ఈ కథలో శ్రీపాద వారి సామాజిక దృష్టి, ఆలోచనా దృక్పథం, సంఘ సంస్కార దృష్టి లోకజిత సువ్యక్తము. వితంతు పునర్వివాహ సమస్య వీరి కథలో ప్రధానాంశం. బాల వితంతువులు అనుభవించిన హృదయ విదారకమైన దురవస్థను, దుర్భరమైన కష్టాలను కళ్ళకు కట్టించినట్లు చెప్తారు. కరుణ రసాత్మకంగా పాఠకులను కంటతడి పెట్టించే తీరులో ఈ కథ సాగుతుంది.
చేజెతులా ప్రాణాలను తీసుకోలేక ఇంటిల్లిపాదీ చాకిరీ చేయించుకొని సూటీపోటీగా మాటలాడుతుంటే, అందరూ అన్ని విధాలా అరికాళ్ళ క్రింద మంటలు పెడుతుంటే, ఇంక ఆ ఇంట్లో నిలువరించలేక అర్థరాత్రి ఇల్లు విడిచిపెట్టి పారిపోయిన రుక్కమ్మ దయనీయ గాథ ఈ కథ.
సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం గారి అభ్యుదయ భావాలను, వితంతు పునర్వివాహాన్నీ ఈ కథలో సమర్థిస్తారు శ్రీపాద వారు. అర్థరాత్రి ఇల్లు విడిచిపెట్టిన రుక్కమ్మ ఒక జట్కా బండి మనిషి సాయంతో వీరేశలింగం పంతులుగారి తోటకు వెళ్తుంది. ఆ నరకంలోంచి ( పుట్టింటి నుంచి ) బయటపడడం తప్ప వేరే మార్గం లేదనుకుని ధైర్యం చేసిన బాల వితంతువు దయనీయ గాథ ఇది.
కుటుంబ సభ్యులు రుక్కమ్మ పట్ల ప్రదర్శించిన నిర్దాక్షిణ్య వైఖరి ఈటెల వంటి మాటలతో ఆమె హృదయాన్ని ఛిద్రం చేసే మాటలు ఒక నాటక దృశ్యంలా కళ్ళకు కట్టిస్తారు శ్రీపాద వారు. సొంత అక్కచెల్లెళ్ళు, తమ్ముడు, అమ్మమ్మ కొంచెమైనా జాలీదయ, సానుభూతి లేకుండా మా పని ముందు చెయ్యి అని తరిమి తరిమి కొడతారు. ఎవరి పని ముందు చెయ్యకపోతే వారికే కోపం. పని మనిషి కంటే హీనంగా చూస్తూ రుక్కమ్మను హింసిస్తారు.
విధవా వివాహాలు జరిపించడానికి పంతులు గారు రాజమహేంద్రవరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తోట ‘ పంతులు గారి తోట ’ గా ఆనాటి సమాజంలో ప్రసిద్ధికెక్కింది. ఒక జట్కా బండి వారి పాత్ర ద్వారా ఆ తోట గొప్పతనాన్ని చెప్తారు శ్రీపాద వారు.
కుటుంబ సభ్యుల ఆదరాభిమానాలకు నోచుకోని రుక్కమ్మ గత్యంతరం లేక ఇల్లు వదలి బయటకు వస్తుంది. దిక్కు తోచని దయనీయమైన ఆమెను అర్థం చేసుకున్న జట్కా బండి వాడు “ పంతులు గారి తోటకయితే నాకేమీ యివ్వక్కర్లేదు తల్లీ ! ”
“ అక్కడికి వెళ్ళీ వెళ్ళగానే మీకూ పెళ్లయిపోతుందండీ ! ”
“ మీరు పుణ్యం చేసుకున్నారు. ఏవీ భయపడకండి అమ్మాయిగారూ ! ఇక మీకు సుఖమే కానీ కష్టం లేదండమ్మాయిగారూ ! ” అని జట్కా బండి వాడు ఆమెకు భయాన్ని పోగొట్టి ధైర్యాన్ని నూరిపోసి ఆమెకు బతుకుపై ఆశను చిగురింప జేస్తాడు.
