10_002 ద్విభాషితాలు – రాత్రి వర్షం

కిటికీ లోంచి పడమటి గాలి…

దేహాన్ని చల్లగా తాకింది.

 

ఆకాశం అంచుల్లోంచి …

విద్యుల్లతలు కాంతులు విరజిమ్మాయి.

 

చీకటి గోడలపై మెరుపులు…

వెలుగు రంగులద్దాయి.

 

పగళ్ల సెగలు దాటిన ఊరికి..

రాత్రి ఉరుములు …

వాన కబురు తెచ్చాయి.

 

వేడితో…ధూళితో…

వేసారిన పుడమి తనువుపై…

చల్లని ధారగా…

స్నానంగా…

రాత్రి కురిసింది.

కష్టాన్ని …..

ఓ సుఖం వెంటబడి తరిమింది!

 

చీకటితో కలిసిన చినుకు…

నిద్రని చల్లబరిచింది.

 

ఉదయం ….

కడిగిన సూర్యోదయంలోంచి….

మరో స్వచ్ఛమైన రోజు అడుగుపెట్టింది!

**************