10_005 ఆనంద సిద్ధి

                      

                      కొత్తగా చేరిన ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ లందరినీ సమావేశ పరిచి ఒకళ్ళని ఒకళ్ళకి పరిచయం చేశాడు గోల్డెన్ లేక్ టెక్నాలజి  వైస్ ప్రెసిడెంట్ దేవరాజన్. ఆ పరిచయాల లోనే ఆనంద్ కి నారాయణ తో పరిచయం అయింది. ఇద్దరూ ఒకే టీమ్ లో ఉండడంతో ఇంకా దగ్గర అయ్యారు. నారాయణ వైజాగ్ లోనే తల్లి తండ్రులతో ఉంటున్నాడు. ఆనంద్ హైదరాబాద్ నుంచి వచ్చి రూమ్ తీసుకుని నారాయణ ఇంటికి దగ్గరలోనే ఉంటున్నాడు.

శలవులలో కూడా  ఇద్దరూ కలిసి తిరుగుతూ ఉండేవారు. కానీ నారాయణ ఆదివారం ప్రొద్దుట  తొమ్మిది, పదకొండు మధ్య మాత్రం దొరికేవాడు కాదు. విచారిస్తే ఆనంద్  కి తెలిసిన విషయం, ఆ సమయం లో నారాయణ ఏదో సత్సంగానికి క్రమం తప్పకుండా వెడుతున్నాడని తెలిసింది. ఒక శనివారం ” నువ్వు వెళ్లే సత్సంగానికి నేను రాకూడదా ?” అని అడిగాడు ఆనంద్.

” ఎందుకు రాకూడదు ? కానీ రెండు గంటలు నీకు బోరు కొడుతుందేమోనని నేను ఎప్పుడూ చెప్పలేదు ” అన్నాడు నారాయణ

”  దేని గురించి సత్సంగం? ఇస్కాన్ వాళ్లదా, లేక సాయి భక్తులదా ?”  అడిగాడు ఆనంద్

” రమణ మహర్షి భక్తులు ప్రతి ఆదివారం జరుపుకుంటారు. మా నాన్నగారు వెళ్లేవారు. ఈమద్యన ఆరోగ్య సమస్య వల్ల, అయన రావటం లేదు. నేను ఒక్కడినే వెడుతున్నాను . కావలిస్తే నువ్వు కూడా రావచ్చు ” చెప్పాడు నారాయణ

ఆ మరుసటి ఆదివారం నారాయణ తో పాటు ఆనంద్  కూడా సత్సంగానికి వెళ్ళాడు

సత్సంగం హాలు లో ఒక పెద్ద బల్ల మీద ఒక పెద్ద ఫోటో చూశాడు, షిర్డీ సాయి ముఖంలో ఉండే ప్రశాంతత లాంటిదే మహర్షి ముఖంలో చూశాడు  ఆనంద్ ,

అంతటి దీప్తి వంతమయిన కళ్ళు ఎక్కడా చూడ లేదు అతను. ఆ చూపులు అతని లో ప్రవేశించి ఎక్కడో గుండె లోతుల్లో స్పృశించిన భావన కలిగింది. కరుణ కరడు కట్టిన ఆ కళ్లల్లోంచి ప్రసరిస్తున్నట్టు అనిపించింది

నారాయణ పక్కన కూర్చుని  సత్సంగం  కార్యక్రమం అంతా మౌనం గా పరిశీలించాడు. మహర్షి రచించిన రచనలు అందరూ కలిసి పాటలు కింద పాడారు.

ఒక భక్తుడు తన ఉపన్యాసం లో, మహర్షి జీవిత కాలంలో ఉన్న కొందరు భక్తుల గురించి వివరించాడు. ఇంకో భక్తుడు తనకి మహర్షి గురించి తనకి ఎలా  తెలిసింది, ఎలా సత్సంగాలకి రావడం జరిగింది అన్నీ వివరించాడు

సత్సంగం అయిన తరవాత బయటికి వస్తూ మిత్రుడిని అడిగాడు

” మహర్షి అసలు బోధించినది ఏమిటి ? పరమహంస, షిర్డీ సాయి లాంటి  వాళ్ళ కి, ఈయనకి తేడా ఏమిటి?. అదేమీ నాకు అంతు పట్ట లేదు ”  అన్నాడు.