జట్కా ఎక్కగానే ‘ మేఘాల మీద ఎగిరిపోయింది. జట్కా మలుపు కూడా తిరిగేసింది ’ అని వర్ణిస్తారు. రుక్కమ్మ జీవితం కొత్తమలుపు తిరగబోతోందని వ్యంగ్య వైభవాన్ని జోడించి చెప్పారు శ్రీపాద వారు.
కథలో మొదటి ఏడు ప్రకరణాలూ రుక్కమ్మ పట్ల కుటుంబ సభ్యులు ప్రదర్శించిన నిర్దాక్షిణ్య వైఖరిని ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క దృశ్యంలా మన కళ్ళకు కట్టిస్తారు శ్రీపాద వారు. ఎనిమిదవ ప్రకరణంలో కథకీ, వర్ణనకీ, సంభాషణకీ పట్టం కట్టి శక్తిమంతంగా కథను నడిపించిన తీరు పాఠకులకు మంచి కథను చదివిన అనుభూతిని కలిగిస్తుందనడంలో సందేహం లేదు.
“ తలచెడ్డ వాళ్ళింట్లో వుండగా పునిస్త్రీ పడుచు మడి కట్టుకోవడం యేమిషోయ్ ? ”
“ తల అంటుకోనా… దువ్వుకోనా… జడ వేసుకోనా… యింకెందుకోయ్ దానికా దిక్కుమాలిన జుట్టు ? ”
“ యెల్లుండి దశమినాడు మంచిదన్నారు. కోటి లింగాలకి వెడితే వొక్క నిముషం పని…. ” ___ అంటూ వైధవ్యం తో తల్లడిల్లుతున్న మనవరాలిని ఓదార్చక పోగా కోటి లింగాల రేవుకి తీసికెళ్లి జుట్టు తీయించమని అల్లుడిని ( రుక్కమ్మ తండ్రిని ) పురికొల్పుతుంది రుక్కమ్మ అమ్మమ్మ. దయాదాక్షిణ్యాలు లేని ఆనాటి బ్రాహ్మణ సమాజంలోని వ్యక్తుల మూఢత్వం, హింసా ప్రవృత్తి, దుర్మార్గాలను కళ్ళకు కట్టినట్లు అతి సహజంగా చిత్రించారు శ్రీపాద వారు.
“ మొగుడు చచ్చిన పడుచు పిల్లలకి మంచిరోజులు కావివి. మొన్ననే వీరేశలింగ తోటలో ఒక వెధవ పెళ్లి అయిందట. ఇంకా నలుగురు వెధవ కొడుకుల కోసం వెతుకుతున్నారుట ముండలకి తోటలోని వాళ్ళు ” — వితంతువులకు పునర్వివాహం జరిపిస్తున్న సంస్కర్త వీరేశలింగం గారి అభ్యుదయమును, సంస్కారమును తెలియజెప్పే వాక్యాలివి. కేవలం మాటలు, రాతలతో సరిపెట్టకుండా అప్పటి కాలమాన పరిస్థితులను, మూఢాచారాలను, మూఢ నమ్మకాలను తీవ్రంగా నిరసించడమే కాకుండా ధైర్యంగా ఆనాటి ఛాందస సమాజాన్ని ఎదిరించి విధవలకు వివాహాలను జరిపించిన గొప్ప అభ్యుదయవాదీ వీరేశలింగం గారి అభ్యుదయ భావాలకు పట్టం కట్టారు ఈ కథలో శ్రీపాద వారు.
వితంతు పునర్వివాహం అనే విషయాన్ని కేవలం సంస్కార దృష్టితో కాక మానవతా దృష్టితో చూసిన ఒక అభ్యుదయ దృక్పథం ఈ కథలో మనకి స్పష్టంగా దర్శనమిస్తుంది.
***********************