10_004 అమ్మమాట, నాన్నబాట – గాంధీమార్గం

                        

                

                        ఈ రోజు మహాత్మా గాంధీ పుట్టిన రోజు. మా తల్లిగారు సుసర్ల సీత దేవి గారి పుట్టినరోజు. అమ్మ అరచేతిలో ముద్దలు పెడుతూ మహాత్మా గురించి, మహనీయుడు జిడ్డు కృష్ణ మూర్తి చెప్పిన పాఠాలు వల్లె వేసుకునే రోజు. అమెరికా ప్రవాసినైన నేను 1989 ప్రాంతం లో, హైద్రాబాదు నగరంలో తాత్కాలిక నివాస కాలంలో, నేను సాగించిన రచనా ప్రయత్నాలలో నా మనసుకి దగ్గరైన అంశం నాన్నగారి ప్రబోధ ” గాంధీ మార్గం ఉవాచలు “. విశ్వ విఖ్యాత భాషావేత్త, పండితుడు, బహు గ్రంథ కర్త ఆచార్య కోరాడ మహాదేవ శాస్త్రి గారి సాంగత్యంలో నెలల తరబడి చర్చల ఫలం – అముద్రితంగానే ఉన్న ఆ గ్రంథం లో కొంత భాగం ఈ 2020 మహత్తర సమయంలో పంచుకుంటున్నాను. మా తండ్రిగారు విద్యావేత్త, సంఘ సంస్కర్త, యుగ సంధిలో భాగమై రాజకీయ, సాంఘిక, మత, సాంస్కృతిక రంగాలలో విశాఖ ప్రవరగా నిల్చిన సుసర్ల గోపాలశాస్త్రి గారు; మా తల్లి గారు భావుక హృదయిని, బహుభాషా విదుషి, అభ్యుదయ వాది, విద్యా శక్తీ, కళానురక్తీ ఏకమైన విశిష్ట వ్యక్తి సీతా దేవి చూపిన మార్గం ” గాంధీ మార్గం “. ఆ బోధనలలో బాల్యం, ఆ సాధనలలో చదువుల కాలం సాగాయి. ఈనాడు ఆ ఉపదేశం ఆసరాగా నిలిచింది. గాంధేయులైన వారికి నమస్కరిస్తూ  – 

 ఓ చిన్న వ్యాసంలో ఒక మహాత్ముని సందేశం వివరించాలనుకోవటం సాహసం. ఒకనాడు మహాత్మా ఎదుర్కొన్న ‘ గడ్డు కాలం ‘ లో ఈనాటి మనమున్నాం. నిస్సందేహంగా మహాత్మా ఒక ” దేశం” ఒక ” చరిత్ర”. ఆ పుటలు ఒకమాటు తిరగవేస్తే, తల్లక్రిందులైన ఈనాటి ప్రపంచంలో ఉంటున్న మనకి సమాధానం దొరుకుతుందని నా దృఢ విశ్వాసం. మన అదృష్టానికి మరోసారి మహాత్మా పుట్టిన రోజు మన ఎదుటి కొచ్చింది… వెలుగు మార్గం చూపిస్తూ, ధైర్యం చెప్తూ ! నూట యాభై ఏళ్ళ ఒక దేశ చరిత్ర పుటల్లో ప్రతీ అక్షరం తానే అయి బ్రతికిన ఒక మహాత్ముని దర్శించాలి. మహాత్మా ఒక విశ్వ జీవన సత్యం. ఆ అక్షర సత్యాలు తెలియాలి. అన్వేషణ మొదలవ్వాలి. గాంధీజీ మాటలు పలుకుదాం. ఆ బాట మరోసారి ఒక్కొక్క ఇటికా పేరుస్తూ నిర్మిద్దాం. ఆ అవసరం వచ్చింది. నిరంతరాన్వేషణలో, అనేకమైన వైఫల్యాల నెదుర్కొంటూ సాఫల్యాన్ని సాధించిన పూర్ణ పురుషుడు మహాత్మా! ” శాంతినీ “, ” స్వాతంత్య్రాన్ని “, ” ప్రేమనీ “, ” అహింసనీ ” నిర్వచించిన విధానం తెలియాలి మనం. 

