అద్భుత సహజ నటీమణి సూర్యకాంతం గురించి ఒక చిన్నపాటి పరిచయం రాయాలనుకున్నప్పుడు శీర్షిక పేరు ఏమి పెట్టాలా అని ఆలోచిస్తే – నేను కొత్తగా పెట్టేదేవిటి, 1962లో అతిరథ మహారథులు నాగిరెడ్డి – చక్రపాణిల జంట చేసిన తిరుగులేని నామకరణం స్ఫురణకు వచ్చింది. అంతకన్నా సరైన పేరు లేదనే నమ్మకం గట్టిపడి ధైర్యం చేసి అదే పేరు ఈ చిన్న వ్యాసానికి పెట్టుకున్నాను !
తూర్పు గోదావరి జిల్లా కాకినాడ దగ్గర వెంకటరాయపురంలో, 1934 అక్టోబర్ 28 నాడు నియోగి బ్రాహ్మణ కుటుంబంలో శ్రీ పొన్నాడ వెంకట రత్నమ్మ – అనంతరామయ్య దంపతులకు పదునాలుగవ సంతానంగా సూర్యకాంతం జన్మించారు. ఆరవ ఏటి నుంచే సంగీత, నాట్యం నేర్చుకుంటూ కళాభిరుచి వ్యక్తంచేస్తూ పెరిగి సూర్యకాంతం కాకినాడలో రంగస్థల నటిగా నటనా జీవితానికి అంకురార్పణ గావించారు. హిందీ తారలు అశోక్ కుమార్, లీలాచిట్నీస్ ల వీరాభిమాని అయిన సూర్యకాంతం మొదటి నుంచీ హిందీ చిత్రరంగంలో ప్రవేశించి పేరు తెచ్చుకోవాలని ఉబలాటపడ్డారు. లీలా చిట్నిస్ సినీ గీతాలను, హావభావాలతో అభినయించటంలో ఆమె ఆ రోజుల్లో దిట్ట. ఆ కాలంలో మద్రాస్ లోని జెమిని స్టూడియోలో హిందీ చిత్రాల షూటింగులు జరిగేవి. డాన్స్ ఆర్టిస్ట్ గా నెలకు 65 రూపాయల జీతంతో వారు చేరమంటే, వారితో వాదించి, 75 రూపాయల జీతానికి ఒప్పించి చేరారు సూర్యకాంతం.
‘ చంద్రలేఖ ’ లో బృందనృత్యంతో తెరపై మొదటిసారి మెరిసిన సూర్యకాంతం ఎన్ని రోజులు గడిచినా బృందగానాల పాత్రలు తప్ప వేరేవి రాకపోవటంతో విసుగు చెందారు. తాపీ ధర్మారావు, పి. పుల్లయ్యగార్లు ఆమె ఆసక్తిని గమనించి తెలుగు చిత్రాలలో చిరు పాత్రలలో నటించమని కోరినా ఆమె హిందీ చిత్రాలు తప్ప చేయనని ఖండితంగా చెప్పారు. అయితే ఆ పట్టు వదలని విక్రమార్కులు ఆమెను ఒప్పించి ‘ నారద నారది ’ లో ఒక చిన్న వేషం వేయించారు. ఆమె మాత్రం ఆ పాత్రతో తృప్తి చెందలేదు. జెమిని వారి కోరస్ పాత్రలతో వేసారి ఆమె జెమిని స్టూడియో నుండి బయటికి వచ్చేశారు. బొంబాయి హిందీ చిత్ర పరిశ్రమలో అవకాశాల కోసం ప్రయత్నించాలని ఎంత కోరికగా ఉన్నా ఆమె ఆర్థిక స్థితి అందుకు సహకరించక ఊరుకున్నారు. 1949 లో ‘ ధర్మాంగద ’ లో మూగపాత్ర పోషించారు. అందులో గుర్తింపుతో పాటు ‘ సౌదామిని ’ చిత్రంలో నాయిక వేషం తలుపు తట్టింది. విధి వక్రించి అదే సమయంలో కారు ప్రమాదంలో ముఖం మీద గాయాలు ఏర్పడి ఆ చిత్రాన్ని వదులుకోవలసి వచ్చింది.
