10_007 అమెరికా ఇల్లాలి ముచ్చట్లు – ప్రేమానురాగం

రాకింగ్ చైర్ లో కూర్చున్న అన్నపూర్ణ, ఆ రోజు మెయిల్ లో వచ్చిన కవర్లన్నీ ఒక్కొక్కటే తెరిచి చూస్తోంది. ఇన్నేళ్ళుగా రోజు వచ్చే మెయిల్ ను ఏనాడు పట్టించుకోని అన్నపూర్ణ ఈ అలవాటు ఈమధ్యనే చేసుకుంది. ఇండియా నుంచి వచ్చే ఉత్తరాలు, శుభలేఖలు, స్నేహితుల దగ్గరనుంచి ఇన్విటేషన్లు, తన కిష్టమైన సేల్స్ కేటలాగ్స్ ఉంటే తప్ప మాములుగా..రొటీనుగా వచ్చే మెయిల్ వంక కన్నెత్తి కూడా చూసేది కాదు.

అన్నపూర్ణ పేరు మీద వచ్చే మెయిల్ కూడా శేఖర్ చూసుకోవాల్సిందే. ఎప్పుడైనా అవసరం పడినప్పుడు, శేఖర్ అంతా సిద్ధం చేసి అన్నపూర్ణ దగ్గరకు తీసుకొస్తే నవ్వుతూ సంతకం పెట్టేసి, వెంటనే తన పనిలో మునిగిపోయేది. గత నెల రోజులనుంచి బిల్లులు వగైరాలతో పాటు అందరి దగ్గరనుంచి వస్తున్న ఉత్తరాలు, కార్డులు చూడటం పూర్తిచేసిన అన్నపూర్ణ చేతిలో చివరిగా రెండు కవర్లు మిగిలిపోయాయి. అందులో ఒకటి అన్నపూర్ణ పని చేసిన ఆఫీసునుంచి, రెండోది భర్త శేఖర్ ఆఫీసునుంచి. అయిష్టంగా, తప్పనిసరిగా రెండు కవర్లను ఓపెన్ చేసి చూసిన అన్నపూర్ణ మనస్సు ఒక్కసారిగా వెనక్కి వెళ్ళిపోయింది.

నలభై ఏళ్ళ కిందట అన్నపూర్ణ పెళ్ళి అనుకోకుండా శేఖర్ తో జరిగిపోయింది. అన్నపూర్ణ రెండో అన్నయ్యకు స్నేహితుడిగా తరచు వాళ్ళింటికి వెళ్ళే శేఖర్, చక్రాల్లాంటి కళ్ళతో చలాకీగా ఎప్పుడూ నవ్వుతూ ఉండే అన్నపూర్ణను చూసి ఇష్టపడ్డాడు. ఆస్తిపరుడైన అన్నగారి అమ్మాయిని చేసుకోమని తల్లి అంటే వినకుండా “ నాకు ఈ అమ్మాయే కావాలి ” అంటూ గప్ చిప్ గా చేసేసుకున్నాడు. శేఖర్ అమెరికా వచ్చిన రెండేళ్లకు అన్నపూర్ణ వచ్చింది. శేఖర్ తనకు వచ్చే జీతంలో ఇక్కడి అవసరాలకు మాత్రమే ఉంచుకుని మిగిలినదంతా తల్లికి పంపించేవాడు. శేఖర్ పెళ్ళికి ముందే, తండ్రిలేని ఇంటికి తనే పెద్దవాడినని, తనకు కుటుంబ బాధ్యతలు ఉన్నాయని అన్నపూర్ణకు చెప్పాడు.

అన్నపూర్ణ అమెరికా వచ్చాక ఇక్కడవున్న అవకాశాలు చూసి, తను కూడా ఏదైనా ఉద్యోగం చేసి శేఖర్ కుటుంబ బాధ్యతల్లో సాయపడాలని నిశ్చయించుకుంది. ఉన్న చదువుకు మెరుగులు దిద్దుకుని మంచి  కంపినీలో అక్కౌంటింగ్ డిపార్ట్మెంటులో ఉద్యోగం సంపాదించుకుంది.