అడుగడుగునా ఎదురైన అవాంతరాల వలన మహాత్మా తన గమ్యాన్ని మార్చుకోలేదు. తన ఆలోచన మారింది, తన కార్యాచరణ విధానం మారింది, తన చుట్టూ ఉన్న సంఘ వాతావరణం మారింది. తనతో ఉన్న వారి ఎంపిక మారింది. మార్గం రాజకీయ విధానం, దాని నేపథ్యం సత్య దర్శన వాంఛ. తన జీవితపు పట్టు అదే. అంచులూ అదే. తాను వాంఛించిన స్వాతంత్య్రం ‘ సత్యం ‘. జీవితమంతా ఆ సత్య శోధనలోనే గడిచింది. సత్యాన్వేషణకి వినయం కావాలి. తాను దర్శించాలనుకున్న సత్యం పేరు ” అహింస “. తన ప్రయత్నంలో తాను సత్యాసత్యాలకీ, హింసాహింసలకీ మధ్యనున్న విచక్షణ గ్రహించటమే కాక వాచ్యం చెయ్యగలిగిన మహా వక్త గాంధీ. అయితే చివరి వరకు వెదుకులాట ఎందుకు ? కారణం అడుగడుగునా వివరిస్తూనే వచ్చారు. తనకి ” సత్యం”, ” అహింస”, ” స్వాతంత్య్రం ” అన్న విషయాల దఘ్నత సంపూర్ణంగా అవగాహన  కాలేదు అని. రోజూ వారీ కార్యాలలో కూడా స్పష్టం చేస్తూ వచ్చారు. మహాత్మా తన జీవితం పణం పెట్టిన విషయం ఈనాటి మనకి తెలియకపోతే మనమంతా మన జీవిత కాలమంతా సత్య శోధన సాగించాలి. గాంధీ ప్రవక్తనని  ఏనాడూ  చెప్పలేదు. సిద్ధాంత కర్తననీ చెప్పలేదు. తాను పండితుడననీ చెప్పలేదు. తనని తాను అత్యంత సామాన్య మానవునిగా నిర్వచించుకున్నారు. 

సామాన్య మానవునిగా జీవనం సాగించారు. తన మాట, తన బాట, కట్టిన బట్ట, తన పడక, తాను రుచి చూసే ముద్దా సర్వం సామాన్యం ! దూది పింజలనిపించే గాంధీజీ జీవన సత్యాలు ఎక్కడికి చేరుస్తాయో  తెలియాలి మనం. పిడికెడు ముద్దతో కడుపు నింపుకుని, చేతి కర్ర తో ప్రపంచం చుట్ట గల సత్తా ఏమిటో తెలియాలి. తాను కట్టే బట్టకి తానే నేత గాడు కావాలి. సమాధానకోసం ఆయన మాటలే వెదుకుదాం. వారి రాజకీయ ఆలోచనలు, ప్రయత్నాలు, ఎత్తుగడలు, సిద్ధాంతాలు, నేను ముందుకు తీసుకురాను. మన జీవిత కాలాలు చాలవు ఆ విషయాల విశ్లేషణలకు. ఈనాటి మనకి అనివార్యమైన సత్యం తాత్త్విక చింతన. 

అందువలన గాంధీజీ గుండె చప్పుడు వినాలి. గాంధీజీ మాటల్లో ” సత్యం – అహింస ” ల గూర్చిన నా రచనా ప్రయత్నం లో ఒక పటలం ! 

మహాత్ముని వచనాలకి చిన్న చిన్న అనువాదాలు. తాత్త్వికత మాత్రమే అంశం.

 

” జీవితం ఒక దివ్యమైన ఉత్తేజం. జీవితానికి పరమాశయం వేరేలేదు పరిపూర్ణంగా సాధించటమే. 

ఆ స్థితిలో సత్య సాక్షత్కార సిద్ధి నిశ్చయం. ప్రయాణానికి ఊనిక అహింస. 

 ప్రయత్నం పల్చనైతే అబద్ధాలు ఎదురౌతాయి.    

తన జీవన సాఫల్యం కోసం ప్రయత్నం చెయ్యటం బ్రతుకు హక్కు.

తన బ్రతుకు తాను నిర్వహించకపోతే పనిబట్టీ ఫలం ఉంటుంది.

తన తోటి వాళ్ళ అభ్యున్నతికి పాటు పడాలి. కృషి చెయ్యాలి. చివరి వరకు యత్నం నడపాలి. 

