10_007 పాలంగి కథలు – అత్తారిల్లు మొదటిరోజు

హాల్‌లో గడియారం అరగంట కొట్టింది టంగ్‌మంటూ! 6.30 అయిందన్నమాట! ఇంక క్షణమైనా గదిలో ఉండలేక పెరటివైపునించి వెళ్లాను. అత్తగారు పళ్లు తోముకుంటున్నారు. ఏం పెట్టి తోముకుంటున్నారో అర్థంకాలేదు.

ఈపాటికి అన్నయ్యలూ, నాన్నగారూ మండువా చుట్టూ కూర్చుని ‘నంజుంగుడి’ పళ్లపొడితో తోముకోవడం గుర్తుకొచ్చింది. వచ్చేటప్పుడు ‘అమ్మా! పళ్లపొడి పాకెట్‌ పట్టుకెళ్లమంటోంది ఒదిన. పట్టుకెళ్లనా?’

‘ఒద్దమ్మా. అక్కడందరూ ఏం చేస్తే అదే చేద్దువుగాని. ఇలా పట్టుకెళ్తే ‘పట్నం షోకు’లంటూ ఎద్దేవా చేస్తారు’

‘అది కాదత్తయ్యా. బొత్తిగా ఇంక దేంతోనూ తోముకోవడం అలవాటు లేదు కదా? అందుకే అలాగన్నాను’.

‘నువ్వన్నందుకు కాదమ్మా. అదంటే నీకున్న అభిమానం నాకు తెలుసు. కానీ ప్రతి చిన్న విషయాన్నీ పెద్దది చేస్తారమ్మా. జాగర్తగా వాళ్ల అలవాట్లే నేర్చుకుంటే ఏ బాధా ఉండదు’. ఇంకేం మాట్లాడకుండా వెళ్లిపోయింది ఒదిన.

ఇంతకీ అక్కడెక్కడా పళ్లపొడి జాడ కనబడటం లేదు.ఈలోగా పెద్ద ఆడపడుచు ఏడుస్తూన్న పిల్లాడ్ని చంకనేసుకుని అటుగా వచ్చి నాకేసి పలకరింపుగా చూసి ‘మొహం కడుక్కున్నావా?’ అంటుంటే తల అడ్డంగా తిప్పాను. నూతి వసారాలోకి వెళ్లివచ్చి ‘ఇదిగో ఒదినా కచ్చిక. కావాలా? వీటితో తోముకుంటావా? మీ పట్నం నుంచి తెచ్చుకున్నావా?’

‘లేదమ్మా. ఇటియ్యి’ అంటూ తన చేతిలో ఉన్న కచ్చిక తీసుకున్నాను. గుండిగలో నీళ్లు చెంబుతో తీసుకుని ఎక్కడికెళ్తే బాగుంటుందా?’ అని ఆలోచిస్తున్న నన్ను చూసి సోదెమ్మత్తయ్య–––‘ఆ గులాబి చెట్టు మొదట్లో కడుక్కో అమ్మా’ అన్నారు.

కచ్చిక నలిపి తోముకోబోతుంటే వాంతి వచ్చేలా అనిపించింది.

అప్పుడే గమనించినట్లున్నారు అత్తగారు.

‘పట్నం వాళ్లు కచ్చికతో తోముకుంటారా? అవేవో ఖరీదైన పొడులు కొనితేవాలేమో! చెప్పకపోయావా తల్లీ అలా వెలపరించుకోపోతే?’

‘ అవేం మాటలే సుబ్బులూ? ఇవాళేగా వచ్చింది కొత్తగా. అలా బెదరగొడతావేమిటి? ’ సోదెమ్మత్తయ్య నన్ను చూసి…‘ ఫర్వాలేదమ్మా. ఒక్క నాల్రోజులు గడిస్తే అదే అలవాటవుతుంది ’ అన్నారు.

ఇప్పుడు నేను మాత్రం ఏవన్నాను…అంటూ అత్తగారు అక్కడ్నించి వెళ్లిపోవడం చూసి– ‘ ఛ. అలా కాస్తదానికే కళ్లల్లో నీళ్లు రాకూడదు. ఆవిడ మాటతీరే అంత. అయినా, వెళ్లి మీ ఆయన దగ్గర అదేదో ముద్దలాంటిది ఉంటుందిగా? తెచ్చుకుని ఆ పెరట్లోకెళ్లి కడుక్కొచ్చెయ్‌ ’ అన్నారు.

‘ అక్కర్లేదండీ ’ అంటూ బలవంతాన తోముకుని కడుక్కున్నాను. కానీ నాలిక గీసుకోవడం ఎలాగో అర్ధం కాలేదు. అరెరె..వాళ్లెవర్ని గమనించలేదే…అనుకుంటూ దిక్కులు చూస్తుంటే –నన్నే గమనిస్తున్న సోదెమ్మగారు పక్కనే ఉన్న కొబ్బరాకు చీల్చి బద్ద చేసి గబుక్కున నాకందించింది. కృతజ్ఞతతో కాళ్లకి దండం పెట్టెయ్యాలనిపించింది. నాకేసే చూస్తున్న ఆవిడ నా భుజం మీద సున్నితంగా తట్టడం కొండంత ధైర్యం ఇచ్చింది. ఎక్కడికెళ్లినా అందరూ నాకేసే గుచ్చిగుచ్చి చూస్తుంటే ఇబ్బందిగా అనిపించింది. అయినా ఈ జనారణ్యంలో ఒంటరిదాన్ని కాననీ, సోదెమ్మత్తయ్యని భగవంతుడు నాకోసమే పంపాడనీ అనుకున్నాక కాస్త ధైర్యం వచ్చింది.

అప్పటికే పొయ్యి వెలిగించి కాఫీకి నీళ్లు పడేశారు అత్తగారు. మాణిక్యాంబ కుంపటి వెలిగించి తెచ్చి కటకటాల గుమ్మం దగ్గర పెట్టింది. పాలు గిన్నెలో పట్టుకొచ్చి కుంపటి మీద పెట్టడం గమనించి విసినికర్ర తెచ్చి విసరడం మొదలెట్టాను. లేచి బ్రూక్‌ బాండ్‌ కాఫీ పొడి డబ్బా అడగకుండానే తెచ్చి అత్తగారికిచ్చాను. పొయ్యి మీద మరిగే నీళ్ల గిన్నె దింపి 3 చెంచాల పొడి వేసి చన్నీళ్లు చేత్తో పైన చిలకరించి మూతపెట్టారు మాట్లాడకుండా. కుంపటి మీద పాలు పొంగు రాబోతున్నాయి. దింపుదామంటే ఎలా దింపాలో అర్ధం కాలేదు. నాకేసి ఓ చూపు చూసి చీర కొంగుతో పాలు దింపారు. వెళ్లి గ్లాసులు పట్టుకురా అన్నారు. లేచి వెళ్లాను. గ్లాసులెక్కడుంటాయో తెలీదు. ఆడబడుచు అటుగా వస్తుంటే గ్లాసులని సౌజ్ఞ చేశా. అర్ధం చేసుకుని వంట వసారాలోంచి నాలుగూ, నిన్నరాత్రి పిల్లలు మంచినీళ్లు తాగినవి, పాలు తాగినవి గ్లాసులు హాల్లోనూ, గదిలోనూ ఉంటే అన్నీ పోగేసి తెచ్చి నాచేతికిచ్చి నూతి దగ్గరకెళ్లి తోమి, కడిగి తెచ్చి ఇయ్యి అంది. అలాగే చేశాను. పిల్లలంతా ఒక్కొక్కళ్లే చేరారు కుంపటి దగ్గరికి. అన్ని గ్లాసుల్లోనూ కాఫీ పోస్తుంటే అర్ధంకాలేదు ముందర. చిన్నపిల్లలతో సహా అందరూ కాఫీయే తాగుతారని అర్ధమైంది!!

