10_006 ద్విభాషితాలు – క్వారంటైన్

__________________________________

వైరస్ జైలు శిక్షలో..

మరో రోజు మొదలవుతుంది.

లెఖ్ఖ లేనన్ని నిశ్శబ్ద క్షణాలు… యుగాలై..  చుట్టుముడతాయి.

బిగించుకున్న తలుపు బయట..

నిట్టూర్పుల  సవ్వడులు..  రాజ్యమేలుతాయి. 

మొబైల్  గొంతులోంచి..

పలకరింపులు.. ఓదార్పులు..

చెవులకు  తూట్లు పొడుస్తాయి.

వాపోరైజర్ లోంచి ఆవిరి..

భయం భయంగా..

శ్వాస లోకి ప్రవేశిస్తుంది.

కష్టం..కషాయంగా..

వేడిగా..

గొంతులోకి దిగుతుంది.

వార్తల్లో రోజువారి తీసివేతలు..

ఊపిరికి అడ్డుపడుతుంటాయి.

మొత్తం ప్రపంచమంతా అటువైపు!

నువ్వు ఇటువైపు !

అవును !

ప్రాణాలు నిలుపుకోవడమే..

పని అయినప్పుడు… 

వేరే  దారిలేక..

ప్రేమ మూగదైపోతుంది.

బంధం చేయి విడిపించుకొంటుంది. 

ఇప్పుడు…

నీతో  నువ్వుండడమే..

జీవితం!!

***********************