10_003 వెలుగునీడలు

 

తే. గీ.     నీవు కల్పించునిద్రలోనే గతించు

            జీవితము కొంత – పరులకు సేవచేయు

            టందు వ్యాధుల దుఃఖములందు కొంత

            ఇంక నీసేవ కావకాశ మేది ? స్వామి !

 

తే. గీ.     నీవు చైతన్యమూర్తివి – నీ వెవనికి

            ద వ్వవుదొ వాని కిక జీవితమ్మె లేదు !

            నీదయకు నోచుకొన్నవానికి సమస్త

            కాంక్షితమ్ములు కొంగుబంగారమె కద !

 

తే. గీ.     గాలి పోగానె మట్టిలో కలసిపోవు

            జాలిబ్రతు కిది; దీనికై గాలిమేడ

            లెన్ని కట్టిన నన్నియు నిట్టె కూలు !

            జాలిపడి లాభ మే ? మిది గాలిబ్రతుకు !

 

తే. గీ.     ఆర్ద్ర మౌనామనస్సున నధివసించు

            కృష్ణమేఘ మూపిరిగాలికే చలించి

            కదలిపోవునొ యేమొ ? అన్‌బెదరుతోడ

            ఊపిరిని పీల్ప జంకెద నొకొకసారి !

 

తే. గీ.     తనకు నాత్మీయు లందఱు దవుల నిలువ

            తనకు తెలియనితరు వెదో తరలి వచ్చి

            కాటిలో తనతో చితిన్ కాలిపోవు !

            ఎవరెవరి కేది ఋణ మన్న దెఱుగరాదు !

 

తే. గీ.     కలల కర్థ మేమి ? కల యేమి ? కలలోన

            మేలుకీడులందు మెలగు టేమి ?

            విలువ యింత లేనికలవంటీ బ్రతుకున

            కర్థ మేమి ? ఆరహస్య మేమి ?

 

తే. గీ.     రెప్ప లార్పక నిన్ను దర్శింప గోరి

            యెదురు చూతును నీకయి యేండ్లు పూండ్లు;

            స్వామి ! ఒకసారి కన్పింతువా – కల వని

            చాటెద జగాన పారవశ్యమ్ముతోడ.

 

తే. గీ.     పాము పాన్పు నీకు – పక్షి వాహన మటే !

            పాము పక్షి పుణ్య మేమి చేసె ?

            నరుడ నై జనించునాకన్న నవి యెట్టు

            లధిక మయ్యె నయ్య ! అబ్జనాభ !

 

తే. గీ.     ఏమి పుణ్యము చేసెనోయీ మయూరి ?

            పింఛమున్ తల దాల్తువు వేడ్కతోడ !

            గుండె పగిలినవెదు రెప్డు కొలిచె నిన్ను ?

            వేణువుగ చేసి ధరియింతు పెదవులందు !

 

తే. గీ.     రసజగత్సృష్టికర్తను లలితకవిని

            నేను కవిచక్రవర్తిని – నీదుస్నుషకు

            పుత్తృకుడను – రసస్వరూపుడవు నీవు;

            నేను పైవాడనా ? స్వామి ! నీవె చెపుమ.

 

తే. గీ.     పద్మముఖి పద్మ పద్మజ పడతి యంట !

            పద్మజుడు నీకు గారాబుపట్టి యంట !

            పద్మశరు డొక్కకొడు కంట పద్మనేత్ర !

            పద్మ మన నింతమో జేమి ? పద్మనాభ !

 

ఆ. వె.     శ్రీనివాస ! మాకు చెంపకు చేరెడు

            కన్ను లిచ్చినావు – కంట బడవు !

            నిన్ను చూడలేనికన్ను లి వేలరా ?

            సారసాక్ష ! సూర్యచంద్రనయన !

 

ఆ. వె.     నరులకంట పడవు నను గన్ననాస్వామి !

            ఏమి చేయు నరులదృష్టి నిన్ను ?

            దృష్టిదోషమునకు దేవుడే భయపడ్డ

            ఇంక బెదురు లేని దెవరి కంట ?

 

తే. గీ.     ఒకమహాభావకుం డైనసుకవిచూపు

            దరు లొరసి సత్యలోకము దాటిపోవు !

            విశ్వమును మాయతో మభ్యపెట్టగలవు –

            కవులకను గప్పి యెందు పోగలవు నీవు ?

 

ఉ.         కన్నులలోనివెల్గు వయి కాంతికి శాంతికి కేంద్రబిందు వై

            అన్నములోనిశక్తి వయి ప్రాణమ వై వెలుగొందుదే ప్రభూ !

            ఉన్న దొకయొకండ వయి ఊపిరి వై అలచందమామలో

            వెన్నెల వై జలంబ వయి వెల్గుదయామయ ! నీ కివే నతుల్.

