అమలపురికి నధిష్ఠానం బాది దేవ
యాది శక్తిని పరిణయమాడి నీవు
శుభపరంపర పంచెడి చూపు తోడ
భాగ్యభోగంబులనిడుము వరముగాను.!!
అమలాపురం మా ఊరు అని చెప్పుకోగానే నా మనస్సు కోనసీమ కొబ్బరాకులా గాలిలో తేలిపోతుంది. కోనసీమ ముఖద్వారమైన రావులపాలెం నుండి ప్రయాణం చేసి మా అమలాపురం రాగానే ఈదరపల్లి వంతెన క్రింద ప్రవహిస్తున్న “కౌశిక” నదీపాయ మనకి స్వాగతం పలుకుతుంది. ఆ వంతెనకి కుడివైపున రెండు మైళ్ళదూరంలో మహాపండితులు ఉదయించిన ఇందుపల్లి ఊరు మనకి కనబడుతూ ఉంటుంది.
కాలువలనిండా నీరు బంగారంలా ప్రవహించి కాలువల గట్టున కొబ్బరిచెట్లు బంగారు హారానికి నగిషీలా అన్నట్టు, చెట్లమధ్య అమృత కలశాలైన కొబ్బరి కాయలు అమ్మ కడుపు పండి చంకలో తన సంతానాన్ని ఎత్తుకున్న చందాన మనకు గోచరిస్తుంది. అలాంటి కోనసీమకు గుండెకాయ వంటి పట్టణం అమలాపురం. దీనికి “పాంచాలపురం ” అని పేరు ఉండేదని ఒక ఐతిహ్యం ఉంది. కానీ చిందాడమడుగులో వెలసిన పార్వతీ సమేత అమలేశ్వర స్వామి నామం తో ఈ ఊరికి ” అమలాపురం ” అనే పేరు వచ్చిందని చెబుతారు.
అమలాపురం లో ప్రముఖంగా చెప్పుకోదగ్గ అతి పురాతనమైన దేవాలయాలలో మోబర్లీపేటలో ద్రుపద మహారాజు ప్రతిష్ఠ చేసాడు అని చెప్పబడుతున్న చెన్నమల్లేశ్వర స్వామి, ఎఱ్ఱవంతెన దగ్గరలో ఉన్న స్వయంభూవేంకటేశ్వర స్వామి, ఆయన పొలంలో లభ్యమైనాడని చెప్తారు. ఆయన మహిమలు చెప్పనలవి కాదు. ఒకరోజు నా జీవితంలో జరిగిన సంఘటనే దానికి తార్కాణం. నా పెద్ద కుమారుని మొక్కుచెల్లిస్తుండగా పోయిన బంగారు గొలుసు ఒక వారం తర్వాత బంగారం షాపులో దొంగ అమ్ముతుండగా వాసుదేవుని కృపవల్ల దొంగని పట్టి ఇచ్చి నా వస్తువు నాకు చేరవేసి తన మహిమ చూపించిన స్వామి ఆ ఏడుకొండల వాడు ఈ వెంకన్నబాబు.. ఆయన ఉత్సవాలు ప్రతీ మాసంలో జరుగుతాయి. అదీకాక ఈ స్వామి గుళ్ళో పెళ్ళి చేసుకుంటే ఆ కాపురం కలకాలం ఉంటుందని ముహూర్తాల రోజుల్లో కొన్ని వందల పెళ్ళిళ్ళు జరుగుతాయి. అందుకే ఆయనకి కళ్యాణ వేంకటేశ్వరుడని పేరు. అమలాపురం గ్రామ దేవత సుబ్బాలమ్మ తల్లి దేవాలయం, కాలేజీ రోడ్ లో వున్న వల్లీదేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర, రాజరాజేశ్వరీ సమేత శ్రీ కృష్ణేశ్వర స్వామి వారి దేవస్థానం, దాని సమీపంలో కూచిమంచి అగ్రహారంలో ఉన్న బాలాత్రిపుర సుందరీ సమేత శ్రీచంద్రమౌళీశ్వర స్వామి ఆలయం, శంకరమఠం, భూపయ్యఅగ్రహారం లో నెలకొన్న సీతారామస్వామి దేవాలయం మఖ్యమైనవి. పోలీసు లైన్ వీధి లో వెలిసిన చెట్టుకింద దుర్గ గొప్ప మహిమగల దేవత. శ్రావణ మాసం లో అమ్మ ఉత్సవాల లో వేప చెట్టు కొమ్మ ముందుకి వంగుతుంది. ఇలా ఆ రోజుల్లో మాత్రమే జరుగుతుంది. అమ్మని కొలిచిన వారికి కొంగు బంగారం.
