జగమెరిగిన, బ్రాహ్మణునికి జంధ్యమేల అన్న సూక్తినే జగమెరిగిన గాయకునికి పరిచయమేల అని కూడా మనం అన్వయించుకోవచ్చును.
ఆయనే ఎస్. పి. బి. గా పేరెన్నికగన్న శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం అనే నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు. ఆయనలో అటు సంగీతపరమమైన విద్వత్తు మాత్రమే కాకుండా, మరొక ప్రక్క వినయశీలత, సౌహార్దము కూడా ఇతోధికంగా చోటుచేసున్నాయి. అందువలననే ఆయన ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది శ్రోతల హృదయాలలో ఏనాటికి చెరగని, తరగని స్ధానాన్ని సంపాదించుకున్నారు. నిజానికి అదే అసలు సిసలైన సిరి, సంపద అన్నమాట ! బిరుదులూ, సన్మానాలు కంటే అదే మిన్న.
చిన్నప్పటినుండి సంగీతం పట్ల అభిరుచి ఉన్నప్పటికీ – అణుమాత్రంగా ఉన్న అది క్రమేపీ తనలో విశ్వరూపం దాల్చడంతో, వృత్తిపరంగా ఇంజినీరు కావలసిన వ్యక్తి, ప్రవృత్తి యొక్క ఆధిక్యత కారణంగా గాయకునిగా, జీవితం లో స్థిరపడ్డారు. ఆ సంగీత, గాన సరస్వతి సేవలో తన జీవితాన్ని పండించుకున్నారు ఆయన. వైవిధ్యభరితమైన అనేక పాటలను అనేక భాషలలో ఎంతోకాలంగా పాడుతూ అందరి మన్ననలను పొందారు.
అసలు అయన పేరే ఒక మహత్తు… విద్వత్తు… సూక్ష్మంగా విశ్లేషించి చూస్తే ఆయన( పేరు) లో సరస్వతీదేవితో బాటుగా మరో నలుగురు దేవుళ్ళు పీఠం వేసుకుని కూర్చున్నారు.
శ్రీ — లక్ష్మీదేవి
పతి – ఆ సతి కి పతి విష్ణుమూర్తి
పండితారాధ్యుల — పండితులచే ఆరాధింపబడేవాడు
బాల – పార్వతీదేవి
సుబ్రహ్మణ్యం – సుబ్రహ్మణ్యస్వామి
ఇది ఒక విశేషమే కదా మరి !
బాలు గారితో నా తొలి ప్రత్యక్ష పరిచయం 1972 ప్రాంతాలలో ఏర్పడింది. రాజమండ్రి లో ఒక కార్యక్రమానికి వచ్చిన ఆయన గోదావరి తీరాన ఉన్న పంచవటి హోటల్ లో బస చేసారు. అయన గదికి చేరువలో మరొక గదిలో బస చేసిన నా ఆప్త మిత్రుడు, నేపథ్య గాయకుడు శ్రీ విస్సంరాజు రామకృష్ణ ను కలిసేందుకు నేను అక్కడకు వెళ్లడం జరిగింది. రామకృష్ణ సూచనను అనుసరించి ఇద్దరం కలిసి బాలసుబ్రహ్మణ్యం గారిని కలిసాము. కలిసి కాసేపు కబుర్లు చెప్పుకున్నాము.
బాలు గారిని కలిసిన మరొక సందర్భం ఏమంటే, హైదరాబాద్ లో జరిగిన శ్రీ సినారె గారి పెద్ద అమ్మాయి చి. సౌ. గంగ వివాహానికి రెడ్డి గారి నుండి నాకు అందిన ఆహ్వానం మేరకు హైదరాబాద్ వెళ్లాను. అక్కడ పెళ్లి అనంతరం జరిగిన సంగీత కార్యక్రమంలో పాల్గొన్న శ్రీమతి పి. సుశీల, శ్రీ ఎస్. పి. బి. గారలను స్వయంగా చూడడం తటస్థించింది.
కొన్నేళ్ళకి — 1992 లో అన్నమాట !
