10_003 తో. లే. పి. – ఏ. కె. వి. సన్యాసిరావు

 

 

నేను ఉద్యోగ రీత్యా తెలుగు గంగ ప్రాజెక్టులో కార్య నిర్వాహక ఇంజినీరు ( మెకానికల్ విభాగం ) గా 1993-99 మధ్య కాలం లో పనిచేసాను. అప్పుడు మాకు పై ఆఫీసర్ – సూపరింటెండింగ్ ఇంజినీర్ గా కొంతకాలం పాటు శ్రీ ఏ. కె. వి. సన్యాసిరావు గారు పనిచేసారు. సన్యాసిరావు గారు ఆ హోదా లో చాలా దక్షత గా వ్యవహరిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. వ్యక్తిగతం గా కూడా ఆయన అతి సౌమ్యుడు. అంతే కాదు. పని సామర్ధ్యం కలవాడు. తన కింద పనిచేసే వారితో సముచితంగా వ్యవహరిస్తూ వారి అభిమానాన్ని చూరగొన్నారు. 

సన్యాసిరావు గారు ప్రవృత్తిపరం గా చూస్తే ఆయన లో ఒక రచయిత, కళాకారుడు, క్రీడాకారుడు ఉన్నారు. నాటకాలలో పాల్గొనడం, ఆధ్యాత్మిక రచనలు చేయడం, చదరంగం పోటీలలో పాల్గొనడం, యోగా క్లాసులకు హాజరవడం చేస్తూ ఉండేవారు. 

మాకు ఆయన పై ఆఫీసరుగా ఉంటూ, మాకు ప్రాజెక్ట్ నిర్మాణ పనుల నిర్వహణ విషయం లో తగు సూచనలు ఇస్తూ మాకు పెద్ద దిక్కు గా ఉండేవారు. తానూ ఆ పనులలో ప్రధాన పాత్ర వహిస్తూ నిర్విరామం గా పనిచేసేవారు. నిజానికి మేము అందరమూ కలిసికట్టు గా ఉంటూ ఆ ప్రాజెక్ట్ పనుల విషయం లో ఏకతాటి మీద నడుస్తూ, సకాలానికి  పూర్తయేలా పనులను ప్రామాణికం గా చేయిస్తూ ఉండేవాళ్ళం. 

సన్యాసి రావు గారు విశాఖ లో సకుటుంబం గా ఒక విశాల భవనం లో కాపురముంటూ, ఎవరు ఏ విషయం లో ఎలాంటి సహాయాన్నిఅర్ధించి వచ్చినా సరే అది సబబని తోస్తే తాను వెనువెంటనే వారికి ఆ సహాయాన్ని అందించేవారు. 

తాను సూపరింటెండింగ్ ఇంజినీర్ గా పదవీ విరమణ నంద్యాల లోనే చేసి తదనంతరం వారి స్వస్థలం విశాఖపట్నం లోనే స్థిరపడ్డారు. నేను విశాఖ వెళ్ళినప్పుడు 1, 2 పర్యాయాలు వారిని, వారి కుటుంబాన్ని మర్యాదపూర్వకంగా కలుస్తూ ఉండేవాడిని. వారి అభిమానము, అనురాగము, అనుపమానము, అప్రమేయం. 

ఆ మధ్య సన్యాసిరావు గారి శ్రీమతి అస్వస్థత కు గురి అయి పరమపదించారు. ఈ విషాద సంఘటన జరిగిన స్వల్పకాలానికే సన్యాసి రావు గారు కూడా కైవల్యం చెందారు. కనుమరుగయినా ఆ దంపతులు తమ పుత్ర వాత్సల్యాన్ని నాపైన చూపిస్తూ ఉండడాన్ని నా మనసు గ్రహించింది. 

ఆ దంపతులకు మనసారా ప్రణమిల్లుతూ మీ నుండి ప్రస్తుతం శెలవు తీసుకుంటున్నాను.