10_005 గురుఃబ్రహ్మ

 

ప్రముఖ సంగీత విద్వాంసులు ఎం‌ఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ గారి గురించి…..

ఆంధ్రులలో కర్ణాటక సంగీత సాంప్రదాయంలో తిరుగులేని స్థానం సంపాదించుకున్న గాన ఘనాపాఠి ఎం. ఎస్. బాలసుబ్రహ్మణ్యశర్మ గారు. వారి స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం, ఆయన చిన్నతనంలో శ్రీ గండవల్లి పైడిస్వామి అనే నాదస్వర విద్వాంసులు వీరి గాన కౌశలాన్ని గమనించి ముగ్ధులై, పిలిచి మరీ సంగీతం నేర్పించారు. సోదేమ్మ, కొండయ్య దంపతులకు జన్మించిన బాలసుబ్రహ్మణ్య శర్మ గారు సంగీతం మీద ఆసక్తిని పెంచుకుని, అలుపెరుగని సాధన ద్వారా మహాగాయకులుగా పేరు తెచ్చుకున్నారు. పది సంవత్సరాల పిన్న వయసులోనే వీరి గాన ప్రతిభ గమనించిన మహాకవులు చెళ్లపిళ్ల వేంకటశాస్త్రిగారు బాలగాయకరత్న అనే బిరుదు ప్రసాదించారు. అదే విధంగా రాజమండ్రి కే చెందిన మహాకవి, గ్రంథకర్త శ్రీ శ్రీపాద కృష్ణమూర్తి గారు శర్మ గారికి ఘంటాకంకణం బహూకరించి ఘంటా కంకణ ప్రౌఢగాయక శిఖామణి బిరుదును బహూకరించారు.

మహాగాయకుడిగా ఎన్నో పురస్కారాలు, బిరుదులు పొందినా కూడా అతి సాధారణమైన జీవన శైలి బాలసుబ్రహ్మణ్య శర్మ గారి ప్రత్యేకత. ఎందరో శిష్యులను, ప్రశిష్యులను తయారు చేసిన శర్మగారు సంగీత సరస్వతికి చేసిన సేవలు విలువ కట్టలేనివి. అంతటి మహాగాయకుడికి రావలసినంత గుర్తింపు రాకపోవడానికి ఆంధ్రుల అలసత్వమే కారణమనిపిస్తుంది. తమిళులను ఆదర్శంగా తీసుకుని గట్టిగా ప్రయత్నిస్తే ఆయనకు ‘ పద్మ ‘ అవార్డు సాధించగలిగితే… అది ఆ మహావిద్వాంసులు ఎం. ఎస్. బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి కాదు…. తెలుగు జాతికే గర్వకారణం.

శ్రీ శర్మ గారి శిష్య బృందం ఏర్పాటు చేసిన ఫేస్ బుక్ గ్రూప్ లింక్ :

https://www.facebook.com/groups/SAMKEERTHANA.TARANGINI/

స్వర్గీయ ఎం. ఎస్. బాలసుబ్రహ్మణ్య శర్మ గారి శిష్యులైన సోదరీమణులైన గాయనీమణులు శ్రీమతి కాళీపట్నం సీతా వసంతలక్ష్మి, శ్రీమతి బుద్ధవరపు సూర్యకుమారి గారు గురువు గారి గురించిన జ్ఞాపకాలను అందించారు. 

గురువుగారికీ దండం పెట్టు ….

శిష్యులను తమ కన్నబిడ్డల్లా భావించి, ఇసుమంత కూడా గర్వం, అహంభావం లేకుండా, శిష్యులు తమని మించిపోతారనే అభద్రతా భావం లేకుండా నేర్పగలిగిన గురువులను పొందిన శిష్యులు కొద్దిమందే ఉంటారని నాకు ఎప్పుడూ అనిపిస్తుంది. 

అలాంటి సద్గురువుగారిని పొందిన నేను చాలా అదృష్టవంతురాలినని అనుకుంటాను.  

శ్రీ ఎం. ఎస్. బాలసుబ్రహ్మణ్య శర్మ గారి దగ్గర సంగీతం నేర్చుకోడానికి మా నాన్నగారు భావరాజు బాపన్న శాస్త్రి గారు రాజమండ్రిలో ఏర్పాటు చేశారు. అప్పటికే శర్మ గారు చాలా పెద్ద గాయకులు. కానీ 14, 11 ఏళ్ళ వయసులో మాకవన్నీ తెలిసి, అర్థం చేసుకునే మేధ లేదు. సాయంత్రం ఆటలాడుకోడానికీ, కబుర్లాడుకోడానికీ లేకుండా ఈ మేష్టారేమిటి రోజూ వచ్చేస్తారు క్రమం తప్పకుండా అని కాస్త కోపం కూడా వస్తూ ఉండేది. 