” అయితే మహర్షి జీవితం గురించి రాసిన పుస్తకం చదివితే నీకు బాగా అర్థం అవుతుంది.” అని పుస్తకాలు అమ్మే చోట ఒక పక్కగా ఉంటె అక్కడికి తీసుకు వెళ్ళాడు. నిమిషకవి పేర్రాజు గారు రాసిన చరిత్ర, డేవిడ్ గాడ్మన్ న్ రాసిన ‘  “బి ఏజ్యు ఆర్” అన్న ఆంగ్ల పుస్తకం కొనిపించాడు

అవి చదువు. సందేహాలు ఉంటే, పరాశర స్వామి  గారని ఒక భక్తుడు ఉన్నారు. మనకి కొంచం దూరం లో ఒక కుర్చీలో కూర్చున్నారు చూశావా ?. చాలామంది ఆయనని సాధన విషయంలోను, మిగతా విషయాలలోనూ సందేహాలు అడుగుతూ ఉంటారు. ఆయన ఉపన్యాసాలు ఇవ్వరు. మనం అయన ఇంటికి వెళ్లి మాట్లాడ వచ్చు ” అన్నాడు నారాయణ.

******

ఆనంద్ కి చిన్నప్పటినుంచీ కొంచం పరిశీలనాత్మక దృష్టి ఎక్కువ. తన  ఇంట్లోనూ , చుట్టుపట్ల గుళ్ళల్లో జరిగే పూజలు చూసినప్పుడు,, టీవీల లోను జరిగే అనేక ఉపన్యాసాలు, చర్చలు విన్నపుడు అతనికి చాలా సందేహాలు మనసులో మెదిలేవి. స్తోత్రాలు విన్నప్పుడు, అసలు భగవంతుడిని ఎందుకు పొగడాలి ? తీర్థ యాత్రలు ఎందుకు చేయాలి ? చేయడం వల్ల ఫలానా ఫలితాలు ఖచ్చితంగా వస్తాయా ? దగ్గరగా ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి, చిలుకూరు బాలాజీకి, తిరుపతి వెంకన్నకు తేడా ఉందా ? ఉంటే ఏమిటి అది ? కోరికలు తీరడానికే, చాలామంది పూజలు, జపాలు చేస్తున్నా, వాటివల్ల అన్ని సందర్భాల లోను వాళ్ళ కోరికలు తీరుతున్నాయా ? శివుడు విష్ణువు , కృష్ణుడు, గణపతి  ఇన్ని రకాల దేవుళ్ళు ఎందుకు ? ఇలాంటి సందేహాలకు అతనికి జవాబులు ఎక్కడా దొరకలేదు.

అసలు భగవంతుడు ఎలా ఉంటాడు ? ఎక్కడ ఉంటాడు ? ఈ ప్రశ్నలు వేధించేవి. ఎవరో చెబితే పరమహంస గాస్పెల్ చదివితే కొంత అర్థం అయింది. నీరు ద్రవం గాను, గడ్డకట్టి మంచు లాగా ఎలాగా ఉండకలదో. అలాగే భగంతుడు ,

ఆకారంతోను, ఆకారం లేకుండా కూడా ఉండవచ్చని కొంత అవగాహన వచ్చినా చాల సందేహాలు తీరలేదు. అతనికి ముఖ్య మయిన ప్రశ్నలు, మనిషి కి,

ప్రపంచానికి, ఎక్కడో ఉన్నాడనుకునే దేముడికి సంబంధం ఏమిటి ? మనిషిని, ప్రపంచాన్ని , దేముడు సృష్టించాడా ? ఇలానే ప్రశ్నలకి జవాబులు వెతుకుతున్నాడు

సత్సంగం నుంచి ఇంటికి వెడుతూ మహర్షి పుస్తకాలలో తనకి జవాబులు దొరుకుతాయా అనుకున్నాడు

******

తరవాత రెండు రోజులు ఆఫీస్ పనిలో బిజీగా ఉన్నా, మరుసటి ఆదివారం లోపులో రెండు పుస్తకాలు చదవడం పూర్తి చేశాడు.