అలా ఉద్యోగంలో చేరిన అన్నపూర్ణ ముప్పయి ఏళ్ళు పైగా పనిచేస్తూనే ఉంది.

ఇన్నేళ్ళల్లో అన్నపూర్ణ కొన్నిసార్లు అనుకోకపోలేదు ఉద్యోగం మానేద్దామని. మొదట్లో శేఖర్ చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు, తమ్ముళ్ళ చదువులు తోటి కొన్ని ఏళ్ళు గడిచాయి. రెండో పాప పుట్టిన తర్వాత పిల్లలిద్దర్నీ చూసుకుంటూ ఇంట్లో ఉండిపోదామనుకుంది. కానీ ఇంకా ఇండియాలో పూర్తిగా తీరని బాధ్యతలు, కొత్తగా కొనుక్కున్న ఇంటి తాలూకు మార్టిగేజ్ గుర్తుకొచ్చి ఆ ఆలోచన విరమించుకుంది. ఇంకో రెండేళ్లకు బాబు పుట్టాడు. భర్త..పిల్లలు…ఇల్లు…ఉద్యోగంతో అన్నపూర్ణకు ఎప్పుడూ క్షణం తీరుబడి ఉండేది కాదు. పిల్లలు పెరుగుతున్న కొద్దీ వాళ్ళ స్కూళ్ళు, హోంవర్కులు, ఆటలు, పాటలు, ఇంటిపనులతో, వచ్చేపోయే అతిధులతో అన్నపూర్ణకు ఇరవైనాలుగు గంటలు సరిపోవడంలేదనిపించేది.

అన్నపూర్ణకు మళ్ళీ అనిపించింది ఉద్యోగం మానేసి ఇంటిపట్టున ఉంటే ఎలా ఉంటుందీ అని.

మళ్ళీ అంతలోనే “అమ్మో! పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. అందులో రెండేళ్ళ తేడాతో ముగ్గురూ వరుసగా కాలేజీలకు సిద్ధం అవుతారు. ఇప్పుడు మానేస్తే ఎలా అనుకునేది. అన్నపూర్ణ అనుకున్నట్టుగానే పిల్లల చదువులయ్యేసరికి తడిపి మోపెడయ్యింది. పిల్లలకు ఉన్నచోట కాలేజీలకు వెళ్ళటానికి నామోషి. ముగ్గురూ వాళ్ళ కిష్టమైన కాలేజీలు ఎన్నుకుని, అక్కడికి తప్ప వేరే చోటుకు వెళ్ళం అని నిష్కర్షగా చెప్పారు. ముందు గుండె గుభేలుమన్నా, పోనీలే పిల్లలు మంచి కాలేజీలకు వెళ్తాం అంటే కాదనటం ఎందుకు? వాళ్లకు మంచి భవిష్యత్తు ఉండాలనే కదా ఇంతదూరం పడి వచ్చిందని సర్దిచెప్పుకున్నారు భార్యాభర్తలు. అబ్బాయి కూడా కాలేజీలో చేరాక అన్నపూర్ణ మళ్ళీ అనుకుంది ఇక ఉద్యోగం మానేద్దామా అని.

