10_006 లలితసంగీత ‘ మణి ‘ – ఇందిరామణి

 

 

క్రిందటి నెల ( అక్టోబర్ ) 20 వ తేదీన స్వర్గస్తులైన

లలిత సంగీత స్వరకర్త శ్రీమతి సి. ఇందిరామణి గారికి నివాళులు అర్పిస్తూ…..

భారతీయ సంగీతం లో ఎన్నో సంప్రదాయాలతో బాటు, ఎన్నో ప్రక్రియలు కూడా ఉన్నాయి. శాస్త్రీయ సంగీతంతో బాటు లలిత సంగీతం, జానపద సంగీతం, భక్తి సంగీతం….. ఇలా ఎన్నో ఉన్నాయి. శాస్త్రీయ సంగీతం ఆస్వాదించలంటే అందులో ప్రవేశం ఉన్నా, లేకున్నా అవగాహన మాత్రం ఉండాలి. పండిత పామరులనందరినీ సమానంగా అలరింపజేసేది లలిత సంగీతం.

శాస్త్రీయ సంగీత విద్వాంసులలో ప్రముఖులైన వారు కూడా అప్పుడప్పుడు లలిత గీతాలు పాడటం మనకు తెలుసు. ఉదా : మంగళంపల్లి బాలమురళీకృష్ణ, వోలేటి వెంకటేశ్వర్లు, నల్లాన్‌చక్రవర్తుల జగన్నాధాచార్యులు, శ్రీరంగం గోపాలరత్నం వంటి వారెందరో. కేవలం లలిత సంగీతం లో మాత్రమే ప్రసిద్ధులైన వారు కూడా లెక్కకు మించే ఉన్నారు.

లలిత సంగీతం ప్రజల దగ్గరకి చేరాలంటే గతంలో రేడియో, తర్వాత దూరదర్శన్ మాత్రమే సాధనాలు. అవి మాత్రమే సమాచార సాధనాలుగా ఉన్న రోజులు నిజంగానే లలిత కళలకు స్వర్ణయుగం అని చెప్పవచ్చు. అన్ని రకాల కళలను ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాయి ఆ రెండూ. లలిత సంగీతం కూడా వీటి ద్వారా ఎంతో ప్రాచుర్యం పొందాయి. ఎంతోమంది గాయకులు, గాయనీమణులు తయారయ్యారు. అలాగే స్వరకర్తలు కూడా ఎంతోమంది ఉండేవారు. అయితే స్వరకర్తలలో సింహభాగం పురుషులదే. మహిళా స్వరకర్తలు దాదాపుగా ఎవరూ ఉండేవారు కాదు.

అలాంటి సమయంలో లలిత సంగీత రంగంలో మహిళా స్వరకర్త గా ప్రవేశించారు శ్రీమతి సి. ఇందిరామణి గారు. తండ్రి శ్రీ చివుకుల సుబ్రహ్మణ్యం గారి ప్రోత్సాహం, సోదరి ప్రముఖ గోటు వాద్య విద్వాంసురాలు శ్రీమతి సీతాలక్ష్మి గారి శిష్యరికం ఇందిర గారిని గాత్రం తో బాటు వీణ, గోటు వాద్యాలలో కూడా నిష్ణాతురాలిని చేశాయి. శాస్త్రీయ సంగీత విద్వాంసురాలిగా ఎన్నో సంగీత, నృత్య రూపకాలకు స్వరకల్పన చేశారు. వాటిలో ముఖ్యమైనవి, ఆమెకు పేరుతో బాటు పురస్కారాలను కూడా తెచ్చి పెట్టిన వాటిలో ‘ త్యాగయ్య ’ సంగీత నృత్య రూపకం ఒకటి. 1949-50 సంవత్సరంలో తిరుపతి మున్సిఫ్ ఆధ్వర్యంలో జరిగిన త్యాగరాజ ఆరాధనోత్సవాలలో ప్రదర్శింపబడి బహుమతిని సంపాదించింది. తర్వాత కొన్ని వందల సార్లు ఈ రూపకం అనేక చోట్ల ప్రదర్శించబడి సంగీత నృత్య అభిమానుల ప్రశంసలు అందుకుంది. అలాగే ‘ శబరి మోక్షం ‘ అనే సంగీత రూపకం కూడా ఈమె రూపొందించారు ఇందిర. త్యాగరాజస్వామి వారి ‘ ఎంతని నే వర్ణింతు… ’ అనే ఒకే ఒక్క కృతి ఆధారంగా రూపొందించిన ఈ రూపకం కూడా అనేక ప్రశంసలు అందుకుంది. ఇంకా వాగ్గేయకారులు, మా జానకి, అన్నమయ్య గాంచిన కృష్ణుడు, పోతన, నౌకచరితము, నిస్వార్థం, సంక్రాంతి లక్ష్మి వంటి అనేక రూపకాలను ఇందిర రూపొందించారు. దూరదర్శన్ కోసం కలి కల్యాణం, చండాలిని, ప్రత్యూష వంటి కార్యక్రమాలు కూడా రూపొందించారు.

