10_005 నాదాభిజ్ఞత

                                       

                                                              మొదటి కెరటం                                                              

” తోడి రాగం ” – కలవరపడిన మనసుకి శాంతినిస్తుంది, ” కళ్యాణి రాగం ” దిగులు పోగొట్టి ఉత్సాహానిస్తుంది, ” శహానా రాగం ” తోటివారి పట్ల దయాభావాన్నిస్తుంది, ” సావేరి రాగం ” సానుభూతి గుణం పెంచుతుంది, ” హంసధ్వని రాగం ” రుగ్మత ని పోగొట్టి శౌర్యాన్నిస్తుంది, ” మోహన” మబ్బులు పోగొట్టి సాంద్ర భావం పెంచుతుంది.

మనసు నిలిపితే శుద్ధ రిషభం అంతరంగ శుద్ధి కలిగిస్తుంది, ఆధార షడ్జమం దార్ధ్యాన్నిస్తుంది. ఆహారం విషయంలో జాగరూకత, తగినంత నీరు, నిషేధాలు పాటించటం, నియమాలు అనుసరించటం, ఆలోచనలని అదుపులో పెట్టుకోవటం, ఏకాగ్రత, సౌందర్య భావన కలిగి ఉండటం కావాలి. అనుసరణే కానీ అనుకరణ పనికిరాదని తెలియటం ముఖ్యం. క్రమశిక్షణలో శ్రద్ధ, నిత్యం సాధన అవసరం ” –

అవును ప్రతీచీ ! ఆ మాటలు లోతైనవి చాలావరకు నిజం. రహస్యం లోతు తెలిస్తే. జీవస్వరం ఏదో, దాని స్వరూపం ఏమిటో తెలిసి పాడితే ! మన సంగీతంలో ఉన్న రాగాల సంఖ్య  తీసుకుని ఏదెలా పనిచేస్తుందో పరిశోధన చెయ్యవలసిన కాలం వచ్చింది. ప్రతీచీ ! ఎన్నో బోధించారు నీకు నీ గురువులు. శృతి, స్వరం, స్థాయి, గమకం, లయ, తాళం, రాగం, గానం ఎన్నెన్నో విన్నావు. పాటలు పాడుతున్నావు. ఎన్నెన్నో అనుభూతులు, ఆనందాలు, తన్మయ భావాలు! అవునా ? ఈ రోజు భూగోళాన్ని మొత్తంగా ఊపేస్తున్న ‘ ఆ శక్తిని ‘  ప్రతిఘటించగలదా మనం అనుకుంటున్న నాదం ? ఇదేగా నీ ప్రశ్న ! నీకు నీ గురువులు అందించిన విషయం నా దగ్గరకు తెచ్చావు వివరించమని ! 

మనసు శృతి చేసుకుని శ్రద్ధగా విను. అంటే నీ మనసు వినాలి, కంఠం ప్రకటించాలి. 

భయం, ఉద్వేగం, చింత, దుఃఖం, ఇంకా ఎన్నెన్నో భావాలు, విభావాలు, అనుభవాలు వెంట వస్తున్నాయి ఈరోజు.. అనారోగ్యాన్నీ వ్యాధినీ అరికట్టాలని గబా గబా మందులు గుమ్మరించుకుంటున్నాం. అవి మనం చేసుకున్నావవే కదా. ధైర్యం చాలక, నమ్మకం కుదరక దిక్కులు  చూస్తున్నాం. మన ఆరోగ్యాన్నీ, మానసిక ఒత్తిళ్ళనీ మనం నేర్చుకున్న సంగీతం సరిచేస్తుందని నేర్చుకున్నాం. మొట్టమొదట తెలుసుకోవలసినది – నాదం సంగీతం ఒకటేనా ? నాదయోగం, స్వరయోగం, గానం ఒకటేనా ?

భరతుడు, పతంజలి ఒకే విషయం గురించి చెప్పారా ? ” ఆహత నాదం”, ” అనాహత నాదం ” ఏమిటివి ? భారతీయమైన భావన కి అందే విషయం ఒకటుంది. నాదం విషయం లో ‘ ఆత్మ విమర్శన ‘ ఎక్కువగా ఉండాలి. నాదాన్ని ఉపాసించటం అంటే తెలియాలి. నాదం శరీరానికి ఆవల, లోపల కూడా ఉంది. శరీరం ఒక ఘటం, శరీరం లోపల ఘటాకాశం, శరీరం బయట బాహిరాకాశం. ప్రతీ శబ్దం ఒక కాంతి పుంజం. కాంతి తో పాటు నాదం కూడా ఆకాశతత్త్వమే. శబ్దగుణకమాకాశం అని కదా శాస్త్రం! అందువలన నాదానికీ, కాంతికీ అవినాభావ సంబంధం ఉంది. మనం చేసే ప్రతీ శబ్దం మన లోపల బయటా కూడా సంయమనాన్ని ప్రభావితం చేస్తాయి. ప్రతీ కాంతి శకలానికీ, నాద శకలానికీ విశేషమైన చికిత్సా శక్తి ఉంది. అందువలన జాగ్రత్త చాలా అవసరం. అయితే సంగీతానికీ, నాదానికీ ఉన్న సంబంధం ఏమిటి ? రోజు ప్రపంచాన్ని భయావహం చేస్తున్న స్థితి నుండి ఊరట కలిగించగలవా నాదాక్షారాలు. మన చుట్టూ ఉన్న నాదం, మన లో నుండి వినిర్గతమయ్యే నాదం, వీటి మధ్య మనం దోషాలు ఎక్కడున్నా ఫలితాలు పల్చన అని అందరికీ తెలిసినదే. నాదం లో కూడా అంతే. మనలో నాదం – ప్రాణం వాయువు ‘ అగ్ని ‘ సంయోగం వలన పుడుతోంది. ప్రాణం, ధర్మం, స్పందన. స్పందన ఉన్నచోట నాదం తప్పదు. మనకి వినబడచ్చు… వినబడక పోవచ్చు, తెలియవచ్చు… తెలియక పోవచ్చు. ఒక్కొక్క అడుగే వేద్దాం. ఒక్కొక్క కెరటాన్నీ ఒడ్డు చేరనిద్దాం. దీర్ఘంగా పరిశీలిద్దాం !  

**********************************************