10_004 అమెరికా ఇల్లాలి ముచ్చట్లు – గుర్తింపు

 

                 

                     మా అమ్మాయి పెళ్ళి చేసుకున్న తర్వాత మా వారి సంగతేమో కానీ, నాకు మాత్రం మన కమ్యూనిటీలో మంచి గుర్తింపొచ్చింది!

 

అంతవరకు పెద్దగా పట్టించుకోని G.P.A. సభ్యులు తల్లి లెవెల్ నుంచి అత్తగారి లెవెల్ కు ఎదిగిన నన్ను చూసినప్పుడల్లా “ హలో ” చెప్పడం మొదలుపెట్టారు. అంతే కాకుండా అందులో బాగా పేరున్నవారు, ప్రముఖులు నేను ముందు ముందు ఇంకా ఎదగగలనని పసిగట్టేసి, ఎందుకయినా మంచిదని వారి పక్కన నాకు స్థానం ఇవ్వడం మొదలు పెట్టారు !

 

చెప్పొద్దూ అంత గొప్ప వాళ్ళ మధ్య కూర్చునే అవకాశం  దొరికినందుకు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయి పోయాను ! ఎందుకంటారా ? మరి ఆ “ G.P.A “ అదేనండీ గ్రాండ్ పేరెంట్స్ అసోసియేషన్ లో ఉన్నవాళ్ళు సామాన్యులా  ?

 

వాళ్ళలో ఒక్కక్కరికి ఎంత విజ్ఞానం….ఎంత అనుభవం…..అన్నింటికీ మించి అందులో అడుగు పెట్టాలంటే ఎంత అదృష్టం చేసుకోవాలి !!

 

ఏ సందర్భం వచ్చినా అందరూ కలుసుకుంటూ వాళ్ళ అనుభవాలను తోటి వారితో పంచుకుంటూ, నా లాంటి వారికి ఆదర్శప్రాయంగా ఉంటున్న ఎందరో మహానుభావురాండ్రులకు నిలయంగా ఉంటున్న సంస్థ అది. వారి సలహాలు, సూచనలు, వాళ్ళ వెనక నడిచే నా లాంటి వాళ్ళకు వారు చేసే ఉపదేశాలు, హెచ్చరికలు ఎంత విలువైనవీ ఎంత అమూల్యమైనవీ—–

 

ఎలా అంటారా ? ఉదాహరణకు…….    

 

“ పిల్లల్ని కనడం వాళ్ళ స్వవిషయం, మనకెందుకూ అని మాట్లాడకుండా ఊరుకునేరు. ఎప్పుడు కనాలనుకుంటున్నారో అప్పుడప్పుడూ అడుగుతూ ఉండండి. లేకపోతే మాలాగా ఉన్న పళంగా ఉంటున్న ఊరుని, ఉన్నవాకిలిని వదిలేసుకోవాల్సి వస్తుంది. ఈ పిల్లలకు వాళ్ళ వీలే ముఖ్యంగాని మన ఇబ్బందులూ, మన ప్లాన్లు వాళ్లకు అవసరం లేదండోయ్ తస్మాత్  జాగ్రత్త….జాగ్రత్త “ అంటారు జానకిగారు.

 

“ నువ్వు పిల్లల్ని కనేయ్. నేను చూసుకుంటాలే… అని తొందరపడి నేను చేసినట్టు వాగ్దానాలు అవీ చెయ్యకండి. ఆ తర్వాత పీక్కు చావాలి” అంటూ హెచ్చరిస్తారు హేమలత గారు !!

 

“ఇప్పుడే లైఫ్ ఎంజాయ్ చెయ్యండి! మీరు ఎక్కడికెళ్ళాలన్నా, ఏం చూడాలన్నా వెంటనే చేసేయండి. రేపు మనవలు-మనవరాళ్ళు వచ్చాక ఇవన్నీ బంద్!” అంటూ మన భవిష్యత్తుని కళ్ళ ముందుంచుతారు కమల గారు.

 

“ మనం పిల్లల్ని కనే వయసులో మన పేరెంట్స్ దగ్గర లేకుండా ఇలా దేశాలు వచ్చి నానా తిప్పలూ పడ్డాం. ఇప్పుడు మళ్లీ పిల్లల్ని సాకాలనడం అన్యాయం” అంటూ తన నిరసనను వెలిబుచ్చుతారు నిర్మలారావు గారు!