ఇలా శాస్త్రీయ సంగీతం ఆధారంగా అనేక కార్యక్రమాలను రూపొందించి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటున్న సమయంలో అనుకోకుండా జరిగిన ఒక సంఘటన ఆమెను లలిత సంగీతం గురించి ఆలోచింపజేసి అటువైపు నడిపించింది. వారి కుమార్తె పద్మజ బాల్యంలో పాఠశాలలో జరిగిన పోటీలలో పాల్గొని ఒక సినిమా పాడారు. దానికి ప్రథమ బహుమతి వచ్చింది. అయితే ఇందిర గారికి ఈ విషయం ఆనందం కలిగించలేదు. శాస్త్రీయ సంగీతాన్ని ఆరాధించే కుటుంబంలో పుట్టిన పద్మజ పోటీలలో ఒక సినిమా పాడటం, దానికి బహుమతి రావడం ఆమె జీర్ణించుకోలేకపోయారు. శాస్త్రీయ సంగీతం నేర్చుకున్న పద్మజ ఆసక్తి లలిత సంగీతం వైపే ఉండేది. దాని ఫలితమే సినిమా పాట పాడేలా చేసిందని ఇందిర గుర్తించారు. ఈ లలిత సంగీతంలోని విశేషమేమితో తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. అప్పటినుంచి శ్రద్ధగా రేడియో లో లలిత సంగీతం వినసాగారు. శాస్త్రీయ సంగీతంలో ఎంత గొప్పతనం ఉన్నప్పటికీ అది పండిత వర్గానికే పరిమితమని, పామరులను రంజింపజేసేది సరళంగా, సులువుగా అర్థమయేటట్లు ఉండే లలిత సంగీతమేనని గ్రహించారు. అప్పటినుంచి లలిత సంగీత సాధన ప్రారంభించారు. శాస్త్రీయ సంగీతంలో పట్టు సాధించిన ఇందిర గారు త్వరగానే లలిత సంగీతంలో ప్రావీణ్యం సాధించారు. గాయనిగా లలిత గీతాలను అలపిస్తూనే భర్త సుబ్రహ్మణ్యమణి గారి ప్రోత్సాహం స్వరకల్పన వైపు నడిపించింది. అంతే ! ఇక వెనుదిరిగి చూడలేదు. ప్రగతి గీతాలు, ప్రకృతి గీతాలు, ప్రణయ గీతాలు, ప్రస్తుతి గీతాలు, ప్రబోధ గీతాలు, భక్తి గీతాలు, జానపద గీతాలు, దేశభక్తి గీతాలు, సమైక్యతా గీతాలు వంటి ఎన్నో రకాల గేయాలను పాడటంతో బాటు చాలా గేయాలను స్వర పరచారు.

