10_003 ఆనందవిహారి

                                  రెంటాల గోపాలకృష్ణ తెలుగు సాహిత్యంలోని అనేక ప్రక్రియలు చేపట్టినా కూడా ఆయన ప్రాథమికంగా కవి, కవి హృదయాన్ని రంగరించుకున్న విమర్శకుడు అని ప్రముఖ కథా రచయిత శ్రీవిరించి పేర్కొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం యూట్యూబ్ లో ప్రసారమైన “నెల నెలా వెన్నెల” ‘నెట్’ఇంట్లో సమావేశం’ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ప్రముఖ సాహితీవేత్త రెంటాల గోపాలకృష్ణ శత జయంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమం జరిగింది. సరిగ్గా వందేళ్ళ క్రితం సెప్టెంబర్ 5న జన్మించిన రెంటాల… కవిత్వం కొత్త తొడుగులు తొడిగి భావ, అభ్యుదయ తదితర ప్రక్రియలలో వెలువడుతున్న సమయంలో సమకాలీన విషయాలతో కొత్త కొత్త రుచుల కవిత్వాన్ని వెలువరించారని అన్నారు. తెలుగు కవిత్వంలో మొదటి సంకలనం ముద్దుకృష్ణ వెలువరించిన ‘వైతాళికులు’ కాగా, ఆ తరువాత వచ్చింది 1952, 53లలో రెంటాల తీసుకొచ్చిన ‘కల్పన’ అని చెప్పారు. ఇందులో సంపాదకులుగా ఆయనతోపాటు అనిశెట్టి సుబ్బారావు, బెల్లంకొండ రామదాసు, అవసరాల సుబ్బారావుల పేర్లు కూడా ఉన్నాయి. అయినప్పటికీ పాత, కొత్త కవుల రచనలున్న ఇందులో సింహభాగం కృషి రెంటాలదేనని వెల్లడించారు. అభ్యుదయ కవిత్వంలో ఇటువంటి గొప్ప సంకలనం ఆ తరువాత మళ్ళీ రాలేదని చెప్పారు. అభ్యుదయ కవిత్వంలో ఆరుద్ర ‘త్వమేవాహం’, బైరాగి ‘నూతిలో గొంతుకలు’, సోమసుందర్ ‘వజ్రాయుధం’తో సరితూగేది రెంటాల ‘సర్పయాగం’ అని కొనియాడారు. ఆయన కవిత్వం ధారాళంగా, సూటిగా ఉండేదని సోదాహరణంగా వివరించారు. రెంటాల ‘సర్పయాగం’, ‘శివధనుస్సు’, ‘సంఘర్షణ’ సాహిత్య లోకంలో విస్తృతంగా విహరించి ప్రఖ్యాతి గాంచాయని పేర్కొన్నారు. 

రజాకార్ల ఉద్యమం జరుగుతున్నప్పుడు హైదరాబాద్ నుంచి సినారె, దాశరథి తదితరులు కవిత్వం వెలువరించారని, దాశరథి తమ్ముడు రంగాచార్య నవలలు రాశారని, మరొకవైపు సర్కారు ప్రాంతం నుంచి రెంటాల, సోమసుందర్, అనిశెట్టి తదితరులు కవితలు రాశారని వక్త గుర్తు చేశారు. 

పదహారేళ్ళ ప్రాయంలో ‘రాజశ్రీ’ అనే చారిత్రాత్మక నవలని రెంటాల రాయగా, అప్పట్లో ఖ్యాతి పొందిన చరిత్రకారుడు మారేమాట్ల రామారావు ఉపోద్ఘాతం రాయడం గొప్ప విషయమని వ్యాఖ్యానించారు. 

బి. ఏ చదువుతూండగానే రెంటాలకు పత్రికా రంగంతో అనుబంధం ఏర్పడిందని, అప్పట్లోనే గుంటూరు నుంచి వెలువడిన ‘దేశాభిమాని’ సహ సంపాదకుడిగా, తరువాత సత్రావాడ పిచ్చయ్య స్థాపించిన

‘నవభారతి’ మాసపత్రికకి ఇతోధికంగా సేవలందించారని వివరించారు.  ఆంధ్రభూమికి, భారతికి కూడా తన రచనలను అందించారని, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభలలో పని చేశారని గుర్తు చేశారు. ఆంధ్రప్రభ సంపాదకులు కమలాకర వెంకట్రావు అయినప్పటికీ, రెంటాల కూడా కొన్ని సందర్భాలలో మంచి సంపాదకీయాలు రాశారని వెల్లడించారు. అనంతరం స్వాతి పత్రిక కోసం వాత్స్యాయన కామసూత్రాలు, పిల్లల కథలు, పెద్దల కథలు ఎన్నో రచించారన్నారు. 

