రత్తాలూ రాంబాబూ – పరిచయం
గతంలో అనేక సందర్భాలలొ మనవి చేసుకున్నట్టు, ఈ పరిచయాల లక్ష్యం పరిచయం చేయబోయే రచయితల గురించీ వారి సాహితీ వ్యాసంగం గురించీ, ఈ పరిచయ కర్త కు ఉన్న అర కొర జ్ఞానం మేరకు సంక్షిప్తం గా పాఠకులకు తెలియజేయడం కోసమే. పరిచయం చేయబొయే రచయితల రచనలు ప్రస్తుత కాలం లో ఎవరూ ముద్రించడం లేదు. వార, మాస పత్రికల వ్యాపార విస్తరణ కి ఇలాంటి విషయాలు ఉపయోగపడవు కనక వారు ఇలాంటి పనులకు పూనుకోరు. కొందరు ఔత్సాహిక సాహితీ ప్రియులు చేతులు కాల్చుకున్నారు.
ఈ పరిచయాల ప్రధాన ఉద్దేశ్యం మరుగున పడిన మాణిక్యాలను వెలుగులోకి తీయడమే.
ఈ నవల మొత్తం నాలుగు సంపుటాలు గా వెలువడింది. రాంబాబు మిత్రుల సహాయం తో రత్తాలును ఒక దరికి చేరుస్తాడు. అతను కలెక్టరు అవుతాడు. ఇటువంటి వారి జీవితాలు వివాహబంధం తో ముడిపడి, కథలోని దుష్థపాత్ర లకి శిక్ష పడి / వారిలో పరివర్తన వచ్చి శుభం కార్ద్ పడడం తెలుగు సినిమాలలో జరగవచ్చు.
ఈ ప్రయత్నం లో రాంబాబుని అతని ప్రియురాలు వసంత వదిలేస్తుంది. స్నేహితుడు క్రిష్ణ కి మొదట్లో రాంబాబు ప్రయత్నాలు అంత గా రుచించవు. కానీ తరవాత అర్ధం చేసుకుని చేదోడు గా ఉంటాడు. ఒక సంధర్భం లో రాంబాబు కోరిన మేరకు నరసమ్మ మనిషి అడ్డబుర్ర ద్వారా రత్తాలి అవసరాలకు డబ్బు పంపుతాడు.
రాంబాబు ఇంకో స్నేహితుడికి మందుల షాపు ఉంటుంది. రాంబాబు కలెక్టర్ అవుతాడని అతనికి గట్టి నమ్మకం. ” పనికొస్తాడులే ” అని స్నేహం నటిస్తూ, రాంబాబు తల్లి టీచరమ్మని పిన్నీ అని పిలుస్తూ చనువుగా ఉంటో ఉంటాడు. ఒకసారి రత్తాలు పని మీద రాంబాబుకి అయిదు వందల రూపాయలు కావలసి వచ్చి ఇతన్ని అడుగుతాడు. ఇద్దామంటే, ఇచ్చిన అయిదు వందలూ తిరిగి రావేమో అన్న భయం, ఇవ్వకపోతే ఇంత కాలం నటించిన స్నేహపు ప్రదర్శన భావిలో పనికి రాకుండా పొతుందేమో అనే భయాల మధ్య ఊగిసలాడి అఖరికి అదే రోజు రాత్రి తన స్నేహితుల తో కలసి జరుపుకునే పార్టీ సమయానికి రమ్మని పిలిచి అందరి సమక్షం లోనూ డబ్బు ఇస్తే సాక్ష్యం ఉంటుంది అని భావించి అక్కడకి రమ్మని పిలుస్తాడు. వెళ్ళిన రాంబాబు కి ఆ వాతావరణం, అక్కడి వారి ప్రవర్తనా నచ్చకపోవడం అక్కడ గొడవ పడవలసి వస్తుంది. అనంతరం కానా గట్టు మీద ఆదమరచి నిద్రపోతున్న రాంబాబుని తెల్లవారుఝామున గుర్తించిన చిన్ననాటి భోళా ప్లీడర్ గుమస్తా స్నేహితుడు తనకు తెలిసిన ఇంకో పెద్ద గుమస్తాను పట్టుకుని ఒక కాబూలీవాలా దగ్గర తాను హామీ గా ఉండి డబ్బు ఇప్పిస్తాడు.
బయట పడిన రత్తాలు ఒక ఇంట్లో పనిమనిషి గా చేరి ఇంటావిడ మెప్పు పొందడం, కొంతకాలానికి రత్తాలు గతం తెలుసుకున్న ఇంటావిడ రత్తాలుని అనుమానించడం జరుగుతుంది. మొత్తం మీద ఎక్కడా నేల విడిచి సాము చెయ్యడం ఉండదు. కథ, కథనం, వాస్తవ పరిస్తితులకు దగ్గర గానే ఉంటాయి.