 

తే. గీ.     కంట పూవులు విరియునీకరుణచేత

            నిలిచి వలపులమేడలో కులికినాను !

            ఇంతలో విడదీయుదే యింటి నుండి ?

            స్వామి ! నీగుండె అది పెద్దబందఱాయి !

 

తే. గీ.     నన్ను సృష్టించినావుపో – ఉన్నవాని

            నుండనీయక ఆల్బిడ్డ్ లుస్సు రనగ

            ఏల మ్రందింతు ? దాన నీ వేమి బావు

            కొందు మాయుసురులు పోసికొనుటెకాక ?

 

కం.        పచ్చనిపూవుందోటను

            చి చ్చిడుదురె ? బ్రతుకు లిట్లు చెడగొట్టెదరే ?

            ముచ్చటలా యీహత్యలు ?

            పచ్చిదగా – జీవహింస పాపముసుమ్మీ !

 

తే. గీ.     నీవు సృష్టించుప్రాణుల నీవె చంపు

            దిట్టివాడవు దేవుడ వెట్టు లైతి ?

            ఈశుడవు కావు – మఱి జీవితశ్వరుడవు !        

            యముడ వనుపేరు నీపట్ల సార్థకమ్ము !

 

తే. గీ.     తను వశాశ్వత మని నిరుత్సాహపడను !

            పాంచభౌతిక మనియును బాధపడను !

            నశ్వరశరీరమును సాధనముగ చేసి

            నేను రచియింతు శాశ్వత మైనకళను !

 

తే. గీ.     అక్షరాక్షరమధురభావాంబరమున

            ఏబదేండ్లుగ నేను రచించుకొన్న

            మహితరసలోకరమ్యహర్మ్యమ్ములందు

            నే వసింతును – చావు న న్నేమి చేయు ?

 

తే. గీ.     తనువె తా నన్నభ్రాంతిలో తగులుకొన్న

            జీవు డఙ్ఞాని యై యుండు చివరివఱకు;

            అత డెఱుంగడు కంట పడ్డట్టీ దెల్ల

            నీఱుగా మారు ననుపచ్చినిజ మొకండు !

 

తే. గీ.     లోకమే మిథ్య యందురు; లోకమందు

            సౌఖ్యములకోస మఱ్ఱులు చాచుచుంద్రు;

            సుఖము మిథ్య కాదా ? యని చూడ రేమి ?

            ఏమివేదాంతమో యిది యెఱుగరాదు !

 

తే. గీ.     “ అన్నమైనను ఒక్కటే – సున్నమైన

            నొక్కటే ” యని – అన్నమే మెక్కుచుంద్రు !

            ఇట్లు పొసగనిమాట లేవేవొ చెప్పి

            వంచకులు లోకు వౌదురు ప్రజలముందు !

 

తే. గీ.     సాలెపురువునుండి సాలెగూడువిధాన

            ఈశునుండి పుట్టు నీజగాలు !

            నారికేళజలము నశియించువిధముగా

            ఈశుననె లయించు నీజగాలు !

 

తే. గీ.     ఎక్కడికి పోవుచున్నామొ యెఱుగరాని

            ఒంటరిప్రయాణ మిది ! జీవు డొంటరిగనె

            ఉండుట భయంకరము – మఱి ఉర్విమీద

            జంటతో కూడి బ్రతుకుటే సౌఖ్యదమ్ము !

 

తే. గీ.     నీవు సూదంటురాయివి – ని న్నెఱుగని

            జీవరాశి నాకర్షించి నీవయిపుకు

            కరుణతో వారికిం దగుఙ్ఞాన మొసగి     

            తుదకు నీలోన చేర్చుకొందువు మహాత్మ !

 

తే. గీ.     గాలి నై యెన్నిలోకాలొ కలయ దిరిగి

            వచ్చి పడితిని భూమిపై వానవోలె !

            నీవు పంపినకబురు నన్ చేరగానె

            స్వీయజనముకైనను జెప్పకుండ

            వణకుచున్ దేహ మిక్కడ పాఱవైచి

            రెక్కలను గట్టుకొని వత్తు దిక్కుమాలి !

 

తే. గీ.     కాంత తనువున నర్థభాగమ్మునందు

            నంటిపెట్టుక యున్నవా డనవరతము

            యోగివలె వల్లకాటిలో నుండవక్చు !

            నింతకన్నను యోగ మిం కెందు గలదు ?      

 

 

తే. గీ.     గాలి తనువును వీడిపోగానె మహిని

            నీవు కూర్చినబంధము లేమి యవునొ !

            బంధములు వీడ నెవరి కెవ్వరునుగారు !

            వసుధలో జీవితము గాలిబ్రతుకు కాదె ?