మాణిక్యాంబ పిల్లవాడిని ఒళ్లో కూర్చోబెట్టుకుని తానో గ్లాసు తీసుకుంటూ ‘నువ్వూ తాగేయ్‌. అన్నయ్య ఎలాగూ అప్పుడే లేవడుగా!’ అంది. సోదెమ్మత్తకి ఓ గ్లాసు అందించి, నేనో గ్లాసు తీసుకుని ఆవిడ పక్కనే నిలబడి తాగుతున్నాను. ఒదిన చేసే ఫిల్టర్‌ కాఫీ గుర్తుకొచ్చింది. మళ్లీ చిక్కటి పాలతో కలిపిన కాఫీ కుండలేశ్వరం పిన్ని పెట్టిన కాఫీని గుర్తు తెచ్చింది.

‘ ఏం పుట్టిల్లు గుర్తుకొచ్చిందా? మాట కూడా వినబడనంత పరధ్యానం?…’ఉలిక్కిపడి వాస్తవంలోకొచ్చా. ‘ మీ ఇంట్లో పొయ్యిలమీదేగా వంటా? పొయ్యి అలకటం చేతనవునా? ’ అత్తగారి ఆరా. ఏం చెప్పాలో తెలీదు. నిజానికి ఎప్పుడూ పొయ్యి అలకలేదు. అయినా ఒదిన ఎప్పుడూ 3 కుంపట్ల మీద వండేది కదా? ఎలా చెప్పాలి?

‘ అదేవిటే సుబ్బులూ? పిల్ల వచ్చి పట్టుమని 24 గంటలవలేదు. అలా బెదరగొడతావేమిటే? ’

‘ నేనేవన్నాను? పొయ్యి అలకమనలేదుగా! వచ్చా అన్నానంతే ’. ఈలోగా 2 సంవత్సరాల ఆడబడుచు గదిలోంచి ఏడుస్తూ వచ్చి వాళ్లమ్మ ఒళ్లో వాలింది. దాన్ని సముదాయించి ముద్దుచేసే సందట్లో విషయం మరుగున పడింది.

ఇప్పుడు నేనేం చెయ్యాలో తెలీటం లేదు. ఈ పని చెయ్యి అని పురమాయిస్తే బాగుణ్ణు! సోదెమ్మత్త నా మనసు చదివినట్లే ‘ చీపురుతో ప్రాచిల్లు తుడిచేసిరా. మీ గది ఆనక తుడుద్దుగాని. వెళ్లు ’ అంటూ కాఫీ గ్లాసు పెరటి చివర పడేసి, చెయ్యి కడుక్కొని చీపురు తెచ్చి నా చేతికిచ్చింది. నేను ఎడంచేత్తో చీపురందుకుని వెళ్లి నా గ్లాసు కూడా ఆవిడ ఉంచినచోటే ఉంచి, చెయ్యి కడుక్కొని మరీ వచ్చాను. నన్ను మెప్పుకోలుగా చూస్తూ, మంచి గ్రహింపు ఉన్న పిల్లవే! వెళ్లు! అంది. పిల్లలంతా లేచేశారు. అత్తగారి గదిలోకి వెళ్లాను. పిల్లలు ఉచ్చలు పోసిన బొంతలు, దుప్పట్లు తీసి పక్కన పడేసి, చిన్న చిన్న నులకమంచాలు ఒకదాని కిందకు మరొకటి తోసి ( నిన్న రాత్రి వాటిని పందిరి మంచం కింద ఒకదానికిందనించి ఒక్కొక్కటి లాగడం చూశాను! ) గది తుడిచేశా. కానీ ఆ కంపుకి కడుపులో దేవినట్లయింది. ఒక్కసారి తమాయించుకుని తలుపులు తెరిచిన కిటికీలోంచి బైటికి చూస్తే విరబూసిన గులాబీలు. నిన్న రాత్రి కోయగా మిగిలిన మల్లెలూ, వాటి మీంచి వచ్చిన గాలి కాస్త నన్ను సేదదీర్చాయి.

‘ ఇక్కడే ఉండవలసిన నువ్వు దేనినీ అసహ్యించుకోకూడదు. ఈ వాసనలని తట్టుకోవడం అలవాటు చేసుకోవాలి సుమా ’ అని ఎవరో నా చెవులో చెబుతున్నట్లనిపించింది. నిజమే కదా! ఈలోగా మాణిక్యాంబ వచ్చి ఆ బొంతలన్నీ తీసుకెళ్లి పెరట్లో నూతి దగ్గర పడేసింది. హమ్మయ్య! అనుకున్నాను. ఇల్లు తుడవడం పూర్తిచేసేశాను. కానీ, దుమ్ము తుక్కూ ఎత్తడానికి ఏమీ కనబడలేదు. మద్రాసులో అయితే న్యూస్‌ పేపర్‌లోకి ఎత్తి పారపోశాక దాన్ని దులిపి యధాస్థానంలో ఉంచేవాళ్లం. ఇక్కడెక్కడా ఒక్క కాగితం ముక్కైనా కనబడటం లేదు. నా గదిలోకి వెళ్లి నేను తెచ్చుకున్న ఓ నోటు బుక్కులో కాగితం చింపి, జాగర్తగా పోగులు దాంట్లో ఎత్తి పెరట్లో పారపోసి కాగితం దులిపి తెచ్చి మళ్లీ గదిలో గూట్లో పెట్టేశాను. మధ్యలో కటకటాల గుమ్మం దగ్గర పిల్లకి జడవేస్తూ నన్నే గమనిస్తున్న అత్తగారినుంచి ఏం కామెంట్స్‌ ఉంటాయోనని భయం భయంగా నా పని పూర్తి చేశాను.

