరించారు.
“సావిద్యా పరమాముక్తే ర్హేతుభూతా సనాతనీ సంసారబంధ హేతుశ్చ శైవ సర్వేశ్వరీ ” సర్వేశ్వరేశ్వరి అయిన ఆ తల్లి సనాతని, శాశ్వతురాలు కానీ బహువిధ అవతారాలలో కనిపిస్తుంది. లక్ష్మీదేవి రెండు గుణములు కలిగినది. సంపద – దారిద్య్రం.
” యాశ్రీ స్వయం సుకృతినా భువనే ష్వలక్ష్మీ:
పాపాత్మనామ్ కృతధియాం హృదయేషు బుద్ధి:
శ్రద్ధాసతాం కులజానా ప్రసవస్య లజ్జా
త్వామ్ త్వామ్ నతాస్మి పరిపాలయ దేవి విశ్వం “
పుణ్యాత్ముల ఇంట లక్ష్మి గా పాపాత్ముల ఇంట దరిద్ర దేవతగా బ్రహ్మజ్ఞాన సాధకులకు బుద్ధి, సజ్జనులలో శ్రధ్ధ, కులీనులలో లజ్జ ( తప్పు పనులు చేయటానికి సిగ్గు) వంటి రూపాలతో లక్ష్మీదేవి ఉంటుంది.
**************************************
కాంతుని ఎదపై కాపురముండీ
ఎడబాటన్నది ఎరుగనితల్లీ
భాగ్యములిచ్చి సౌభాగ్యములిచ్చి
కాపాడరావే కళ్యాణకారిణి
అని విష్ణువు హృదయంలో నివాసముండే లక్ష్మీదేవిని, ఆ దంపతుల అన్యోన్య దాంపత్యాన్ని కొనియాడారు కవి.
అనుకూల దాంపత్యసిద్ధికి లక్ష్మీనారాయణుల ఆరాధన సర్వ శ్రేష్ఠమని లోకులకు సందేశంగా ఈ పాట లో ఈ వాక్యాలను కవిగారు చెప్పటం గమనార్హం.
లోకహితాన్ని కోరుకునే కవిగారి అంతరంగం విశాల హృదయం విశదమవుతాయి.
దేవీభాగవతంలో లక్ష్మీనారాయణుల అన్యోన్యతత్వాన్ని వర్ణిస్తూ లక్ష్మీదేవి ఎక్కడెక్కడ ఉంటుందో చెప్తారు.
హరిభక్తి, హరిసేవ, హరిగుణకీర్తన ఉన్న చోటల్లా లక్ష్మీదేవి సర్వమంగళ ప్రదాయినిగా ఉంటుంది. శ్రీకృష్ణప్రశంస కానీ, కృష్ణ భక్తుల ప్రశస్తులుగాని వినిపించే చోట స్థిరంగా నిలుస్తుంది.
శంఖధ్వని, సాలగ్రామశిల, తులసి ఉన్న చోటా, వానికి ధ్యాన వందనాది సేవలు జరిగే చోటా తనకు తానై వెళ్లి నిలుస్తుంది.
శివలింగార్చన, శివగుణస్తోత్రం, దుర్గార్చన, దుర్గాస్తుతి జరిగే తావుల్లో, విప్రార్చన, విప్రసేవ దేవతా పూజాదితం జరిగే గృహాలలో, ఆలయాలలో లక్ష్మీదేవి స్థిరనివాసం ఏర్పరుచుకుంటుంది.
అటువంటి లక్ష్మిని ఆరాధన చేసి అందరూ సర్వసౌభాగ్యాలను పొందగలగాలన్నది కవిగారి సద్భావన.
*******************************************
కవీంద్రులైన లక్ష్మీపతిరావు గారు లక్ష్మీదేవిని ఈ విధంగా స్తుతించారు.
హరినీలమణులే నీ నీలికురులు
ఆణిముత్యములే నీ సిగవిరులు
నీపాదములే పద్మరాగములు
నీ చిరునవ్వులే నవరత్నాలు
నీ సోగకనులే రతనాల గనులు
నీవున్న చోటనే నిలిచేను సిరులు
– ఆ తల్లి సౌందర్యాతిశయాన్ని చక్కని లలితమైన పదాలతో నుతించడం మనోహరంగా ఉంది.
