అప్పల నరసయ్య అనే ఆయన కి అప్పుల నరసయ్య అనే ముద్ర సమాజం చేత వెయ్యబడడం వెనకాల పెద్ద కథే నడిచింది. సమాజం అనే రంగులరాట్నం అప్పుల నరసయ్య అనే జీవిని తిప్పిందా? లేక అప్పుల నరసయ్య గా ముద్ర వేయుంచుకున్న అప్పల నరసయ్య రంగుల రాట్నాన్ని తిప్పాడా? ఏమో! కథకుడు లౌక్యుడు! మనం ఊహించుకోవలసిందే!
ఈ కథ నడిచింది దామలచెరువు లాంటి ఒక చిన్న గ్రామం లోనే. కథా పాత్రలన్నీ మధ్య తరగతి వారివే. కొంత విద్య, వివేచనా, కొంత పరిమితంగా ఆర్ధిక వనరులూ ఉన్నవారు. ఇన్ని పరిమితులు ఉన్న మనుషుల మధ్య నడచిన కథలో ప్రపంచ ఆర్ధిక సూత్రాలు పరోక్షంగా ప్రస్తావించబడతాయి.
బడికీ ఇంటికీ మధ్యలో ఉన్న చిన్న బజారు. ఒక పది అంగళ్ల్లు ఉంటాయేమో ! అందులో అప్పల నరసయ్య గారిది ఒక అంగడి. యజమాని వ్యవహారం చూస్తుంటే ఏదో కాలక్షేపానికి అంగడి నడిపే వాడిలా ఉంటాడు. రంగులకీ మరమ్మత్తులకీ ఆశగా ఆబగా చూసే తాతలనాటి పెద్ద ఇల్లు. ఇంట్లో రోజూ పది విస్తర్లు వెయ్యవలసిందే. అంగట్లో కొనుగోళ్లు, అమ్మకాలూ ఎక్కువగా అరువే! సరుకు తక్కువ. చిల్లర తిను బండారాలే ఆకర్షణ. అందులో కొన్ని యజమాని స్వంత ఉపయోగానికీ, అతిధులకి మర్యాద చేయడానికీ వాడబడతాయి.
బడిలో కొత్తగా చేరిన పంతులు గారిని అప్పల నరసయ్య కలుపుగోలుతనం ఆకర్షిస్తుంది. పంతులుగారికి ఇంటి పనీ, బడి పనీ ఎక్కువగా లెని కారణం చేత నరసయ్య గారి అంగట్లో కొంచెం కాలక్షేపం అవుతూ ఉంటుంది. పనిలో పని గా నరసయ్య గారి దానగుణం, నిరాడంబరత్వం, పరోపకారత్వం అవగతం అవుతుంది.
ఉన్నట్టుండి ఒకరోజు నరసయ్య గారు దివాళా తీసాడనీ, అప్పిచ్చిన అసామీలు నరసయ్య గారి స్థిర చరాస్తులనూ, స్థావర జంగమాలనూ, స్వాధీనమో, విక్రయమో చేసి బాకీలు జమ చేసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారనే వార్త వ్యాపించి బడిపంతులు గారి చెవిన పడుతుంది. కొట్టు మూత పడడం వలన నరసయ్య గారిని కలుసుకోవడం పంతులు గారికి కుదరదు.
స్వతహాగా మితభాషీ, మొహమాటస్థుడూ, సున్నిత మనస్కుడూ ఐన బడిపంతులుగారు నేరుగా అప్పల నరసయ్య గారిని ఏమీ అడగలేకపోతారు. ఒకటి రెండుసార్లు కలుసుకున్న సందర్భాలు వచ్చినా కూడా.
