—————————————————
త్యాగరాజ కవీశ్వరుడు
1767-1847
అనేక దశాబ్దాల నుంచి దక్షిణ భారతదేశవాసులు వారణాసికి వెళ్లి అక్కడ వేదాలను, సంస్కృతం, కళలు, సంగీతం అభ్యసిస్తూ ఉండేవారు. 14 వ శతాబ్దాంతానికి ఉత్తర భారతదేశంలో గొప్ప గొప్ప విశ్వవిద్యాలయాలన్నీ ముస్లిమ్ దండయాత్రలలో విధ్వంసానికి గురై ఎన్నో పురాతన సంగీత కావ్యాలు మరియు కళలపై వ్రాసిన కావ్యాలు మరియు ఆయా సాంప్రదాయాలు నామరూపాలు లేకుండా సమసిపోయాయి. అప్పటివరకూ దేవాలయాలలో పాడబడుతున్న సంగీతం పై ముస్లిం మరియు అరబ్బు సంస్కృతి ప్రభావం పడి, రాజదర్బారులు, జమీందారీ కొలువుల్లో పాడబడే సంగీతంగా మారిపోయింది. రాగాల వివరణ, పాడే పద్ధతులు వ్యక్తి వ్యక్తికీ విభిన్నంగా ఉంటూ క్రమేపీ నేడు మనం చూస్తున్న బాణీలు, ఘరానాలుగా రూపుదిద్దుకున్నాయి. ఉదాహరణకి బనారస్, లక్నో, ధార్వాడ్, పటియాలా ఇత్యాది. ఈ ప్రభావం కొంతవరకూ దక్షిణాదిలో కూడా బీజాపూర్, గోల్కొండ మొదలైన చోట్లలో కానవస్తుంది. కానీ శుద్ధమైన కర్ణాటక సంగీత సాంప్రదాయం దక్షిణాదిన చక్కగా వ్రేళ్లూని శ్రీకృష్ణదేవరాయల వారి పాలన లో చాలా చక్కగా వృద్ధిచెంది నేడు మనం పాడుకుంటున్న కర్ణాటక సంగీతంగా స్థిరపడింది. 1750 నుంచి 1850 వరకూ సంగీత ప్రపంచంలోనే సువర్ణ శతాబ్దంగా ప్రసిద్ధి గాంచింది. ఈ సమయంలోనే పాశ్చాత్య సంగీతంలో మోట్జార్ట్, బీథోవెన్ వంటి సంగీతజ్ఞులు ప్రకృతి అందాలను తమ సంగీతంలో బంధించగలిగితే, అదే సమయంలో భారతదేశంలో కర్ణాటక సంగీతంలో త్రిమూర్తులయిన త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితార్ మరియు శ్యామశాస్త్రుల వారు కర్ణాటక సంగీతానికి ఎనలేని భవ్యతను సమకూర్చారు. వారిని గురించి తెలీని వారు లేరంటే అతిశయోక్తి కాజాలదు. మామూలుగా అందరికీ తెలిసిన జీవిత చరిత్రను మాత్రమే వ్రాయటం కాకుండా, కొన్ని విశేషాలను అందరి ముందూ ఉంచాలనే సంకల్పంతో రాస్తున్నాను.
–
అసలు భక్తి అంటే ఏమిటి ?
–
“ స్వాతస్మి పరమ ప్రేమ రూపా “
–
అంటే, ఒక వ్యక్తికి ఒక వస్తువు / వ్యక్తిపై ఉండే ప్రేమ, అది దేవుడిపై అయితే దానినే భక్తి అంటాము. ఈ దైవ ప్రేమ నూనె వలే, విభజన లేకుండా, ఆగటం అనేది లేకుండా ప్రవహించాలి. రామానుజులవారు ” భగవంతుని స్వరూపజ్ఞానము, సర్వశక్తిమత్వ, సర్వజ్ఞత / వాత్సల్య, సౌశీల్య, సౌలభ్యాది విలక్షణ గుణముల జ్ఞానమేర్పడిన తరువాత కలిగెడి ప్రేమ నిరంతరము లేక సుస్థిరము. ఎన్ని ఒడిదుడుకులనైననూ ఎదిరించి అవిచ్చిన్నముగా భగవంతుని యందు నిలిచి యుండవలెను. అది నిష్కామంగా, నిర్హేతుకంగా ఉండి సేవాభావంతో నిండి ఉంటుంది” అని వివరించారు.