అమలాపుర పట్టణము చుట్టు పక్కల గ్రామాల ప్రజలందరి విద్య, ఆరోగ్య, వ్యాపార అవసరాలు తీరుస్తుంది. ఇప్పుడు బోడసకుర్రు గోదావరి రేవు మీద కొత్త వంతెన రావడం వల్ల రవాణా సదుపాయం మరింత పెరిగి వ్యాపారాభివృద్ధి కి తోడ్పడుతోంది. చక్కని ప్రకృతి సౌందర్యం, చుట్టుపక్కల అంతా గోదావరి నది ప్రవహించే కోనసీమ లో ముఖ్యమైన వూరు మా అమలాపురం. ఊరికి ఉత్తరం వైపున నల్లవంతెన మీద నుంచి దాటి 10 కిలో మీటర్ల దూరంలో అయినవిల్లిలో వేంచేసిన వరసిధ్ధివినాయకుడు అభయప్రదాత. ఎన్నో ఊళ్ళనుంచి అమలాపురం వచ్చిన భక్తులు చుట్టూ ఉన్న పుణ్యక్షేత్రాలైన గౌతమి ముని ప్రతిష్టించిన కుండలేశ్వరుడు, మురమళ్ళ లో నెలకొన్న నిత్యకళ్యాణ స్వామి భద్రకాళీసహిత వీరేశ్వరుణ్ణి, అప్పనపల్లిలో కొబ్బరితోపులో వెలసిన వెంకన్న బాబుని…. క్షణ కాలం దర్శిస్తే పుణ్యం ఇచ్చే క్షణ ముక్తేశ్వరులని దర్శించి చుట్టూ ఉన్న ప్రకృతి రమణీయతను ఆస్వాదించి వెడుతూ ఉంటారు.
ఇక్కడ ఎందరో లబ్ధ ప్రతిష్టులయిన నాయకులు, వేద పండితులు, మేధావులు, వివిధ రంగాలలో ఎంతో కీర్తి ని ఆర్జించిన వారు మా ఊరి వారు కావడం మాకు గర్వకారణము. అమలాపురం లో జన్మించిన శ్రీ కళా వెంకట్రావు గారు ఆల్ ఇండియా కాంగ్రెస్ జనరల్ సెక్రటరిగా పనిచేసి ఎనలేని కీర్తి గడించారు. పూర్వం రోజుల్లో తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకి రెండు పక్కల పడవలమీద అతిప్రయాసగా గోదావరి పాయల్ని దాటడం కష్టతరంగా ఉండేది. గోదావరి నది మీద ఆలమూరు దగ్గర, అలాగే సిద్ధాంతం దగ్గర వంతెనలు నిర్మింప చేయడం లో ఆయన పాత్ర అద్వితీయమైంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ మంత్రిగా పనిచేసి ఎంతో కీర్తి గడించారు. మా ఊరిలోని విద్యార్ధులకే కాకుండా ఎన్నో చుట్టుపక్కల గ్రామాలలో నివసిస్తున్న విద్యార్ధులకి సహితం సమున్నత విద్యని అందించిన శ్రీ కోనసీమ భానోజీ రామర్స్ కళాశాల తూర్పుగోదావరి జిల్లాకే తలమానికం.