దేవీభాగవతం లో ఐశ్వర్యగర్వితుడైన ఇంద్రుడు దుర్వాస శాప ఫలితంగా కోల్పోయిన సమస్త ఐశ్వర్యాలను లక్ష్మీకటాక్షం తో తిరిగిపొందిన తరవాత ఆ తల్లిని కీర్తిస్తాడు.అహంకారాన్ని విడిచి సర్వస్య శరణాగతి వేడినవారిని ఆ తల్లి చేరదీసి అక్కున జేర్చుకుని అనుగ్రహిస్తుంది. సకలాభీష్టాలనూ ప్రసాదిస్తుంది. అతడు ఇంద్రుడైనా సరే, సామాన్యుడైనా సరే ఆ తల్లికి ఎవరైనా ఒకటే.
సహస్రదళ పద్మస్థ కర్ణికా వాసినీం పరాం
శరత్వార్వణ కోటీందు ప్రభా ముష్టి కరాం పరాం.
వేయిరేకుల తామరపువ్వు దుద్దుమీద కూర్చునే తల్లిని కోటి శరత్పూర్ణిమలనాటి కాంతిని అపహరించే పరాదేవతను ధ్యానిస్తున్నాను.
తేజస్సుతో ప్రజ్వరిల్లుతూ చూపులకు హాయిగొలుపుతూ కాగిన బంగారపు రంగులో రూపంధరించి ఉన్న లక్ష్మీదేవిని ఉపాసిస్తున్నాను. పీతాంబరం ధరించి, రత్నభూషణాలు అలంకరించుకుని, చిరునవ్వులు చిందిస్తూ ప్రసన్న వదనంతో ప్రత్యక్షమైన సుస్థిర యౌవనవతినీ శ్రీహరి సతిని స్తుతిస్తున్నాను. శుభంకరియై సర్వసంపదలనూ ఇచ్చే మహాలక్ష్మిని సేవిస్తున్నాను అని స్తుతిస్తూ షోడశోపచారాలనూ మంత్రపూర్వకంగా చేసి తరించాడు దేవేంద్రుడు.
కళ్యాణకారిణి ఐన ఆతల్లి యందు అచంచలమైన భక్తితో, నమ్మకంతో, చక్కని భావుకతతోముద్దుల మూటకట్టే పదగుంభన శైలితో పాఠకుల, శ్రోతల హృదయాలపై చెరగని ముద్రవేశారు కవి.
నిర్మల మనస్కులూ, హరిభక్త పరాయణులూ ఐన వారినీ, తనను త్రికరణశుద్ధిగా నమ్మినవారిని ఆ తల్లి చేరుతుంది అని కవి హృదయం. మనం ఆచరించే సత్కర్మలను పక్కవారితో కూడా ఆచరింపచేసే ఆదరణ, ఔదార్యం మనిషికి ఉండాలనే దివ్యమైన సంకల్పాన్ని, చారుమతి పాత్రను ఆలంబనగా తీసుకుని భక్తి రసానుకూలమైన చాతుర్యాన్ని, శేముషిని ప్రదర్శించారు కవివర్యులు. త్యాగనిరతిని, సౌశీల్యాన్ని మానవుడు అలవరచుకోవాలని కాంతాసమ్మితంగా తెలియజేసారు.
తీసుకోవటం కాదు ఇవ్వడం నేర్పాడు భగవంతుడు అనే పరమసత్యాన్ని అందరూ నేర్చుకుని ఆచరించాలనే సందేశం నిగూఢంగా ఉంది.
పూవున నిలచిన పూబోణి, పద్మపత్రేక్షణా, పద్మాస్య, పద్మాసన, పద్మినికి వందనం.
వైష్ణవికి సర్వసంపత్స్వరూపిణికి సర్వారాధ్యకు వందనం.
మహాదేవికి ప్రణతులు.
అమృతస్వరూపిణి ఐన లక్ష్మీదేవిని గురించిన ఈ పాట లక్ష్మీపతిరావు గారి లేఖిని నుండి జాలువారిన అమృతఝరి.