–
నారదులవారు పేర్కొన్న భక్తి సూత్రాలు తొమ్మిది – శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, వందనం, అర్చన, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. వీటిలో శ్రవణం లో గుణమహత్మ్యాసక్తి, స్మరణాసక్తి, రూపాసక్తి, పూజాసక్తి, దాస్యాసక్తి, సఖ్యాసక్తి, ఆత్మనివేదనాసక్తి, వాత్సల్యాసక్తి, కాంతాసక్తి, పరమావిరహాసక్తి (మధురభక్తి), తన్మయాసక్తి ఉంటాయి. ఇవన్నీ కూడా త్యాగరాజు గారి రచనలలో కానవస్తాయి.
–
గాయక శిఖామణి, కవీశ్వరుడూ అయిన త్యాగరాజువారు, వారి రచనల్లో అనేక రసాలను పోషించారు. రామభక్తి సామ్రాజ్య చక్రవర్తి అయిన త్యాగరాజు గారు రాముడిని సంబోధిస్తూ వ్రాసిన కీర్తనలను జనులతో అన్నవి, అనుభవసారం గలవి, కలికాలాన్ని నిందించేవి, సగుణత్వాన్ని నిరూపించేవి, దివ్య వర్ణన, పూజావిధానం అనే శీర్షికల క్రింద విభజించవచ్చు. రామాయణంలోని ఘట్టాలను ఉదహరిస్తూ తనను నిర్లక్ష్యం చేయక వెంటనే రక్షించమని మొరపెట్టుకున్నారు. తనకు నారదముని ద్వారా ప్రసాదించబడిన “స్వరార్ణవం” గురించి “స్వర రాగ సుధా రస” అనే కృతి లో తెలియచేశారు. వీరు నారదమహాముని ద్వారా “నారదీయము” అనే గ్రంథాన్ని కూడా పొందారు.
–
సారంగదేవుని వర్ణనలో రూపక భంజని అంటే గాయకుడూ తాను పాడుతున్న రచనలో వచ్చే తానాలను మాత్రమే కాక ఆ రాగానికి సముచితమైన ఇతర గమకాలను కూడా చేర్చి, పాటను భూషణాలంకృతం చేయటం. అదే విధంగా స్థాయీభంజని అంటే గమకాలతో కూడిన శ్రావ్యమైన రాగాలాపన అనీ అర్థం. సారంగధర, సంగీతరత్నాకరం లో వివరించిన స్థాయీభంజని, రూపకభంజని లను రీతిగౌళ రాగంలో “ చేర రావదేమిరా ” లో త్యాగరాజుగారు వాడారు. ఖరహరప్రియ రాగం లోని “ చక్కని రాజమార్గములుండగా, సందున దూరనేలా ఓ మనసా” అనే కృతి లో బాగా వెల్లడి అవుతాయి. ” చిక్కని పాలు మీగడ యుండగా, తీయని గంగా సాగరమేలా… కంటికి సుందర తరమగు రూపమే…” అంటూ రామభక్తి యొక్క ఔన్నత్యాన్ని ఎత్తి చూపారు.
–
ఇరవైనాలుగు వేలకు పైగా కృతులు, కీర్తనలు రచించిన త్యాగరాజు గారు మూడు సంగీత నాటకాలను కూడా రచించారు. తెలుగు సాహిత్యంలో శ్రీ త్యాగరాజు గారిని మొట్టమొదట తెలుగు సంగీత నాటికల ( ఓపెరా) రచయితగా పేర్కొనవచ్చును. అవి ప్రహ్లాద భక్త విజయం, నౌకా చరిత్రం, మరియు జానకీ పరిణయం. ఇప్పటివరకూ సుమారుగా 1000 కృతులు మాత్రమే ఉపలబ్ధమౌతున్నాయి. కారణం వారు ఇవేవీ పుస్తకాలుగా వ్రాయకపోవటం, కేవలం భక్తి పారవశ్యంలో పాడుకున్నప్పుడు, వారి శిష్యగణాలు తాళపత్రాల పై వ్రాయగలిగినవి మాత్రం లభ్యమౌతూ ఉండటం కావచ్చు.