ఆ కళాశాల ఎందరో విజ్ఞానవంతుల్ని, నాయకుల్ని తయారుచేసి తన ఘనత చాటుకుంది. పేరూరి జమిందార్ గారైన శ్రీ జె. వి. భానోజీ రామర్స్ గారి దాతృత్వం వల్ల కళా వెంకట్రావు గారి కృషి వల్ల అమలాపురానికి ఈ కళాశాల 1951 లో స్థాపితమైంది. 12-10-1951 న ఆనాటి ఆర్ధిక శాఖామంత్రి శ్రీ బెజవాడ గోపాలరెడ్డిగారు దీనిని ప్రారంభించారు. దీనికి మొదటి అధ్యక్షులుగా శ్రీ నడింపల్లి రామభద్రరాజు గారు వ్యవహరించారు. శ్రీ గరిమెళ్ళ ప్రభాకర రమేశం గారు గణితశాస్త్రాధ్యాపకులు గాను, తర్వాత ప్రిన్సిపాల్ గా ఈ కళాశాల లో పనిచేసి కళాశాల ప్రతిభని ఇనుమడింప చేసారు.
మహామహులైన అధ్యాపకులు శ్రీ గొలకోటి వెంకటరత్నంగారు, మంథాసాంబశివశాస్త్రిగారు, అడ్డాల పేరిశాస్త్రి గారు, అందరి నోళ్ళల్లో ఇప్పటికి పాడుకునే ఆంధ్ర పుణ్యక్షేత్రాలనే పాట వ్రాసిన తెలుగు అధ్యాపకులు శ్రీ వక్కలంక లక్ష్మీపతిరావు గారు, శిష్టా సూర్యనారాయణగారున మూర్తి గారు, సంస్కృత పండితులు శ్రీ ఘనశ్యామ ప్రసాద్ గారు, అజ్జరపు పాపయ్యగారు, పోడూరి రమణశర్మగారు, మాచిరాజు వెంకట రామకృష్ణారావుగారు, తెలుగులోనే ఐ. ఎ. ఎస్ పరీక్ష వ్రాయడానికి ధైర్యాన్నిచ్చిన తెలుగు భాషా కోవిదులు ద్వా. నా. శాస్త్రిగారు, తెలుగు భాష మీద ఎంతో పట్టు సాధించి గొప్ప గొప్ప నాటకాలు రచించిన డాక్టర్ బి. వి. రమణమూర్తి గారు, పైడిపాల సత్యనారాయణ రెడ్డి గారు, జూవాలజీ లో గుర్రం ప్రకాశరావు గారు, బెండపూడి రామకృష్ణ గారు, భౌతిక శాస్త్రంలో అయ్యగారి శేషగిరి రావు గారు, సి. వి. సర్వేశ్వర శర్మగారు, గణితం లో డా. శ్రీ పి. వి. యస్ గారు, మంగిపూడి వెంకట సత్యనారాయణ మూర్తి గారు, శిష్ట్లా సూర్యనారాయణ ( కామర్స్ ) గారు, మంచిరాజు వెంకటేశ్వర రావు గారు… ఇలా లబ్ధ ప్రతిష్టలైన వారు ఎందరో ఈ కళాశాల సర్వతోముఖాభివృధ్ధికి పాటుపడ్డారని చెప్పడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు.
ఈ కళాశాల లో నేను, నా తమ్ముళ్ళు చాగంటి శ్రీనివాస రవికుమార్, హర గోపాల్ చదువుకొని వృద్ధి లోకి వచ్చాం. ఇక శరన్నవరాత్రుల్లో దసరా పండగ అంటే అమలాపురం పేరు చెప్పుకోవాలి.
చాన్నాళ క్రితం మొదలు పెట్టి ఇప్పటికీ సాంప్రదాయంగా కొనసాగుతున్న చెడీ – తాలింఖానా కి శ్రీ అబ్బిరెడ్డి రాందాసు గారు ఆది గురువు.
శ్రీ అబ్బిరెడ్డి రామదాసు గారు ఆయన మొదలు పెట్టి నేర్పించిన కర్రసాము, కత్తి తిప్పడం, బల్లెం, లేడి కొమ్ములు, అగ్గి బరాటాలు, తాడుకొసలకి ఇనప గుండులు కట్టిన దాన్ని కర్ర లాగ తిప్పడం, కర్రలకి ఇనపరింగులు తగిలించి వాటికి అగ్గి బరాటా గుడ్డలు కట్టి వెలిగించి కర్రసాము తిప్పే సాహసాలు, అలాగే పొట్టమీద కాయగూరలు పెట్టి వాటిని వేట కత్తి తో కళ్ళకు గంతలు కట్టుకొని నరకటం లాంటి ఒళ్ళు గగుర్పొడిచే సాహసాలు గొప్ప సంబరాలు ఒక పక్క అలాగే నవరాత్రుల్లో ఊరేగించే వాహనాలను పోటీపడి వ్యయప్రయాసలతో తయారు చేస్తారు. వాటిలో గండు వీధి నుండి శేషశయన విష్ణుమూర్తి, కొంకాపల్లి లక్క ఏనుగు, రవణం వీధి మహిషాసుర మర్ధని, మహిపాల వీధి హంసవాహనం, రవణం మల్లయ్య వీధి గరుడ వాహనం, నల్లా వీధి సీతా రాములు, కోర్టు వారి గడ్డి ఏనుగు ముఖ్యమైనవి.
