10_005 కూచిపూడి ‘ శోభ ‘

 

 

జయంతితే సుకృతినో

రససిద్ధ కవీశ్వరా

నాస్థియేశాం యశఃకాయేన జరామరనజం భయం।।

 

దివినుండి దిగి వచ్చిన అప్సర అనే మాటతో ఆమె పేరు నేను మొదటిసారి మా నాన్నగారి ద్వారా విన్నాను.

వృత్తిరీత్య కరీంనగర్ నుండి తొలిసారి హైదరాబాద్‍లో నివసించడానికి వచ్చిన మా నాన్నగారికి ఒక ఫ్రెండ్‌ ద్వారా రవీంధ్రభారతిలో కూచిపూడి నృత్యం ప్రోగ్రామ్ పాసులు వచ్చాయి. అప్పట్లో magazine లో అచ్చయ్యే ఫోటోలు తప్ప లైవ్‌లో డాన్స్ ప్రోగామ్స్ చూడటం చాలా కష్టం.

కానీ, హైదరాబాద్ శివార్లలోని రామచంద్రపురం నుండి నగరం నడిబొడ్డన వున్న రవీంధ్రభారతికి ఆరు గంటలకు చేరుకోవడం కొత్తగా వుద్యోగంలో చేరిన నాన్న వల్ల కాలేదు. అలా ఆ ప్రోగ్రామ్ మిస్సయ్యారు.

తర్వాత చాలాకాలానికి ఆవిడ ప్రోగ్రామ్ ని చూడగలిగారట.

ఆ దేవకన్యే శోభానాయుడు.

సినిమాల్లో వైజయంతిమాల, భానుమతిగారిని చూసి నాకు నాట్యం నేర్పించాలని మా అమ్మ ఉవ్విళ్ళూరి కరీంనగర్ లో వుంటున్నప్పుడు మంకమ్మతోటకు కాస్త దూరంలోని వేణుగోపాలస్వామి కోవెలలో డాన్స్ నేర్పిస్తున్నారని తెల్సుకుని నన్ను అక్కడ జాయిన్‌ చేసి రోజూ క్లాస్‌కి తీసుకెళ్ళేది.

ఆ తర్వాత శోభానాయుడు గారి గురించి విని మా అమ్మాయి కూడా అంత అవ్వాలి అని మురిసిపోయేది. తర్వాత వైజాగ్‌ ట్రావ్ఫర్‌ అయింది. ఏడేళ్ళకే నా అరంగేట్రం అయ్యాక వెంపటి చినసత్యంగారు డాన్న్ స్కూల్‌ పెడుతున్నారట, అమ్మాయిని అక్కడ చేరుద్దామా అని నాన్న అంటే… ఆయనెవరు అన్న ప్రశ్నకు శోభానాయుడు గారి గురువు అని నాన్న చెప్పడం నాకింకా గుర్తు.

అలా కూచిపూడి కళాక్షేత్రలో ఐదేళ్ళ శిక్షణ తర్వాత నాన్నకు తిరిగి హైదరాబాద్‍కి ట్రాన్స్ఫర్‌ అవడం నన్ను శోభానాయుడు గారి దగ్గర జాయిన్‌ చెయ్యడానికి తీసుకు రావడం వెనుక మా అమ్మ నాన్నల తపన కృషి వర్ణించలేనివి.

మొదటిసారి శోభానాయుడు గారిని కలిసినప్పుడు ఆయన ఆనందం నాకింకా గుర్తు.

మహామహోపాద్యాయ నూకల చినసత్య నారాయణ గారి దగ్గర గాత్రం శిష్యరికం చేసిన మా నాన్నగారికి శోభానాయుడు గారి ట్రూప్‌లోని నట్టవనార్‌ మహాంకాళి మోహన్‌ గారితో చాలా పరిచయం.

నన్ను ఆర్ట్ అకాడమి లో జాయిన్‌చేసి తిరిగి వస్తున్నప్పుడు ఈ విషయాలన్నీ నాన్న నాతో పంచుకున్నారు.

నా MA dance అప్పుడు, ఆ తర్వాత జర్నలిస్ట్ గా నా వృత్తి రీత్యా కలిసిన ప్రతిసారీ ఎన్నో కొత్త విషయాలు చెప్పేవారు. చాలాసార్లు తానెలా ఈ నృత్యాన్ని అభ్యసించి స్థిరపడ్డారో వివరించారు శోభానాయుడు గారు.

1956 లో అనకాపల్లి లో పుట్టిన శోభ గారు ఎస్.ఇ. గా పనిచేస్తున్న వెంకట నాయుడు గారి కుమార్తె. వృత్తిరీత్యా రాజమండ్రికి బదిలీ అయ్యాక అక్కడే పెరిగి, తల్లి సరోజమ్మ గారి ప్రొత్సాహంతో పి. ఎల్. రెడ్డి గారి దగ్గర కూచిపూడి నాట్యం నేర్చుకున్నారు.