గంగరాజెడ్డు గారిని పరామర్శించక పోతే నవల పరిచయం అసంపూర్ణం. కథా ప్రారంభకాలానికి వారు ” డిపాట్మెంట్లో ” హేడ్ కానిస్టేబుల్ గా పరిచయం అయి ముగింపు సమయానికి ఎస్సయి గా మారి, రత్తాలు ఒకసారి టేసన్ కి వెళ్ళిన సందర్భం లో ఆమె ని చూసి ఎవరో పెద్దింటి ఆవిడ అనుకుని కంగారుపడి సీట్లోంచి లేచి నుంచుని నమస్కరిస్తాడు. అప్పటికి ఆయన ప్రమోషన్ కోసం డిపాట్మెంటోళ్ళతో తగవులూ, పేచీలూ, గొడవలూ పడి కోర్ట్ కి ఎక్కి మొత్తానికి ఎస్సై అవుతారు, కానీ ఎస్సై అయ్యేసరికి, సినికల్ అయిపోతారు. మునుపటి నిదానం, ధైర్యం పోయి, కంగారుగొట్టు, పిరికి మనిషి గా మారిపోతారు.
తన కింద పనిచేసే కానిస్టెబుల్ శిశువుకి వీరు తరచుగా చేసే హితబోధలూ, లోకం తీరు గురించీ, డిపాట్మెంట్లోని పెద్ద దొరల గురించీ వీరు చేసే వ్యాఖ్యలూ మనకి కూడా జ్ఞానభోధ ని చేస్తాయి.
గంగరాజెడ్డు గారు శిష్యుడి తో కలసి బీటు కొట్టే డూటీ చేసే సమయం లో మద్దేనపేళ హొటల్లో ని ఫామిలీ రూము లో ఫాను కింద కూర్చుని తమ అధికార చిహ్నాలైన లాఠీ టోపీ లకు పక్క సీట్లో ఉచితాసనం కల్పించి, హొటలాయన ఖర్చుతో బీరూ, పలావూ సేవిస్తూ శిశువు కి లోక జ్ఞానబోధ చేస్తున్న సమయం లో బయట ఒక గలాటా అవుతున్నట్తు గ్రహిస్తారు. అలర్టైన శిశువు కంగారు పడి, టోపీ సర్దుకుని లాఠీ, తీసుకుని లేవబోతూండగా, గంగరాజెడ్డు గారు శిశువుని చేతి సైగ తోవారించి, నిదానంగా భోజన కార్యక్రమం ముగించుకుని బయటకు వచ్చి scene of offence ని అవగతం చేస్తారు.
అదేమిటంటే, ఒంటినిండా బంగారం దిగెట్టుకున్న ఒక బొబ్బిలావిడ ని ఏమార్చి, ఆవిడ మనవరాలిని ఎత్తుకొచ్చిన సివాసెలం ఆ పిల్ల ఒంటిమీద నగలు ఒలుచుకోవడం కోసం ఇదే హొటల్లో గంగరాజెడ్డు గారు కూర్చున్న రూము పక్క ఫామిలీ రూం లోనే కూర్చుంటాడు. మనవరాలిని వెతుక్కుంటూ వచ్చిన బొబ్బిలావిడ మనవరాలి ఏడుపు విని గలాభా చెయ్యగా అప్పుడు గంగరాజెడ్డు గారు అలర్టయ్యి బొబ్బిలావిడని దొంగ పోలికలు అడిగి, హొటలు తలుపులు మూయించి నాకాబందీ సెకింగ్ చేసినా సివాసెలం చొక్కా, తలకట్టూ మార్చుకుని మనవరాలిని వదిలేసి మాయం అవుతాడు. మనవరాలు దొరికిన సంతోషంలో బొబ్బిలావిడ గంగరాజెడ్డు గారికి పదిహేను రూపాయలు చదివించుకోబోగా ఆయన అగ్గిమీద గుగ్గిలం లా మారి ఈ పదేను రూపాల్తో ఏటి సెయ్యమంతవమ్మా ? బుర్ర గోరిగించుకోవాలా? గెడ్డం గీయించుకోవాలా ? ఏదో ఒకటే వస్తుంది, రొండూ రావు, అని చీత్కారం చెయ్యగా బొబ్బిలావిడ హేడ్డు గారిని సముదాయించి, వారి మీద కలిగిన కోపాన్ని జెస్టముండా అని మనవరాలిని తిట్టి తీర్చుకుంటుంది.