అమలాపురం కి చెందిన ప్రముఖ రచయిత శ్రీ పైడిపాల గారు తెలుగు సినిమా పాట పుట్టుపూర్వోత్తరాలను సవివరంగా తెలియజేస్తూ ఒక రచన చేసారు. దానిని శ్రీ ఎస్. పి. బి. ” స్నేహ ప్రచురణలు ” పేరున పాట అంటే తనకున్న మమకారంతో పుస్తకంగా ప్రచురించారు. ఆ పుస్తకం కోసం నేను వారిని సంప్రదించాను. అయితే, అనూహ్యంగా ఆ పుస్తకం ముద్రణ, విడుదలలో కొంత జాప్యం జరిగింది. ఈ విషయాలన్నిటినీ ప్రస్తావిస్తూ, జరిగిన ఆలస్యానికి మన్నించమని కోరుతూ ఆయన నాకు ఒక ఉత్తరం వ్రాసారు. ఇది కూడా అనూహ్య పరిణామమే ! ఇలా ఉత్తరాన్ని వ్రాయడం ఆయన సంస్కారానికి ఒక మచ్చుతునక. ఈ విషయాలను పేర్కొంటూ శ్రీ ఎస్. పి. బి. గారి ఉత్తరాన్ని ( తోక లేని పిట్ట ) జత చేస్తూ నేను వ్రాసిన ఒక చిన్న వ్యాసాన్ని మిత్రులు శ్రీ శిష్ట్లా రామచంద్ర రావు గారు ఎంతో సౌజన్యంతో తన వెబ్ పత్రిక ” శిరాకదంబం 09_013 ” ( 01 – 04 – 2020 ) సంచిక లో ప్రచురించారు. ఈ దిగువ లింక్ లో ఆ వ్యాసాన్ని ఆసక్తి ఉన్నవారు చూడవచ్చును.
https://sirakadambam.com/09_013-tolepi-spbalasubrahmanyam/
తరువాత ముఖ్యమైన ఘట్టం.
చెన్నై లో డిసెంబర్ 1996 లో మా పెద్ద అబ్బాయి చి. సుధాకర్ వివాహం చెన్నై, వడపళని లోని విజయ శేష్ మహల్ లో జరిగింది. మా వియ్యంకుడు శ్రీ ఎస్. పి. వెంకన్నబాబు గారు సినీ నిర్మాత, ప్రఖ్యాత సినీ సంగీత దర్శకుడు శ్రీ ఎస్. పి. కోదండపాణి గారికి స్వయానా తమ్ముడు. మంచితనం ముందు పుట్టి అటు తరువాత వెంకన్న బాబు గారు జన్మించారు. ఆయనకు సంతానం ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. ఆ అమ్మాయే విజయలక్ష్మి… మాకు కోడలైనది. ఆ వివాహానికి హాజరై వధూవరులను నిండు మనసుతో దీవించారు బాలు గారు. ఆనాటి ఆ ఫోటోలను ఈ వ్యాసానికి జత పరచడమైనది. అలాగే పదిలపరచిన ఎన్నో జ్ఞాపకాలలో ఇవి కేవలం కొన్ని మాత్రమే. అపురూపమైనవి. నిత్య నూతనమైనవి. ఇవన్నీ ఇప్పుడు జ్ఞాపకాలుగానే మిగిలిపోయాయి.
ధన్యవాదాలు ~ నమస్కారములు.
<><><>!<><><>
అతి మధురంగా రచించేరు. జోహార్లు.
ధన్యవాదాలు ,పాణి !
ధన్య వాదములు సుబ్బారావు గారు. చాలా బాగుంది.
కురుమద్దాలి వెంకట సుబ్బారావు
చాలా బావుంది బాబాయి గారు. బాలు గారి గురించి చదువుతుంటే, మేము ఎన్నో ఏళ్ళ కిందట న్యూయార్క్ లో బాలు- సుశీల గారి సంగీత కార్యక్రమం, 1981 లో ఎప్పటికీ మర్చిపోలేని “శంకరాభరణం” నైట్ ప్రోగ్రాంకు వెళ్ళటం, ఆ తర్వాత చిత్ర గారితో కలిసి ఇచ్చిన ప్రోగ్రాం, ఈమధ్యనే న్యూజెర్సీ లో జరిగిన “పాడుతా తీయగ ” కార్యక్రమానికి వెళ్ళటం అన్నీ గుర్తుకు వస్తున్నాయి. బాలుగారి వలనే సినిమా పాటల్లోని మంచి సాహిత్యాన్ని గుర్తించటం, సినిమా పాట పాడటానికి ఎటువంటి ప్రతిభ ఉండాలో, దానికి సింగర్స్ పడే శ్రమ వంటి విషయాలు ప్రజలకు తెలిసాయి.
శ్యామలాదేవి దశిక