అబ్బాయి మనసులో ఏముందో తెలీదు కానీ, ఆడపిల్లలు మాత్రం సందర్భం వచ్చినప్పుడల్లా వాళ్ళకు ఎలాంటి పెళ్ళిళ్ళు కావాలో చెప్పటం మొదలు పెట్టేవారు. వాళ్ళు అనటమే కాదు, అన్నపూర్ణ కూడా చూస్తూనే ఉంది. ఈమధ్య జరిగే పెళ్ళిళ్ళు ఫైవ్ స్టార్ హోటళ్ళలో ఎంతో గ్రాండుగా, గ్లామరస్ గా చేస్తున్నారు అందరు. ఒక్కరోజు కోసం ఇన్నివేల డాలర్లు ఖర్చుపెడుతున్నారే అని అనుకున్నా, అంతలోనే జీవితంలో ముఖ్యమైన వాటికి ఖర్చు చేసుకోకపోతే, ఎందుకు ఇంత కష్టపడటం అని అనుకునేది అన్నపూర్ణ. పెళ్ళిళ్ళంటే ఇండియాలోనే కాదు, అమెరికాలో కూడా పెద్ద ఖర్చే అని తెలుసుకున్న అన్నపూర్ణ ఉద్యోగం మానేద్దామనే ఆలోచన విరమించుకుంది!

శేఖర్, అన్నపూర్ణలు కూడా అందరి తల్లిదండ్రుల లాగే పిల్లలకు కావాల్సినట్లే చదువులు చెప్పించి, వాళ్ళు ఎన్నుకున్నవారితోటే పెళ్ళిళ్ళు చేసి వాళ్ళ బాధ్యత నెరవేర్చుకున్నారు. పిల్లలు ముగ్గురూ తలా ఒక మూలకు వెళ్ళిపోయారు.

శేఖర్ ఒకరోజు అన్నపూర్ణతో “ ఇంక చాలు..కష్టపడినన్నాళ్ళు కష్టపడ్డాం. ముఖ్యంగా నువ్వు నాకంటే ఎక్కువగా  శ్రమపడుతూనే ఉన్నావు. యూ డిజర్వ్ ఎ బ్రేక్. ఇద్దరం రిటైర్ అవుదాం” అన్నాడు. “ ఇన్నాళ్ళు బిజీగా ఉండటానికి అలవాటుపడ్డ వాళ్ళం, ఉన్నట్టుండి రిటైరయ్యి ఏం చేస్తాం? ” అంది అన్నపూర్ణ అమాయకంగా.

“ ఏం చేయటమేమిటోయ్! ఇన్నాళ్ళుగా చేయలేనివన్నీ చేద్దాం ” అన్నాడు శేఖర్ హుషారుగా!

“ ఇండియా వెళ్ళి అందర్నీ చూడాలి, తీరుబడిగా ఎంజాయ్ చెయ్యాలన్న నీ కోరిక కోరికలాగానే ఉండిపోయింది కదా? ముందుగా ఆ కోరిక తీరుస్తాను. ఆ తర్వాత నాకు పెద్ద ప్లాను ఉంది. ఈ ప్రపంచంలో చూడాల్సినవి, చెయ్యాల్సినవి ఎన్నో ఉన్నాయి. ఇన్నాళ్ళు మనకు టైము లేక చెయ్యలేకపోయాం. ఆ తర్వాత నీ హాబీలు..నా హాబీలు…వాలంటీర్ సర్వీస్..ఇలా బోలెడన్ని ఉన్నాయి. ఇకనుంచి నాకు నువ్వు – నీకు నేను అన్నట్టు బతుకుదాం. నీకు ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి వెళ్లటం…ఏం చెయ్యాలనిపిస్తే అది చేసేయడం నీకు హనీమూనోయ్! ” అంటూ ఆట పట్టించడం మొదలు పెట్టాడు.

శేఖర్ మాటలు వింటుంటే అన్నపూర్ణకు కూడా ఉత్సాహం వచ్చింది.

మళ్ళీ అంతలోనే “ అమ్మో! ఇవన్నీ చేయాలంటే ఎంత ఖర్చు? పైగా ఉద్యోగాలు కూడా మానేస్తున్నాం ” అంది అన్నపూర్ణ.