బడిపంతులుగారు వతను గా సరుకులు కొనే అంగడి యజమాని ఒకరోజు పంతులు గారిని రెక్క పట్టుకుని లోపలికి తీసుకు వెళ్ళి రహస్యం గుట్టు విప్పేస్తాడు. నరసయ్య డబ్బూ దస్కం రహస్యంగా మూట కట్టి ఎక్కడికో చేరవేసేసాడు, ఇహ ఆసామీలకు మిగిలింది ఇల్లు మాత్రమే ! ఒక రూపాయి అప్పిచ్చిన అసామీలకు, అరవై నయా పైసలు కిడితే అదృష్టవంతులే ! నరసయ్య గారికి అప్పు తెచ్చిన రూపాయి లో నలభై నయా పైసలు మిగులే. బడిపంతులు గారికి ఈ రహస్యం నమ్మబుద్ది కాదు. విషయం మింగుడు పడదు. నీరు పల్లమెరుగు, నిజము దేముడెరుగు అనీ, లోగుట్టు పెరుమాళ్ళకెఱుక అనీ సర్దుకుంటారు.
రోజులు గడుస్తూ ఉంటాయి. రోజుకో కొత్త వార్త బయటకి వస్తూ ఉంటుంది. నిద్రపట్టని ఒకరాత్రి బడిపంతులు గారు రెండవ ఆట సినిమాకి వెళ్ళగా రీలు మార్చి రీలు వేసే సమయం లో వెలిగించిన కిరసనాయిల్ గుడ్డి దీపం వెలుగులో పక్క వరసలో కూర్చున్న నరసయ్యను గుర్తించి పలకరిస్తాడు. ఇద్దరూ బయటకు వచ్చి టీ తాగుతున్న సందర్భంలో నరసయ్య తన ఘోషను వెళ్లబోసుకుని, పిల్లల పెంపకం, చదువు సంధ్యలూ, పెళ్ళిళ్ళకూ, పేరంటాలకూ, అతిధి అభ్యాగతుల ఆదరణకీ, ఆస్తి హారతి కర్పూరం అయ్యిందనీ, తనకి తన రెక్కల కష్టం మీద నమ్మకం ఉందనీ, అందివచ్చిన కొడుకులూ, ఆదరించి అన్నం పెట్టే కూతుళ్ళూ, కోడళ్ళూ, అల్లుళ్ళూ ఉన్న తనకు భావి జీవితం మీద బెంగా, విచారం లేదని ధీమా వ్యక్తపరుస్తాడు. బడిపంతులు గారికి సంతోషం కలుగుతుంది.
ఒకరోజు నరసయ్య గారి కుటుంబం మిగిలిన తట్టా బుట్టా బండిలోకి ఎక్కించి ఉన్న ఊరికి వీడ్కోలు పలుకుతుంది. ఊరివారు అటూ ఇటూ గా ఉంటారు. ఎటూ తేలరు. తెచ్చిపెట్టుకున్న వీడ్కోలు మాటలు, బండి బయలుదేరాక వెక్కిరింపులూ.
రోజులు గడుస్తాయి. విషయం వింత పోకడలు పోతూ ఉంటుంది. పట్నంలో నరసయ్య గారు అప్పడాల తయారీ ప్రారంభించారనీ, నష్టాలు పోగేసుకున్నారనీ ఇలా కథనాలు సాగుతూ ఉంటాయి.
కొంతకాలానికి బజారులో అప్పల నరసయ్య మార్కు అగ్గిపెట్టెలు ప్రత్యక్షం అవుతాయి. మంచి నాణ్యం ఉన్న సరుకు, సరసమైన ధరా కావడంతో డజన్ల తో మొదలైన సరఫరా బళ్ల కొద్దీ విస్తరించి అంగట్లో సరుకు దిగిన వెంటనే అమ్ముడైపోయి గిరాకీ పెరుగుతూ పోతుంది. నరసయ్య గారి పేరు మారుమోగి అందరి నోళ్ళ లో నానుతుంది. తలకో రకంగా మాట్లాడతారు.