ఒళ్ళు గగుర్పొడిచే ఈ సాహసాలు చూడడానికి చుట్టుపక్కల గ్రామాలనుంచి ప్రజలు తండోపతండాలుగా వచ్చేవారు. ఇప్పటికీ సాంప్రదాయానుసారంగా ఇవి కొనసాగుతున్నాయి. వేరే ఊళ్ళల్లో స్థిరపడ్డ మాలాంటి వాళ్ళకు తియ్యని జ్ఞాపకాలుగా మిగిలాయి. అలాగే సంక్రాంతి సంబరాలలో భోగిమంటలు, పొంగళ్ళు, అల్లుళ్ళ అలకలు వాళ్ళకి ఇచ్చే ఆతిధ్యాలు, కనుమ నాటి బళ్ళపూజలు చూసి తీరవలసిందే.
వినాయక చవితి నవరాత్రుల్లో గొప్ప కళాకారులతో శ్రీ చిక్కాల సూర్యారావు గారి ఆధ్వర్యం లో పౌరాణిక నాటకాలు, హరికథలు, బుర్రకధలు, సంగీత ఉత్సవాలు నా చిన్నతనం లో జరిగేవి.
మా గడియారం స్ధంభం సెంటర్ గొప్ప వ్యాపార సముదాయ స్ధలం. చాలా ఏళ్ళక్రితం నిర్మించిన గడియార స్ధంభం అందరికి ఒక దిక్సూచి లాంటిది. దానిని మేం ఊరి నడిబొడ్డుగా ఊహించుకొనేవాళ్ళం, మేము నిరుద్యోగులుగా అక్కడ వున్న గ్రంధాలయంలో పోటీ పరీక్షలకి ప్రిపేర్ అయ్యేవాళ్ళం. గడియార స్తంభం తో మా చిన్ననాటి జ్ఞాపకాలు దానితో ముడిపడి ఉన్నాయి. కాలాతీతంగా అది శిధిలావస్ధ పొందింది. ఇప్పుడు దాని స్థానంలో కొత్తది నిర్మించారు.
ఎన్నో ప్రముఖుల ఉపన్యాసాల ను అక్కడ ప్రజలు గుమిగూడి ఆ సెంటర్లో వినేవారు. ఎన్నో దీక్షలకి అది చోటు నిచ్చింది. ఎందరో కళాకారులు అక్కడ నాటక ప్రదర్శనలు, కచేరీలు చేసారు. ఇదే ప్రదేశం లో కథ చెప్పి, బుర్రకధ కళ మీద ఉన్న మక్కువతో ప్రేమతో ” జనరంజని ” అనే సంస్ధ ద్వారా నలభై ఏళ్ళుగా భారతదేశమంతా తన బృందంతో పర్యటిస్తూ ప్రదర్శనలిస్తున్న శ్రీ బందా కామేశ్వర రావు మాష్టారు అభినందనీయులు.
“ గణితం మూర్థ్నిస్థితమ్” అని తోపెల్ల సూర్యనారాయణ మూర్తి గారి లాంటి గణితావధాని అమలాపురం వాస్తవ్యులవడం మా ఊరికే అదృష్టం. గణితంతో అవధానం చేయవచ్చని ఆయన తన మేధతో ఎంతోమంది విద్యార్ధులకి గణితం అంటే భయం పోగొట్టి అభయమిచ్చిన మేధావి శ్రీ మూర్తిగారు.