 

తే. గీ.     తానె దేవుడ ననుయదార్థమ్ము మఱచు

            జీవు డఙ్ఞాని యై నిన్ను చేరలేడు !

            మఱపు గలవాడు గెలుచునే మఱి పరీక్ష ?

            ఆత్మవిఙ్ఞాన మబ్బెనా – అతడె నీవు !

 

తే. గీ.     హరివొ ? హరుడవొ ? నీ వుండునట్టీతావు

            వెండికొండయొ ? తిరుపతికొండయొకద ?

            నవనవం బైనకవితలన్ పరిమళించు

            ఈమనఃపద్మమున నివసింప వోయి !

            కొండ యేటికి ? బంగారుకొండ ! నీకు.

 

తే. గీ.     మహిపయిన నిన్నికోట్లబొమ్మలను పోత

            పోసి అలసితివా ప్రభూ ! భువనవంద్య !

            జీవరాశి నేమట్టీతో చేసినావొ

            విప్పి చెప్పు మీమర్మమున్ విశ్వశిల్పి !

 

తే. గీ.     ఒక్కసూర్యుం డనేకసూర్యులుగ వేఱు

            వేఱుమూకుళ్ళనీట కన్పించునట్లు

            కానిపింతు వనేకులుగా ననేక

            దేహముల నీ వొకండవు దేవదేవ !  

 

ఉ.         ఆరనిచావుపుట్టువుల కవ్వలిగట్టున నున్న నీవు సం

            సారనిమగ్నజీవులను చల్లనిచూపుల చూడకున్నచో

            వారియనంతయాత్ర కొకపారము కల్గునె ? ఓదయామయా !

            వారిదురంతదుఃఖ మిది పాయుట యెన్నడు జీవితేశ్వరా !

 

తే. గీ.     ఒకకొడుకు వెదజడుడు – వేఱొక్కకొడుకు

            పిచ్చిగా కాముకత్వము రెచ్చగొట్టు;

            తిరుగుబో తట యిల్లాలు – తిరిపె మెత్తు

            నర్థనారీశుబ్రతు కెంతహాయి ! చూడు.

 

తే. గీ.     తరుణికోపమ్మునకు నీవె తాళలేక

            అడుగులం బడినా వటే అబ్జనాభ !

            అట్టిచో నింతి అలిగి మూడంకె వేయ

            ఉర్వి మామూలుమగ డెట్టు లోర్వగలడు ?

 

తే. గీ.     అంద మైనట్టిదృశ్యము లరయువేళ

            వేయికనులును చాల వన్పించునపుడు

            కన్నులకు రెప్పపా టడ్డు కాదె చెపుమ ?

            రెప్పపా టేల పెట్టితి శ్రీశ ! మాకు ?

 

తే. గీ.     మాఱు కలకండగా పంచదార బెల్ల

            ములుగ చెఱ కొక్క టయ్యు – నట్టులనె స్వామి !

            వేఱువేఱురూపములందు పేరులందు

            కదలియాడెడునాత్మ యొక్కటియె కాదె ?

 

ఆ. వె.     మఱచిపోయినాము మాచిరునామాలు

            దారి తప్పుబాటసారులు మయి !

            పొసగుదారి చూపి పుణ్యము కట్టుకో;

            ఈవు కాక మాకు నెవరు దిక్కు ?

 

తే. గీ.     స్వప్నమందలిదృశ్యముల్ సత్యమైన

            సంఘటనలట్లు తోచు నాక్షణమునందు !

            చిన్నకల యది యైనచో – జీవితమ్ము

            చిత్ర మౌపెద్దకలకదా జీవితేశ !

 

తే. గీ.     నీవు జ్యోతిర్మయుండవు; నీవెలుంగు

            లోకముల కెల్ల వెలుగు – నీలో వెలుంగు

            లోకముల కెల్ల వెలుగు – నీలోన నుందు

            నేను – నాలోన నీ వుందు నిర్మలాత్మ !

 

చ.         అవధులు లేనికూర్మి నను నాదర మొప్పగ చూచి నన్ మహా

            కవిగ సృజించినావు; మఱి కానుకపెట్టెద నీకు నాకృతిన్;

            అవధులు లేనివెల్గ వయి అందఱిడెందములందు నిండునీ

            వెవరికి నే మొసంగెదవొ యెవ్వ డెఱుంగునురా దయామయా !

 

తే. గీ.     ఆత్మయందు ప్రవేశించెనా మనస్సు

            విషయభోగములందు నపేక్ష కనదు !

            పాలలో నుండి మఱి వేఱుపడిననేయి

            తిరిగి పాలలో కలియునే దేవదేవ !

తరువాయి వచ్చే సంచికలో…….

 

*****************************************************************