10_005 కథావీధి – రావిశాస్త్రి రచనలు

 

గురువందనం :

ముందు గా ఒక విషయం. నా ఈ వ్యాస పరంపర గురించి గత సంచికలో తమ అభిప్రాయం తెలిపిన మా గురువు గారు శ్రీయుతులు రమణ శర్మ గారికి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. వృత్తిపరంగా, వ్యక్తిగతం గా అనేకమంది ప్రతిభావంతులను తయారు చేసి, అనేకమంది జీవితాలలో వెలుగును నింపిన మహామనిషి శ్రీ పోడూరి వెంకటరమణ శర్మ గారు. వారికి జీవితం లో ఇప్పటివరకూ లభించిన భగవత్ కృప ఇక పైన కూడా కటాక్షింపబడాలనీ, సాహిత్య, వేదాంత తత్వ విషయాలలో వారి అన్వేషణ సుసంపన్నం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

*******

తెలుగు సాహితీ రంగంలో రావిశాస్త్రి గా లబ్దప్రతిష్టులైన రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు ” కవి అంటే కష్టజీవి కి అటూ ఇటూ నిలబడేవాడు ” అని వారికి మార్గదర్శకులైన శ్రీశ్రీ అనే ఆయన చెప్పిన మాటని నమ్మి మనసా వాచా కర్మణా పాలించిన మనిషి. శ్రీశ్రీ గారి ని ఒక అమాయక జిజ్ఞాసి ” విప్లవం జనానికి ఎక్కించే కవులు ఎక్కువ శాతం మంది దానిని తమ వ్యక్తిగత జీవితంలో కి ఎందుకు తీసుకుని రారూ? ” అని ఒక సందర్భంలో అడిగినప్పుడు వారు ” కవి అనే ఆయన మార్గ దర్శకుడు, మీ ఊరికి దారి చూపించే బోర్డ్ పని దారి చూపడమే ! అది మీ ఊరు వెళ్లదు కదా! అలాగే కవులు కూడా, కవి పని మార్గదర్శనం చేయడమే ” అని చెప్పుకొచ్చారు. రావి శాస్త్రి గారు మాత్రం మనం పరిచయం చేసుకొనబోతున్న కవుల పంథా, అనగా తాను నమ్మినదే రాయడం ఆర్భాటాలకీ, ప్రచారాలకీ దూరం గా ఉండడం, రచనని ఒక సహజమైన ప్రవృత్తి గా స్వీకరించడం మొదలైన లక్షణాలు కలిగిన రచనా కృషీవలుడు. వీరి శైలి అనితరసాధ్యం. అల్పజీవి లాంటి తొలినాటి రచనల కాలం లో జేమ్స్ జాయస్, లాంబ్ అండ్ డికెన్స్  మరికొందరు ఆంగ్ల రచయితలు గురజాడ అప్పారావు, గిడుగు రామమూర్తి పంతులు మొదలైన వారి ప్రభావం ఉంది అని విశ్లేషకులు తెలియజేసినప్పటికీ, అనంతర కాలం లో వీరి ప్రత్యేకమైన శైలి లబ్ద ప్రతిష్టమైంది. ఆద్యంతమూ ఒక ఝరి లా సాగుతుంది. వీరి వాదం ప్రత్యక్షంగా జాతీయ వాదం కాకపోయినప్పటికీ, దానికి వ్యతిరేకం కాదు. కాగా జాతీయవాదులు ప్రతిపాదించిన అడుగు వర్గాల అభ్యున్నతి అనే సూత్రాన్ని వీరు తమ రచన లన్నిటిలోనూ సమర్ధించారు. వీరిపైన గిడుగు రామమూర్తి, గురజాడ, శ్రీ శ్రీ గార్ల వ్యక్తిగత ప్రభావం కూడా ఉంది కానీ వీరి రచనా శైలి భిన్నం వేరేవారి తో కలవదు. అయితే వీరి రచనా శైలి ని చాలామంది ఔత్సాహికులు అనుసరించారు.