ఆ మలుపే ‘ సంసారం ’ ( 1980 ) అనే చిత్రంలో తెలుగు తెరపై మొదటిసారిగా గయ్యాళి పాత్రను సూర్యకాంతం ముద్రతో ఆవిష్కరించారు. ‘ కోడరికం ’ అనే తదుపరి చిత్రంలో తిరుగులేని నటనతో అత్తగారి పాత్రలో జీవించి సూర్యకాంతం తనదైన ‘ బ్రాండ్ ’ ను, తెలుగు సాంఘిక చిత్రాలపై శాశ్వతంగా ముద్రించారు !!
తెలుగులో టపాకాయల చిటపట వెలుగులు చిమ్ముతుండగా, చిరకాల స్వప్నం – హిందీ చిత్రంలో నాయిక పాత్ర ఎదురొచ్చి తలుపు తట్టింది. అయితే ఒప్పుకున్న కొద్ది రోజుల్లోనే ఆ పాత్ర ఇదివరకే ఒకరితో చిత్రించి ఆ నటిని సినిమా నుండి తొలగించారని తెలిసి, ఆమెలో మానవత్వం అలాంటి అవకాశం పట్ల విముఖత చూపింది.
‘ ఒకరిని బాధ పెట్టి సంతోషంగా ఉండటం నా వల్ల కాదు ’ అని తేల్చి చెప్పి ఆ పాత్రను వదులుకున్నారు.
ఈ ఒక్క ఉదంతం చాలు – ఇతరుల కలల సమాధులపై తమ ఆశల మేడలు నిర్మించుకునే వారందరికీ గుర్తుండిపోయే గుణపాఠం !
చిత్రాలూ…. ‘ విజయ ’ పరంపరలూ !
ఇక ‘ చిరంజీవులు ’ ( 1950 ), ‘ చక్రపాణి ’ ( 1954 ), ‘ దొంగరాముడు ’ ( 1955 ), ‘ తోడికోడళ్ళు ’ ( 1955 ), అత్తా ఒకింటి కోడలే ’ ( 1958 ), ‘ ఇల్లరికం ’ ( 1959 ), ‘ భార్యాభర్తలు ’ ( 1961 ), ‘ గుండమ్మ కథ ’, ‘ కులగోత్రాలు ’ ( 1962 ), ‘ దాగుడు మూతలు ’ ( 1964 ) మొదలైనవి ఆమెకు పేరుప్రఖ్యాతులు తెచ్చిపెట్టిన చిత్రాలలో కొన్ని మాత్రమే !
హావభావాలలో హాస్యాన్ని, వెటకారాన్ని – చేష్టలలో ఏహ్యన్నీ, కోపాన్నీ ఒక్కసారిగా ప్రదర్శించగల ప్రజ్ఞావంతురాలు సూర్యకాంతం. నాటి మేటి నటులు, నటీమణుల సరసన ఏ విధంగానూ తీసిపోకుండా తనకంటూ ఒక ప్రత్యేక ఉనికిని ఏర్పరుచుకున్న ధాటీ ఆవిడది !
ప్రముఖ తారలకున్నట్లే ఆమెకు కూడా లెక్కకు మించిన అభిమానుల ప్రోత్సాహం, ప్రేమా లభించాయి. 60వ దశకంలో అద్భుతంగా విజయవంతమైన చిత్రాలలో నటించిన సూర్యకాంతం విజయావారి ఆస్థాన నటిగా పేరు పొందారు. ‘ తోడికోడళ్ళు ’ తరువాత అన్నపూర్ణవారి అదరణకు నోచుకున్నారు. భానుమతి గారి భరణి సంస్థ ఏ చిత్రం తీసినా అందులో సూర్యకాంతం ఉండవలసిందే !
అందరూ అసమాన ప్రజ్ఞావంతులతో నిర్మించిన చిత్రం ‘ గుండమ్మ కథ ’ లో ఒక కారెక్టర్ ఆర్టిస్ట్ పేరు మీద చిత్రం నామకరణం జరగటం ఆ రోజుల్లో సంచలన వార్త అయ్యింది. అందరూ వద్దన్నారు, అపహసించారు. కానీ, నాగిరెడ్డి – చక్రపాణి జంట తమ నిర్ణయానికి కట్టుబడి ఆ పేరుతోనే చిత్రాన్ని విడుదల చేశారు. ‘ విజయ ’ ఢంకా మోగించారు ! నిజానికి వారు సూర్యకాంతం లేకుండా చిత్రం తీయడానికి ఇచ్చగించేవారే కాదట ! ఆమె నటనా కౌశలం మీద వారికి అంత అభిమానమూ, గురీ !
