10_005 తో. లే. పి. – మల్లాది సూరిబాబు

                     

                       ‘ సప్తగిరి సంగీతవిద్యన్మణి ‘, ‘ సుస్వర గాయక ‘, ‘ సంగీత విద్యానిధి ‘ శ్రీ మల్లాది సూరిబాబు గారు సంగీత సరస్వతి ప్రియపుత్రులలో ఒకరు. బాల్యం నుండే ఆయనకు సంగీత పిపాస అలవడింది. ఇక ఆయన తదనుగుణంగా సంగీతపరమైన విద్యను గురుముఖంగా అభ్యసిస్తూ, నిరంతర సాధన తో ఆ మార్గమే తన జీవన మార్గమని గుర్తెరిగి అడుగు ముందుకు వేసారు. ఇక అంతే !…. వెనుతిరిగి చూడవలసిన అవసరం లేని విధంగా ఆయన సంగీత ప్రయాణం నిరాటంకం గా ముందుకు కొనసాగింది. 

సూరిబాబు గారి తండ్రి గారు కీ.శే. శ్రీ మల్లాది శ్రీరామమూర్తి గారు సంగీత విద్వన్మణులు. హరికథాపితామహ శ్రీ ఆదిభట్ల నారాయణదాసు గారి హరికథలను  వింటూ, వాటి పట్ల అభిరుచి ని పెంచుకుని స్వయంకృషి తో తానూ నేర్చుకుని హరికథల ప్రదర్శనలను ఇవ్వడం ప్రారంభించారు. 1948 లో విజయవాడ లో ఆకాశవాణి, విజయవాడ కేంద్రం స్థాపన జరగడంతోనే శ్రీరామమూర్తి గారు తానూ రంగప్రవేశం చేసి, రేడియో లో హరికథలు చెబుతూ, మరొక ప్రక్కన పిల్లల కోసం సంగీత రూపకాలను ప్రవేశపెట్టి వారు నిర్వహించే ఆ కార్యక్రమాలలో సూరిబాబు గారికి కూడా తగు స్థానాన్ని ఏర్పరిచారు.. ఆ రకం గా సూరిబాబు గారికి ఈ రంగం లో ఆకాశవాణి అనేక అవకాశాలను కల్పించి ఆదరించింది, అక్కున చేర్చుకుంది. 

1971 లో ఆకాశవాణి విజయవాడ కేంద్రం లో రేడియో అనౌన్సర్ గా ఉద్యోగ పర్వం లో అడుగుపెట్టి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ని తెచ్చుకున్న సంగీతజ్ఞుడు సూరిబాబు గారు. ఆయన అటు శాస్త్రీయ సంగీతాన్ని గురుముఖం గా —  అంటే సంగీత త్రయం అని చెప్పుకోదగ్గ శ్రీయుతులు వోలేటి వెంకటేశ్వర్లు గారు, డాక్టర్ శ్రీపాద పినాకపాణి గారు, శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారి వద్ద శుశ్రూష చేసి తన  సంగీతగాన కళాకౌశలానికి మెరుగులు దిద్దుకున్నారు. అలా ఆ గురువుల చల్లని నీడలో సేద తీరగలగడం ఆయనకు లభించిన ఒక అపూర్వవరం గా భావించవచ్చును. ఇది ఇలా ఉండగా, కర్నూలు లో ఉంటున్న పినాకపాణి గారి వద్దకు వెళ్లి దాదాపు రెండున్నర దశాబ్దాల వ్యవధి లో క్షేత్రయ్య పదాలను, జావళీలను కూడా అవలీలగా అభ్యసించడం సూరిబాబు గారికి దక్కిన అదృష్టం గా చెప్పవచ్చును. 

ఆకాశవాణి లో పనిచేస్తూన్న సందర్భం లోనే వివిధభారతి లో ‘ రాగరంజని ‘, ‘ రాగరాగిణి ‘ పేరిట ప్రతి శనివారం మధ్యాహ్నం 12 గంటలకు వీరి నిర్వహణ లో కొన్ని దశాబ్దాలపాటు సంగీత ప్రధాన కార్యక్రమాల రూపకల్పన, ప్రసారం జరిగేవి. ఇవి అనేకమంది శ్రోతలను ఆకట్టుకునేవి. 

