10_002 అమెరికా ఇల్లాలి ముచ్చట్లు – బతుకు పడవ

                               

ఏమిటీ…బయట మంచు చూసి మండిపడుతున్నారూ?

తెలిసిన సంగతే కదా? అయినా ఇప్పుడేం కొంప మునిగిపోయిందిటా బయటకు వెళ్ళకపోతే?

“లేడికి లేచిందే పరుగని” అనుకున్నవి అనుకున్నట్టు ఆ క్షణంలో జరగాల్సిందే మీకు!

ఎందుకంత చిరాకు పడతారు! ఈ స్నో స్ట్రార్మ్ ఇప్పుడిప్పుడే తగ్గదు కానీ, హాయిగా ఇంట్లో కూర్చుని ఎంజాయ్ చెయ్యండి!

ఎందుకూ అలా నవ్వుతారు?

ఓ చెంప బయట స్నో పడుతుంటే ఇంట్లో కూర్చుని సంబరాలు చేసుకుందాం రమ్మంటుందేమిటా అని అనుకుంటున్నారు కదూ? అక్కడేవుంది మీ బస్తీ వాళ్లకు, మా పల్లెటూరి వాళ్లకు పెద్ద తేడా! చిన్నప్పుడు చదువుకోడానికి, పెద్దయ్యాక పనిచెయ్యడానికే పుట్టాం అనుకునే మీలాంటి వాళ్ళు ఎక్కడున్నా ఒకటే. ఇన్నేళ్ళనుంచీ అమెరికాలో ఉంటూ కూడా లైఫ్ ఎలా ఎంజాయ్ చెయ్యాలో తెలీదు మీకు. ఇక గాలివానలు..మంచు తుఫాన్లు..మండుటెండలు ఎంజాయ్ చెయ్యడం ఏం తెలుస్తుందీ?

అసలు సరదాగా గడపాలనే సంకల్పం, కాస్తంత క్రియేటివిటీ ఉండాలే కాని ఎక్కడున్నా, ఎప్పుడైనా ఆనందంగా గడపచ్చు.

నాకెలా తెలుసునంటారా?!

నేను చిన్నప్పుడు అలాంటి వాతావరణంలో పెరిగినదాన్ని కనుక, పైపెచ్చు నేను కోనసీమ అమ్మాయిని. నా బుర్ర వజ్రాలగని! మా ఊళ్ళో వానాకాలం వచ్చిందంటే మాకు వెకేషన్ అన్నమాటే! మనసు ఎప్పుడూ ఆటల మీద, అల్లరి మీద ఉండే నాలాంటి వాళ్లకు వానలు పడినప్పుడల్లా బడి మూత పడటం పెద్ద బెనిఫిట్! బళ్ళోకి వెళ్ళక్కరలేదు సరిగదా, ఇంట్లో కూర్చుని బోలెడు ఆటలు ఆడుకోవచ్చు.

చద్దెన్నం తినగానే దొరికిన చిత్తుకాగితాలన్నీ పోగేసుకుని అందరం రకరకాల పడవలు చేసుకునే వాళ్ళం. సాదా పడవలు..కత్తి పడవలు..రెండంతస్తుల పడవలు..పువ్వుల పడవలు ఇలా మాకున్న టాలెంటుని బట్టి చేసుకునే వాళ్ళం. మా చిన్నన్నయ్య పిల్లలందరికీ “పడవల పందెం” పెట్టేవాడు.

“వానలో తడవకండర్రా!” అని అమ్మ అంటున్నా వినకుండా ఎవరికి వాళ్ళు, వాళ్ళ పడవ మునిగిపోకుండా వెళ్లాలని, పందెంలో గెలవాలనీ ఒకటే దండాలు పెట్టుకుంటూ గోలగోల చేసేవాళ్ళం! ఈడురుగాలిలో, కుండపోతగా కురిసే వానలో బయటకు వెళ్ళలేనప్పుడు, పిల్లలం అందరం చేరి ఇంట్లో ఉన్న బిందెలు, బకెట్లు చూరు కిందపెట్టి నీళ్ళు నింపేవాళ్ళం. మనిషికి ఇన్ని చెంబులని లెక్కపెట్టి ఇచ్చిన వేడినీళ్ళతో ఆ ఈదురు గాలిలో స్నానం చేసి పొడి/వెచ్చని బట్టలు వేసుకున్నప్పటి ఆనందం అనుభవించిన వారికే తెలియాలి! ఇంట్లో కూరా, నారా ఏమి లేకపోయినా, పెద్ద రాచిప్పలో అమ్మ పెట్టే పప్పుపులుసుఘుమఘుమ, వేడి అన్నంలో కమ్మని కందిసున్ని, తియ్యని గడ్డపెరుగు రుచి ముందు మీ ఫైవ్ స్టార్ హోటల్ భోజనం ఎందుకూ పనికిరాదు!