మాణిక్యాంబ పెరట్లో నీళ్ల పొయ్యి వెలిగించి పెద్ద కాగు బిందె పొయ్యి మీదుంచి నూతిలోనించి నీళ్లు తోడిపోసి, చెరుకు పుల్లలు మంట పెడుతూంది. రెండేళ్లవాడు వాళ్లబ్బాయి కటకటాల్లో కూర్చుని వాళ్లమ్మ ఆడకోడానికిచ్చిన చెంచాలతో ఆడుకుంటున్నాడు. అంతలో ఏమైందో ఏడుపు లంకించుకున్నాడు. ఎత్తుకుందామని దగ్గిరికెళ్తే వాడు ఉచ్చపోసి అలికి, ఏడుస్తున్నాడు. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. బాబోయ్‌! మరోటి కూడానా!! ఒక్కసారి అటూ ఇటూ చూశాను. అత్తగారు అంతకుముందే లేచి వంటింట్లోకెళ్లారు కాబోలు. అక్కడెవరూ లేరు. రెండంగల్లో పెరట్లోకెళ్లి ‘ పుల్లల్తో నేను మంట పెడ్తాను. నువ్వెళ్లు. పిల్లాడు ఏడుస్తున్నాడు ’ అంటే ‘ వాడినే ఇలా తీసుకురాలేకపోయావా? ’ అంది. జవాబు చెప్పకుండా అక్కడ కూలబడ్డాను. సరేలే అంటూ వెళ్లింది. పిల్లాడ్ని నూతి పళ్లెంలో నిలబెట్టి పట్టుకుని చెంబుతో నీళ్లు పొయ్యి. కడగాలి. వెధవ ఒళ్లంతా చేసుకున్నాడు – లేచి వెళ్లి దూరం నుంచి చెంబుతో నీళ్లు పోస్తే కడిగి పిల్లాణ్ణి చంకనేసుకుని వెళ్లిపోయింది. హమ్మయ్యా…ఏమీ అనలేదు. ధన్యురాల్ని అనుకున్నాను. కానీ నిత్యం ఈ వెలపరాన్ని ఎలా భరించడం? కృష్ణా దేన్నయినా సహించే శక్తినియ్యి స్వామీ…నీదే భారం!

‘ నీళ్లు కాగినట్టున్నాయ్‌. పిల్లలకి నీళ్లోయండర్రా ’ అత్తగారు వంటింట్లోంచి కేక.

‘ అమ్మా నేను ముందు పోసుకుని వెళ్లాలే…నాకు ముందు నీళ్లు తోడేయమను ’. హైస్కూల్‌ చదువుతున్న ఆడబడుచు గదిలోంచే!

‘ విన్నావుగా వదినా? ఆ బాల్చీలోకి నీళ్లు తోడి ఆ దడి వెనక పెట్టమ్మా. ఆవిడగారు నీళ్లు పోసుకుని వెళ్తే సగంమంది స్నానాలయినట్లే!! ’

ఇలా ఏం చెయ్యాలో ఎవరేనా చెబితే చేసెయ్యడం సులువు. అయినా హైస్కూల్‌లో చదివే వయసున్న అమ్మాయి తన స్నానానికి నీళ్లు తోడుకోలేదా! బాబోయ్‌! ఇలా ఆలోచించకూడదు. ఇక్కడి పద్ధతులేమిటో? వెళ్లి వేణ్ణీళ్లు తోడి, దడి వెనకపెట్టి, మళ్లీ నూతిలో నీళ్లు తోడి, కాగులో పోసి, మంట ఎగసన తోశాను. మెడ్రాసులో అయితే కుళాయిలున్నాయి. నుయ్యి కూడా ఉన్నా గిలక ఉండటంతో తోడటం సులభంగా అనిపించేది. కానీ ఇక్కడ చేంతాడు కట్టిన బాల్చీ పైకి తోడటం కష్టంగానే ఉంది. నాలుగు చేదలు తోడేసరికి చేతులు ఎర్రగా కంది…నొప్పులు పుడుతున్నాయి. అరి చేతుల కేసి చూసుకోబోయి ఎవరేనా చూస్తే ఏవంటారోనని మానేశాను.

సందు గుమ్మంనించి మావగారు భుజాన కావడితో వచ్చారు. మరో భుజమ్మీద తువ్వాల్లో బెండకాయలు కాబోలు, మూట వేలాడుతోంది. కానీ ఎదురెళ్లి ఏదైనా సాయం చెయ్యొచ్చో చెయ్యకూడదో. తటపటాయిస్తున్న నన్ను ఆదుకోవడానికి మళ్లీ సోదెమ్మత్తయ్య–‘ వస్తున్నాను తమ్ముడూ ’ అంటూ వచ్చి ఒడుపుగా పాల తపాలాలు ఒక్కొక్కటీ కావడి చిక్కంలోంచి ఒడుపుగా తీసి కిందపెట్టి, బెండకాయల మూట తీసిచ్చి ‘ కమలా ఇవి తీసుకెళ్లి కటకటాల్లో ఉంచమ్మా! ’ అంటూ బెండకాయల మూట నాకిస్తే అందుకున్నాను. మావగారి ఎదుటపడటానికి కాస్త భయం అనిపించింది. మళ్లీ ఆవిడే ‘ నువ్విక్కడుండు. పాల తప్పేలా ఒకటి వంటింట్లో పెట్టి వచ్చి, మరోటి తీసుకెళ్లేదాకా…’ అంటూ ఓ పాలతప్పేలా తీసుకుని లోపలికెళ్లారు.

తప్పేలా నిండా నురుగుతో ఉన్న పాలు చూడగానే చిన్నప్పుడు ( ధనుర్మాసంలో ) తిరుప్పావైలో గోదాదేవి వర్ణించిన పాల సమృద్ధి గుర్తుకొచ్చింది. పోనీ ఆ పాల తప్పేలా నేనే వంటింట్లోకి తీసుకెళ్దామంటే జాగర్తగా మొయ్యగలనో లేనోనని భయం.

ఆలోగా లోపలినించి వచ్చిన అత్తగారు ‘ అలా గుడ్లప్పగించి పాలతప్పేలాకి కాపలా కాస్తూ నిలబడకపోతే తీసి లోపల పెట్టలేవూ? ’ అంటూ తప్పేలా తీసుకుని వెళ్లిపోయారు. ఆ ఝాడింపుకి కళ్ల నీళ్లు రాబోయాయి. కానీ వాటిని వెనక్కి మళ్లించగలిగాను. వంటింట్లోంచి పాలకుండ ఒకటి నూతి దగ్గరకి తీసుకెళ్లి, కొబ్బరి పీచుతో కడిగి, పాలు అందులో పోసి నూతి వెనకున్న వసారాలో పిడకలదాలి ( ఆమాట కొత్తగా విన్నాను ). ముందు అర్థం కాలేదు. ఏం చేస్తున్నారా అని గమనిస్తే తెలిసింది. దాన్ని ‘దాలి’ అంటారని! ఇంతకీ ఆ దాలి ఎలా వెలిగించాలో అర్థం కాలేదు. సరే. చూస్తాగా! ఇహ రోజు కడిగిన కుండలో పాలు పోసి, ఆ ‘పిడకలదాలి’ మీద పెట్టి కాస్తారు కాబోలు! ఇదంతా కొత్త నాకు!