సూర్యకాంతం తమ నటనా ప్రస్థానంలో 750కి పైగా చిత్రాలకు ప్రాణం పోశారు. అందులో 50 దాకా తమిళము, ‘ బహుత్ దిన్ హుయే ’, ‘ బాలనాగమ్మ ’, ‘ దో దుల్హనే ’ అనే మూడు హిందీ చిత్రాలున్నాయి.
వ్యక్తిగా సూర్యకాంతం
నిజజీవితంలో ఎంతో సున్నితమైన భావాలు, సుతిమెత్తని మనసుగల మానవి సూర్యకాంతం ! ఎవరు బాధలో ఉన్నా తట్టుకోలేక తనకు మించిన, తలకు మించిన సాయం చేసేవారని గొప్ప పేరు. నిజాయితీ, ఆత్మస్థైర్యం కల ఉజ్జ్వలమైన వ్యక్తిత్వం ఆమెది. అతితెలివిగా పారితోషికాలు తగ్గించి, ఎగవేసే నిర్మాతల దగ్గర ఖరాఖండిగా ప్రతి పైసా వసూలు చేసేవారు. అయితే ఎవరు కష్టంలో ఉన్నారని తెలిసినా తన వద్దనున్న ఆఖరి పైసా వరకు వారికి సాయం చేసే ఉదాత్తురాలిగా నిలిచిపోయారు. ఎప్పుడూ నవ్వుతూ, సంతోషంగా నలుగురిలో నడయాడే సూర్యకాంతం తన పరిసరాలను హాస్యాలతో, నవ్వులతో చైతన్యవంతం చేసేవారు.
ఒకరికి పెట్టి వారు తింటుంటే చూసి సంతోషించే బంగారు మనసు ఆమెది ! ఆమె భోజన ప్రియత్వం అందరికీ తెలిసిందే ! ప్రత్యేకించి తీపి వంటకాలంటే ఆమెకు ప్రాణం ! షూటింగుకి వెళ్ళేటప్పుడు ఇంటి నుండి పెద్ద కారియర్ నిండా రకరకాల వంటలు స్వయంగా చేసి సర్దుకుని తీసుకు వెళ్ళేవారు. అందరికీ కొసరి కొసరి వడ్డించి, వారు తింటుంటే చూసి, తృప్తి పడేవారు. ఆమె వంటలలో చెప్పుకోదగ్గ వంటకం పులిహోర ! షూటింగు ముగిసే ఆఖరు రోజున యూనిట్ లోని చిన్నా పెద్దా సభ్యులకు తనకు తోచిన వస్తువు కానుక చేసి చిన్నపిల్లలా సంబర పడేవారు !!
బాపు – రమణలు ‘ బుద్ధిమంతుడు ’ చిత్రాన్ని నిర్మిస్తున్నప్పుడు వారిపట్ల ప్రోత్సాహంతో ఉచితంగా నటించారు. అది గుర్తుంచుకుని వారు ‘ బాలరాజు కథ ’ లో ఆమెకు ముఖ్యపాత్ర నిచ్చారు. పిల్లలు లేని సూర్యకాంతం కొందరు అనాధ పిల్లలను చేరదీసి పెంచేవారు. వారందరికీ ఆ చిత్రంలో చోటు కల్పించారు బాపు – రమణలు. ‘ అందాల రాముడు ’ నిర్మించినప్పుడు ఆమెకు ‘ అట్ల సావాలమ్మ ’ పాత్ర ఇచ్చారు. ఆ పాత్రకు ఆమె ప్రాణప్రతిష్ట చేశారు.
వితరణశీలి, పరోపకారి సూర్యకాంతం !
– ఆమె ఆంధ్రప్రదేశ్ రంగస్థల కళాకారుల సంస్థకు విధిగా ప్రతి ఏటా విరాళాలు ఇచ్చేవారు.
– గ్రంథాలయాలకు, వికలాంగుల సంస్థలకు, విద్యాలయాలకు లెక్కకు మించిన విరాళాలు ఇచ్చేవారు.
