10_003 సౌభాగ్యలక్ష్మీ !

ఓ సౌభాగ్యలక్ష్మి !

నీ పాద పద్మములను శరణుబొంది

నీయందు శేష భావత్వమున నిలిపి

ఇతర ఉపాయములను వీడి, ఓ తల్లీ

నేను సంసారమును తరింతును.


ఓ సౌభాగ్యలక్ష్మి ! ఓ సార్వభౌమిని !

మాయందు దయయుంచి ప్రసన్నురాలవు

గమ్ము, భక్తులు నిన్ను శరణని, నీయందు

భక్తి ప్రపత్తులు కలవారై నిన్ను శరణు బొంది

నిన్నే చింతించుచూ, నీవే, వారికి

దిక్కుయని పలుకుచు నిన్ను సేవించుచున్నారు.


సకల లోకములకు సుఖము నిచ్చు

ఓ తల్లి, అధికురాల ! బ్రహ్మ రుద్రాది

మరుద్‌గణములు నిన్నే సేవించు

చున్నరు ప్రసన్నురాలవు గమ్ము !


ఓ సౌభాగ్యలక్ష్మి !

మిక్కిలి అతిశయించిన గుణములు

కలదానా ! మహావిష్ణుప్రణయ

మునకు ఆలంబమయినదానా !

వేదవేదాన్తముల ప్రకాశించు

దానా ! ఓ నిత్యాన్నదాత్రి ! ప్రసన్నరాలవు గమ్ము.


ఓ సౌభాగ్యలక్ష్మి !

ఆదిభౌతిక – ఆది దైవిక – ఆథ్యాత్మిక

ములనే, తాపత్రయములను నశింప

జేసి, ఈ జన్మకు తృప్తినిచ్చి నా

దేహయాత్రను ఆ పరాత్‌పరుని దిశకు మళ్ళించుము.


ఓ సౌభాగ్యలక్ష్మి !

జగద్‌గురువైన యతిరాజ

రామానుజులు, ఆ కరుణా సముద్రులు

ద్రావిడ ఆమ్నాయముల యందు

ప్రశంసించబడిన నీ మంగళ గుణము

లను పలుమార్లు ఉచ్చరించి ప్రకాశించినారు.


ఓ సౌభాగ్యలక్ష్మి !

నిన్ను కీర్తించుటకు, నిన్నే చింతించు

టకు, నీ దివ్య గుణగానమును జేయుటకు

నీ ముఖాంభోజమును దర్శించుటకు

నాకు దివ్యమైన మనస్సునిమ్ము.


ఓ సౌభాగ్యలక్ష్మి ! యే దివ్యజ్యోతి

పరమ పవిత్రమై పరమ ప్రభావోపేతమై

శ్రీ వేంకటాద్రిన నిలిచిన ఆ పర దైవమే

నాకు ఇహలోకమున శరణ్యము.


ఓ సౌభాగ్యలక్ష్మి !

నీవు సదా గొప్ప వారి మనస్సులతో

సుగుణవంతుల హృదయములలో

సజ్జనుల గృహములలో నివసింతువు కదా !


ఓ సౌభాగ్యలక్ష్మి !

వేదాన్త దేశికులను మహాకవి

నీ శరణాగతిని ప్రశంసించు

బృహద్‌కావ్యమును వ్రాసి జగద్‌గురు

త్వమున గాంచిరి. ఆహా ! ఏమి

నీ స్తుతి మహత్మ్యము.


ఓ సౌభాగ్యలక్ష్మి !

ఓ వైకుంఠనాధుని ప్రియురాలా !

నీ చూపు మాపై క్షణము ప్రసరించిన

మా మనస్సు వికసించును, ఈ భూతల

వాసులగు మాకు మహదానందమును

సర్వసౌఖ్యములను

సమకూర్చును


ఓ సౌభాగ్యలక్ష్మి !

ప్రాచార్యులైన పరాంకుశ – శఠగోపా

దుల చరణములే శరణ్యము. ఏలయన

వారు ద్రావిడ దివ్య ప్రబన్ధముల గూర్చి

నీ గుణగానమును జేసి, భక్తులను తరింపజేసిరి.


తరువాయి వచ్చే సంచికలో…