అమర గాయకుడు స్వర్గీయ ఘంటసాల గారితో ఈమధ్యనే దివి కేగిన బాలు గారు, మరో ప్రముఖ గాయకుడు పీ బీ శ్రీనివాస్ గార్ల ఈ ఫోటో ఏ సందర్భంలో తీసారో గాని ఒక్కసారిగా ఎన్నో ఒకప్పటి జ్ఞాపకాల దొంతరలు మనసులో తిరుగుతున్నాయి. సందర్భం ఇప్పుడు బాలు గారు “ఇక సెలవు” అని వెళ్లి పోవడం. ఆలోచిస్తే మొదట ఈ గొంతు ఎప్పుడు విన్నాం అని వెనక్కి వెళితే ఆయన మొదటి పాట మర్యాద రామన్న లోని దయినా ఓ హడావుడి మొదలయింది “గుంతలకిడి గుమ్మా” పాట తోనే. 1966 లో మొదలైన ప్రస్థానం ఓ పక్క ఘంటసాల వారు, మరో పక్క పీబీ శ్రీనివాస్ ల మధ్య అవకాశాలు కి వెతుకులాట లో పూర్తి ప్రోత్సాహం లభించింది కోదండపాణి గారి దగ్గరనుంచే. ఘంటసాల వారు ముఖ్య హీరో లకు పాడితే రెండో పాత్ర లో ఉన్న కుర్ర నాయకులకు బాలు పాడడం 73 వరకు సాగింది. మధ్యలో హీరో కృష్ణ చాలా ప్రోత్సహించడం వల్ల అంతా బాగుంది అనుకున్న తరుణం లో ఘంటసాల వారి అనారోగ్యం ఆయనకి ప్రత్యామ్నాయం గా ఇంకో గాయకుడు రావడం అప్పటికే నిలదొక్కుకున్న బాలుకి సవాల్ గా పరిణమించి కొన్ని పాటలకే పరిమితం కావలసివచ్చింది. అప్పటికే శోభన్, కృష్ణ వంటి నటులకు ఎన్నో మంచి పాటలు పాడినా, అవకాశాలు కొత్త గాయకుడికే వెళ్లడం మొదలెట్టాయి. ఆ స్థితిలో కొన్ని పాటలు అగ్రనటులకు పాడినా పెద్దగా రాణించలేదు. ‘ మనుషుల్లో దేవుడు ‘ లో” ఏయ్ రేఖా, శశి రేఖా” ఎన్టీఆర్ కి, ‘ ఇద్దరు అమ్మాయిలు ’ లో ఏయన్నార్ కి.
1973 లో వచ్చిన “నేను నాదేశం”, “ రావమ్మా మహాలక్ష్మి ” వంటి అతి పెద్ద పాటలు బాలు స్టామినా తెలియచెప్పాయి.
ఈ డోలాయమాన స్థితిలో తాతినేని చలపతిరావు గారు చేసిన హితబోధ పనిచేసి ‘ ఆలుమగలు ‘ సినిమాలో అక్కినేని కి పాడిన ” ఎరక్క పోయి వచ్చాను ” పాటతో ఒక్కసారిగా అగ్రనటులందరూ బాలు వెంటపడ్డారు. అప్పటినుంచి వెనుతిరిగి చూసుకోకుండా అప్రతిహతంగా కొనసాగిన ప్రస్థానం ఒక్కసారిగా ” చూడాలని ఉంది ” సినిమాలో ” రామా చిలకమ్మ “కి హిందీ గాయకుడు పాడడం ప్రేక్షకాదరణ రావడం తో గాయకులు ఎక్కువయ్యారు. అయినా సరే ఏకఛత్రాధిపత్యం పోయి పాటలు పంచుకోవడం మొదలైనది. ఇక హిందీ లో ఒక దశాబ్దం తిరుగు లేకుండా పాడి తమిళ, మలయాళ, కన్నడ వంటి 16 భాషల్లో వేలాది పాటలు పాడారు.