అనువాదాల్లో మాగ్జిమ్ గోర్కీ ‘భయస్తుడు’, లియో టాల్స్టాయ్ ‘యుద్ధము – శాంతి’ ఎంతో ముఖ్యమైనవని అన్నారు. రవీంద్రనాథ్ ఠాకూర్ ‘గీతాంజలి’ని రామదాసు అనువాదం చేయగా, రెంటాల ఆయన కథలు, నాటకాలని ‘ఆంధ్ర శిఖర మండలి’ కోసం అనువాదం చేశారని చెప్పారు. తాను కూడా ‘జనతా’ పబ్లిషర్ కోసం కొన్నింటిని, అలాగే పెర్ల్స్ బక్ రచనలు కొన్నింటిని అనువాదించానని వెల్లడించారు. 

రెంటాల 200కు పైగా రచనలు చేశారని చెప్పారు. 

పురాణ గ్రంథాలని సరళమైన భాషలో అందించడం, పాత్రికేయం, కవిత్వం, నాటక రచన, అనువాదాలు, విమర్శ, సినిమాలో సంభాషణల రచన, బాల సాహిత్యం, రేడియో ప్రసంగాలు… ఏ ప్రక్రియలోనైనా రెంటాల ఆత్మగతంగా నిమగ్నమయ్యారని ప్రశంసించారు. 

60లు, 70ల కాలంలో మద్రాసు నుంచి డిటెక్టివ్ సాహిత్యం వెలువడగా, విజయవాడ అనువాద సాహిత్యానికి కేంద్రంగా ఉండేదని అన్నారు. ప్రధానంగా బొందలపాటి శివరామకృష్ణయ్య నిర్వహించిన “దేశి కవితా మండలి”, గద్దె లింగయ్య “ఆదర్శ గ్రంథ మండలి” ద్వారా అనువాద సాహిత్యాన్ని వెలువరించారని తెలిపారు. అనువాదాల్లో నిలదొక్కుకున్న రచయితలు రెంటాల, రామదాసు అని పేర్కొన్నారు. 

రెంటాల ‘జయంతి’ తదితర ఇతర ముద్రణా సంస్థలకి చాలా పురాణ గ్రంథాలని వచనంలో అందించారని చెప్పారు. అప్పట్లో తాను కూడా కొన్ని పురాణ గ్రంథాలని వచనంలో రాశానని, అనేక ఆంగ్ల సాహిత్య, బాల సాహిత్య అనువాదాలు కూడా మిగతా అనువాదకులు, తాను చేశామని శ్రీవిరించి గుర్తు చేసుకున్నారు. అప్పటి ఉమ, క్వాలిటీ, నవయుగ తదితర ముద్రణా సంస్థల గురించి ప్రస్తావించారు. సర్కారు ప్రాంతంలో 1950, 60 దశకాలకి సంబంధించిన కవులు, రచయితలు, ప్రచురణకర్తలు, సంస్థల గురించి శ్రీవిరించి ప్రస్తావిస్తూ అప్పటి సాహిత్యలోకాన్ని కళ్ళకు కట్టారు.

వ్యక్తిగా నిజాయితీకి పెట్టింది పేరని అన్నారు ఎవ్వరినీ నొప్పించకుండానే నిర్మొహమాటంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేసిన రెంటాల తెలుగు సాహిత్య రంగంలో ఒక మహాపురుషుడని కొనియాడారు. 

 కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన రెంటాల కుమార్తె, ప్రముఖ రచయిత్రి కల్పన రెంటాల మాట్లాడుతూ.. తమ తండ్రి గుంటూరు జిల్లాలోని రెంటాలలో జన్మించారని, తమ ఇంటిపేరు కూడా అదేనని చెప్పారు. అదే పేరుతో రచనలు చేసి సాహిత్య లోకంలో ఖ్యాతి గడించారని పేర్కొన్నారు. ఆయన రచనలు రాశిని, వాసిని కలిగి ఉంటాయని అన్నారు. ‘రెంటాల స్మరణోత్సవ సంఘం’ తరఫున నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. 