వీరి శైలి ఇంతగా లబ్దప్రతిష్టం అవడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. వీరికి ముందు కొంతమంది రచయితలు సమాజంలో అణగదొక్కబడిన వారిని గురించీ సమాజం చేత రకరకాల ఆంక్షలతో పీడించబడిన వారి గురించీ రాసినప్పటికీ అవి ఏదో కధల లానే రాశారు. అవి చదివిన వారికి విషయం అర్ధమయ్యేది కానీ అవగాహనకి వచ్చేది కాదు. దానికి కారణం రచయిత గట్టుమీద కూర్చుని వ్యవసాయం చేసే అనుభవశూన్యుడైన రైతు పాత్రనో లేక ఒడ్డున కూర్చుని కాలవ లోతు అంచనా కట్టే ఔత్సాహికుని పాత్రనో పోషించడం ఒక కారణం కావచ్చును. రచయిత తాను రాసే ప్రతీ విషయం తాను వ్యక్తిగతంగా అనుభవించి రాయడం అసాధ్యం. కానీ చదువరులకు అలా అనిపించేలా రాయగల నేర్పు లో అతనికి ఉన్న స్థాయి అతని విజయానికి, అతనికి పాఠక లోకంలో ఉన్న ఆదరణకీ కారణం అవుతుంది. ఈ లక్షణం వీరిలో పుష్కలం ఉన్న కారణంగానే వీరికీ, వీరి రచనలకీ పాఠక లోకంలో విశేషమైన ఆదరణ లభించింది. వీరి విజయానికి ఇంకొక కారణం వీరి నిబద్ధత. సమాజం లోని పేద, అట్టడుగు వర్గాల వారికి తన న్యాయవాద వృత్తి ద్వారానూ, తన రచనా ప్రవృత్తి ద్వారానూ, తనకి వీలైనంత ఎక్కువగా సాయం చేసిన గొప్ప మనిషి.

జననం శ్రీకాకుళం 1922 వ సంవత్సరం జూలై 22 వ తేదీ తల్లి తండ్రులు నారాయణమూర్తి, సీతాలక్ష్మి గార్లు. తండ్రి తాతలు న్యాయవాదులు. తల్లి గారు సాహితీకారిణి. పెరిగినది అనకాపల్లి దగ్గర తుమ్మపాల. విద్యాభ్యాసం – తత్వశాస్త్రం, విశాఖపట్నం. న్యాయశాస్త్రం మదరాసు. మొదట తాతగారి వద్ద శిష్యరికం. తరవాత స్వంత ప్రాక్టీసు విశాఖపట్నంలో తొలుత కాంగ్రెస్ వాది. తరువాత మార్క్సిజం పట్ల ఆకర్షితులైనారు. విరసం పట్ల సానుభూతి పరులు. కమ్యూనిస్టు సిద్ధాంతాల పట్ల ఆకర్షితులు, కమ్యూనిస్టుల పట్ల సానుభూతి పరులు. ఆయా సంస్థ లలో సభ్యత్వం ఉన్నట్టుగా ఎక్కడా తెలియజేయబడలేదు. వి. ర. సం. స్థాపకులలో ఒకరు. ఆ సంస్థ కు 1970 వ సంవత్సరం లో ఉపాధ్యక్షులు. ఉద్యమకారులకు వృత్తిపరం గా సహాయ సహకారలందించారు. తమ రచనలలో ఎక్కడా నాస్తికవాదాన్ని సమర్ధించలేదు. కొన్ని సందర్భాలలో ఆస్తిక వాదాన్ని ప్రస్తావించారు.