 

“ అప్పటి ఓపికలు వేరు. ఆ ఓపిక ఇప్పుడు రమ్మంటే ఎక్కడ వస్తుందీ? అదీ కాక అప్పుడు పిల్లల్ని మనకు చేతనైనట్టు పెంచుకున్నాం. ఇప్పుడు అట్లా కాదే. వాళ్ళ రూల్స్ ప్రకారం, వాళ్ళ ఇష్టానుసారం పెంచాలి. ఏ కాస్త తేడా వచ్చినా మన పని గోవిందా !!” అని అంటారు అటు కూతురి పిల్లల్ని, ఇటు కొడుకు పిల్లల్నిపెంచి తల బొప్పి కట్టించుకున్న భవాని గారు.

 

“ వాళ్ళ అవసరాలకు మనం కావాలి, కానీ వాళ్ళకు మనమీద వీశమెత్తు నమ్మకం కూడ ఉండదు. ఓ చెంప మనచేత అన్నీ చేయించుకుంటూనే ‘ ఆర్ యూ షూర్ యు కెన్ హాండిల్? ‘ అంటూ ఇమ్మిగ్రేషన్ వాళ్ళు చూసినట్టు మనవంక అనుమానంగా చూస్తారు” అంటూ తన కోపాన్ని ప్రకటిస్తూ ఉంటారు పార్వతి గారు.

 

“ ఎవైలబుల్ గా ఉంటే ఇలాంటి పాట్లు పడాల్సివస్తుందనే, నేను ఉద్యోగం వదలకుండా పట్టుక్కూర్చున్నాను” అంటూ తన అసలు రహస్యం బైట పెట్తారు రాధారాణి గారు !

 

ఇలా గ్రాండ్ పేరెంట్స్ అసోసియేషన్ ఆడవాళ్లందరూ అడపాదడపా చర్చలు జరుపుకుంటూ వాళ్ళ విజ్ఞానాన్ని తోటివారితో పంచుకుంటున్నప్పుడు, పక్కనే వున్న తాతగార్లు కూడ సంభాషణలో తల దూరుస్తూ ఉంటారండోయ్!!

 

“ మాకంటే మీరు ఎన్నో రెట్లు నయం. మీకు “గ్రాండ్ మదర్” గా మంచి గుర్తింపు, తోటి ఆడవాళ్ళ దగ్గరనుంచి టన్నుల కొద్దీ సానుభూతి ఉంటుంది. మా మగాళ్ళనే ఎవరూ పట్టించుకోరు” అంటూ విచారాన్ని వ్యక్తపరుస్తారు విష్ణుమూర్తి గారు.

 

“ఈ వయసులో కూడా ఇంకా పనిచేస్తూ అలిసిపోయి ఇంటికి వచ్చే నాకు, మా ఆవిడ దర్శన భాగ్యమే ఉండదు. ఎప్పుడు ఏ పిల్లల ఇంటికి వెళ్తుందో, ఎన్నాళ్ళుంటుందో, ఎప్పుడు వస్తుందో ఆ దేముడికే ఎరుక! మా పిల్లలకు నా భార్య కావాలి గాని నేను అక్కరలేదు” అంటూ వాపోతారు వాసుదేవరావు గారు.

 

“ ముప్ఫై ఐదేళ్లు కంపెనీకి గొడ్డు చాకిరీ చేసి రిటైరై హాయిగా బతుకుదామనుకున్నాను. కానీ రిటైరైన మర్నాటి నుంచి, ‘ తాతా టేక్ మి దేర్, గ్రాండ్ పా డ్రాప్ మి హియర్, తాతా డోంట్ ఫర్ గెట్ టు పిక్ మి అప్ ” అంటూ నా గ్రాండ్ చిల్డ్రన్ ఇచ్చిన డ్రైవర్ ఉద్యోగంతో రోజంతా రోడ్డు మీదే “ అంటారు రెడ్డి గారు.

 

ఇలా వారి అనుభవాలు వింటూ పెద్దవారితో పరిచయాలు పెంచుకున్న నేను, వాళ్ళు ఊహించినట్లే జి. పీ. ఏ. తరఫున భావితరాలవారికి  ఒక సరికొత్త సందేశమిచ్చే స్థాయికి ఎదిగిపోయాను!

 

కానీ.. చాలామంది నన్ను చూసి, నిన్నగాక మొన్న ఏదో ఒక్క పెళ్లి చేసి,  గ్రాండ్ చిల్ద్రెన్ రాకుండానే ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ  గ్రాండ్ పేరెంట్స్ అసోసియేషన్ లో దూరిపోయి ఇంత పాపులారిటీని ఎలా సంపాదించానా అని అనుమానిస్తూ, అసూయ పడటం గమనించాను. కానీ నేను ఎంత కష్టపడి ఈ గుర్తింపు సంపాదించుకున్నానో వాళ్ళకు తెలీదు.