నిజమైన ఆదర్శాలకోసం పోరాడే వారిని ఎవరు ఆపలేరు.

జంతు లక్షణం తనలో ఉన్నంత వరకు హింస చేస్తూనే ఉంటాడు మానవుడు. 

తోటి వారి పట్ల క్రూరంగా ప్రవర్తిస్తాడు. ఆలోచన స్వార్ధ పూరితమవుతుంది. హింసిస్తాడు. అదే యుద్ధం. 

తనలో ఆధ్యాత్మిక చింతన ఎందుకు అంటే పేరుకు పోతున్న మానసిక రుగ్మతల నుండి బయట పడటానికి . ప్రేమ పంచటానికి. 

జన్మతో మానవుడు పశువు కాదు. విచక్షణా జ్ఞానం ఉన్నందున. ఆలోచించగల మనసున్నందున. భావించగల సాత్విక చింతన ఉన్నందున. 

ప్రేమించగల స్వభావం ఉన్నందున. స్వస్వరూపం తెలియని మానవుడు జంతువే !

తాను జంతువు కానని తెలియాలి. మానవ స్వభావ రహస్యం ప్రబుద్ధం కావాలి.

మనసు చేత అనుక్షణం అఘమర్షణ స్నానం చేయించాలి. భావ కల్మషం కడిగేయాలి. 

మనం మన అంతరంగం లోనే శాంతి కోసం వెదకాలి. బాహిర పరిస్థితుల వలన సిద్ధించే శాంతి అబద్ధం. 

శాంతికి కావలసింది వేగం కాదు. పంతం కాదు. సాధించే తత్త్వం కాదు.

ప్రయత్నంలో బలం కాదు. వీటిల్లో ఏదున్నా అది ” అహింసే “. 

సత్యాన్వేషణకి కావలసింది ‘ మనసు, సంయమనం, స్థిరత, నిమగ్నత, స్థిమిత, శిక్షణ, ‘ 

తన అంతస్సాక్షి తన చేయనున్న దివిటీ. కళ్ళతో చూడాలి. మనసుతో వినాలి, సమ్యక్దర్శనం నిశ్చయం 

సంయమమూ, సౌజన్యమూ స్వశక్తి తోడైతే ప్రయత్నంలో శాంతి నిర్నిరోధం అవుతుంది. 

మన ప్రయత్నంలో ఆత్మ గౌరవ భావన అత్యవసరం. ఏమాత్రపు నిర్లక్ష్యం కూడదు.

అప్పుడు అక్రమమైన విధాన కార్యాచరణ ఉండదు. 

అబద్ధపు అసత్యపు సాధన మార్గాన్ని ఏవగించుకుంటాడు. అది లోనుంచి సహజంగా వ్యక్తమవుతుంది.  

మానసిక బలం లేని చోట ఆత్మ శక్తి పల్చన. ఆత్మా శాంతి ఉండే అవకాశం కూడా ఉండదు. 

మానసిక బలం శరీరానికి సంబంధించినది కాదు. దేహ శక్తి వలన రాదు.

అచంచలమైన విశ్వాసం వలన వస్తుంది. 

ధైర్యం, సాహసం, ధర్మం, ఏకాగ్రత, స్థిత ప్రజ్ఞత్వం దేహానికి చెందవు. అవి ఆత్మ గుణాలు.  

కండ పుష్టి కలవారికి పిరికితనం ముండవచ్చు. అర్భకునిలో అసాధారణ ధైర్యమూ ఉంటుంది. 

కాపట్యం లో, బీరాలు పలకటంలో, అధికారం వెలగబెట్టటంలో లేదు,

తోటి వారిని అణగ దొక్కటంలో వ్యక్తిత్వం లేదు. ఉండదు. 

అందరికోసం పని చెయ్యటంలో, ఎదుటివారికై సమస్యల నెదుర్కొటంలో, తోటి వారిని శాంతి మార్గం పట్టించటం లో ఉంటుంది. 

ఆధ్యాత్మిక చింతన ఆరంభం నుండి కావాలి. ముసలి తనానికి పరిమితం కాదు.

దానికి కావలసినది నిర్భయత్వం. భయ రోగ మనస్తాపాల నుంచి విముక్తి.