కాలక్రమం లో ఒకరోజు అప్పల నరసయ్య డబ్బు సంచీ తో ఊర్లో దిగి తనకి గతం లో అప్పిచ్చిన ఆసామీలకి తన వలన ముట్టవలసిన బాకీ పైకం అణా పైసలతో తీర్చి వేసి తన ఊరికి తిరుగు ప్రయాణం అవుతాడు. వీడ్కోలు ఇవ్వడానికి వచ్చిన ఒకే ఒక స్నేహితుడు బడిపంతులు గారు. నరసయ్య మళ్లీ తన ఘోష వెళ్లబోసుకుని తాను చేసిన పనికి ఊరి జనం, ముఖ్యంగా పైకం ముట్టిన అసామీలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని ఉంది అనీ పంతులుగారు నిజం చెప్పాలనీ ప్రాధేయపడతాడు.
ఈ బాకీల చెల్లుబాటు వ్యవహారం చేయడానికి రంగంపేట…. అదే అప్పల నరసయ్య గారి కథకి రంగస్థలం, వచ్చిన నరసయ్య బడి పంతులుగారి అతిథి గా ఉంటాడు. పైకం ముట్టవలసిన ఆసామీ ల దగ్గర ఒక్క కాయితం ఉండదు. అవన్నీ అంతకుముందే నరసయ్య గారి, ఆస్తులు స్వాధీనమో, విక్రయమో చేసుకున్న నాడే రద్దయిపోయాయి కేవలం నోటి మాట మీదే. మాటకు కట్టుబడి ఉండాలి అన్న న్యాయ, ధర్మ సూత్రం ప్రకారంగానే నరసయ్య వ్యవహరిస్తాడు. పైకం ముట్టిన అసామీలు, వినోదం చూడడానికి వచ్చిన ఔత్సాహికులూ కూడా మామూలుగానే ఉంటారు. ఇదేదో మామూలు వ్యవహారమే అన్నట్టు ఉంటారు. నరసయ్య పట్ల కృతజ్ఞతా భావం కానీ, అతని చర్యలకు మెప్పుకోలు భావం కానీ కనపరచరు. ఇది నరసయ్యని ఏదో తెలియని ఒక ఉక్రోషం లాంటి భావానికి గురి చేస్తుంది. ఈ సాయంత్రం పూట తనకు వీడ్కోలు ఇవ్వడానికి రైల్వేస్టేషన్ కి వచ్చిన ఒకే ఒక్క వీడ్కోలుదారుడు బడిపంతులు గారు. రైలు రావడానికి ఇంకా ఇరవై నిమిషాలే సమయం ఉండగా ఇక ఆపుకోవడం వశం కాక నరసయ్య పంతులు గారిని అడిగిన ప్రశ్న ఇది. జవాబుగా ” కాయా మీదే, కత్తీ మీదే కదా ! నేనేం చెప్పాలి ? ” అని పంతులుగారు తప్పించుకోవడానికి ప్రయత్నించినా ఎప్పటికైనా నిష్ఠూరం అయిన నిజం తెలియవలసిందే అనుకుని ఊరి వారి ఆభిప్రాయాలు చెపుతారు. కొంతమంది అప్పల నరసయ్యకు మతి భ్రమించింది అనీ, కొంతమంది తమ సొమ్ము గట్టిదైన కారణం చేత తిరిగి వచ్చిందనీ, మరి కొంతమంది అప్పలనరసయ్య కు అంత్య కాలంలో పాప భీతి పుట్టుకొచ్చిందనీ, ఈ మూడు కారణలలో ఏదో ఒక కారణం చేత అప్పలనరసయ్య తిరిగి అప్పులు తీర్చాడనీ తీర్మానం చేస్తారు. అతని సౌజన్యాన్నీ, నిజాయితీనీ గుర్తించరు. ఇక్కడి తో కథ ముగుస్తుంది.
లోకుల అంతరంగంలో మెదిలే అభిప్రాయాలని లోకేశ్వరుడు మాత్రమే ఊహించగలడేమో అనిపిస్తుంది …
– ‘ యువ ’ మాసపత్రిక దీపావళి వార్షిక సంచిక ( 10/11/1971 ) లో ప్రచురితం.
*******************************************************