ఆయనగారు లేచి టూత్‌బ్రష్‌ పట్టుకుని పెరట్లోకి వస్తూ నాకేసి కళ్లెగరేస్తూ కొంటెగా చూడటం గమనించినా, పక్కనించి చూడనట్లుగా పోబోతుంటే కటకటాల్లో పెరుగు చిలకడానికి సిద్ధం అవుతున్న అత్తగారు ‘ అదేవిటీ? అలా వెళ్లిపోతున్నావెక్కడికి? మా వాడికి చెంబుతో నీళ్లివ్వకుండా? ’ అన్నారు. ఓహో! ఈయనగారు ముఖం కడుక్కోడానికి చెంబుతో నీళ్లు నేనే ఇవ్వాలి కాబోలు. మద్రాసులో అన్నయ్యలు మండువాలో ఉన్న గంగాళంలో నీళ్లు వాళ్లే ముంచుకోవడం వల్ల ఇలా అందించాలని అనుకోలేదు. కాగులోంచి నీళ్లు ముంచి అందించా. అందుకుని మల్లె పందిరికేసి వెళ్లారు ముఖం కడుక్కోడానికి.

కవ్వం కట్టేసి వంటింట్లోకి వెళ్లిన అత్తగారు కొడుక్కి కాఫీ తను కలిపి ఇస్తారా?! నే వెళ్లి ఇవ్వాలా?? అయోమయంగా ఉంది. ఆవిడ ఎదుట పడటానికి భయంగానూ ఉంది. మధ్యేమార్గంగా నూతిదగ్గరకెళ్లి మెల్లిగా నీళ్లు తోడటం మొదలుపెట్టా. ఏదో ఒకటి చెయ్యాలని! భుజం మీద టర్కీ టవల్‌తో ముఖం తుడుచుకుంటూ వచ్చిన కొడుక్కి గ్లాసులో కాఫీ తనే అందించారు. సో…విషయం అర్ధం అయింది!

స్నానం చేసి వచ్చిన చిన్నాడబడుచు – ‘ ఒదినా నేను 6 సార్లు ఒళ్లు తోముకుని స్నానం చేశాను. కాస్తేమైనా తెల్లబడ్డానంటావా? ఏమైనా నీ తెలుపు రాదనుకో. అయినా ఒదినా నీ తెలుపు కాస్త నాకీయరాదూ?? ’

‘ తీసుకోగలిగితే నువ్వే తీసుకో ఎంతైనా!! ’

‘ ప్చ్‌…ఏమిటో ఒదినా. నాకు తెలుపంటే ఎంతిష్టమో! దేవుడు ఈ నలుపిచ్చాడు. అవునూ. నల్లగా ఉన్న మా అన్నయ్యను నువ్వెలా చేసుకున్నావమ్మా?? నాలాగే మా అన్నయ్యకీ నల్లగా ఉంటే ఇష్టం ఉండదు. ఆ రాజమండ్రి సంబంధం చూసొచ్చి ఖరాఖండీగా చెప్పేశాడు. తను తెల్లని అమ్మాయిని తప్ప చేసుకోనూ అని ’. ఏం మాట్లాడను? తను గలగలా మాట్లాడేస్తూంది. ఈ సంభాషణ నచ్చటం లేదు. కానీ వినక తప్పదు. ఈలోగా…‘ అన్నం పెట్టాను కంచంలో ఇంకా రావేం? ’ వంటింట్లో నుంచి కేకవిని, అటు వెళ్లిపోయింది. హమ్మయ్యా. వానవచ్చి వెలిసినట్లయింది. ఈలోగా …‘ చెల్లీ. స్కూలు టైమయిపోతోంది. ఇంకా తెమలలేదా ’ అంటూ ఎదురింటి శేషక్క ( అలాగే పిలుస్తారు వీళ్లంతా ) వచ్చింది. నాకేసి పరీక్షగా చూస్తూ – ‘ ఏవమ్మా పట్నంలో నువ్వు సంగీతం పరీక్షలిచ్చావటగా. మా నాన్నగారు లోయర్‌ పరీక్ష పాసయారు. మేమూ నేర్చుకుంటున్నాంలే. గీతాలదాకా వచ్చాం. అవునూ…నువ్వు లోయరా? హయ్యరు కూడానా? ’

‘ హయ్యరు పాసయాను ’

‘ అబ్బో! చాలానే వచ్చుండాలయితే! ‘ కమల జాదళ ’ వచ్చా…? ’ ఒక్క క్షణంపాటు ఏమనాలో అర్ధంకాలేదు. డిప్లొమా పాసయానంటే, గీతం వచ్చా అంటుంది! ‘ ఆ…’ అన్నాను ముక్తసరిగా. ఈలోగా హేమ రావడం, ఇద్దరూ కలిసి స్కూల్‌కి బయలుదేరడంతో అప్పటికా సంభాషణ ముగిసింది!

పెరట్లో మల్లెపందిరి కింద పీటమీద కూర్చోబెట్టి పిల్లాడికి నీళ్లోస్తున్న మాణిక్యాంబతో రహస్యంగా…‘ లెట్రిన్‌కి ఎక్కడికెళ్లాలో కాస్త చూపించవూ? ’ అన్నాను. ‘ ఎక్కడికీ వెళ్లటం? ’ అంది! ఎలా చెప్పాలో తెలీలేదు మొదట. చెంబుతో నీళ్లు ముంచుకుని వేళ్లు చూపించా. ‘ ఓ అదా?? ఆ చివరగా తాటాకు దడి వెనక ‘బోరింగ్‌ రాయి’ ఉంది. అక్కడికి వెళ్లు ’ అంది. ‘ నీ కోసమే వేయించారు నాన్నగారు ’. భయంగా చూశా! ‘ నడు వచ్చి చూపిస్తా ’ అంటూ పెద్ద మనసుతో, పిల్లాణ్ణి చంకనేసుకుని వచ్చి చూపించింది ‘అదే…’ అంటూ. మెల్లిగా ఎక్కి కూర్చోబోతుంటే ఝాయ్‌మంటూ పెద్ద పెద్ద రాక్షసి ఈగలు లోపల్నించి బైటికి రాసాగాయ్‌. హడలిపోయి ఒక్క ఉదుటున కిందికి దూకేశా. చేతిలో చెంబు కింద దొర్లిపడిపోయింది. గుండెలు దడదడా కొట్టుకుంటుంటే మాలతి పందిరి రాటని పట్టుకుని కళ్లు మూసుకుని నిలబడిపోయాను. ఇంక ఎక్కువసేపుంటే బావోదని, నన్ను నేనే సంబాళించుకుని మెల్లిగా కిందపడ్డ చెంబు తీసి నూతి దగ్గరెళ్లి కాళ్లు కడుక్కుని మళ్లీ నీళ్ల పొయ్యిదగ్గర కూలబడ్డాను. చల్ల చిలుకుతూ కటకటాల్లోంచి ఓ చూపు నాపైనే ఉంచిన అత్తగారు చల్లకోసం వచ్చిన తోటికోడలితో ‘ ఇన్నేళ్లనించి మనం అందరం పుంతలోకి వెళ్తుంటే ఏమాత్రం అనిపించలేదు మీ బావగారికి. ఈవాళ పట్నం కోడల్ని తెచ్చుకున్నారు కదూ? అందుకని ప్రత్యేకంగా బోరింగ్‌ రాయి తవ్వించారమ్మా! భోగం!! పెట్టి పుట్టాలి ’ అంటుంటే దుఃఖం తన్నుకొచ్చింది. పొయ్యిలో చెరుకుపుల్లలు మంటపెడుతూ పొగ నెపంతో కళ్లు తుడుచుకున్నాను. మద్రాసులో అప్పటికే ఫ్లషవుట్‌ ఉండటం వల్ల ఇలాంటిదొకటి ఉంటుందని కూడా తెలీదు. పైగా అదేదో చాలా భోగమైనట్లు మాట్లాడుతుంటే ఆ భోగం ఏదో అనుభవించకుండానే?! ఈగలు గుర్తుకొచ్చి గుండె దడదడలాడింది. రోజూ ఎలా గడపాలి? ఎవరికీ చెప్పుకునే విషయం కాదు! ఎన్నాళ్లిలా ఉండగలను పరమాత్మా!!?