మొదటి రచన ‘ అల్పజీవి ‘. రావిశాస్త్రి గారు ఈ నవలను “అయ్యారే బాబారే” అనే కలం పేరు తో రాశారు.  అణగదొక్కబడి, వాజ్యాలలో ఇరికించబడిన వారికి అనునిత్యం, వృత్తిపరం గానూ, వ్యక్తిగతం గానూ సహాయపడడం వలన వారు జీవితంలో మోసగించబడిన విధానం, వారిని చట్టపరంగా ఇరికించడం కోసం న్యాయవ్యవస్థని నైతిక విలువలు లేని కొందరు న్యాయవాదులు ఉపయోగించుకునే విధానం, వీటిమూలంగా అలా అణగదొక్కబడ్డవారు అనుభవిస్తున్న కష్టాలూ బాధలూ అన్నీ వీరికి అవగతం అయ్యాయి. వీరి గురువు గారైన శ్రీశ్రీ గారు కాదేదీ కవితకనర్హం అనే శీర్షిక తో రాసిన “కుక్క పిల్లా, సబ్బుబిళ్ళా” కవిత లోని అన్ని పదాలనూ శీర్షికలు గా స్వీకరించి ఒక్కో పదానికి ఒక్కొక్క కథను వీరు రాసి కాదేదీ కవితకనర్హం అనే వాక్యాన్ని నిజం చేసారు. అవి ఆంధ్ర్రజ్యోతి పత్రికలో ధారావాహికం గా వచ్చి తరవాత ఒక పుస్తకం గా ప్రచురించబడి, వీరి ఇతర రచనల లాగా పాఠకుల ఆదరణను పొందాయి. అందులో ఒక చిన్న చిన్న దొంగతనాలు చేసే బతికే అతను ఒక హత్యా నేరంలో ఇరికించబడగా జడ్జి గారు సాక్ష్యాధారాలు పరిశీలించి అతనికి ఉరిశిక్ష విధించి తీర్పు చదువుతారు. ముద్దాయికి చదువు రాదు. జడ్జి గారి భాష అర్ధం కాదు. ముద్దాయి తరఫున వాదించడానికి ఏర్పరచబడిన ఉచిత న్యాయవాదికి ఇదొక యాంత్రికమైన కేసు. ముద్దాయి పెంపుడు కొడుకు విచారణ జరుగుతున్న గది బయట అయోమయంగా నించుంటాడు. అతను అప్పటికి బాల్యావస్థ లో ఉంటాడు. జడ్జ్ గారు ఇవ్వబోయే తీర్పు ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలో అన్న విషయాన్ని కొంతమంది మహానుభావులు నిర్వచించారు. దాని ప్రకారం తీర్పు క్లుప్తంగా ఉండాలి. గుంభన గా ఉండాలి. హ్యూమరస్ గా విట్టీ గా ఉండాలి. న్యాయ సూత్రాలనీ, జడ్జి గారి, వ్యక్తిగత ప్రతిభా పాఠవాలనీ ప్రతిబింబించాలి అంటూ ఆ నిర్వచనం సాగుతుంది. రావిశాస్త్రి గారు ఈ కథ లోని దొంగ కు జడ్జి గారు ఉరి ఖరారు చేసిన సందర్భంలో ఈ నిర్వచనాన్ని ప్రస్తావించి “జడ్జ్ గారి తీర్పు ఈ నిర్వచనం లోని అన్ని లక్షణాలనూ కలిగి ఉంది. అయితే అది న్యాయంగా ఉందో, మరోలా ఉందో దేముడికే తెలుసు ” అంటారు.” సొమ్ములు పోనాయండి”అనే రచనలో అమాయకులు చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా ఏ విధంగా అన్యాయానికి గురి అయి మోసగించబడతారో వివరంగా తెలియజేయబడుతుంది.