కొన్ని సంవత్సరాల క్రితం మల్లాది వారు శ్రీ నారాయణ తీర్థుల వారి తరంగాలకు సంగీత స్వరూపాన్ని ( Notations ) కల్పించి ఒక పుస్తకం గా ప్రచురించి చెన్నై లో ఆవిష్కరణ గావించారు. ఇందులో మూలం లో ఇంగ్లీషు లో వ్రాయబడిన పరిచయ వ్యాసాలను ప్రచురణ నిమిత్తమై తెలుగులో అనువదించే మహత్కార్యాన్ని వారు అప్పట్లో చికాగో లో మా అబ్బాయి వద్ద ఉన్న నాకు  ఎంతో వాత్సల్యం తో అప్పజెప్పడం నేను దానిని భగవత్కృపతో తెలుగు లోనికి అనువదించడం అంతా దైవ లీల గా  భావిస్తాను. ఇవే కాకుండా అన్నమాచార్య కీర్తనలు, భద్రాచల రామదాసు కీర్తనలు, సదాశివ బ్రహ్మేంద్రులవారి కీర్తనలు — వీటికి కూడా సంగీత స్వరూపాన్ని కల్పించారు సూరిబాబు గారు. ఆంధ్రభూమి దినపత్రిక లో 2016 నుండి ‘ అమృత వర్షిణి ‘ పేరిట వీరు వ్రాసిన వ్యాసమంజరి 2019 లో పుస్తకరూపం లో రావడం హర్షణీయం.. 

సూరిబాబు గారు, వారి తనయులు మల్లాది సోదరులు ( శ్రీరామ్ ప్రసాద్, రవి కుమార్ ) సంగీతపరం గా జగత్ప్రసిద్ధులు. దాదాపు రెండు దశాబ్దాలుగా వారితోనూ – వారి కుటుంబం తోనూ నాకు ఎంతో సాన్నిహిత్యం అంతకు మించిన ఆత్మీయత ఉన్నాయి. వారు ఇంట్లో చేసే సంగీత సాధనను అప్పుడప్పుడు వీక్షిస్తూ ఉండడం నాకు ఎంతో ఇష్టం. వీరితోబాటుగా వీరి తరువాతి తరం — అంటే మల్లాది సూరిబాబు గారి అమ్మాయి, అబ్బాయిలే కాకుండా వారి పిల్లలు కూడా ఈ సంగీతసేవ ను ఆరాధిస్తూ, ఆచరిస్తూ ఉండడం ముదావహం, అభినందనీయం. 

మల్లాది వారి సంగీత కచేరీలను ఇటు ఇండియా లో విజయవాడ, చెన్నై వంటి నగరాలలోనే కాకుండా అమెరికా లో, చికాగో లో కూడా ప్రత్యక్షంగా చూసి ఆనందించే అద్భుత అవకాశం నాకు లభించడం ఆ సరస్వతీ కటాక్షం గా నేను భావిస్తాను. చికాగో లో కొన్ని సంవత్సరాల క్రితం SAPNA వారి నిర్వహణ లో శ్రీ బాలాజీ టెంపుల్ లోనూ HTGC లోనూ జరిగిన మల్లాది వారి కచేరీ – మల్లాది వారు, గుండేజా సోదరుల జుగల్బందీ, అవి అందించిన ఆనందాన్ని నేను ఎన్నడూ మరువలేను. 

తాజాగా శ్రీ మల్లాది సూరిబాబు గారు నాకు వ్రాసిన లేఖ – వారి దస్తూరి లో — నేటి తోక లేని పిట్ట గా మీ ముందు దర్శనమిస్తుంది. తిలకించండి.

దయచేసి మీ అమూల్య స్పందనను, ఆశీస్సులను నాకు అందజేయవలసినదిగా కోరుకుంటూ మీనుండి ప్రస్తుతానికి శెలవు తీసుకుంటున్నాను. 

<><><>***  ధన్యవాదాలు~  నమస్కారములు ***<><><>