ఈ సందర్భం లో ఆహం దెబ్బతిన్న గంగరాజెడ్డు గారు బొబ్బిలావిడకీ, హొటల్ యజమానికీ, నీలం చొక్కా స్టూడెంట్ కుర్రాడికీ, శిశువుకీ చేసిన బోధలూ, జనాతికం గా విసిరిన విసుర్లూ మనకి చాలా విషయాలు తెలియజేస్తాయి.
ముత్యాలూ, రిక్షా జోగులూ అడ్డ బుర్ర లాంటి వారు తాడిత పీడిత వర్గానికి ప్రతినిధులు. ఇందులో సందేహం లేదు కానీ వారి పక్కన నరసమ్మనీ, సన్నమ్మడినీ, సివంసెలం నీ, షేక్ బంగారప్ప తాలూకు రాకెట్ స్పుత్నిక్ బేచీనీ ఇలాంటి మరికొన్ని పాత్రలనీ కూడా ఈ తాడిత, పీడిత కోవ లోకి రావిశాస్త్రి గారు ఎందుకు చేర్చారా ? అని మనకు ఈ నవల చదివాక ఒక సందేహం కలుగుతుంది.
ఈ నవలలోని కథా, కధనం, శైలీ ఉత్తమం గా ఉంటాయి. నవల లోని అనేక అంశాలనూ సన్నివేశాలనూ వదిలి చాలా సూక్ష్మం గా మాత్రమే పరిచయం చేయడం జరిగింది. సాహితీ ప్రియులందరూ తప్పకుండా చదవవలసిన పుస్తకం.
రత్తాలూ – రాంబాబూ రచనా కాలం రావిశాస్త్రి గారు యెమర్జెన్సీ కాలం లో జైలు లో ఉన్న సమయం.
ఈ రచన ఆంధ్రజ్యోతి వార పత్రిక లో ధారావాహికం గా ప్రచురించబడింది. ఆ కాలం లో పాఠకుల ఆదరాభిమాలకు విశేషంగా లోనై ముద్రణలూ, పునర్ముద్రణలూ పొందిన ఈ పుస్తకం ప్రస్తుతానికి, పుస్తకాల దుకాణాలలో దొరకటం లేదు, పుస్తకమేళాలలో కానీ, ఆమెజాన్ వంటి అంతర్జాల విక్రయశాలలో కానీ దొరకవచ్చు.
మూడు కథల బంగారం
రావిశాస్త్రి గారి మరో పెద్ద కథ మూడు కథల బంగారం. ఈ కథలో బంగారం వలన మనిషి జీవితం ఎలాంటి ప్రభావాలకీ, ప్రలోభాలకీ లోనవగలదో పరోక్షం గా ప్రస్తావించబడుతుంది. ప్రత్యక్షం గా ఇది ప్లీడరు గుమస్తా గారి కొడుకు బంగారుబాబు అనే మనిషి అమాయక బంగారు బాబు నుంచి జేబులు కొట్టే బంగారి గాడిగా, సారా రెంటర్ బంగారయ్య గారిగా ఎలా మారాడో, మారి సమాజాన్ని ఎలా శాసించాడో, శాసించి తాను ప్రేమించిన ఆవిడ కోసం అవన్నీ ఎలా ఒదులుకున్నాడో చెప్పే కథ. ఈ మూడు కథల బంగారం లో లేని నాలుగో కథ వియత్నాం విమల కథ.
ఈ కథలోని ఇమలమ్మే బంగారయ్య గారి భార్య విమల. బంగారు బాబు కథ – ఆ తరవాత వియత్నాం విమల కధ, బంగారిగాడి కథ, కడవలూరి వీరవేంకట సత్యనారాయణ అనే బంగారయ్య గారి కథ… ఈ వరసలో పరిచయం చేసుకోవడం సమగ్రం గా ఉంటుంది.