 

అసలు ఏమైందంటే  —–

 

పెళ్ళి అయిన వెంటనే మా అమ్మాయి దాని ఇంటికి అది వెళ్ళగానే, మావారు ఇదే ఛాన్స్ అని ఓ రెండు నెలల పాటు ఇండియా ప్రయాణం పెట్టేసారు. అక్కడ ఉన్నన్ని రోజులు నన్ను ఎక్కించిన రైలు ఎక్కించకుండా, చూపించిన డ్రైవర్ని చూపించకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు తిప్పారు. మా విహరయాత్ర మధ్యలో ఉన్నట్టుండి మా అమ్మాయి, అల్లుడి దగ్గరనుంచి “ We have a news to tell you, we will announce it soon “  అంటూ బాంబు లాంటి ఈమైల్ వచ్చింది. విషయం ఏమిటో తెలియని మేము ఇద్దరం ఆశ్చర్యపోవడం… నేనూ అందరి ఆడవాళ్ళ లాగానే ఏదో ఊహించుకోవడం వగైరా…జరిగాయి.

 

తర్వాత వారం రోజులకు, “ We are proud parents of Rani. She is two weeks old- – – beautiful- – –  అంటూ ఆటంబాంబు లాంటి ఇంకో ఈమైల్ వచ్చింది. పెళ్లి అయి రెండు నెలలన్నా కాలేదు, అప్పుడే పిల్లను పెంచుకోవడమేమిటి ? ఇలాంటి ఆలోచన ఉన్నట్టు మాటవరసకైనా అనలేదే అని అనుకుంటూ ఏమీ అర్ధం కాక ఫైల్  ఓపెన్ చేసాం.

 

మా అమ్మాయి ఒళ్ళో దర్జాగా కూర్చున్న కుక్కపిల్లను చూసి, ఒకరి ముఖాలు ఒకరం చూసుకొని దీనికా ఇంత బిల్డప్ ఇచ్చారు అని ఒకటే నవ్వుకుని ఆ సంగతి అంతటితో మర్చిపోయాం !

 

ఆ తర్వాత కొద్ది  రోజులకు మా హనీమూన్ యాత్ర ముగించుకుని ఇంటికొచ్చి పడ్డాం.

 

జెట్ లాగ్, ప్రయాణపు బడలిక తీరకుండానే అమ్మాయి, అల్లుడ్ని చూడాలన్న ఆత్రుతతో వాళ్ళింటికి బయలుదేరి వెళ్ళాం.

 

కారు డ్రైవ్ వే లో ఆగడం చూసిన మా అల్లుడు మేము డోరు బెల్లు కొట్టకుండానే తలుపు తీసాడు. అతను తలుపు తీసీ తీయడంతోటే కుక్క “భౌ భౌ “ మంటూ అరుస్తూ బంతిలాగా నా మీదకు ఎగరడం, నేను దానికి రెట్టింపు అరుపుతో బావురుమంటూ రోడ్డు మీదకు పరిగెత్తడం, క్షణంలో జరిగిపోయింది.

 

ముందు నేను… నా వెనకాల కుక్క….అది ఎక్కడ తప్పిపోతుందో అని ఆదుర్దాతో దాని వెనకాల మా అమ్మాయి,  అల్లుడు….ఏ కారు కింద పడి కాలో చెయ్యో విరగ్గొట్టుకుంటానేమో అని కంగారు పడుతూ ఆయాస పడుతూ మావారు…. ఇలా కుటుంబం అంతా రోడ్డున పడ్డాం !

 

కుక్కలంటే నాకు విపరీతమైన భయం అని తెలుసుకున్న మా అల్లుడు దాన్ని పట్టుకుని వెంటనే కేజ్ లో పెట్టి అదే పనిగా సారీ చెప్పాడు.

 

మా అమ్మాయి మాత్రం “ ఇంత పెద్ద దానివై ఉండి అంత చిన్నకుక్క పిల్లకు భయపడతావా? అది షాంపూ చేసుకొని ఉదయం నుంచీ మీకోసం ఎదురు చూస్తోంది తెలుసా? చక్కగా అమ్మమ్మా – తాతకు హలో చెప్పడానికి వస్తే నువ్వు దాన్ని హడలు కొట్టడమే కాకుండా, నీ మూలకంగా అది వాళ్ళ డాడి చేత చివాట్లు తింది తెలుసా ? “ అంటూ ఇన్నాళ్ళుగా దానికి నా మీద ఉన్న కసంతా తీర్చుకుంది !