నాన్న, అన్నయ్య పుస్తకాలు చదువుకుంటుంటే, అమ్మ మమ్మల్ని కూర్చోపెట్టి గవ్వలాట, పచ్చీసు ఆటలు ఆడించేది. రాత్రికి నాన్న అందరికీ కాశీమజిలీ కథలు చెప్పేవారు. ఏడాది పాటు కష్టపడగా చేతికొచ్చిన పంట చివరికి ఏమైపోతుందో అని నాన్న పడే ఆందోళన కానీ. ఇంటికప్పు ఎక్కడ కూలిపోతుందో అన్న అమ్మ భయంగానీ, చిన్నపిల్లల మైన మాకు తెలిసేదికాదు.

మాకు తెలిసిందల్లా కుండపోతగా వర్షం పడితే ఇంటిల్లిపాదికి ఆటవిడుపని!

అందుకే నా ఫిలాసఫీ కూడా లైఫ్ ని వీలైనంతవరకు నవ్వుతూ, సరదాగా గడిపెయటమే. జీవితంలో తుఫానులు ఎదురైనప్పుడల్లా మా “బతుకు” అనే పడవ మధ్యలో మునిగిపోకుండా ఎలాగో అలాగు తీరానికి చేర్చు స్వామీ అని వేడుకుంటూ ఉంటాను.

ఇదిగో మిమ్మల్నే! వింటున్నారా?

నా మాట విని బయటకు వెళ్ళే ప్రోగ్రాం కాన్సిల్ చేసుకోండి. అల్లపచ్చడి చేసాను,  వేడివేడిగా ఎం.ఎల్.ఎ పెసరట్టు తిందాం! ఆ తర్వాత….

ఏమిటీ నా ఐడియా అదిరిందంటారా?!

అమ్మయ్యా! ఇప్పటికి వెలిగింది ట్యూబ్ లైట్!!!!     

***************************************************

బతుకు పడవ – నేపథ్యం

ఒకసారి ఏదో గెట్ టు గెదర్ లో అందరం చిన్నతనం గురించి, చిన్న చిన్న సరదాల గురించి మాట్లాడుకుంటుంటే మా ఫ్రెండ్ ఒకావిడ “మా వారికి బోలెడంత డబ్బు ఖర్చుపెట్టి, ఎక్కడికైనా వెకేషన్ కు వెళ్తేనే ఎంజాయ్ చేసినట్టు. ఆయనకు ఇటువంటి వాటి గురించి ఏమీ తెలీదు” అంటూ వాపోయారు. నిజమే కొంతమంది సంతోషంగా ఉండాలంటే దానికి ప్రత్యేకంగా టైము కేటాయించుకోవాలని.. డబ్బు ఖర్చు చెయ్యాలని అనుకుంటారు. మరి కొంతమంది ఏ పెద్ద ప్రయత్నం లేకుండా నవ్వుతూ సరదాగా ఉంటారు!

జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే అందరికీ బాల్యం ఓ మధురమైన ఘట్టం. నేను ఈ బతుకు పడవలో రాసినది అచ్చంగా నా చిన్నతనంలో మా ఊరు.. మా ఇంటి వాతావరణం! ఇక్కడ ఎప్పుడు బాగా స్నో పడుతున్నా నాకు వెంటనే మనసులో గుర్తుకొచ్చేది, మా చిన్నప్పటి ఆ వర్షాకాలం.. ఆ ఆటలు.. ఆ అల్లరి! చిన్నప్పుడు ఆనాడు చేసిన కాగితం పడవలు.. వాటి తాలూకు అనుభూతులు, మా ఫ్రెండ్ అన్న మాటల కారణంగా “బతుకు పడవ” ముచ్చటగా మారిపోయాయ్!     

♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