బంగారుబాబు ఒక బక్కచిక్కిన ప్లీడర్ గుమాస్తా గారి కొడుకు. గుమాస్తా గారు అల్పజీవి లోని సుబ్బయ్యకు నకలు. పిల్లి లాంటి మనిషి. అయితే మునసబు గారి ధాన్యం గాదె పక్కన నక్కి కూర్చుని గాదె లో దూరబోయే ఎలకలనీ, పందికొక్కులనీ వేటాడి భక్షించి సుఖంగా బద్ధకం గా జీవించే గండు పిల్లి లా కాకుండా, బోడి బాపనమ్మ గారింట్లో సంధ్య వేళ గుడ్డి నూనె దీపం వెలుగు లో ఆవిడ తింటున్న నీళ్ళ మజ్జిగ అన్నం పిడచల కోసం ఆవిడ కేసి ఎగాదిగా చూస్తూ మ్యావ్ మ్యావ్ మని నీరసం గా జాలి గా మూలిగే బక్కచిక్కిన ముసలి పిల్లి లా ఉంటాడు. అతని యజమాని ప్లీడరు గారు కూడా ఈ కోవ లోని మనిషే. బంగారు బాబు చిట్టి చెల్లిని బంధువుల కుర్రాడు ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి మిఠాయి కొంటానని బయటకు తీసువెళ్ళి ఆ పిల్ల చెవికి వేలాడుతున్న ఏకైక ఆభరణం అణా ఎత్తు పాళా బంగారం చెవి పోగులని మాత్రం ఒలుచుకుని ఆమెని శవం గా మార్చి మాయం అవుతాడు. తండ్రి అసమర్ధుడు, బంగారు బాబు నాలుగైదేళ్ళ వయసువాడు. సవత్తల్లి కి ఇది అవసరం లేని విషయం. అప్పుడు అతనికి బంగారం విలువ కొంత అసమగ్రంగా బోధ పడుతుంది.
కొన్నాళ్ళయ్యాక ఒకరోజు ఉదయం ఒక రోడ్డు రోలర్ సైజ్ మనిషి రైల్ ఇంజన్ లా రంకెలు వేస్తూ. తండ్రిని తిడుతూ ఉండగా తండ్రి చేతులు నులుపుకుంటూ, ఏదో నెమ్మదిగా గొణుగుతూ ఉంటాడు, అదీ బంగారానికి సంబంధించిన విషయమే.
కొన్నాళ్ళయ్యాక తండ్రి చనిపోవడం తో తదనంతర పరిణామాలు బంగారుబాబు ని ఒంటరి వాడిగా, దిక్కు లేని అనాధ గా మారుస్తాయి. అతను ఒక ఇల్లు లేని మనిషై గాలికి పెరగవలసి వస్తుంది.
అదే కాలఘట్టం లో ఆ ప్రాంతపు వేరే ఉరిలో ఒక రిటైర్ అయిన రైల్వే ఇంజనీయర్ గారు ఉంటారు. మనకి ఒక్క మేఘ శలకం కూడా లేని నీలాకాశం చాలా అరుదు గా కనిపిస్తుంది. ఇతను అలాంటి మనిషి, సర్వీసు మొత్తం మీద ఒక్క కళంకం లేదు. ఇతని నిజాయితీ ని గుర్తించిన పై అధికారులు ఇతన్ని ప్రమోట్ చేయకుండా జూనియర్ గానే దిగ్గొట్టి ఉంచి గౌరవించారు. ఇతని సంతానం ఇద్దరు పెద్ద మొగ పిల్లలు ముగ్గురు చిన్న ఆడపిల్లలూ. భార్య అనుకూలవతే కానీ జబ్బు మనిషి. రిటైర్ అయ్యేనాటికి ఇద్దరు మొగ పిల్లలనీ శక్తిమేరకు బాగా చదివించగా వారు మంచి ఉద్యోగాలు సంపాదించుకుని, మంచి సంబందాలు చూసుకుని పెళ్ళిళ్ళు చేసుకుని వారి బతుకులు వారు బతుకుతున్నారు. ఫై సంపాదనకు అలవాటు పడలేదని తండ్రిపై వారికి కోపం.
పెద్దమ్మాయిని సౌందర్య పిపాసి అయిన ఒక బియ్యపు మిల్లు యజమాని కొంచెం తక్కువ కట్నం తీసుకుని పెళ్ళి చేసుకున్నాడు. అతను పెద్ద గా ఉన్న తెల్లటి చలిమిడి ముద్ద కి ముక్కూ చెవులూ అతికినట్టు గా ఉంటాడు.
ప్రస్తుతానికి ఆయన దగ్గర రిటైర్ అవగా వచ్చిన దాంట్లో పెద్దమ్మాయి పెళ్ళికి ఖర్చవగా మిగిలిన కొంచెం డబ్బూ, జబ్బు మనిషైన భార్యా, సరళ, విమలా అనే ఇద్దరు పెళ్ళి చేయవలసిన పిల్లలూ ఉన్నారు. సొంతిల్లు లేని కారణం గా అద్దింట్లో కాలక్షేపం. ఈయన కి కథలో ప్రత్యేకించి పేరు లేదు. విమల తండ్రిగానే రచయిత మనకి పరిచయం చేస్తారు. ఈయన మంచితనం గురించి విన్న ఒక రైల్వే ఉన్నతోద్యోగి ఈయనతో పరిచయం పెంచుకుని స్నేహం గా ఉంటాడు. అతను కూడా రిటైర్ అయినవాడే.
**************************************