–
ప్రహ్లాద భక్త విజయంలో 45 కృతులున్నాయి. అన్నిటిలాగే, ఇది శ్రీరామచంద్రునికి అంకితం చేశారు. ఈ సంగీత నాటికను మొట్టమొదట గురువందనం మరియు మునిగణాలు, తన ఇష్టదైవాలనూ కొలిచే ప్రార్థనలతో ఆరంభించారు. ఈ కృతులలో భక్తి వేదాంతాలు ఒక ఆధ్యాత్మిక స్థాయికి చేరుకుంటాయి. నాటిక రాక్షస రాజయిన హిరణ్యకసిపుడు తన కొడుకైన ప్రహ్లాదుని విష్ణుభక్తికి విసిగి అతడిని హింసల పాలు చేయటంతో ఆరంభం అవుతుంది. ఇందులో సాగరునికి ప్రహ్లాదునికి నడుమ నడిచే సంభాషణ కమనీయంగా ఉంటుంది. నారదమహాముని రాక, ప్రహ్లాదుని విషాదపరిస్థితి, చిట్టచివరిగా అతడి కష్టాలు కడతేరి, శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారంలో దర్శనం ఇవ్వటం ఇందులో ముఖ్య ఘట్టాలు. “ శ్రీ గణపతిని, వాసుదేవయని, వినతాసుత, రారా మా యింటిదాకా, నన్ను విడచి కదలకురా, నారదముని వెడలే, చల్లరే రామచంద్రునిపై, ఎన్నఁగా మనసుకు రాని ” తదుపరి నాటికీ నేటికీ మనం మరువలేని “ మంగళం నీ నామరూపములకు ” ఈ నాటికలో మరపురాని కృతులు. ఈ మంగళం ప్రతి కచ్చేరీకీ చివరన పాడే మంగళం అని అంటే అతిశయోక్తి కానేరదు.
–
ఇక త్యాగరాజుగారి రెండవ సంగీత నాటిక “నౌకా చరిత్రం”. ఇదొక శృంగార నాటిక. దీనిలో ముఖ్యమైన రాసలీలల గోపికల భక్తి వర్ణన ఉంటుంది. ఈ రకమైన శృంగార భక్తిని “మధురభక్తి” అని పేర్కొంటారు. ఇందులో 21 కృతులున్నాయి. త్యాగరాజు తనను శ్రీకృష్ణ ప్రేమలో మునిగిపోయిన ఒక గోపికగా ఊహించుకుని వ్రాసినట్టు అనిపిస్తుంది. ఈ కృతులన్నీ శృంగార రసభరితమైనవి. ఈ నాటిక కూడా
–
ప్రథమ వందనాలు విఘ్న వినాశక గణపతి, చదువులతల్లి సరస్వతి, శ్రీరాముడు, ఆపై నారదమహామునికీ అందచేస్తారు. ఈ కృతులలో కళ్ళకు కట్టినట్టు చేసిన రాసలీలల చిత్రీకరణ వర్ణనాతీతం. సన్నివేశపు ఆరంభం శ్రీకృష్ణుడు, గోపికలతో కలిసి యమునా నదిలో నౌకా విహారానికి వెళ్తాడు. గోపికలకు తనపై గల భక్తి ఎంత గాఢమైనదో పరీక్షించటానికి నదిలో ఒక తుఫానును సృష్టిస్తాడు. నౌక మునగటానికి సిద్ధంగా ఉంది. గోపికలు తమను కాపాడమని కృష్ణునికి విన్నవించి, ప్రార్థించి, బేషరతుగా తమను తాము అర్పించుకుంటారు. కరుణించిన కృష్ణుడు తుఫానును పోగొట్టి, కాపాడి వారి భయాలను తీరుస్తాడు. ఈ సంఘటనను చూసిన దేవతలు సువర్ణ పుష్పవర్షం కురిపిస్తారు. ఈ సంగీత నాటికలో నుంచి ఎక్కువ కృతులు లభ్యం కావటం లేదు. ముఖ్యమైనవి, అందరికీ తెలిసినవి ” ఓడను జరిపే ముచ్చటగనరే “, “గంధము పుయ్యరుగా”, “చాలు చాలు నీ యుక్తులు” మరియు ” శృంగారించుకుని వెడలిరి ” చాలా ప్రసిద్ధిగాంచినవి. ప్రముఖ గాయకులు కీ. శే. పద్మవిభూషణ్ శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ మరియు కీ శే. పద్మశ్రీ శ్రీరంగం గోపాలరత్నం గార్లతో ఆకాశవాణి విజయవాడ వారు ఒక చక్కని కార్యక్రమాన్ని అరవైల్లో రూపొందించి ప్రసారం చేశారు.