కోనసీమ కేంద్రబిందువైన అమలాపురం కొబ్బరి, ధాన్యం, కొబ్బరి పీచు, బట్టల వ్యాపారాలు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకి విద్యాసంస్థలకి ఆలవాలం. ఈమధ్య కోనసీమ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్యకళాశాల మా అమలాపురం లో నెలకొల్పడం ఎంతో ఉపయోగకరమైంది.
అమలాపురంలో ఉన్న అగ్రహారాలు ఏ ఊరిలోను లేవని చెప్పడం అతిశయోక్తి కాదేమో ! కూచిమంచి అగ్రహారం, భూపయ్య అగ్రహారం, పేరమ్మ అగ్రహారం, బుచ్చమ్మ అగ్రహారం, దుడ్డువారి అగ్రహారం, వెత్సావారి అగ్రహారం, విశ్వేశ్వర అగ్రహారం, బండివారి అగ్రహారం, పేరూరు అగ్రహారాలతో విలసిల్లుతోంది. విశ్వేశ్వర అగ్రహారం, పేరూరు అగ్రహారాలు వేదమాతకు అలంకారాలు, పండితులకి నిలయాలు.
అక్కడ ఇల్లు, వాకిళ్ళు చూసి తీరవలసిందే. ఈ ఆధునిక కాలం లో కూడా, అక్కడ నివసిస్తున్న ప్రజలు తమ పురాతన ఇళ్ళు గాని, బావులు గాని, మార్చకుండా విశాలమైన వీధులలో చక్కగా అన్ని సదుపాయాల తో ఎన్నో ఏళ్ల నుండి అలాగే కొనసాగించడం గొప్ప విశేషం. అక్కడ నుండి ఎందరో అమెరికా లాంటి దేశాలకి వెళ్ళినా, తమ స్వంత వూరిని మర్చిపోకుండా, ప్రతి ఏడాది శివుని కళ్యాణం కి వస్తారు. తమ ఊరి అభివృద్ధికి తమ వంతు సాయం చేస్తారు.
మా అమలాపురం నుండి ఎందరో ప్రముఖులు అసెంబ్లీకి, పార్లమెంటుకి ప్రాతినిధ్యం వహించి, అమలాపురం మరియు కోనసీమ అభివృధ్ధికి ఎంతో పాటుబడ్డారు. వారిలో శ్రీ గంటి మోహన చంద్ర బాలయోగి లోక్‌సభ స్పీకర్ గా పనిచేసిన రోజుల్లో కోనసీమ అభివృధ్ధికి ఎంతో పాటుబడ్డారు. ఎంతోకాలంగా ప్రజలు ఎదురుచూస్తున్న గోదావరి నదీపాయ పై యానాం వంతెన ఆయన చొరవ వల్లనే సాథ్యమైంది. అలాగే రాష్ట్ర మంత్రులుగా పనిచేసిన శ్రీ కుడుపూడి ప్రభాకరరావు గారు, 1977 లో శ్రీ జలగం వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న మంత్రివర్గంలో శ్రీ పళ్ళా వెంకట్రావుగారు నీటిపారుదల శాఖ మంత్రిగా కోనసీమ అభివృధ్ధికి ఎంతో పాటుపడ్డారు. తెలుగుదేశం పార్టీ పెట్టిన కొత్తలో డాక్టర్ శ్రీ మెట్ల సత్యనారాయణ గారు తన ప్రజలతో మమేకమై పోయి, మంచి నాయకుడిగా పేరుతెచ్చుకున్నారు. రాష్ట్రమంత్రిగా కూడా పనిచేసారు.
గొల్లపల్లి సూర్యారావు గారు మొదలైనవారు ప్రజలకి ఎంతో సేవ చేసారు.
అలాగే జనతా పార్టీ లో చేరి అమలాపురం నియోజక వర్గం నుండి శ్రీ పలచోళ్ళ రామారావు గారు గెలుపొంది ఏకైక మొనగాడుగా పేరు సంపాదించారు.