 

మా అల్లుడు మాత్రం ఈ వయసులో కూడా ఇంత స్పీడుగా పరిగెత్తగల అత్తగార్ని చూసి ఆశ్చర్యపోయాడు !

 

అతనికి తెలీదు, నేను స్కూల్ రన్నింగు రేసులో ఎప్పుడూ ఫస్టు వచ్చే దాన్నని !

 

చిన్నప్పటి నుంచి నాకు కుక్కలన్నా, సూది మందన్నా చచ్చేంత భయం. హఠాత్తుగా స్కూల్లో టీకాల వాళ్ళు ప్రత్యక్షమైనప్పుడు, సంక్రాంతి టైములో తెల్లవారుజామున ఆవు పేడ కోసం వెళ్ళే సమయంలో  కుక్కలు నా వెంట పడినప్పుడు, ఎవరూ ఊహించలేనంత స్పీడుగా పరిగెత్తి ఆపద నుంచి తప్పించుకోవటం నాకు బాగా అలవాటు !

 

ఆ తర్వాత మేము మా అమ్మాయిని, అల్లుడ్ని మా ఇంటికి ఎన్నిసార్లు పిలిచినా ఏవో సాకులు చెప్పడం మొదలు పెట్టారు. గట్టిగా అడిగితే చివరకు మా అమ్మాయి అసలు విషయం బయట పెట్టింది.

 

“మేము రాక పోవడానికి నువ్వే కారణం. క్రితంసారి వచ్చినప్పుడు నీ వలన రాణిని బయట ఎండలో చెట్టుకు కట్టేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఒక్క దాన్నే గరాజ్ లో ఉంచితే రాత్రంతా ఏడుస్తూనే ఉంది. మేము సకుటుంబంగా మీ ఇంటికి రావాలంటే నువ్వు అర్జెంటుగా రిఫార్మ్ అవ్వాలి. ఏ పూజో, పునస్కారమో చేసి కుక్కలంటే భయం పోగొట్టుకో. ఆ తర్వాత ఆలోచిద్దాం “  అంటూ తెలుగు సీరియల్స్ లో  ఆడవిలన్ లాగా మాట్లాడి ఫోన్ పెట్టేసింది !

 

దీని వ్యవహారం చూస్తుంటే నన్నే ఇది వాకిట్లో నుంచోపెట్టేటట్టుందని ఇక లాభం లేదని How to get rid off your fears, How to be friendly with animals? లాంటి పుస్తకాలు చదివి, మావారి సాయంతో నెమ్మదిగా ఎలాగో అతికష్టం మీద భయం పోగొట్టుకున్నా. అక్కడితో నా బాధ్యత తీరిందని భ్రమ పడ్డా ! కేవలం భయం తీరితే చాలదని, వాళ్ళ కుక్కని ఎలా పలకరించాలో, గ్రాండ్ పేరెంట్ గా ఎలా బిహేవ్ చెయ్యాలో, నా రెస్పాన్సిబిలిటీస్ ఏమిటో అన్నీ మొట్టికాయలు వేయించుకు మరీ నేర్చుకున్నాను.

 

మొదట్లో నేను మా అమ్మాయి అత్తవారి యోగ క్షేమాలు అడిగితే, “ అందరూ ఎలా ఉన్నారని పేరు పేరునా అడుగుతున్నావు కానీ మా అమ్మాయి ఎలా ఉందని అడగవేం ? “ అని అక్షింతలు వేసింది !

 

ఆ తర్వాత మాట్లాడినప్పుడు చేసిన తప్పు దిద్దుకుందామని “ హౌ ఈజ్ డాగ్? “ అని అడిగి మరో తప్పు చేశా.

నాకు ఉన్నట్టే దానికీ గోత్రనామాలున్నాయని, సరిగా సంభోదించడం నేర్చుకోమని మా అమ్మాయి ఓ క్లాసు తీసుకుంది !

క్రిస్మస్ కి ఇద్దరికీ మంచి గిఫ్ట్స్ పట్టికెళ్ళి, “మరి మా రాణి గిఫ్ట్ ఏది ? “ అని అడిగించుకున్నాం.

ఒకసారి వాళ్ళింట్లో నేను, మావారు ఏదో ఊసులాడుకుంటుంటే, వంటింట్లో ఉన్న మా అమ్మాయి వచ్చి,“ అలా ఊరికే కూర్చోకపోతే రాణితో కాసేపు ఆడచ్చు కదా ? “ అంటూ కసిరింది !