దాదాపు అందరి స్నానాలూ అయ్యాయి. నేను కూడా బట్టలు తెచ్చుకుని జాజి పందిరి పక్కనున్న దడిమీద వేసి నీళ్లు బాల్చీలోకి తోడుకుంటుంటే, ఎందుకో అక్కడికి వచ్చిన అత్తగారు…‘ ఇక్కడ బాతురూములూ, కొంగరూములూ ఉండవమ్మా. మావగారు కోడలికోసం కట్టిస్తారేమో ఇహ!! సామెత చెప్పినట్లు ‘సవితప్ప ధర్మాన మెతుకొప్పగంటి’ అందిట వెనకటికో ఆవిడ!! కోడలి ధర్మమా అని ఇంతకాలానికి భోగాలు మేమూ అనుభవిస్తాం ’ అని వ్యంగ్యంగా అంటుంటే ఎలా గడపాలి రోజులు? భోగాలు అంటున్నవాటిని నేనుగా కోరుకోలేదే?! ఇంతకీ అవి నాకు ఉపయోగపడటమూ లేదు. అది భోగం ఎలాగవుతుంది?…ఇలా నాలోనేనే మథనపడుతూ, తడిక వెనకాల స్నానం పూర్తిచేసి బట్టలు చుట్టబెట్టుకుని పరుగుపరుగున దగ్గరగా ఉన్న వంటింట్లోకి వెళ్లిపోయా.

మడికట్టుకుని సోదెమ్మత్తయ్య వంట పూర్తిచేశారు. పిల్లలు అన్నాలు తినడమూ అయింది. అంతకుముందే అత్తగారు జడ వేసుకుని స్నానం చేసి, తోటి కోడలుగారింటికెళ్లారు. పిల్లని చంకనేసుకుని పెద్ద ఆడబడుచు పెద్ద నూతి నీళ్లు తేవడానికి వాళ్ల పిన్నిగారి పిల్లలతో వెళ్లింది. వాళ్లబ్బాయి నిద్దరోతున్నాడు.

ఈలోగా శ్రీవారు వీణ తీసి, శృతి చేసి, వాయించడం మొదలెట్టారు. కొంత రాగం, తానం వాయించి కృతి మొదలుపెట్టారు. కొంత తెలిసినట్టే ఉందికానీ, ఏ రాగమో గుర్తుకు రావడం లేదు. మెల్లిగా వెళ్లి, ఎదురుగా కూర్చున్నాను. ఏ కృతో చెప్పగలవా అన్నారు. గుర్తు రావడంలేదనన్నాను. మద్రాసు యూనివర్సిటీ డిప్లొమా వారికి గౌళ రాగం గుర్తుకురావడం లేదన్నమాట! శ్రీమహా గణపతిరవతుమాం. దీక్షితుల కృతి గౌళ పంచరత్న కృతి పాడాను కానీ ఈ కృతి నేను వినలేదు కూడా అన్నాను. కృతి పూర్తిచేసి, సంహేంద్రమధ్యమ రాగం నన్ను పాడమన్నారు. రాగం పాడి తానం కూడా పాడు అన్నారు. ‘‘ ఓం…త్తఅఅఅతత్త అనంతత్తఅఅనం…తనోం తత్తోం..తొఅఅ ’ అని పాడుతున్నాను. ఈలోగా మూడో ఇంట్లో ఉండే పినమామగారు వచ్చారు. ఆపేసి పక్కగదిలోకి వెళ్లిపోయాను. ‘ ఏరా! విస్సినాథం! ఇందాకట్నించి మీ ఆవిడ తంతానంటుందా, తొంతానంటుందా? ’

‘ అబ్బే మొదటిది కాదులే బాబాయ్‌ ఆ రెండోదే!! ఏం స్కూల్‌ లేదా? ’

‘ ఉందిరా. ఇంట్రవెల్‌లో ఇంటికొచ్చాను. ఈలోగా పాటవినబడి గుమ్మంలో నిలబడ్డా! సర్లే వస్తా! ’

నాకు దుఃఖం ముంచుకొచ్చింది. రాగం తానం పల్లవి చక్కగా పాడ్తానని క్లాసులోనూ, గురువులూ కూడా ఎంతో మెచ్చుకునేవారు. అలాంటిది ఈ అవహేళనలేమిటి? రోజులన్నీ ఇలాగే ఉండబోతున్నాయా? కృష్ణా…ఈ జీవితాన్నా నాకు నువ్వు నిర్దేశించింది?!

‘ అదేమిటి? ఏడుస్తున్నావా! బాబాయ్‌ మాటలకే?! అబ్బే…ఏదో సరదాకన్నారాయన. అంతే. అయినా, ఇక్కడ ఎవరు ఏమన్నా తేలిగ్గా తీసుకోవాలి ’ అంటూ మళ్లీ వీణ దగ్గర కూర్చున్నారు. అత్తగారు వచ్చినట్లున్నారు ‘‘ ఇదుగోరా అబ్బాయ్‌ పాలు ’’ అంటూ పాలగ్లాసు అందించారు. పాలగ్లాసు పక్కనపెట్టి వెళ్లబోతున్న నన్ను వారించి కూర్చోమని సంజ్ఞ చేశారు.

