10-020 ద్విభాషితాలు – నాన్న ఉత్తరం

.

బాబూ !

నీకు ఆశీస్సులు.

విద్యావంతునిగా…

జీవితంలోకి అడుగు పెడుతున్నావు

నీకు నీడగా ఇంతవరకు నడిచాను నిన్ను నడిపించాను.

ఇక.. ఇది నీ శకం!

వృక్షం నుండి వేరుపడి…

మొక్కై…. మానై..

శాఖలుగా విస్తరించి..

నీ సామ్రాజ్యాన్ని స్థాపించుకో! జీవితమంటే…

చీకటి వెలుగుల సమాహారం.

చీకటి ఆవరించినప్పుడు… కృంగిపోకుండా…

వెలుగు కోసం శ్రమించడమే

జీవన సౌందర్యం!

.

సత్య జీవనగమనంలో…

పవనం ప్రతికూలంగానే ఉంటుంది. సహనం ప్రశ్నిస్తూనే ఉంటుంది. మనసుకు దెబ్బ తగిలితే…

కాలాన్ని శరణువేడాలి.

కాలమే ఎదురుతిరిగితే…

గమనదిశ మార్చుకుని… సాగిపోవాలి.

.

వేసవి వెనుక వర్షం దాగి ఉన్నట్లు..

కష్టాన్ని వెన్నంటి సుఖం ఉంటుంది. ఓర్పుతో వేచి ఉండాలి.

ప్రలోభాలు ప్రఛండమైనప్పుడు.. విలువలు బీటలు వారకుండా.. జాగ్రత్త పడాలి.

సవాళ్లు ఎదురైనప్పుడు..

ధైర్యమే ఆయుధం!

ఆలోచన కొత్తదయినప్పుడు..

మార్గం భిన్నమవుతుంది.

వెనకడుగు వేయకుండా కదలిపో. ప్రపంచం నీ వెనుకే నడుస్తుంది. ప్రేమే తత్వం!

స్నేహమే మతం!

.

బాబూ!

నా సుదీర్ఘ ప్రస్థానంలో..

నేను గడించిన అనుభవం..

నా తల్లిదండ్రుల నుంచి..

నేను పొందిన సంస్కృతి..

నా నుండి నువ్వు…

నీ నుండి నీ సంతతి..

పరంపరగా పొందగలిగితే..

అంతకన్నా సత్ఫలమేముంది ? విజయోస్తు!

ప్రేమతో…

నాన్న

.

***************

.

👉🏾మీకు నచ్చితే Like బటన్ నొక్కండి. మీ అభిప్రాయాలను ఈ క్రింద వ్యాఖ్యల పెట్టె (comment box) లో తెలియజేయండి👇🏾

******************************************************