– దివిసీమ వరద ముంపుకు గురైనప్పుడు ఎంతో అంకిత భావంతో విరాళాలు సేకరించారు. నిధుల కోసం నిర్వహించే కార్యక్రమాలలో ఉచితంగా పాల్గొనేవారు.
– అన్నింటికంటే చెప్పుకోదగ్గ పరోపకారం – అవివేకంతో, అనాలోచితంగా మోసగాళ్ళ వలలో ఇరుక్కుని సినీరంగంలో తారలు కావాలని మద్రాసు చేరే అమాయకులైన అమ్మాయిలను, గట్టిగా చీవాట్లు పెట్టి, వారికి మంచి బుద్ధులు మప్పి, తమ ఇళ్లకు వెడలనంపేది ‘ గయ్యాళి సూర్యకాంతం ! ’. ఇది మామూలు సేవ కాదు ! లేత జీవితాలను చితికి పోకుండా కాపాడిన మహోత్తర సేవ !! ఒప్పుకుంటారు కదూ !!!
శ్రీ పెద్దిభొట్ల చలపతిరావు ఈమె జీవన సహచరులు, మద్రాస్ లో పేరు పొందిన పబ్లిక్ ప్రాసిక్యూటర్.
తెలుగు సినీరంగంలో ఇలాంటి నటి మరి లేరు. ఆమె నిష్క్రమణ శూన్యం చేసిన స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరు !
బాలకృష్ణ తదితర నటులు ‘ గుండమ్మ కథ ’ ను పునర్నిర్మించాలని అనుకుని సూర్యకాంతం పాత్ర ఎవరూ పోషించలేరని బెంగతో తటపటాయించారు. కొరివికారంలా చురుక్కున గుచ్చుకుని మండే పదునైన మాట, ఎడమచేతివాటంతో చూపించే నిక్కచ్చిదనం, వెటకారపు మూతి విరుపు… ఎన్నివందల పాత్రలలో చూచినా, విసుగు పుట్టించవు.
ప్రతిసారీ ‘ ఒరిజినల్ ’ గా మెప్పించే నటనను పండించటం ఒక్క సూర్యకాంతానికే చెల్లింది !
కేవలం హావభావాలతో క్షణంలో పాత్ర మనస్తత్వాన్ని కళ్ళకు కట్టించే అసమాన ప్రజ్ఞ ఆమెది ! అదీగాక ఆమె చెప్పేవి ‘ మాటలు ’ ! – డైలాగులు కావు సుమండీ !
ఎన్టీఆర్ మొదలుకుని చిరంజీవి వరకు అందరితోనూ నటించారు సూర్యకాంతం. 1994లో విడుదలైన ‘ ఎస్ పీ పరశురాం ’ ఆమె ఆఖరి చిత్రం. మధుమేహంతో ఎంతో బాధపడిన సూర్యకాంతం శరీరం సహకరించినంత వరకూ నటించారు. మరణించే దాకా నటించాలని అనుకుని సాధ్యమైనంత వరకు అనుకున్నట్లు చేశారు. వెండితెరపై పూడ్చలేని వెలితిని సృష్టించి 1996 డిసెంబర్ 18న ఆ అసమాన కళాకారిణి స్వర్గస్తురాలైనారు.
వరించిన బిరుదులు
– సహజనట కళాశిరోమణి
– హాస్యనట శిరోమణి
– బహుముఖ నటనా ప్రవీణ
– రంగస్థల శిరోమణి
– అరుంగలై మామణి
– మహానటి సావిత్రి స్మారక పురస్కారం
– పద్మావతీ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్
వివిధ పాత్రలలో…..
– తోడికోడళ్ళు లో ‘ తోడికోడలు ’
– గుండమ్మ కథ లో ‘ అత్తగారు ’
– చరణదాసిలో ‘ సోదరి ’
– మాయబజారు లో ‘ తల్లి ’
– ఆత్మబంధువు లో ‘ కూతురు ’
– కాలం మారింది లో ‘ అమ్మమ్మ ’
– మట్టిలో మాణిక్యం లో ( షోకైన ) ‘ సంఘసేవిక ’
ఇంకా ఎన్నెన్నో…….
*********************************************