‘ వెంటనే తాగరా. చల్లారిపోతాయి ’

‘ అలాగేనమ్మా ’

‘ నువ్వెళ్లి కంచాలూ, మంచినీళ్లు పెట్టు కమలా ’ అన్నారావిడ. అలాగేనంటూ వెళ్లబోతుండగా – ‘ ఇదుగో గ్లాసు పట్టుకెళ్లిపో ’ అన్నారు కాసిని పాలు మిగిల్చి గ్లాసు నాకిస్తూ. గుండెలు కొట్టుకుంటున్నాయ్‌!!

‘ తాగడం అయిపోయిందా అప్పుడే?! ’ అన్న అత్తగారికి…‘ఆ…’ అంటూ వీణ అందుకున్నారు.

రెండంగల్లో గదిలోంచి పెరట్లోకెళ్లి అటూ ఇటూ చూసి, ఆ మిగిల్చిన పాలచుక్కలు నోట్లో పోసుకుని, గ్లాసు కడిగి వంటింట్లోకెళ్లాను. అప్పటికే మావగారు రావడం, వాళ్లక్కగారు వడ్డిస్తే తినడం కూడా అయిపోతోంది. నన్ను చూసి ‘ మీ అత్తగార్ని, ఆడబడుచునీ రమ్మను భోజనానికి ’ అన్నారు. వీధిలో ఎవరితోనో మాట్లాడి వస్తున్న వాళ్లకి చెప్పి, గదిలోకెళ్లి – ‘ మీరు భోజనం చేయడానికి రాలేదేం? నాన్నగారు భోంచేస్తున్నారు? ’ అన్నాను. ‘ నాకు ఆలస్యంగా తినడం అలవాటు. మీరంతా తినేయండి ’ మెల్లిగా వంటింట్లోకి వెళ్లి పెద్దత్తయ్యతో ‘ నేను కూడా తర్వాత తింటానూ…’ ప్రాధేయపడుతున్నట్లడిగా. ‘ పిచ్చిపిల్లా! అలాగే. మీ ఆయనా, నువ్వూ తిందురుగానిలే ’ ఎంతో లాలనగా మాట్లాడే ఆవిడ తీరు పన్నీరు చిలకరించినట్లుంటుంది.

రాత్రి కోయగా మిగిలిన విచ్చిన మల్లెలు కోస్తున్నా. ఈలోగా నలుగురైదుగురు మొగపిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చి ఆగారు. ఎవరికి వాళ్లే…‘ ఒదినా…నిన్ను…ఒదినా…మీరు…మిమ్మల్ని…’ ఇలా ఎవరికి వాళ్లే బిడియంగానూ, కుతూహలంగానూ పదేపదే ‘ఒదినా’ అంటూ నిలబడ్డారు. వాళ్లంతా నా మరుదులు. పినమామగార్ల పిల్లలు. ‘ చెప్పండి ఏమిటీ? ఇంతకీ మీ పేర్లేమిటో చెప్పండి ముందు ’ అంటూ లాలనగా అడిగేసరికి – ఒకళ్లనొకళ్లు తోసుకుంటూ, ‘ నా పేరు రామం. వీడు సూరిగాడు. నా పేరు వెంకట్రత్నం. నా పేరు సత్యం…’ అంటూ చేతుల్లో వెనక దాచిన పూల గుత్తి ముందుకు చాచి, ‘ ఒదినా…ఇవి గుల్షబ్‌ పూలు. చాలా బాగుంటాయ్‌. నువ్‌ తీసుకుంటావా? ఇవ్వనా? ఇదుగో…’ అంటూ సంబరంగా ఇచ్చాడు. నిజమే చక్కని సువాసనల్ని వెదజల్లుతున్నాయి పువ్వులు.

అప్పుడు గుర్తుకొచ్చింది. మా పెళ్లయాక, పాలంగి రావడం, పెళ్లి ఊరేగింపూ… ‘ సత్యం! నువ్వేనా పెళ్లి ఊరేగింపులో పరిగెత్తుకొచ్చి ‘ ‘గుల్షబ్‌ పూలంటూ కారు దగ్గిరకొచ్చి ఇచ్చావ్‌? ’

‘ అవును ఒదినా!! నేనే ఆ రోజు మీకు ఇలాంటి పూలే ఇచ్చింది ’.

‘ చూశావురా? ఒదినకి నేను గుర్తున్నాను? మీరంతా ఆ వేళ అలా వెళ్లకూడదు అన్నారా? నన్ను ఒదిన గుర్తు పెట్టుకుంది చూశారా! ’ ఆ కళ్లల్లో చిన్న గర్వం, కళ్లల్లో మెరుపూ…ముచ్చటేసింది. ఇంతలో మిగతా వాళ్లని వెనక్కి నెట్టి –‘ ఒదినా ఒకటడగనా…’ అంటూ ముందుకొచ్చాడు రామం. ‘అడుగు’.

‘ నువ్వెప్పుడూ చెట్టుక్కట్టిన మడి బట్ట ముట్టుకోలేదా చిన్నప్పుడు…? ’ ఉన్నట్టుండి ఈ ప్రశ్న వింతగా అనిపించింది.

‘ ఏం ఎందుకూ?! ’

‘ అమ్మ చెట్టుక్కట్టిన మడి బట్టలు ముట్టుకోకండేం? అలా ముట్టుకుంటే నల్లగా అయిపోతారు అంది. అయినా నేనేమో ముట్టేసుకున్నాను. అందుకే ఇలా నల్లగా అయిపోయాను! ’ అంటూ బెంగగా ముఖం పెట్టి అంటూంటే – ఇక్కడి పిల్లలందరికీ ఈ నలుపూ తెలుపూ గురించి బాగా మనసుకు పట్టేసిందే! అనిపించింది. ఈలోగా స్కూల్‌ బెల్‌ వినిపించి అందరూ పరుగో పరుగు!

మధ్యాహ్నం అత్తగారు నవల చదూతూ గదిలో మంచమ్మీద పడుకున్నారు. పిల్లాడు పడుకున్నాడు. మాణిక్యాంబ చేటలో బియ్యం తెచ్చి బెడ్డలు ఏరడం మొదలుపెట్టింది. నేనూ కూర్చుని ఏరటం మొదలెట్టా. ‘ ఒదినా మీ ఊళ్లో అరవ సినిమాలే చూస్తారా? తెలుగువి కూడా ఉంటాయా? ’అడిగిందామె.

‘ తెలుగు, అరవం, హిందీ అన్నీ వస్తాయ్‌. కానీ మా ఇంట్లో సినిమాలకి వెళ్లడం, పంపించడం కూడా తక్కువే. నేనైతే ఇప్పటివరకూ మల్లీశ్వరి, హిందీ ఝాన్సీరాణి రెండే చూశాను ’. ఆశ్చర్యంగా చూసింది నావంక. ‘మాకైతే సినిమాలంటే ఎంతిష్టమో! అందరం చూస్తాం. అన్నయ్య సినిమా పాటలెంత బాగా పాడ్తాడో తెల్సా?! సినిమా పుస్తకాలు ఎన్ని ఉన్నాయో ఇంట్లో’! ‘.

