10_004 వెలుగునీడలు

తే. గీ.     ముఖము ముఖమందె యుండును మోము చూచు

            కొనెడునద్దము పగిలిపోయిననుగాని

            ఎది యె ట్లైనగాని పట్టించుకొనక

            అత్మ తనయందె తా నుండు నాదిదేవ !

తే. గీ.     తనను పగులగొట్టగ వచ్చునినుమునైన

            బంగరుగ మార్చివేయును పరుసవేది !

            నిన్ను ద్వేషించి దూషించునీచునైన

            మోక్ష మిచ్చి రక్షింతు వోముక్తిదాత !

           

తే. గీ.     అందుబాటున నున్నలోహమ్ము నిట్టె

            తనదెసకు లాగికొనును సూదంటుఱాయి !

            కర్మ పరిపక్వ మగు వేళ కరుణ చూపి

            జీవులను దేవ ! నీలోన చేర్చుకొందు !

తే. గీ.     ఆకసము శూన్య మయ్యును అంబుదముగ

            చంద్రుడుగ చకోరములను చాతకముల

            తనుపునట్లు దయామృతమ్మును నొసంగి

            కాతు భక్తుల నోనిరాకార ! నీవు !

తే. గీ.     కర్మ మనుగాలి కానందకంధియందు

            జీవు డనుతరంగము తోచు దేవదేవ !

            అట్టియానందసాగరమందు మునుగు

            వాడె ఙ్ఞానప్రపూర్ణత పడయువాడు !    

తే. గీ.     పుట్టుకను గాంచువారెల్ల గిట్టుచుంద్రు ;

            కంట బడునవి మట్టిలో కలసిపోవు ;

            పుట్టుకయు రూపమును లేక పొలుచునీవు

            శాశ్వతుడ వైతివి ; వివేకశాలి వగుట !

తే. గీ.     అవనిపై నెన్నియోమాఱు లవతరించి

            అయయొ ! నీవును పంచత్వ మందినావు !

            భళిర ! జాతస్య మరణమ్ ధృవ మ్మనునుడి

            నీకుసైతము వర్తించునే మహాత్మ !

ఆ. వె.     “ పంచభూతములకు ప్రతిరూప మీ – వని

            విడకముందె నిద్ర వీడు ” మనుచు

            చేతివ్రేళు లైదు చెప్పుచున్నను మాయ

            జీవి మేలుకొనడు – చిత్ర మేమొ !

తే. గీ.     బండఱాలగుండెలు చీల్చి ప్రభవ మంది

            కడకు నదు లెల్ల కడలిని కలియునట్లు

            బ్రతుకుసంద్రము నీదినప్రాణికోటి

            కర్మపరిపక్వతను వచ్చి కలియు నిన్ను !

ఆ. వె.     గాలి నీరు మట్టి ఖాళీప్రదేశమ్ము

            కలసి రూప మందుకడవ నేను !

            అందు నీవు నిలచినన్నాళ్ళు నే నుందు !

            నీవు లేచిపోవ నేను లేను !

తే. గీ.     గాలివై చల్లగా వచ్చి కౌగలించి

            కంట పడకుండగా నెటో కదలిపోదు !

            చక్షు లేపాపమును చేసె ? చర్మ మేమి

            పుణ్య మొనరించె ? చెప్పుము పురుషసింహ !

ఆ. వె.     నాకు తెలియకుండ నాదేహమున మార్పు

            లెట్లు జరుగుచుండు నెఱుగరాదు !

            నన్ను నే నెఱుంగకున్నవాడను నేను

            ని న్నెఱుంగ టెట్లు నీరజాక్ష !

ఆ. వె.     కంట పడక గాలి కౌగలించుచు పోవు

            జీవరాశి నెల్ల సేదదేర్చి !

            కానిపించనంత గాలి లే దందుమా ?

            నీవుకూడ అంతె దేవదేవ !

తే. గీ.     స్వామి ! నీపదమ్ములను పూజాసుమముగ        

            మధురకవితామరందసంపదలు నిండు

            హృదయపద్మమె నీకు నర్పించుకొంటి

            ఇంతకన్నను నీకు నే మీయగలను ?

తే. గీ.     పంకమున కాక కన్నీట ప్రభవ మంది

            మృదులరసలోకరమ్యపరీమళమ్ము

            లొలయుపద్మదామమ్ము నీ కొసగుచుంటి

            కనికరించి కాపాడవే కన్న్దతండ్రీ !

తే. గీ.     మధువు లొలికెడు కవితాసుమాలమాల

            కంఠహారముగా చేసి కాన్క నీకు

            ఇడినకవితాకళాప్రపూర్ణుడను నన్ను

            చల్లగా చూడు మొకకంట సరసిజాక్ష !

కం.        శ్రీకల్యాణగుణాకర !

            తాకిననే కందిపోవుతావకచరణ

            శ్రీకి సుకుమారతరమౌ

            నాకవితాసుమమర్చనం బిదె కొనుమా !

******** సమాప్తం ********