వీరి రచనా శైలి ముందుగా చెప్పుకున్నట్టు అనితర సాధ్యం. వీరికే స్వంతం. ఒక ఝరి లా, సెలయేరు లా, కొండపై నుంచి జాలు వారే జలపాతంలా సాగుతుంది. ప్రధాన కథే కాకుండా అందులోని పాత్రలు చెప్పే ఉపకథలూ, వృత్తాంతాలూ కూడా చదువరుల మనసుల్లో నిలిచిపోతాయి. మచ్చుకు కథలలో వచ్చే రెండు మూడు ఉపకథల ని చూద్దాం.
‘ మూడు కథల బంగారం ’ లోని బంగారి గాడి కథ లో బంగారి గాడి తోడుదొంగ “సి త్త ర్లే క ” గాడు తన పినతల్లికి పండక్కి సీరెట్టడం కోసం బట్టల కొట్లో చీర దొంగిలిస్తూ పట్టుబడి, షావుకార్లు కొట్టిన దెబ్బలకు చనిపోయినప్పుడు పోలీసు వారు షావుకార్లందరినీ బొక్కలోకి తోసీసి, బొవికలు కుళ్ళబొడీసీసీ, ఆళ్ల దగ్గర పొందూరోళ్లు నూలొడికినట్టు డబ్బులొడికీసి, ఒక దొమ్మీ కేసు కట్టీసి, దానికి సాచ్చీకానికి, ఆళ్ల తోటి షావుకార్లనే ఏసీ, ఆళ్ల సేత మావేటి సూడనేదు, మాకేటి తెనీదు అని కోర్ట్ లో సాచ్చీకాలు చెప్పించి, ఆ దొమ్మీ కేసును కొట్టించేసి, హంతకులందరినీ, నిర్దోషులు గా తీర్పు ఇప్పించిన సందర్భం లోనూ, మన న్యాయవ్యవస్థ పని తీరును ప్రశ్నిస్తారు. అలాంటిదే బంగారు గాడి మరొక తోడుదొంగ సత్తరకాయి గాడు అనంతరకాలం లో బంగారి గాడు బంగారయ్య గారి గా మారిన కాలానికి సత్తరకాయి తన సారా సప్లై ఆపేసి తన చిలకల లాడ్జీని మర్యాద లాడ్జీ గా మార్చి తాను కౌన్సిలర్ అయి మారి ” ఇయత్నాం ఇమలమ్మ” గురించి బంగారయ్య గారికి చెప్పిన కథ.

ఇంకో కథ లోని ఉప కథ. ” వేతనశర్మ” కథలో కడుపు నిండని కష్టజీవులు రాజు గారి మీద తిరగబడినప్పుడు రాజు గారు ఆ జనం లో ఉన్న చదువుకున్న వాళ్ళని కొంచెం ఎక్కువగా శిక్షిస్తాడు. అప్పుడు వారిలోని వేతన శర్మ అనే ఆయనకి జ్ఞానోదయం అయి సాటి వారితో సమావేశం చేసి సమాజంలో తాము ఉద్యోగులమనీ, తమకి జీతాలే ఆధారం అనీ, అవి రాజు గారు ఇస్తారనీ, పంటలకు కిట్టుబాటు ధరా, శ్రమకి, కష్టానికీ తగినంత ప్రతిఫలం కిట్టని అలాగా జనం రాజు గారి మీద తిరుగుబాటు చేసినప్పుడు రాజు గారు తగిన విధంగా ప్రతిస్పందిస్తారనీ, అది రాజు గారూ, జనం మధ్య విషయం కనక దానితో తమకు సంబంధం లేదు అనీ, తమకి జీతాలు ఇచ్చే రాజు గారు కష్టకాలం లో ఉన్నప్పుడు ఆయనకి  చేతనైన సహాయం చేస్తే అన్నీ సర్దుకున్నాక జీతాలు పెంచమని అడిగితే వారు కాదు అనరు అని తెలియజేసీ వారికి జ్ఞానబోధా, కర్తవ్య బోధా చేశాడు. తత్ఫలితంగా ఉద్యమానికి వెన్నుపోటు తగిలి, తిరిగి బలపడడానికి అడవులకు తరలిపోతుంది. సహకరించిన ఉద్యోగులకు ఒక తృణ మాత్రం జీతం పెరుగుతుంది, బడుగు జనజీవితం ఇంకా దుర్భరం అవుతుంది. వేతన శర్మ గారి సంతతి వారే ఇప్పటి మన ప్రభుత్వ ఉద్యోగులు అనీ వారు తమ జీతభత్యాల ఉన్నతి కోసమే ఉద్యమిస్తారు తప్ప సమాజహితం కోసం కాదని తెలియజేస్తారు.

తరువాయి వచ్చే సంచికలో….

*********************************************