శేఖర్ వెంటనే “ నాకు తెలుసు నువ్వు ఇలా అంటావని. ఏం ఫరవాలేదు. ఉన్నదాంట్లోనే సర్దుకుంటాం. మనమేమి దుబారా మనుషులం కాదు కదా. ఇన్నాళ్ళు నా వాళ్ళ బాధ్యతలు, నీ వాళ్ళ బాధ్యతలు, మన సంసార బాధ్యతలు, పిల్లల చదువులు వగైరా వగైరా అంటూ చేస్తూనే వచ్చాం. ఇప్పుడు అవన్నీ అయిపోయాయి. అందరికీ వాళ్లకు కావాల్సినట్టుగా, వాళ్ళ ఇష్టం మేరకు అన్నీ చేసాం. అందరూ ఎవరికి కావాల్సినట్టుగా వారు బతుకుతున్నారు. అంతదాకా ఎందుకు, మన పిల్లలే చూడు వాళ్ళ కిష్టమైన చదువులు చదువుకుని, వాళ్ళకిష్టమైన వాళ్ళను పెళ్ళి చేసుకుని, వాళ్ళకిష్టమైన చోటికి వెళ్లారు కదా? అలాంటప్పుడు మనం కూడా మన కిష్టమైన రీతిలో మన జీవితం గడపటానికి ఎందుకు సంకోచించాలి? ఇక డబ్బు అంటావా, ఇన్నాళ్ళు మనకు ఖర్చులున్న మాట నిజమే. మనకొచ్చే పెన్షన్ డబ్బుతో, మన సేవింగ్సులతో వుయి కెన్ మేనేజ్. అంతగా అవసరం అయితే ఐ కెన్ ఆల్వేస్ గెట్ ఎ జాబ్ ” అన్నాడు.

శేఖర్ ఇలా నచ్చచెప్పడంతో అన్నపూర్ణ కూడా ఆలోచించసాగింది.

శేఖర్ అన్నట్టు ఈ దేశం వచ్చింది మొదలు బాధ్యత…బాధ్యత అంటూ బరువు మోయటం తోటే సరిపోయింది.

శేఖర్ అమెరికా వెళ్తున్నాడని తెలియగానే తల్లి “ కానీ కట్నం లేకుండా నీకిష్టమైన పిల్లను చేసుకుని దేశం వదలి వెళ్ళిపోతున్నావు… మరి నీ వెనక ఉన్న చెల్లెళ్ళు, తమ్ముళ్ళ మాటేమిటి? ” అంటూ సూటిగా అడిగింది. శేఖర్ తల్లికిచ్చిన మాట ప్రకారం ఆడపిల్లలకు మంచి సంబంధాలు చేసాడు. తమ్ముళ్ళిద్దరికీ మంచి చదువులు చెప్పించాడు. తల్లిని ఇక్కడికి తీసుకొచ్చి తమతో ఉండటానికి అన్ని ఏర్పాట్లు చేసాడు.

“ నన్ను అమెరికా ఎప్పుడు తీసుకెళ్తావు? ” అంటూ అడిగిన తల్లి, తీరా ఇక్కడికి వచ్చాక “ నేను ఇక్కడ ఉండలేను. మీదంతా ఉరుకులు-పరుగుల వ్యవహారం. నాకంటూ ఒక ఇల్లు ఏర్పాటు చెయ్. కృష్ణా రామా అనుకుంటూ అక్కడే ఉంటాను” అంటూ సౌకర్యమైన మంచి ఇల్లు కొనిపించుకుంది శేఖర్ చేత.

ఎంత చెట్టుకు అంత గాలి అని అమెరికా వచ్చినందుకు ఒకరకంగా సుఖపడినా, ఇక్కడుండే బాధలు, చిక్కులు, సమస్యలు ఇక్కడా ఉన్నాయి. అవి ఎవరికి వారు అనుభవించాలే గాని ఇంకొకరికి చెప్పేందుకు, ఇంకొకరు తీర్చేందుకు ఉండవు.