టైము 3 గంటలవుతుంటే పొట్టు పొయ్యి వెలిగించింది. అది వింతగా అనిపించింది. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు. పొట్టుపొయ్యి కూరుతూ ఉంటే ఆశ్చర్యంగా చూశాను. ఆ పొయ్యి మీదే కాఫీ కలిపింది. గదుల్లోనూ, పెరట్లోనూ వంటింట్లోనూ పిల్లలు ఎక్కడ తాగినవి అక్కడే పడేస్తారు. ఆ గ్లాసులన్నీ పోగుచేసి కడిగి పట్టుకొచ్చాను. కాఫీలయ్యాయి.

‘ ఒదినా సంది గుమ్మాలు నువ్వు తుడుస్తావా? నేను బంగాళా దుంపలు తరుగుతాను? ’ అంది.

‘ సందు, గుమ్మాలూ తడిస్తే చాలా? గదులూ, హాలూ అక్కర్లేదా? ’ అన్నాను. అందుకు నవ్వి– ‘ అన్నీ తుడవాలిలే. సంది గుమ్మాలంటారంతే…’ అంది. నా ప్రశ్నలకీ, అనుమానాలకీ పాపం మాణిక్యాంబ ఎంతో ఓర్పుతో వివరణ ఇస్తుంది. బహుశా అది సంధ్య వేళ గుమ్మాలు తడువడం కాబోలు! ఇద్దరం ఇంచుమించు ఒక వయసు వాళ్లు కావడం, నాకీ పల్లెటూళ్లో చాలా విషయాలు తెలియవనే సానుభూతీ, పట్నంలో పెరిగి చదువుకున్న అమ్మాయని అందరూ అనుకునే ఒదిన సాధారణ విషయాలకి తన మీద ఆధారపడుతుంటే, ఒకింత గర్వంతో కూడిన ఆనందం! మొత్తానికి ప్రతిక్షణం ఏమీ తెలీని దాన్నని అభాసుపాలు కాకుండా, ఇటు ఆడబడుచునీ, అటు సోదెమ్మత్తయ్యనీ చూపించాడు నేను నమ్ముకున్న పార్థసారధి. ధన్యోస్మి!!!

చీపురుచ్చుకుని తుడుస్తున్న నన్ను ఎదురింటి శేషమ్మగారు తదేకంగా చూస్తూ ‘ ఎక్కడో పట్నం నించి వచ్చావా తల్లీ. మా భమిడివారి ఇల్లూడ్చడానికి! అప్పటిదాకా కలం పట్టుకున్నా పెళ్లయాక చీపురు తప్పదుకదా ఆడదానికి ’. ఆవిడ ఆత్మీయంగానే అన్నా, ఎవరైనా వింటే ఏమంటారోనని భయం వేసింది. గబగబా వెళ్లిపోయాను లోపలికి.

‘ పొయ్యి మీద ఎసరు పడేశావేమిటే…’ అంటూ వచ్చారు అత్తగారు. ఉదయం సోదెమ్మత్తయ్య వండితే రాత్రి పూట వీళ్లు వండుతారన్నమాట! మాణిక్యాంబ పెరట్లో దూరంగా నిలబడి ‘ అమ్మా బైటున్నానే. దీపాలు తుడవాలి ’ అంది. కటకటాల్లో అప్పటికే లాంతర్లు, బుడ్డి దీపాలూ తెచ్చి పెట్టి ఉంచింది. వాటిని ఎలా తుడవాలో సరిగ్గా అవగాహన లేదు. ఎప్పుడైనా అమలాపురం వెళ్లినప్పుడు అక్కడ ఈ దీపాలే అయినా అమ్మే చేసుకునేది. అందుకే భయం భయంగా చూశాను. అయినా ప్రయత్నిద్దాం లే అని లాంతరు పైకి తీయబోయాను. కానీ చిమ్నీ వెనక్కి పడిపోయి ముక్కలైపోయింది. కళ్లల్లో నీళ్లు తిరిగాయ్‌ నా అసమర్థతకి. ఏమన్నా పడటానికి సిద్ధపడి ఉన్నాను. చేతులు వణికాయ్‌. రానే వచ్చారు అత్తగారు. లేచి, మెల్లిగా గాజుపెంకులు ఎత్తుతున్నాను. ఈలోగా సాయంత్రం పాలు పితుక్కుని వచ్చారు మావగారు. ‘ కాస్త అలవాటయేదాకా మీరెవరేనా చెయ్యొచ్చుగా? పిల్లలెవరూ కనబడరేం? ’ అన్న మావగారికి ‘ పిల్లలంతా రామాలయం దగ్గరికి పోయారు ఆటలాడ్డానికి. సరే మీరెళ్లి కావయ్య కొట్లో చిమ్ని తీసుకురండి ’ అన్నారు. బిక్కుబిక్కుమంటూ తలొంచుకుని, గోడకానుకుని నించున్న నన్ను ‘ చీపురు పట్రా ఈ గాజు  పెంకులు తుడిచి మరీ పారపొయ్యాలి ’ అన్నారు. ఒక్క ఉదుటున వెళ్లి పూతికీన్ల చీపురు తెచ్చి వాటిని కాగితమ్మీదకి జాగ్రత్తగా ఎత్తుతున్నాను.  ఈలోగా ఆవిడే  గబగబా చిమ్నిలన్నీ  తుడిచేశారు కిరసనాయిలు అన్నింటిలోనూ ఉందిలే అనుకుంటూ.

‘ మీకు పట్నంలో టిక్కుటిక్కూ కరెంటు దీపాలేగా! మనుగుడుపులకొచ్చినప్పుడు చూశాను. బొత్తిగా అలవాటు లేకపోతే లాంతర్లు తుడవటం కష్టమే. నా 14వ ఏట కాపరానికి వచ్చినప్పుడు నేనూ ఇలాగే బద్దలు కొట్టేదాన్ని చిమ్నీలు. పాపం మీ మావగారు ఒక్క మాటనకుండా కొత్తవి కొని పట్టుకొచ్చి తనే తుడిచేవారు మొదట్లో. తరవాత్తరవాత నాకూ అలవాటయింది ’.

ఒక్క క్షణం…. ఇది వ్యంగ్యమా? అనిపించింది. కానీ గొంతులోని ఆ మార్దవం ఆత్మీయంగానే అన్నట్లనిపించింది. ఆవిడ కూడా తన గతాన్ని గుర్తు చేసుకుంటున్నారన్నమాట. ఏమైనా ఆ గొంతులోని మార్దవం నాకు ఆశ్వాసన కలిగించింది. అయినా నా భయంకానీ, ఆవిడ మాత్రం నన్ను అభిమానించకుండా ఎలా ఉంటుంది – ఆవిడ కంఠంలోని కరుకుదనం వల్ల నాకలా అనిపించింది కాబోలు. ఏమైనా మొదటిరోజే ఆవిడ గురించి భయపడటం తప్పు. ఒక ఇంట్లో కలిసి బతకవలసినవాళ్లం. అయినా అభిమానం పంచితే అభిమానం లభించకమానదు.  

