10_005 అమెరికా ఇల్లాలి ముచ్చట్లు – పూర్ మగాళ్ళు

                    

అసలు నన్నడిగితే, మీ మగాళ్ళందరూ ఉట్టి అమాయకులు! మీరందరూ పేరుకు ఇంతలేసి చదువులైతే చదివారు కానీ..ఒక్కళ్ళకు బొత్తిగా లోకజ్ఞానం లేదు.

మా గురువు గారు, అదేనండీ “పురాణం” వారు అదేదో పుస్తకంలో రాసినట్టు, అమెరికాలో ఆనందం ఎల్లవేళలా పొంగి ప్రవహిస్తూ ఉంటుందీ, జుర్రుకు తాగచ్చని మీరంతా పడి ఇక్కడకు వచ్చారు. అమెరికాలో సుఖాల్ని సులువుగా అందిపుచ్చుకోవచ్చని, డాలర్లు డ్రమ్ముల్లో నింపేసుకోవచ్చని మీ మగాళ్ళందరూ కట్టకట్టుకుని వచ్చారు.

అమెరికా వస్తే ఎంచక్కా సూటుబూటు వేసుకుని, దర్జాగా కారులో ఆఫీసులకెళ్ళి అలుపు సొలుపు లేకుండా పనిచెయ్యచ్చని పరుగులెత్తుకుంటూ వచ్చారు! కానీ.. అమెరికాలో ఆఫీసునుంచి ఇంటికొచ్చాక అంట్లు తోమాల్సి వస్తుందని తెలీదు మీకు!

పాపం! మీరందరూ కొత్తగా వచ్చిన సరుకని జాలిపడి, ఇక్కడివాళ్ళు చేసిన పాంపరింగు చూసి మీ పొజిషన్ పర్మినెంటనుకున్నారు. కానీ అమెరికాలో ఏ క్షణాన అయినా ఉద్యోగంలో నుంచి పీకిపారేస్తారని తెలియని పిచ్చివాళ్ళు మీరు!

వెచ్చగా రగ్గు కప్పుకుని బయట పడుతున్న స్నో చూసి సంబరపడి పోయి గొప్పగా, గొప్పగొప్ప కవిత్వాలు రాసుకున్నారు. కానీ తర్వాత “క్లీనింగ్” అనే కార్యక్రమం ఒకటి ఉంటుందని కనుక్కోలేక పోయారు!

అమెరికాలో బేవార్సుగా బట్టరు కుక్కీలు, కోన్ ఐస్క్రీములు, చీజు కేకులు లాగించేయచ్చనుకున్నారు. కానీ తర్వాత బెల్ట్ సైజు ఇట్టే మారిపోతుందని బోధపడలేదు మీకు !

అమెరికా వచ్చేస్తే ఏమి కష్టపడకుండా, కడుపులో చల్ల కదలకుండా కానిచ్చేయచ్చనుకున్నారు. కానీ ఇంటింటా “కొలెస్ట్రాల్” కొలువై ఉంటుందని కనిపెట్టలేకపోయారు!

అమెరికాలో లైఫ్ అంతా హాలీడేస్ లాగా “హాపీహాపీ” అనుకున్నారు. కానీ హాఫ్ సెంచరీ రాకుండానే హార్ట్ సర్జరీలకు హడావిడి పడాల్సివస్తుందని తెలియని అమాయకులు మీరు!

అమెరికాలో పుట్టి పెరుగుతున్న మన పిల్లలు మహా తెలివిగల వాళ్ళని తెగ మురిసిపోయారు. కానీ ముందు ముందు వాళ్ళు తికమక పడతారని తెలుసుకోలేకపోయారు!

విదేశాలనుంచి వచ్చారని మన వాళ్ళందరూ ఇచ్చిన “వీ ఐ పీ” ట్రీట్మెంట్ చూసి ఫర్ ఎవర్ ఇలాగే చేస్తారని పదేపదే పరుగులెత్తారు. కానీ, ఇండియాలో ఈగల బాధకన్నా “అమెరికా అతిధుల బాధ” ఎక్కువగా ఉందని అర్ధం చేసుకోలేని అజ్ఞానులు మీరు!

ఇండియా వదిలేస్తే గుళ్ళు..గోపురాల కెళ్ళే గొడవ ఉండదనుకున్నారు. కానీ, అమెరికాలో ఆమడకొక ఆలయం వెలిసే అవకాశం ఉందన్న విషయాన్ని అండరెస్టిమేట్ చేసారు!

అమెరికాలో వయసులో ఉన్నవారికి లైఫ్ ఉల్లాసంగా ఉంటుందని ఊహించగలిగారు. కానీ వృద్దాప్యంలో ఎలా ఉంటుందో వీసమంత కూడా విచారించలేదు మీరు!

అప్పట్లో మీరందరూ అమెరికాలో ఉండే ఆనందం గురించి ఆలోచించారే గాని, అమెరికాలో ఉండే అవస్థల గురించి తెలుసుకోవడం అనవసరమనుకున్నారు. “గ్రాస్ ఈజ్ గ్రీనర్ ఆన్ అదర్ సైడ్” లాగా అమెరికా వస్తే అందలం ఎక్కచ్చని ఎగురుకుంటూ వచ్చిన మీరంతా అమెరికా వచ్చి “అడుసులో” పడ్డారు!

బ్రహ్మదేముడు మీ అందరికీ బ్రహ్మాండమైన బ్రెయిన్స్ అయితే ఇచ్చాడు గానీ, బుర్రలు మాత్రం ఇవ్వలా!

అందుకే నాకు మీ మగాళ్ళ౦దర్నీ చూస్తే బోలెడంత జాలి!

ఏమిటీ! నాకు రాను రాను బొత్తిగా భయం లేకుండా పోతోందంటారా?!    

*********************

   

పూర్ మగాళ్ళు-నేపథ్యం

మా ఫ్రెండ్ అనేవారు “అమెరికా వస్తే కారులో తిరగొచ్చుకదా అని అనుకున్నానే కానీ..ఇలా కాఫీ కప్పులు కడగాల్సి వస్తుందని నాకేం తెల్సు?” అంటూ, ఓ పక్క పనిచేస్తూనే మమ్మల్ని నవ్విస్తూ ఉండేవారు! అలాగే ఆ రోజుల్లో కేవలం మొగవాళ్ళ నిర్ణయం కారణంగా అమెరికా వచ్చిన ఆడవాళ్ళు, ఇక్కడికి వచ్చి కొత్త కొత్త సమస్యలు ఎదుర్కొ౦టున్న పరిణామం లో “ ఏమిటో ముందువెనక ఆలోచించకుండా ఇలా ఇక్కడకు వచ్చి పడ్డాం ” అంటూ పరోక్షంగా తమ బాధను వ్యక్తం చేస్తుండేవారు. అప్పుడు ఈ మొగవాళ్ళ మీద జాలేసి, ఈ ముచ్చట రాయడం జరిగింది. చాలామంది ఆడవాళ్ళు “చాలా కరక్ట్ గా బాగా రాసారు!” అని మెచ్చుకోడం విని మా ఫ్రెండ్ ఒకరు వెంటనే “పూర్ ఆడాళ్ళు” అంటూ ఆయన కూడా ఓ కథ రాసారు!

******************