“ ఇన్నాళ్ళు ఇంకొకరికోసం అన్నట్టు కష్టపడ్డాం. ఇప్పుడైనా మన కోసం మనం అన్నట్టు బతుకుదాం ” అన్న శేఖర్ మాటల్లో ఎంతో నిజం ఉందనిపించింది అన్నపూర్ణకు. భర్త పైకి చెప్పటం లేదు గాని ఉద్యోగరీత్యా తరచు ప్రయాణాలు చేసే అతనికి, వెనకటి శక్తి, ఓపిక తగ్గుతున్నాయని గ్రహించింది అన్నపూర్ణ.

భార్య ఎక్కడ మనసు మార్చుకుంటుందో అని అన్నపూర్ణ “సరే” ననడం తరువాయి అనుకున్న ప్లాను అమలులో పెట్టసాగాడు శేఖర్. ఇద్దరూ రెండు వారాల తేడాతో ముందు అన్నపూర్ణ తరువాత శేఖర్ రిటైరు అవడానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి.

శేఖర్ ఉహించినట్లే ముందు ఇండియా వెళ్ళి అందర్నీ చూసి వద్దాం అంది అన్నపూర్ణ. ఇండియా నుంచి తిరిగి వచ్చాక స్థిమితంగా ఆలోచించుకుని అవసరమైన మార్పులు చేసుకోవడానికి నిశ్చయించుకున్నారు. అన్నపూర్ణ ఉత్సాహంగా ప్రయాణానికి సిద్ధం అవసాగింది.

“ ఎప్పుడొచ్చినా ఇలా మొహం చూపించి అలా వెళ్ళిపోతావు ” అంటూ నిష్టూరాలాడే అక్కయ్యలను పిలిచి, “ ఇదిగో వచ్చేస్తున్నా” అంటూ బెదిరించి ఫోనులో వేళాకోళాలాడింది!

ఇకనుంచి “ టైము లేదు ” అన్న సమస్య లేకుండా పరుగులు పెట్టాల్సిన పని లేకుండా, శేఖర్ తో కలిసి జీవితాన్ని నింపాదిగా, హాయిగా అనుభవించవచ్చు అన్న ఆలోచన అన్నపూర్ణకు ఎంతో తియ్యగా అనిపించింది!

ఒకరోజు శేఖర్, “ మన టిక్కెట్లు వచ్చేసాయట, వెళ్ళి పట్టుకొచ్చేస్తాను. నేను రాగానే మనం బయటకు వెళ్ళి డిన్నరు చేద్దాం. నువ్వు వంట అదీ పెట్టుకోకు ” అంటూ మరీ చెప్పి వెళ్ళాడు. టిక్కెట్లు తీసుకుని తిరిగి వస్తున్న శేఖర్ కు మధ్య దోవలో తీవ్రంగా గుండెల్లో నెప్పిరావడం, అంబులెన్స్ లో హాస్పిటల్ కు వెళ్లటం, అక్కడినుంచి అటే శాశ్వితంగా టిక్కెట్టు తీసుకుని శేఖర్ ప్రయాణం కట్టేయడం అంతా ఒక కలలాగా అయిపొయింది. అందరూ రావడం, జరగాల్సినవి జరగడం ఎక్కడి వాళ్ళు అక్కడ సర్డుకోడం సినిమాలో రీలులాగా జరిగిపోయింది.

ఈ నెల రోజుల్లో అన్నపూర్ణ శరీరం, మనసు అంతా ఒక చల్లని మంచు ముద్దలా అయిపొయింది.

“ తోడుగా – నీడగా నీ వెన్నంటే నేను ఉంటాను ” అన్న భర్త అకస్మాత్తుగా తనను ఇలా వంటరిగా వదలి వెళ్లిపోయాడంటే నమ్మశక్యం కావడంలేదు అన్నపూర్ణకు. “ నాకు నువ్వు – నీకు నేను అన్నట్టు బతుకుదాం ” అన్న శేఖర్ “ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఎలా ఉన్నాడు? ఏం చేస్తున్నాడు?” అని అన్నపూర్ణ గత నెల రోజులుగా ప్రతి క్షణం ఆలోచిస్తోంది.

