10_006 నాట్య ‘ ప్రియ ‘

                        

                                  పువ్వు పుట్టగానే పరిమళించినట్లు…. ఆ అమ్మాయి పుట్టడమే కళాకారిణిగా పుట్టిందేమో ! ఆమే ప్రియదర్శినికృష్ణ. బహుముఖ ప్రజ్ఞ ఆమె స్వంతం.

పల్లికొండ లక్ష్మి, పి. కె. రావు దంపతుల ప్రథమ పుత్రిక అయిన ప్రియదర్శిని చదువు ఎక్కువ భాగం హైదరాబాద్ లో సాగింది. ఆంధ్రమహిళా సభ కళాశాల నుంచి డిగ్రీ, లా పట్టాలు అందుకున్నారు.

విశాఖపట్నంలో జన్మించిన ప్రియదర్శిని 4వ సంవత్సరాల పిన్న వయసులోనే కూచిపూడి నృత్యాభ్యాసం ప్రారంభించింది. తర్వాత ప్రముఖ నాట్యాచార్యులు గురు శ్రీ వెంపటి చినసత్యం గారి ఆధ్వర్యంలోని కూచిపూడి కళాక్షేత్ర లో చేరి నృత్యాభ్యాసం కొనసాగించారు. చిరుప్రాయంలోనే అంటే 7 సంవత్సరాల వయసులోనే విశాఖపట్నం లోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆడిటోరియం లో రంగప్రవేశం చేసిన ఈమె తన పదవ యేటనే నేవల్ బేస్ ఉత్సవాలలోనూ, స్టీల్ ప్లాంట్, షిప్‌యార్డ్, బి. హెచ్. పి. వి., వుడా, లయన్స్ క్లబ్ వంటి ప్రముఖ సంస్థల వార్షికోత్సవ కార్యక్రమాలలో నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. తండ్రి ఉద్యోగరీత్యా హైదరాబాద్ కు బదిలీ కావడంతో శోభానాయుడు గారి వద్ద కొంతకాలం శిక్షణ తీసుకోవడం జరిగింది. కూచిపూడి నృత్యోత్సవంతో సహా అనేక నృత్యోత్సవాలలో పాల్గొన్నారు. సోలో ప్రదర్శనలు కూడా ఇచ్చారు.

గురు పసుమర్తి రామలింగ శాస్త్రి గారి “ శశిరేఖా పరిణయం ” నృత్య నాటికలో శశిరేఖ గా అభినయించారు. “ రాసవికాసం ” నృత్య నాటికలో కృష్ణుని పాత్ర ధరించి పదిమంది గోపికలతో పళ్ళెం మీద చేసిన తరంగ నృత్యం మకుటాయమానంగా నిలిచింది. పార్వతి, సీత పాత్రలలో కూడా నర్తించారు. స్వంతంగా చాలా కీర్తనలకు నృత్య రీతులు సమకూర్చారు.

మానవవనరుల శాఖ ఫెల్లోషిప్, దూరదర్శన్ ‘ ఏ ’ గ్రేడ్, సంగీత నాటక అకాడెమీ, సాంగ్ అండ్ డ్రామా డివిజన్ వంటి సంస్థలలో ‘ ఏ ’ గ్రేడ్, సాంస్కృతిక శాఖ పానెల్ కళాకారిణి గా వ్యవహరించారు.  

హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ( HCU ) నుండి కూచిపూడి నృత్యంలో మాస్టర్స్ డిగ్రీ ( M.A. ) పొందారు. బంగారు పతాకం కూడా లభించింది. M. Phil కూడా చేసి మరో బంగారు పతాకం కైవసం చేసుకున్నారు. న్యాయశాస్త్రం లో కూడా పట్టా పొందారు. సైకాలజీ లో ఎం. ఏ. కూడా చేశారు.

జానపద కళా రీతులైన కోలాటం, తప్పెట గుళ్ళు, ఒగ్గు కథ, జాంబ పురాణం, లంబాడా నృత్యాల మీద డాక్యుమెంటరీ లు నిర్మించారు. అనేక జర్నళ్ళ లో వ్యాసాలు కూడా వ్రాసారు. 

ఇవన్నీ ఒక ప్రక్కనైతే, మరోప్రక్క పాత్రికేయురాలిగా పత్రిక రంగంలో, వెబ్ పోర్టల్స్ లో, రేడియో, శాటిలైట్ వార్తా ఛానళ్ళలో పనిచేసిన ప్రియదర్శిని ఆ రంగంలో కూడా అనుభవం సంపాదించారు.

తనలోని సృజనాత్మకత కు సరైన కాన్వాస్ అనే భావనతో సినిమా రంగంలో కూడా ప్రవేశించారు. దర్శకత్వ శాఖలో చేరి పూరీ జగన్నాథ్, తేజ, కృష్ణవంశీ, వి. ఎన్. ఆదిత్య మరియు దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు వద్ద పనిచేశారు. స్క్రిప్ట్ రూపొందించడం, చిత్రానువాదంలో దిట్టగా పేరు పొందారు. తీసుకున్న ప్రాజెక్టు ను విజయవంతంగా అనుకున్న సమయం లోపున పూర్తి చెయ్యడంలో సిద్ధహస్తులు. క్రిందటి సంవత్సరం మలేషియా లో రూపొందించి విడుదలకు సిద్ధంగా ఉన్న ఒక చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించారు. ప్రస్తుతం స్వంతంగా కథ తయారు చేసుకునే పనిలో ఉన్నారు.

క్షేత్రయ్య పదాలను మళ్ళీ ప్రాచుర్యంలోకి తీసుకురావాలనే ప్రయత్నంలో ఉన్నారు. శ్రీ వేంకటేశ్వర భక్తి చానెల్ కోసం 52 ఎపిసోడ్ల ‘ శృతిలయలు ’ అనే కూచిపూడి నృత్య టాలెంట్ షో ని రూపొందించారు. కూచిపూడి నాట్యానికి ఉడతా భక్తిగా ‘ సిద్దేంద్రయోగి ’ అనే డాక్యుడ్రామా ను రూపొందించి సమర్పించారు.

ప్రస్తుతం వాగ్గేయకారులు, మనోధర్మం అనే అంశాల మీద రెండు పుస్తకాలు వెలువరించే ప్రయత్నం లో కూడా ఉన్నారు ప్రియదర్శిని.       

ప్రియదర్శినికృష్ణ నృత్యం…  ఈ క్రింది వీడియోలో…..