ఇదంతా జరిగిపోయిన కథ అనుకోండి! ఇప్పుడు మేము పర్ఫెక్ట్ గ్రాండ్ పేరెంట్స్!

 

మా అమ్మాయి గొంతు వినగానే మేము ముందు రాణి గురించే అడుగుతాం. మా అమ్మాయి కూడ అచ్చమైన తల్లి లాగే అది ఎంత అల్లరి చేస్తున్నదో, ఎంత తెలివి గలదో, మధ్య రాత్రిలో వాళ్ళ బెడ్ మీదకు ఎలా చేరుతుందో, బయటకు తీసికెళ్ళినప్పుడల్లా రాణికి ఎంత దిష్టి తగులుతుందో ఇంకా దాని అనారోగ్యం…. అన్నీ ఏకరువు పెడుతుంది !

 

రాణి వచ్చినప్పుడల్లా మా ఇల్లూ, అందరి గ్రాండ్ పేరెంట్స్ ఇల్లు లాగే సందడిగా ఉంటుంది. అందరిలాగే మేమూ మా రాణి సోఫాలు ఎక్కి పాడుచేసినా, కార్పెట్ల మీద పరిగెత్తినా ఏమీ అనము, అనకూడదు కూడా. రాణి వస్తోందంటే మావారు చిన్నచిన్న వస్తువుల్ని, విలువైన వస్తువుల్ని తీసి దాచేస్తుంటారు ! అందరు గ్రాండ్ పేరెంట్స్ చేస్తున్నట్లే మేమూ “ రాణి ” ని బేబీ సిట్ చేస్తుంటాము. మీ పిల్లలు రూల్స్ పెట్టినట్లే మాకూ బోలెడు రూల్స్ ఉన్నాయి.

 

“ ఇప్పుడే డిన్నరు ఇచ్చాం, ఇక దానికి ఏమీ పెట్టద్దు.” ని ఆర్డరు ఇచ్చి వెళ్తారు. మేము అలాగే అని తల ఊపుతాం. వాళ్ళు అటు వెళ్ళగానే అది తోక ఊపుకుంటూ మాతో పాటు వేడివేడి ఇడ్లీ – సాంబారు, మసాలా దోసెలు, చపాతీ – కూర్మాలు లాగిస్తుంది ! రాణి ఎలాగో చెప్పదు. అలాగే మేమూ చెప్పం. మీ ఇళ్లల్లో పిల్లలకు కావాల్సినవన్నీ ఉన్నట్లే, మా ఇంట్లో మా రాణికి కావాల్సినవన్నీ ఉన్నాయి.

 

ఈ మధ్యనే డైమండ్స్ పొదిగిన కాలర్ ఒకటి మా బుజ్జి రాణి మెడలో వేస్తె, దాన్ని మేము అతి గారాబం చేసి పాడుచేస్తున్నామని అందరి పిల్లల్లాగానే మా పిల్లలు మమ్మల్ని కోప్పడ్డారు !

 

రోజూ వాక్ కు వెళ్ళమంటే మొరాయించే మావారు రాణి వస్తే చాలు, దాన్ని తీసుకుని ” షో అండ్ టెల్ ” కు బయలుదేరతారు. రాణి ఎటు తీసికెళ్తే (లాక్కెళ్ళితే) పాపం మావారు అటే వెళ్తారు!

 

ఇన్ని రోజులైనా మా ఫామిలీ ఫోటో ఒకటి మంచిది లేదని ఈ మధ్యనే” గ్రాండ్ పేరెంట్స్ డే” రోజున అందరం  స్టూడియోకెళ్ళి తీయించుకున్నాం. తలుపు తీయగానే ఎదురుకుండా కనిపించే ఆ ఫోటో చూసిన ఎవరికైనా మాదెంత హ్యాపీ ఫ్యామిలీయో ఇట్టే తెలిసిపోతుంది !

 

గ్రాండ్ పేరెంట్స్ అంటే ఉట్టినే మనవలు, మనవరాళ్ళను చూస్తేనే సరిపోదని, వాళ్ళు పెంచుకునే పెంపుడు జంతువుల్ని కూడా ప్రేమించి, పెంచగల సమర్ధత కలిగివుండాలని చాటి చెప్పింది మేమేట  !

 

ఇప్పుడు తెలిసింది కదా, గ్రాండ్  పేరెంట్స్ అసోసియేషన్ లో నాకు (మాకు) అంత గుర్తింపు ఎందుకు వచ్చిందో ?!

 

*******                       *********                          ***********          *******      

తొలి ప్రచురణ కౌముది 2011