కుమార్తె లోని నాట్యకౌశలం గ్రహించిన తల్లి 9 వ తరగతి లో ఉండగా మద్రాస్ లో వెంపటి చిన సత్యం గారి దగ్గర  శిక్షణ ఇప్పించడం కోసం వెళ్ళారు. 11 ఏళ్ళు మద్రాస్ లో చిన్న ఇంట్లో ఉండి ఎన్నో కష్టాలుపడి తన కూతుర్ని ఈ స్థాయికి తీసుకువచ్చారు… అభినయం బాలసరస్వతి, నృత్తంలో పద్మాసుబ్రహ్మణ్యం అంత అవ్వాలని ప్రతిరోజూ తపించి, దానికి తగినట్లు సాధన చేసానని చెప్పేటప్పుడు ఆమె కళ్ళలో ఆనందం తొణికిసలాడేది.

500 ఏళ్ళుగా ఈ కూచిపూడి నృత్యం కేవలం పురుష ప్రాథాన్యతలో ఉన్నది. కూచిపూడి కి మాత్రమే పరిమితమైన ఈ కూచిపూడి భాగవతుల కుటుంబాలకు మాత్రమే పరిమితమైపోయిన ఈ నాట్యాన్ని ప్రపంచ వ్యాప్తి చెందించడానికి వెంపటి చినసత్యంగారు చేసిన యజ్ఞంలో శోభానాయుడు కూడా అహర్నిశలు శ్రమించారనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు.

ఒకప్పుడు నాట్యాచార్యులందరూ పురుషులే ! ఇప్పుడు మహిళా నాట్యాచార్యులు ఉన్నారంటే అది శోభానాయుడు, యామినీ కృష్ణమూర్తి వంటి వారి పుణ్యమే !

ఆమె విశ్రాంతిగా వుంటున్న సమయంలో 2017 ప్రారంభంలో ఒకరోజు ఫోన్‌ చేసి నన్ను రమ్మని పిలిచారు. వెళ్ళిన నాతో గొప్ప విషయం పంచుకున్నారు. తన జీవనయానాన్ని, నృత్యానికి తానెలా అంకితమైనదో మొత్తం ఒక డాక్యుమెంటరీ గా రూపొందించాలనే కోరిక చెప్పారు. దానికి కావలిసిన ప్రణాళిక రూపొందించమన్నారు. కొన్ని రోజులపాటు డిస్కషన్‌ కూడా చేసాము. కానీ ఎందువల్లనో అది అంతకు మించి ముందుకెళ్ళలేదు. ఇవాళ అది గుర్తొచ్చి గుండె మెలేసినట్లవుతోంది. ఆ ప్రణాళిక కార్యరూపం దాల్చి వుంటే భావితరాలకు ఒక ఖనిగా నిక్షిప్తమైవుండేదని నా మనసు రోదిస్తోంది.

దేశ విదేశాలలో ఎన్నో ప్రదర్శనలిచ్చి ఎందరినో ఇన్స్పైర్ చేసి శిష్యులు గా తీర్చిదిద్దారు. ఎక్కువగా రష్యన్లు, అమెరికన్లు బాగా తర్ఫీదు పొంది విదేశాలలో కూడా డాన్స్ స్కూల్స్ ప్రారంభించి కూచిపూడి ని ప్రపంచవ్యాప్తం చెయ్యడం నిజంగా తన గురువులకు ఆమె ఇచ్చిన నిజమైన నివాళి.

 

పిల్లలకి డాన్స్ నేర్పించడానికి ఒక ఇన్స్పిరేషన్‌ శోభానాయుడు గారు. చాలామంది తల్లితండ్రులు తమబిడ్డ అంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని లోలోన కోరుకుంటారు.

నాట్యమైన కూచిపూడిని దశదిశల ఆకాశగంగలా ప్రవహింపజేయడానికి కూచిపూడి పట్ల భగీరథుడైన మహాగురువు వెంపటి చినసత్యం మాస్టర్‌ గారికి నటరాజ ఝటాఝూటం నుండి దూకిపడిన గంగ లా దొరికారు శోభానాయుడు.

అలాంటి విదుషీమణి తెలుగు వారి ఆత్మగౌరవాన్ని తన నాట్యంద్వారా సుస్థిరం చేసారు. మన మనస్సుల్లో ఆమె స్థానాన్ని పదిలం చేసుకున శివైక్యం చెందారు. కళలకు కళాకారులకు వృద్ధాప్యం, మరణం వుండవు అనే భర్తృహరి వాక్యాన్ని నిజం చేసారు.

**************************************************