పీయూసీ చదువుతున్న నాకు కాలేజ్ నించి వచ్చేసరికి, మేష్టారు వీధి గదిలో కుర్చీలో కూర్చుని నాన్నగారితో మాట్లాడుతూ కనిపించేసరికి ప్రాణం ఉస్సురనేది. అప్పుడు మొదలు పెడితే మళ్ళీ ఏడున్నర దాకా కదిలే ప్రసక్తే లేదు. ” బాబుగారూ ! మీ ఇంటికొస్తే నేను పాడక్కర్లేదు, మీ అమ్మాయిలు పాడతారు, మిగతా వాళ్ళ ఇళ్లలో నేను వాళ్లతో కూడా పాడాల్సిందే ! ” అంటూ చమత్కరించేవారు మేష్టారు.  

తాళంలో తప్పులు చేసినందుకు ఫలితంగా ఒకరోజు మేష్టారు నన్నూ, మా చెల్లెలినీ కూర్చోబెట్టి కేవలం ఆదితాళం వేస్తూ ఉండమని, వారు మిగతా ఆరు రకాల తాళాలనూ వేస్తూ చేసిన ప్రక్రియ మమ్మల్నందరినీ అవాక్కయేలా చేసింది. ఎప్పుడైనా ” ఇవాళ టైం లేక సాధన చేయలేదు మాష్టారు ” అంటే మేష్టారు కోప్పడే పధ్ధతి కూడా చాలా తమాషాగా ఉండేది. 

” ఇదిగో సీతా, చిన్నమ్మాయీ (మా చెల్లెలు) మనమంతా కలిసి తపస్సు చేద్దాం. దేవుడు ప్రత్యక్షం అవగానే ‘ ఓ దేవుడా ! మా సీతకీ, చిన్నమ్మాయికీ పాట ప్రాక్టీస్ చేయటానికి రోజులో 24 గంటలు చాలటం లేదు. రేపటినుంచి రోజుకి 26 గంటలు చేసేయి దేవుడా ‘ అని కోరుకుందాం” అంటూ నవ్వేసే వారు. ఆ తరువాత ఎప్పుడూ మేష్టారు వెళ్ళాక ప్రాక్టీస్ చేయకుండా ఉండలేదు, మేష్టారికి సాకులూ చెప్పలేదు. మమ్మల్ని ఎప్పుడూ కోప్పడేవారు కాదు. 

వారి దగ్గర శిష్యరికం చేసింది రెండేళ్లే అయినా, నాకెంతో నేర్పారు. కచ్చేరీ చేసే విధానం, దానికై ఒక ప్రణాళిక తయారుచేసుకోవడం, సమయంలో దానిని పూర్తి చేయటం, పుస్తకం చూడకుండా పాడటం, స్వరకల్పన కంఠస్తం కాకుండా మనోధర్మ పద్ధతిలో పాడటం ఇలా ఎన్నెన్నో.  

ఆల్ ఇండియా రేడియో పోటీలు విశాఖపట్నం, విజయవాడ, నర్సాపురం ఇంకా ఎన్నో చోట్ల పోటీలలో పాల్గొని బహుమతులు సంపాదించినప్పుడు కూడా గర్వంతో విర్రవీగనిచ్చేవారు కాదు. ఒకసారి మెచ్చుకున్నాక మరి మళ్ళీ గుర్తు కూడా పెట్టుకోకుండా, మరుసటి స్థాయికి ఎదిగే ప్రయత్నం లో నిమగ్నం చేసేవారు. కచ్చేరీలలో మేము పాడుతూంటే ఎదురుగా కూర్చుని అన్ని సంగతులూ సరిగా వేసేమో లేదో గమనించేవారు. 

నా పెళ్ళి రెసెప్షన్ కి గురువు గారి కచ్చేరీ అయినాక, వారి కోరిక మేరకు మా నాన్నగారు నా చేత కూడా ఒక గంట పాడించేరు. 

1967 సెప్టెంబర్ లో నేను లండన్ వెళ్ళిపోతున్నానని తెలుసుకున్నప్పుడు సైకిల్ మీద వెళ్ళిపోతూ, ” సీతా, సీతా….” అనుకుంటూ వెళ్ళిపోవటం నేనిప్పటికీ మరిచిపోలేను. ఆఖరుసారిగా 1970 లో విజయవాడలో కలిసినప్పుడు, నా పాట విని, ” ఎలక్ట్రిక్ పిండిమరలా తిరిగేది నీ గొంతు, ఇప్పుడు తిరగలిలా ఉంది” అని వేళాకోళంగా, ప్రాక్టీస్ చేయటం మానవద్దని గుర్తుచేశారు. 

ఈ సరదా మాటలు ప్రక్కన పెడితే, ఎప్పుడూ మమ్మల్ని మర్యాదగా, గౌరవంగా చూసుకుంటూ పాట నేర్పిన మంచి గురువుగారు శ్రీ సుబ్రహ్మణ్య శర్మగారు. వారి పాదాలకు శతకోటి వందనాలు. 