ఈలోగా పెత్తనాలకెళ్లిన చిన్నాడబడుచు, తక్కినవాళ్లు ఒక్కొక్కళ్లే వచ్చారు. ‘ నువ్వెళ్లి సాయంత్రం కోసిన పూలు అక్కడున్నాయి కట్టగలవా మాల? ’ అన్నారు. ‘ ఆ…’ అంటూ వెళ్లి మల్లెలు మాల అల్లడం మొదలుపెట్టాను. దీపాలు వెలిగించి గదుల్లోనూ, సావిడిలోనూ పెట్టారు. అల్లినదండ చూసి, ఆడబడుచు ‘ ఒదినా! నీకు పూల దండ అల్లడం బాగానే వచ్చే! ’ అంటుంటే అత్తగారు వచ్చి ఆ దండ తుంపి పెద్ద ముక్క నాకిచ్చి, తను కొంత పెట్టుకుని మిగిలినది గిన్నెలో పెట్టి మూత వేసి, తులసికోట దగ్గర ఉంచారు. పొద్దున్న స్కూలుకెళ్లే పిల్లలు పెట్టుకుంటారని.

‘ కంచాలు పెట్టు పిల్లలకి అన్నం పెడదాం. ‘ పిల్లల భోజనాలయేసరికి మావగారు, వాళ్లక్కగారూ, పెరటి గుమ్మంలోచి వస్తున్నారు. ఇప్పటిదాకా సోదెమ్మత్తయ్య వాళ్ల పెద్ద తమ్ముడింటికెళ్లారన్న మాట!

‘ ఒదినగారూ మడి కట్టుకుని ఉప్పుడు పిండి చేసుకుంటారా, పచ్చి మిరపకాయలు తరిగివ్వనా? ’ అన్న అత్తగారికి–‘ అక్కర్లేదు సుబ్బులూ, మా పెద్ద మరదలు చేసింది. ఇప్పుడే పెద్ద తమ్ముడితోపాటు తినేసి వస్తున్నా’ అన్నారు. ‘ అక్కతోపాటు నాకూ పెట్టేసింది ఒదిన. ఇంక నాకేం ఒద్దు కాస్త మజ్జిగ ఇయ్యి చాలు ’ అన్నారు మావగారు. అప్పటికే దూరంగా మాణిక్యాంబకి అన్నం పెట్టడం అయింది. ఇహ మేం ముగ్గురం ఉన్నాం.

‘ ఒరేయ్‌ అబ్బాయ్‌…ఎప్పుడో బాగా పొద్దుపోయాక కాదు…నువ్వు కూడా వచ్చేయ్‌ ఒడ్డించేస్తాను ’ అన్న అత్తగారి మాటకి సరేనంటూ వచ్చేశారు. ‘ నువ్వూరా కమలా ’ అన్నారు. ఈలోగా చిన్నవంటింట్లో ఉన్న ఆవకాయ జాడీ తేవడానికి నేవెళ్తే చేత్తో దీపం బుడ్డి పట్టుకుని వచ్చింది హేమ. ‘ దీపం ఇలా తే హేమా…ఈ వేపు చీకటిగా ఉంది ’ అంటూ దీపం తీసుకుని ఆవకాయ జాడీ అందుకున్నాను. ఇంతలోనే హేమ ‘ తేలు కుట్టేసింది బాబోయ్‌…’ అంటూ గట్టిగా ఏడుస్తూ కాలు పట్టుకుని నా మీద ఆనింది. వెంటనే చేతిలోని దీపం అటు తిప్పేసరికి, తేలు సరసరా పాకి గోడ దగ్గరకి వెళ్లి ఆగిపోయింది. ఈలోగా చెక్కపేడు పట్టుకొచ్చిన శ్రీవారు ‘ ఏదీ తేలు? ’ అన్నారు. దీపం వెలుగులో గోడవారనక్కి ఉన్న తేలును చంపేశారు. అంతలో మావగారు తన తువ్వాలు గట్టిగా కాలి పిక్కకి ముడేసి తేలు మంత్రం చదవడం మొదలెట్టారు. కానీ పిల్ల గోలెత్తేస్తూంది. తక్కిన పిల్లలు చుట్టూ మూగి చూస్తుంటే ‘ వాళ్లందరినీ తీసుకెళ్లి గదుల్లో పక్కలేసి పడుకో బెట్టు ’ అన్న అత్తగారి మాటలతో వాళ్లందరినీ పందిరి మంచం కింద ఒక దాని కింద ఒకటిగా ఉన్న మంచాలు లాగి బొంతలు పరుస్తుంటే ఎవరి మంచాలపై వాళ్లు చేరారు పిల్లలు. అప్పటిదాకా ఏడుస్తూన్న హేమ కూడా మెల్లిగా నిద్రలోకి జారుకుంది.

అత్తగారూ నేనూ కూడా వెళ్లి భోంచేసి కంచాలు, వంటిల్లూ కడుక్కుని బయటపడ్డాం. టైము 7.30 కొట్టింది. మద్రాసులో ఈపాటికి మొదలవుతాయ్‌ భోజనాలు. మెల్లిగా నేనూ మా గదిలో చేరా దీపం తగ్గించి. మెల్లిగా నిద్రలోకి జారుకున్న నాకు దూరంగా ఏవో కూతల్లాగా…ఏవేవో వినబడుతుంటే మెలకువ వచ్చింది. భయం వేసింది. లేచి దీపం పెద్దది చేసి – ‘ ఏవండీ ఏమిటా కూతలు? ’ అంటుంటే – ‘ అవా నక్కల ఊళలు! పొలాల అవతల స్మశానం ఉందిలే. రాత్రుళ్లు నక్కలు వచ్చి అలా అరుస్తాయ్‌. మరేం భయంలేదు. ఇలారా…’ అంటుంటే గట్టిగా కళ్లు మూసుకుని భయంతో పక్కలో ముడుచుకుపోయా. ‘ నీవే తల్లివి తండ్రివి…నీవే నా తోడు నీడ నీవే సఖుడౌ…నీవే గురుడవు దైవము నీవే నా పతియు గతియు నిజముగ కృష్ణా! ’ అనుకుంటూ…పార్థసారథిని కన్నులముందుకు తెచ్చుకోవడానికి ప్రయత్నించా.

మొత్తానికి అత్తవారింట్లో మొదటిరోజు గడిచింది! హమ్మయ్య!!

స్వస్తి

*******************