ఈనాటి తరంలో శ్రీ నిమ్మకాయల చినరాజప్ప గారు రాష్ట్రహోం మంత్రిగా, ఆంధ్రరాష్ట్రానికి తొలి డిప్యూటీ ముఖ్యమంత్రిగా కూడ పనిచేసి ఎనలేని కీర్తిని గడించారు. ఆయన అమలాపురం SKBR కళాశాలలో చదువుకున్నారు. అలాగే రాజ్యసభకి ప్రాతినిధ్యం వహించిన శ్రీ భమిడిపాటి కృష్ణమోహన్ గారు రైల్వే బోర్డు చైర్మెన్ గా , కుసుమ కృష్ణ మూర్తి గారు బ్యాంకింగ్ సర్విస్ రిక్రూట్మెంట్ బోర్డు కి ఛైర్మన్ గా కూడా పనిచేసారు.
ఇప్పడు అసెంబ్లీ కి MLA గా శ్రీ పినిపె విశ్వరూప్ గారు, పార్లమెంటు నియోజక వర్గానికి శ్రీమతి చింతా అనూరాధ గారు ప్రాతినిధ్యం వహించి తమ సేవలని ప్రజలకి అందజేస్తున్నారు.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కి తన జీవితం అంకితం చేసి, ఈనాడు భారతీయ జనతా పార్టీ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ గా పనిచేస్తున్న శ్రీ రాంమాధవ్ గారు మా అమలాపురం వారే. మా ఊరి మున్సిపల్ బడిలో చదువుకుని, భారతీయ స్టేట్ బ్యాంక్ లో చిరుద్యోగిగా తన ప్రస్థానం ప్రారంభించి అంచెంలంచెలుగా ఎదిగి ఈశాన్య రాష్త్రాలకి చీఫ్ జనరల్ మేనేజర్ గా పనిచేసి బ్యాంకు ద్వారా ప్రజలకి ఎన్నో విధాల సేవలు అందించిన శ్రీ పోడూరి సూర్య లక్ష్మీ నరశింహమూర్తి గారు మా ఊరివారని నాకు ఆనందం. అలాగే న్యాయవాద ప్రముఖులైన శ్రీ కూచిమంచి వెంకటరత్నం గారు, శ్రీ పాలగుమ్మి సూర్యారావుగారు, శ్రీ నల్లా సూర్యనారాయణ గారు, శ్రీ అల్లాడ భాష్యకార్లు గారు. శ్రీ కూచిమంచి మల్లపరాజు గారు, న్యాయవాది గా తన ప్రస్థానం ప్రారంభించి హైకోర్టు జడ్జిగా ఎదిగిన శ్రీ బులుసు శివశంకరరావు గారు ముఖ్యులు. వేద స్మార్త పండితుల్లో శ్రీ తోపెల్ల నరశింహమూర్తి గారు, శ్రీ మరువాడ మహదేవశర్మ గారి లాంటి పండితులు అమలాపురానికి వన్నె తెచ్చారు.
వైద్యవృత్తిని దైవదత్తంగా భావించి పేదవాళ్ళ దగ్గర ఫీజు పుచ్చుకోకుండా, కొంతమంది దగ్గర చాలా తక్కువ ఫీజుతో సేవచేసిన డా. శ్రీ మంథా సుబ్బారావు గారు, డా. గోటేటి సరస్వతిగారు, కాలక్రమేణా డా. సత్యవతి గారు, డా. చిరంజీవి రాజు గారు కొనియాడ దగ్గ వైద్యులు.
అలాగే విశ్వ హిందూ పరిషత్ లో ఎప్పటి నుంచో సభ్యుడిగా వుంటూ సనాతన ధర్మ పరి రక్షణలో తన వంతు కృషి చేస్తున్న శ్రీ తోపెల్ల సత్యనారాయణ మూర్తి గారు మా గురువుగారు అవ్వడం మాకు గర్వకారణం. ఆయన దిశా నిర్దేశం తో ఆశీస్సులతో నేను ముందుకు వెడుతున్నాను.
వేదములకు ఆలవాలమైన కోనసీమ మహా పండితులకు, కళాకారులకు నిలయం. అలాంటి వేదవిద్యని పరిరక్షించుకోవడానికి, వేద పండితులని సత్కరించుకోవడానికి అమలాపురం ఒక వేదిక. ఎందరో పెద్దలు వేదసభ ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం వైశాఖమాసంలో ” ఘనపనస ” వేదపఠనం జరిపించేవారు. వేంగి క్షేత్రం అన్న పేరు వున్న కోనసీమ లో మా ఊరు ఈ మహోత్కృష్టమయిన కార్యక్రమాలకి ఒక వేదిక.