మహర్షి జీవిత చరిత్ర అతనిని చాలా ఆశ్చర్య పరిచింది.

మదురై కి దగ్గరలో ఉన్న తిరుచ్చుళీ అన్న చిన్న గ్రామంలో సుందరం అయ్యర్ అనే ప్రైవేట్ గా ప్రాక్టీసు చేసే ప్లీడర్ గారి ఇంట్లో పుట్టాడు. తల్లితండ్రులు పెట్టిన పేరు వెంకట రామన్.తల్లితండ్రులు ధార్మిక జీవనం గడిపేవాళ్లే  తప్ప పెద్దగా ఆధ్యాత్మిక చింతనలో ఉన్న దాఖలాలు లేవు. తండ్రి అకాల మరణం తో కుటుంబం మదురై లో ఉన్న వెంకట్రామన్ చిన్నాన్న ఇంటికి చేరారు.

అప్పటికి వెంకట్రామన్ వయసు పదహారు సంవత్సరాలు అసలు మరణం అంటే…..  అక్కడ ఒకరోజు అతనికి సడన్ గ మరణ భయం కలిగింది. కానీ అతనికి వెంఠనే మరణం అంటే ఏమిటి ? అన్న ప్రశ్న ఉదయించింది. అప్పుడు ?  ఏమి జరుగుతుంది. శరీరం కదా చనిపోతుంది అని నేల మీద పడుకుని మరణం నాటకీకరణం చేసుకున్నాడు. ఊపిరి బిగపట్టి శవం ఇలాగే కదా ఉండేది అనుకున్నాడు

ఇప్పుడు  ఇలా చలనం లేకుండా శరీరం బిగుసుకు పోతే దానిని  శ్మశానికి తీసుకుపోతారు అంతే  కదా ? కానీ శరీరానికి భిన్నం గా నేను అని నాకు తెలుస్తోంది కదా ? శరీరాన్ని కాలుస్తారు కానీ నన్ను కాల్చలేరు కదా ? నేను అనే భావన శరీరం కంటే వేరు అని ఒక అనిర్వచనీయమయిన  అనుభూతి పొందాడు. ఆ భావనే స్థిరపడిపోయింది. అదే ఆత్మ సాక్షాత్కారమని  అతనికి అప్పటికి తెలియకుండానే అది జరిగింది..దాని తరవాత అతనికి ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి తగ్గిపోయి, చివరికి ఒకరోజు ఇంట్లో చెప్పకుండా బయలుదేరి తిరువణ్ణామలై వచ్చేశారు. ఎవరో ఎవరితోటో ‘అరుణాచలం వెళ్లి వచ్చాను” అన్న మాటలు మనసులో ముద్రపడి, ఇంటి నుంచి బయలుదేరి అరుణాచలం చేరుకున్నాడు. అరుణాచలం ఎలా చేరుకున్నాడు అన్నది పుస్తకం లో చాలా వివరంగా రాశారు.