పాటది ఎప్పుడూ ప్రజాపక్షమే

కరోనా నేపథ్యంగా గేయధారను కురిపించిన ఆచార్య విస్తాలి శంకరరావు

                          కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా అన్ని విధాలుగా అతలాకుతలం చేసిందని, ఎక్కడా ఆగకుండా వేగంగా వెళ్తున్న మనిషి జీవితానికి కళ్ళెం వేసిందని మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య విస్తాలి శంకరరావు వ్యాఖ్యానించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి శనివారం నిర్వహించిన ‘నెల నెలా వెన్నెల’లో భాగంగా ‘నెట్ ఇంటి కార్యక్రమం’ పేరిట ఏర్పాటు చేసిన ఐదవ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ‘కరోనా నేపథ్యంలో మానవ జీవితం – విశ్లేషణ’ అంశాన్ని కొన్ని నాటి, నేటి పాటలతో పాటుగా వివరించారు. క్రీస్తు శకం 165వ సంవత్సరం నుంచి ఇప్పటివరకు లక్షలు, కోట్ల సంఖ్యలో జనాన్ని బలిగొని ప్రపంచాన్ని గడగడలాడించిన మహమ్మారుల గురించి ప్రస్తావించారు. 

రాజ్యాల పునాదులను కదిలించే, శ్రమ జీవుల కష్టాన్ని వ్యక్తీకరించే, ఉద్యమాల సిద్ధాంతాలను ప్రజలకి సమర్థవంతంగా చేరేవేసే శక్తి ‘పాట’కి ఉందంటూ… ఏరోజైనా పాటది ప్రజాపక్షమేనని వ్యాఖ్యానించారు. సుద్దాల అశోక్ తేజ పాటను ఉదహరించారు. 

మానవుల హృదయాల్లో, జీవితాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్న కరోనా మీద దేశవ్యాప్తంగా కవులు, రచయితలు ప్రజలని చైతన్యపరుస్తూ వేలకొద్దీ పాటలు వెలువరించారని తెలిపారు. ఈ నేపథ్యంలో పాట కొత్తపుంతలు తొక్కుతోందని అంటూ..   సామాజిక మాధ్యమాల ద్వారా వ్యాపి చెందిన కొన్ని గేయధారలను కురిపించారు. 

వలస కార్మికుల పాట్లను కళ్ళకు కడుతూ 1934లో  శ్రీశ్రీ, 1957లో కోసరాజు రాసిన పాటలని ముందుగా వినిపించారు. ఆ తరువాత నేటి సాంఘిక చిత్రాన్ని అవిష్కరించిన  ఆదేశ్ రవి, మానుకొండ ప్రసాద్, ప్రజా వాగ్గేయకారుడు గోరటి వెంకన్న, సినీ గీత రచయితలు భువనచంద్ర, వెన్నెలకంటిలు రాసిన గీతాలను భావావేశంతో వినిపించారు. 

ఆథ్యాత్మిక విశిష్టత కలిగిన మనదేశంలో జీవన విధానం గురించి ముందుతారాలను తత్వవేత్తలు, దూరద్రుష్టి కలిగిన జ్ఞానులు ముందే హెచ్చరించారని గుర్తు చేశారు. ఆ స్ఫూర్తినే కలిగిస్తున్న నేటి గోరటి వెంకన్న గీతాన్ని, గుంటూరు మురళీకృష్ణమాచార్యులు రాసిన గేయాన్ని వినిపించారు. ప్రభుత్వాధికారులు, వైద్యరంగ నిపుణులు, సఫాయి కార్మికులు, పోలీసుల సేవలను ప్రశంసిస్తూ చరణ్  అర్జున్ రాసిన పాటను పాడారు. విలేఖరులు నిరంతరంగా అందించిన సేవలను కొనియాడారు. 

భవిష్యత్తు గురించి ఎప్పుడో వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానం నుంచి కూడా ఒక పద్యాన్ని వినిపించారు. ఈ పద్యాన్ని ఆధారం చేసుకొని ఈమధ్య వచ్చిన ఒక గీతాన్ని ఆలపించారు. 

కరోనా నేపథ్యంలో మనిషి తన జీవన గమనాన్ని సరి చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. 

సంస్థ సంయుక్త కార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్య స్వాగతం పలికి వక్తను పరిచయం చేశారు. ముళ్ళపూడి ప్రసాద్ (చెన్నై), శిష్ట్లా రామచంద్రరావు (విజయవాడ) సాంకేతిక సహకారాన్ని అందజేశారు.