ఆ మహాపండితులని సత్కరించుకుంటే అ వాగ్దేవిని సత్కరించుకున్నట్టే అని భావించేవారు. తర్క, జ్యోతిష, మీమాంస, వేదాంత విషయాల్లో నిష్ఠాతులైన వారెందరో ఈ గడ్డమీద జన్మించి తమ కీర్తి ఉత్తర భారతదేశం లోని బెనారెస్ హిందూ విశ్వవిద్యాలయానికి కూడా పోటీగా వెళ్ళి తమ ప్రతిభాపాటవాలని ప్రకాశింపచేసారు.
అపర సరస్వతీ పుత్రుడు అపర త్యాగయ్య లాంటి వాగ్గేయకారుడు, సంగీత కళానిధి, పద్మవిభూషణుడు శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ కోనసీమలోని శంకరగుప్తం లో జన్మించినా, అమలాపురం రాతిబడిలో జరిగే త్యాగరాయ గానసభ ఉత్సవాలలో ఒకరోజైనా తన గానం వినే భాగ్యం కలిగించేవారు. ఆయనకీ, అమలాపురానికి విడదీయలేని అనుబంధం ఉంది.
పద్మశ్రీ పురస్కార గ్రహీత ఆచార్య శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు శ్రీమద్వాల్మీకి రామాయణం లోని మాధుర్యాన్ని రుచి చూపించారు. ఆయన వ్యాకరణ, వేదాంత, అలంకార, తర్క, మీమాంస శాస్త్రాలకు సంబంధించి సంస్కృత, తెలుగు, ఆంగ్ల, హిందీ భాషలలో 150 గ్రంధాలకు పైగా రచించిన ఆయన మాఊరి వారవడం మన జన్మసుకృతం. తాను లౌకిక జీవితంలో లెక్చరర్ గా పనిచేసినా ఆధ్యాత్మిక జీవిత పథాన్నే అనుసరిస్తూ తాను పూచిక పుల్లగూడ ప్రతిఫలాపేక్ష ఆశించకుండా తన తండ్రిగారైన శ్రీ పుల్లెల సత్యనారాయణ శాస్త్రి గారి నుండి లభించిన జ్యోతిష విద్యా ఫలాల్ని దేశ విదేశీయులకి పంచుతూన్న నిగర్వి, ఋషి తుల్యులు శ్రీ పుల్లెల శ్రీకృష్ణమూర్తి గారు మా ఊరి వారే అని చెప్పుకోవడం మాకెంతో గర్వకారణం.
పక్కనే ఉన్నఇందుపల్లి గ్రామం లో ఈమధ్య శ్రీ గొర్తి గోపాలకృష్ణ గారు ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వారి తాతగారైన శ్రీ గొర్తి కొండయ్య శాస్త్రి భాగవతార్ పేరున తాను నెలకొల్పిన స్మారక సమితి పక్షాన ప్రతి సంవత్సరం హరికధా సప్తాహ కార్యక్రమాలు జరిపిస్తూ హిందూ పరిరక్షణ నిమిత్తం కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే “ గో సేవ ” పేరుతో ఎన్నో గోవుల్ని పెంచి, దాతలు ఇచ్చిన సాయం తో వాటిని పోషించే బాధ్యత తన మీద వేసుకున్నారు. ఆయన సేవలు అభినందనీయం.
గన్నవరంలో పరబ్రహ్మ స్వరూపమైన అన్నాన్ని ఆర్తులకు, అతిధులకు వండి వడ్డించిన శ్రీమతి డొక్కాసీతమ్మ గారు సదాస్మరణీయులు.
ఈ మధ్య మా ఊరికి మరెంతో పేరు తెచ్చి పెట్టిన చిరంజీవి రంకిరెడ్డి సాయిరాజ్ సాత్విక్ షటిల్ బాడ్మింటన్ లో ఇంటర్నేషనల్ ఆటగాడుగా ఎదిగి డబుల్స్ ప్లేయర్ గా 2018 లో గోల్డ్ కోస్ట్ లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లో, టీం ఈవెంట్ లో మనదేశం తరఫున ఆడి స్వర్ణపతకం సాధించి మా ఊరికి పేరు తెచ్చిపెట్టాడు.