చేరగానే గర్భగుడిలోకి వెళ్లి ” తండ్రీ నీ ఆజ్ఞ మేరకు వచ్చాను ” అన్నాడు. తాను మదురై నుండి బయలుదేరి ఇక్కడికి రావడం ఈశ్వర సంకల్పం అని అతను గ్రహించాడు. అతను బయటికి  వచ్చి, యజ్ఞోపవీతాన్ని చేతిలో ఉన్న చిన్నడబ్బు మొత్తాన్ని, గుడి ట్యాంక్ లో పడవేశాడు. చిన్న కౌపీనం ధరించి మిగిలిన బట్టలని కూడా అందు లో పడవేసి ఆలయ ప్రాకారం లో ఉన్న మండపం లో కూర్చున్నాడు. ఆ వయసు కుర్రాళ్ళు మర్నాడు స్నానము చేస్తే తువ్వాలు అవీ ఎక్కడి నుంచి వస్తాయి  అని ఆలోచిస్తారు..అన్నవస్త్రాలు గురించి ఏమాత్రం ఆలోచన లేకుండా అతను అన్నీ త్యజించడం, శరణాగతి పరాకాష్ట అని కొందరు విజ్ఞులు అభిప్రాయపడ్డారు.

ఆలయ ప్రాంగణం లోనే ఆత్మ నిష్ఠ లోనే కూర్చుంటే, కొంటె పిల్లలు రాళ్లు విసిరితే, అక్కడే ఉన్న భూ గర్భ లింగం ఉన్న చోటికి దిగి అక్కడే  కూర్చున్నాడు.

శేషాద్రి స్వామి అని ఒక సాధువు ఇతనిని చూసి, అతనికి గుడిలోని ప్రసాదాలని తినిపించే ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత కొంత మంది సాధకులు ఇతని పరిస్థితి చూసి. ఉన్నతమయిన సాధన లో ఉన్నాడని అనుకుని, అతనికి రక్షణ కల్పించి వేరే చోటకి తరలించారు. అలా కొద్దిచోట్ల ఉన్న తరువాత, అరుణాచలం కొండ మీద విరూపాక్ష గుహ అన్న చోటకి మారడం జరిగింది. ఆ గుహ చేరే లోపులో ఇక్కడ ఉన్నాడని ఎవరో చెబితే తల్లి వచ్చి బ్రతిమాలినా చలించలేదు. తల్లి ఎంత బ్రతిమాలినా మాట్లాడక పోయేసరికి, పక్కన వాళ్ళు ఆమె అంత అలా అడుగుతోంటే ఏదో ఒక సమాధానమ్ చెప్పవచ్చు కదా అని ఒక కాగితం పెన్సిల్ అందించారు. వెంకరారామన్ అరుణాచలం వచ్చినప్పటినుండి మౌనం లోనే  ఉన్నాడు. ఎవరో గిచ్చి గిచ్చి అడిగితే వెంకటరామన్,  తిరుచ్చుళీ అని మాత్రం చెబితే, అది తల్లికి చేరి ఆమె వచ్చింది. అక్కడి వాళ్ళు ఇచ్చిన కాగితం మీద ” కర్త వారి వారి ప్రారబ్ద కర్మానుసారం జీవుల నాడించును.

జరగనిది ఎవరెంత యత్నించినను జరగదు.జరుగునది ఎవరెంత  అడ్డుపెట్టినను జరుగును. ఇది సత్యము కనుక మౌనముగా నుండుటయే ఉత్తమం.”

దీనినే మహర్షి మొదటి బోధ గా చెబుతారు.

వెంకట్రామన్ ని యోగ క్షేమాలు చూస్తూ ఒకళ్ళు ఇద్దరు ఉండేవారు. వాళ్ళు. పళని స్వామి అనే ఒకాయన లైబ్రరీ నుంచి వివేక చూడామణి వంటి పుస్తకాలు  తెచ్చి వివరించమని అడిగేవారు. అవి చూసినప్పుడు వెంకట్రామన్ కి తనకి కలిగిన అనుభవమే అందులో వివరించడం జరిగిందని గుర్తించాడు. అందుచేత వాళ్ళకి పుస్తకం నుండి, స్వానుభవం నుండి కూడా వివరించేవాడు. వెంకట రామన్ ని అందరూ బ్రాహ్మణ స్వామి అనేవారు.

*****

**************************************************************