ఇందిర గారు స్వరపరచిన గేయాలలో ప్రసిద్ధి చెందినవి డా. సి. నారాయణరెడ్డి గారి ‘ ఎదలొకటైతే ’, ఎల్. మాలకొండారెడ్డి గారి ‘ ఎవరో ఎవరో నీ వెవరివో ’ వంటి లలిత గేయాలతో బాటు ‘ హరి హర పుత్రా అయ్యప్పా ’ అనే అయ్యప్ప భక్తులు ఇప్పటికీ పాడుకునే భక్తి గీతం వంటివెన్నో ఉన్నాయి. నారాయణరెడ్డి గారితో బాటు దాశరధి, వడ్డేపల్లి కృష్ణ, గిడుగు రాజేశ్వరరావు, కృష్ణశాస్త్రి గారు వంటి ఎందరో ప్రముఖ కవుల గేయాలు స్వరపరచారు.

1933వ సంవత్సరం ఆగష్టు 11వ తేదీన తిరుపతిలో జన్మించిన ఇందిరామణి గారు తెలుగు సాహిత్యంలో బి. ఏ. చదివారు. వివాహానంతరం మద్రాసు నగరం లో ఉన్నప్పుడు ఆకాశవాణి లో కర్ణాటక సంగీత కచేరీలు చేసేవారు. ఆంధ్ర, మద్రాసు రాష్ట్ర విభజనాంతరం భర్త ఉద్యోగరీత్యా హైదరాబాద్ రావడం జరిగింది. అప్పటినుంచి ఆకాశవాణి, హైదరాబాద్ కేంద్రం లో కర్ణాటక సంగీత కళాకారిణిగా కొనసాగారు. ఆమె ప్రతిభ చూసిన పొరుగు వారు తమ పిల్లలకి సంగీత పాఠాలు చెప్పమని కోరడంతో తన సంగీతాన్ని పదిమందికీ పంచే ఉద్దేశ్యంతో ‘ రాగసుధ ’ అనే సంస్థను స్థాపించి ఎందరికో శాస్త్రీయ సంగీతాన్ని, లలిత సంగీతాన్ని వారి వారి అభిరుచులని, కంఠస్వరాన్ని బట్టి వారికి సరిపోయే ప్రక్రియలో శిక్షణనిస్తూ అనేకమంది శిష్యులను తయారు చేశారు. ఈ సంస్థకు కుటుంబ సభ్యుల అండదండలు, సహకారం పూర్తిగా ఉన్నాయి.

ఇందిర గారికి తెలుగు, ఆంగ్లం, హింది, తమిళ సాహిత్యాలలో మంచి అవగాహన ఉంది. అంతే కాదు. వీరి భర్త సుబ్రహ్మణ్యమణి గారు తమిళ సాహిత్యకారులు, నాటకకర్త. అలాగే వీరి కుమారుడు సురేష్ కూడా నాటక రచయిత, నటుడు, మిమిక్రీ కళాకారులు, గాయకులు. కుమార్తె పద్మజ గాయని.

తెలుగు వారికి ఎన్నో మధురమైన లలిత గీతాలను అందించిన ఇందిరామణి గారి సంగీత ప్రయాణం ఎందరికో స్పూర్తి. తెలుగు లలిత సంగీత ప్రపంచంలో ఆమె పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆమె వారసత్వాన్ని కొనసాగిస్తున్న వారి సంతానం సురేష్ గారు, పద్మజ గారు ధన్యులు.   

ఇటీవలే 87 వ జన్మదినం జరుపుకున్న ఇందిరామణి గారు అంతలోనే దూరం కావడం విషాదకరం. ఆ జన్మదిన సందర్భంగా రచయితలు, వాద్యకారులు, ‘ రాగసుధ ’ ప్రస్తుత… పూర్వ విద్యార్థులు, బంధువులు, సన్నిహితుల అభిప్రాయాలతో, ఇందిరామణి గారు స్వరపరచిన గీతాల సమాహారంగా రూపొందించిన వీడియో …..