ఈ ఊరు నా ఊరు అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది. మా అమ్మ వెంకట సీతా రమాదేవి తండ్రిగారు, నా తాతగారు అయిన విస్సా వెంకట రమణమూర్తి గారి ఊరైన ఈ ఊరిలో నా జననం, విద్యాభ్యాసాలు సాగాయి.
మా నాన్నగారు శ్రీ చాగంటి సుబ్రహ్మణ్యం గారు ఇక్కడ ఉద్యోగరీత్యా ఉండడం, ఇక్కడే ఉద్యోగం రావడం జరిగింది.
బ్రిటిష్ కాలంలో మోబర్లీదొర గారి పేరు పెట్టిన మోబర్లీపేట లోని కాలువ గట్టు, కల్వకొలను వీధి, ముమ్మిడివరం గేటు, ఊరి మధ్య గడియార స్ధంభం, ఊరికి దక్షిణవైపున ఉన్న పేరూరి అగ్రహారం ఇష్టమైన ప్రదేశాలు.
శ్రీ నల్లా సత్యనారాయణ గారి ఆధ్వర్యం లో శ్రీ చెన్నమల్లేశ్వరా కళాపరిషత్ నాటక పోటీలు జరిగే రోజుల్లో మా యువత వాటిని తెల్లవార్లు వీక్షించి ఆనందించేవాళ్ళం. శ్రీ కల్వకొలను సాగర్ గారు మున్సిపల్ ఛైర్మన్ గా చాలా నిబద్ధతతో, నీతి గా పనిచేసి ఆ పదవి కి పేరు తెచ్చారు. వారి శ్రీమతి ఛాయాదేవి గారు మొట్ట మొదటి మహిళా మున్సిపల్ చైర్ పర్సన్ గా చాలా చాకచక్యంతో వూరిని అభివృద్ధి చేశారు. వారు ఉంటున్న వీధిలోనే మేమూ నివసించే వాళ్ళం.
అన్ని సదుపాయాలు ఉన్నా ఈ ఊరికి రైలు మార్గం కూడా ఉండి ఉంటే ఇంకా ఎంతో అభివృధ్ధి చెందడానికి ఆస్కారం ఉంది. ఎందరో ప్రజానాయకులు, ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నా ఆ సౌకర్యం ఇంకా సుదూరతీరంలోనే ఉండిపోయింది.
ఈరోజు నేను ఉద్యోగరీత్యా మా ఊరికి దూరంగా ఉన్నప్పటికీ ఈ ఊరితో నాకు అవినాభావ సంబంధం కొనసాగుతూనే ఉంది.
♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦
మా వూరు
ఉద్యోగ రీత్యానో, వృత్తి రీత్యానో, వ్యాపార రీత్యానో జీవనోపాధి కోసం చాలామంది స్వంత ఊరికి దూరంగా ఉండటం సాధారణమైన విషయం. ' జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి '. మనిషి ఎక్కడ ఉన్నా, ఎన్ని సౌకర్యాలున్నాయనుకున్నా స్వంత ఊరు స్వర్గధామమే ! అలా స్వంత ఊరికి దూరంగా ఉన్నవారందరూ తమ ఊరిని గురించిన విశేషాలతో, వాటికి సంబంధించిన ఫోటోలతో వ్రాసి పంపితే " మా వూరు " శీర్షికన ప్రచురిస్తాం. మీ రచనలను, ఫోటోలను ఈ క్రింది మెయిల్ ఐడి కి పంపండి.
editorsirakadambam@gmail.com / editor@sirakadambam.com
మా వూరు కూడా అమలాపురమే. తెలియని విషయాలు తెలియచేశారు. ధన్యవాదములు. కళావెంకటరావు గారికి సమకాలీన కాంగ్రెస్ అగ్రగణ్యుడు అయిన న్యాయవాది తురగా శ్రీరామమూర్తి గారిని జ్ఞాపకం చెయ్యలేదు. ఆయన మాతాతగారు.
అధ్భుతంగా డిజైన చేసారు రామచంద్ర!
I like amalapuram very much.It is my birth place and educated there in skbr college.The above article has taken back me with lot of good memories.