–
మూడవ సంగీత నాటిక ” జానకీ పరిణయం ” లేదా ” సీతారామ విజయం ”. ఇది మిగతా రెండు నాటికలంత ప్రసిద్ధి గాంచలేదు. ఇందులోని కథను ఉత్తర రామాయణం లోంచి తీసుకున్నట్టు తోస్తుంది. ఇందులో గల కీర్తనలలో ” మా జానకి చెట్టబట్టగా ” అనే కాంభోజి రాగంలో కృతి త్యాగరాజు గారి సంపూర్ణ రచనలలో అత్యంత లోకప్రియమైనదనేది నిర్వివాదాంశం.
–
ఈ మూడు సంగీత నాటికలలోనూ కూడా మొదటి మరియు చివరి కృతులు ఒకే రాగంలో వ్రాసారు. ఇవే కాకుండా, వీటిలో ఎన్నో పద్యాలను కూడా రచించారు. ఇవి చాలా వరకూ ద్విపద లో ఉన్నా, కందం, సీసం. చూర్ణిక, ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం మొదలైన గ్రాంధిక రూపాల్లో ఉన్నాయి. కొన్ని జానపద గేయాలకు కూడా ఈ సంగీత నాటికలలో ఒక శాశ్వత గౌరవ స్థానాన్ని ఆపాదించారు అని చెప్తారు. కానీ అవేమిటో ఎటువంటి దాఖలాలు లభ్యం అవుతున్నట్టు తోచదు.
–
త్యాగరాజుగారి వ్రాసిన ప్రతి పదమూ వారి హృదయాంతరాలలోంచి పుట్టుకొచ్చింది. ప్రతి పదమూ ఎంతో భావగర్భితంగా తక్షణం మనసుకు హత్తుకునేలా నిజమైన ద్రాక్షాపాకమనిపిస్తుంది. తమిళనాడులో నివసించినా, ప్రతి తెలుగు మనిషికీ గర్వకారమైనాడు త్యాగరాజు. ఇంతటి అద్భుత రచనలు తెలుగు భాషను ప్రపంచానికి అందించి తెలుగును నిజంగా ” ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్ ” గా నిలబెట్టి, సంగీతానికి అత్యంత అనువైన భాషగా ఒక చిరస్థానాన్ని అందచేసిన ఘనత త్యాగరాజుగారిదే. ఎంతవరకూ చారిత్రాత్మక నిదర్శనాలున్నాయో తెలీదు కానీ, కూచిపూడి నృత్యకళాకారుల కోరిక మేరకు, త్యాగరాజు గారు ఆనందభైరవి రాగాన్ని వారికి ధారాదత్తం చేసి, అందులో కీర్తనలు ఏవీ రచించలేదట. కానీ నాకు తెలిసి ఒక ఉత్సవ సాంప్రదాయ కీర్తన – “ రామ రామ నీవారము గామా రామా సీతా రామరామ సాధుజన ప్రేమ రామా” ఉంది. ఇంకేమయినా ఉన్నాయేమో తెలీదు.
–
1961 లో భారత ప్రభుత్వం త్యాగరాజ ఆరాధనా దినాన్ని పురస్కరించుకుని 15 పైసల స్టాంపును విడుదల చేశారు.
***********************************