అన్నపూర్ణలో అణువణువు శేఖర్ కోసం పరితపిస్తోంది. “ నీ పక్కనే ఉండి నిన్ను అనుక్షణం చూసుకుంటాను ” అన్న శేఖర్ దగ్గరకు వెళ్లిపోవాలని అన్నపూర్ణ మనసు తహతహలాడుతోంది. నలభై ఏళ్లుగా శేఖర్ ప్రేమానురాగాల్లో తడిసిన అన్నపూర్ణ హృదయం నెల రోజులుగా బీటలు వారిపోయింది.

ముప్పయి అయిదేళ్లుగా తమ కంపెనీకి సర్వీస్ అందచేసిన అన్నపూర్ణకు కృతజ్ఞతలు తెలుపుతూ, రిటైరుమెంటు కాలాన్ని ఆనందంగా గడపమంటూ అభినందనలు తెలియచేస్తున్న లెటరు, భర్త హఠాత్ మరణానికి విచారిస్తూ…అతని లైఫ్ ఇన్స్యూరెన్స్ చెక్ జత చేసి పంపిస్తున్నామన్న లెటరు అన్నపూర్ణ ఒడిలో ఉన్నాయి.

ఇప్పుడు ఈ టైము, ఈ డబ్బు ఏం చేసుకోవాలో తెలీక అన్నపూర్ణ వాటివంకే చూస్తుండిపోయింది నిర్లిప్తంగా.

అంకితం:

జంటగా ఎన్నో ఏళ్ళుగా మోస్తున్న బరువు బాధ్యతల్ని అప్పుడప్పుడే దించుకుంటూ…స్వేచ్ఛావాయువుల్ని పీల్చుకుంటున్న తరుణంలో హఠాత్తుగా జీవితభాగస్వాములను కోల్పోయిన ఆత్మీయులకు…………..

 

( తొలి ప్రచురణ 2008 “ తెలుగు జ్యోతి ” ఉగాది ప్రత్యేక సంచిక)

ప్రేమానురాగం- నేపథ్యం



మనిషి జీవితం చాలా చిత్రంగా అనిపిస్తుంది. ఎంతో మంది ప్రముఖులు వారి జీవిత అనుభవాల్ని చెప్తున్నప్పుడు వాళ్ళు “ తినగల వయసులో తినడానికి తిండి ఉండేది కాదని, ఆ తర్వాత ఏం కావాలన్నా  కొనుక్కుని తినగల స్తోమత వచ్చినప్పుడు, పట్టెడన్నం కూడా హరాయించుకోలేని స్థితిలో ఉన్నాం ” అని అనటం మనం తరచు వింటూ వుంటాం. అది ఒక్క ఆర్ధికపరంగానే కాదు ఎన్నో విషయాల్లో జరుగుతూ ఉంటాయి. మనుష్యులు ఉన్నప్పుడు వారితో మాట్లాడానికి.. వారితో గడపటానికి మనకు సమయం ఉండదు. మనకు సమయం ఉన్నప్పుడు ఆ మనష్యులు ఉండరు. అలాగే బాద్యతలతో తలమునకలై ఉన్న భార్యాభర్తలు అమ్మయ్య! తెరపిన పడుతున్నాం అని సంతోషపడే లోపు జీవిత భాగస్వామిని కోల్పోతూ ఉంటారు. కొన్ని ఏళ్ళ కిందట ఒక మూడు నాలుగు సంవత్సరాల తేడాలో కొంతమంది ఆత్మీయులు హఠాత్తుగా వెళ్లిపోవడం, తద్వారా వారి జీవితాల్లో ఏర్పడిన ఆ వెలితి… ఆ బాధ నా చేత ఈ కథ రాయించింది.