మన చేతిలో పని అది. అందరు పెట్టవలసిన మార్గం. చేరవలసిన గమ్యం. 

పిరికి తనం, బద్ధకం మించిన పాపం మరొకటి లేదు. సర్వ నాశన కారణం ఆ లక్షణాలే.

పిరికివాడు, అలసట స్వభావి ఎప్పటికీ జీవితంలో సఫలం కాలేరు. 

సేవాపరాయణత్వం కావాలి. సాధు వర్తనం కావాలి. సత్య జీవనం కావాలి,

స్వఛ్చమైన  దృష్టి కావాలి. స్వార్థం లేని వినయం కావాలి. అహం వదలాలి. 

చేసిన ప్రతీ పనీ త్యాగ భావనా పూరితం కావాలి. నిష్కళంకం అవాలి.

నిస్స్వార్థం కావాలి. శాంతియుతం కావాలి. 

ప్రతీ భౌతిక దుర్ఘటన వెనుక దైవ నిర్ణయం ఉంటుంది. భగవంతుడు వ్యక్తి కాదు…  శక్తి అని గ్రహించాలి.  

మన నిత్య జీవితాలలో సంభవించే కష్టాలకి కారణం మానసిక రుగ్మత, ఆధ్యాత్మిక బలహీనత అని స్పష్టం అవుతుంది. 

సత్య వాక్కు చాలా ముఖ్యం. అవసరం, ధర్మం, అది శరీర స్థాయిని మించినది.

సత్యాన్ని అభివ్యక్తం చెయ్యటంలో మన వాక్కు పరిమితం. 

మన మాటల ద్వారా సత్యం వెలికి రావచ్చు. కానీ సత్యం అంటే మాటలు కాదు.

జీవించటం వలన మాత్రమే సత్యం సువ్యక్తమవుతుంది. 

అధికారం కావాలంటే ప్రేమ ఒక్కటే మార్గం. అన్ని శక్తుల్లో ప్రేమ అతి శక్తివంతం.

 ఏ ఆయుధాలు దాని ముందు పనిచేయవు. 

” ప్రేమ ” విషయంలో ఇంకో రహస్యముంది.

మనమంతా ఎప్పటికప్పుడు గ్రహించాలి. అనుభవానికి మాత్రమే అందేది. 

మన ఉహల కందే అన్ని విషయాలలో అతి వినమ్రమైనది, స్నిగ్ధమైనదీ, స్నేహమయమైనదీ, హాయినిచ్చేదీ ” ప్రేమ”. 

ప్రేమ అనుసరించే ఒకే ఒక శిక్షా మార్గం ‘ బాధనంతటినీ తాను స్వీకరించటం, ఆనందంగా భరించటం.’. 

పట్టుబడుతోంది కానీ బలవంతం చెయ్యదు. ప్రేమలో తీర్పు ఒకటే ” స్వాత్మార్పణ ” . . 

ప్రేమ ఉన్న చోట అహింస ప్రత్యక్షం అవుతుంది. అహింస ఒక మహత్తరమైన చైతన్య శక్తి. అది వ్యక్తుల ఆత్మ శక్తి. మనలో ఉండే దైవ బలం ! మహోదయానికి అరుణోదయం అహింస.

ద్వేషం నుంచి విడివడి, వైమనాస్యానికి దూరమై, ప్రేమించటమే ” అహింస ” !

” అహింస ” వ్యక్తిగతమైన స్వభావ లక్షణం కాదు.

సాంఘిక నీతి, జాతి గుణం, విశ్వ లక్షణం, సత్యాన్వేషణ మార్గం. 

మనం సాగించవలసినది ‘ జీవిక కోసం పోరాటం కాదు ‘. పరస్పర సేవలో ఉంది మానవ జాతికి అభ్యున్నతి. 

అప్పుడే విజృంభించే పశు ప్రవృత్తి స్థానంలో ” మానవ ధర్మం సత్యం ” ఆవిష్కారమవుతాయి. 

లౌకిక విషయాలలో అహింస సాధించాలి. పరలోకం స్వర్గం అంటూ ఏమీ ఎక్కడా లేవు. 

రాజకీయం జీవ లక్షణమైన మనందరికీ, మానవ జాతికంతటికీ, పురోహిత మవటానికి దివిటీలు

 ” సత్యం, అహింస ” ! –

*****************************