ఇహ “ పాడుతా తీయగా ” ద్వారా ఎందరో గాయకులు తయారయ్యారు. ఆ వేదిక మీద ఈయన చెప్పే ఒకనాటి సంగతులకి ఇక విరామమే. విషయం తెలియడం వేరు. దాన్ని జనరంజకంగా చెప్పడం వేరు. రెంటిలోనూ దిట్ట బాలు గారు. ఈ సందర్భంగా ఆయన ద్వారానే విన్న కొన్ని విశేషాల్లో… ఒక సమయంలో ఆయనకి హిందీలో విపరీత ఆదరణ రావడానికి కారణం వివరిస్తూ ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ బాలు పాటని ఇంకో మరాఠీ గాయకునితో పోలుస్తూ ‘ మీ పాట తెర మధ్యనుంచి వస్తే ఆ గాయకుడిది ఒక పక్కనుంచి మాత్రమే ధ్వనిస్తుంది ’ అన్నారట. బాలు తానెప్పుడూ సంగీతం నేర్చుకోలేదు గానీ ఒక సినిమా పాటని ఎలా పాడితే వినసొంపుగా ఉంటుందో ఆ సూత్రం తెలిసిన వాణ్ణని చెప్పుకునేవారు.
ఆ తరం సంగీత దిగ్దర్శకులందరి వద్ద పాటలు పాడిన ఘనాపాఠీ మన బాలు. మొదట్లో బాలు రాణించడానికి కారణం తాను ఘంటసాల వారిని అనుకరించక పోవడమే అని ఘంటాపథంగా చెప్పుకున్నారు. ఒక రచయిత ఒక చిన్న కాగితం మీద వ్రాసిన రెండు వరుసల పల్లవి, ఎనిమిది వరుసల తో రెండు చరణాలు బాలు గారి గొంతు ద్వారా శాశ్వతత్వం పొందాయి. ఇక తమిళులకు బాలు “యెస్ పీ బీ” గా ఆరాధ్యుడు. ఈయన గళంలో తమిళంతో తమిళులు తమ సొంతంగా, కన్నడిగులు తమ వాడిగా భావించారు. ఏ మత ప్రార్థనలు అయినా రక్తిగా పాడిన బాలు లేకున్నా ఉన్నట్టే. తన గొంతు తో ఎప్పుడూ మనకు వినబడి కనబడుతూనే ఉంటారు.
ఎన్ని పాటలు, కీర్తనలు, భజనలు, స్తోత్రాలు, పద్యాలు ఎంతో శ్రద్ధగా వీనుల విందుగా ఆలపించిన శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు గంధర్వుడి గా మారి శ్రీ తుంబుర నారద నాదామృతాన్ని దివిలో విరజిమ్మడానికి, అక్కడి గంధర్వుల సంగీతాన్ని శృతి చేయడానికి వెడలి పోయారు.
తమ పేరుతో భువిలో విరిసిన పారిజాతాన్ని, తమ అందాన్ని వర్ణిస్తూ ఎన్నో గేయాలు ఆలపించిన కంఠానికి మాలగా తామే మారి తరించిపోతుంటాయి ఎప్పటికీ ఆ పారిజాతాలు.
ఆంధ్ర ప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాకు మధ్యలో ఉండే యానాం పట్టణం పాండిచేరి, కేంద్ర పాలిత ప్రాంతం లోని అంతర్భాగం. కోనసీమ సిగలో మరో అందాల నందనవనం. ఒకసారి ఆ సుందరవనం లో ‘ పాడాలని ఉంది ‘ టీవీ షో కోసం గాన గంధర్వుడు శ్రీ ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం గారు విచ్చేశారు. ఆ సందర్భంగా యానాం పట్టణ సొగసును వర్ణిస్తూ ఆ ఊరి వాస్తవ్యులు, రచయిత్రి శ్రీమతి కామవరపు విజయలక్ష్మి గారు వ్రాసిన పాటను బాలు గారు ఆలపించారు. వారి గొంతులో యెన్నో హోయలు, ఉత్తేజాన్ని నింపుకుని పూర్తి యానాం దృశ్య మాలిక గా రూపొందిన ఈ పాట మీ కోసం……