ఒక గొప్ప విషయం నేడిక్కడ చెప్పాల్సిందే. ఆల్ ఇండియా రేడియో పోటీలలో 1965 లో శ్రీ కె.వీ. బ్రహ్మానందం గారు ( మా గురువుగారి ప్రియ శిష్యులు ) కర్ణాటక ఉపశాస్త్రీయ సంగీతం లో రాష్ట్రపతి పురస్కారాన్ని గెలుచుకుంటే, 1966 లో అదే శ్రేణిలో నేను కూడా రాష్ట్రపతి పురస్కారాన్ని గెలుచుకున్నాను. మాస్టారి శిక్షణకు ఇది నేను అందించగల ధ్రువీకరణ. 

గురువుగారికి దండం పెట్టూ ….. 

— కాళీపట్నం సీతా వసంత లక్ష్మి

 

*******************************************

మా గురువుగారి తో నాకున్న అనుబంధాన్ని మీ అందరి తోటి పంచుకోవాలని అనిపించి రాస్తున్నాను.
రాజమండ్రి  ఆర్ట్స్ కాలేజిలో చదువుతున్నప్పుడు మా అక్క శ్రీమతి కాళీపట్నం సీతా వసంతలక్ష్మి( భావరాజు) యూత్ ఫెస్టివల్ కి ఆంధ్రా యూనివర్సిటీ నించి కర్నాటక సంగీతం పాడటానికి ఎంపిక అయింది. ఆమెకు మంచి
శిక్షణ ఇప్పించాలని మా నాన్నగారు శ్రీ భావరాజు బాపన్న శాస్త్రి గారు శ్రీ బాలసుబ్రహ్మణ్య శర్మ గారిని కోరారు. ఆయన అంగీకరించి మా యింటికి మా మాష్టారుగా వచ్చారు. ఓ రెండురోజుల తరువాత అక్కడే ఉన్న నన్ను పిలిచి పాడమన్నారు. నాకు వచ్చిన కృతి పాడగానే ’ రేపటినించి నువ్వూ సీత తో కలిసి పాట నేర్చుకుంటున్నావు’ అని చెప్పారు. అలా మొదలైంది మా గురు శిష్య అనుబంధం.

అప్పటిలో మేము చాలా చిన్నపిల్లలం. ఆయన విద్వత్తుని కాని, ఆయన గొప్పతనాన్ని గాని అంచనా వేసే వయస్సు కాదు. క్రమం తప్పకుండా సమయాన్ని పాటిస్తూ వచ్చే ఆయన్ని చూస్తే అప్పుడప్పుడు విసుగు వేసేది. కానీ ఆయన ఓపికగా మమ్మల్ని బుజ్జగిస్తూ సంగీతం నేర్పారు. “ చిన్న అమ్మాయీ ” అని నన్ను
ప్రేమగా పిలిచేవారు. అక్కతో సరిసమానంగా సంగీతం నేర్పారు. కొద్ది రోజులలోనే మా కుటుంబంలో ఒక ముఖ్య వ్యక్తిగా అయ్యారు.
అక్కకి కాకినాడ లో కచ్చేరి ఉన్నప్పుడు “ మీరు ఎదురుగా ఉంటే నాకు భయం మాష్టారు గారూ ” అంటే స్థంబం వెనకాతలగా కూర్చున్న గురువుగారు ఆయన. ఎక్కడ మేము కచ్చేరి చేసినా ఆయన తప్పకుండా సభలో కూర్ర్చుని మమ్మల్ని ప్రోత్సహించారు. మరుసటి రోజు మా తప్పులు వివరించి చూపించేవారు కూడా. అటువంటి
గురువుగారి వద్ద  సంగీతం నేర్చుకునే అదృష్టం నాకు కలిగింది.
ఆయన కచ్చెరీల కోసం తయారుచేసుకున్న కృతులు మాకు నేర్పి పాడించేవారు. ఆయన సాధన మా యింట్లోనే జరిగేదంటే అతిశయోక్తి కాదేమో ! గురువును మించిన శిష్యులు ఉండాలనే అనుకునేవారు ఆయన. ఇది ఆయన శిష్యులు చేసుకున్న పుణ్యం.
ఏ కొత్త కృతిని స్వరపరచినా మాకు నేర్పేవారు. ఆయనకు తనకు వచ్చిన విద్యను దాచుకోకుండా నేర్పే పెద్ద మనసు ఉన్నది. ఆయన పాదాలకు శతకోటి వందనాలు.

— సూర్యకుమారి బుద్ధవరపు ( భావరాజు )

సంగీత సామ్రాట్ ఎం. ఎస్. బాలసుబ్రహ్మణ్య శర్మ గారి భక్తిరంజని గానం వినండి…..