10_007 తో. లే. పి. – హేరీ మిల్లర్

హేరీ కొలిన్ మిల్లర్ :

స్వాన్ సీ, వేల్స్ ఇంగ్లండ్ లో, ఒక వెల్ష్ కుటుంబం లో 1923 లో జన్మించారు హేరీ మిల్లర్. ఈయన పేరొందిన జర్నలిస్ట్, రచయిత, ఫోటోగ్రాఫర్, ప్రకృతి పరిశోధకుడు.. తాను పుట్టినది ఇంగ్లాండ్ లో అయినా ఊహ తెలిసిన తరువాత దాదాపు ఆయన జీవితమంతా అంటే షుమారు 40 సంవత్సరాలకు పైగా ఇండియాలోనే, చెన్నై లో గడచిపోయింది. ఈయన వ్యాసాలు ప్రముఖ దినపత్రికలు THE HINDU, THE INDIAN EXPRESS లలో ప్రచురితం అయ్యాయి. ఆయనకు ప్రముఖ వ్యక్తులు శ్రీ దలైలామా, సర్ ఆర్థర్ క్లార్క్, క్వీన్ ఫెడరికా లతో సత్సంబంధాలు ఉన్నాయి. 

తమిళ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన రేవతి పార్ధసారధి ని ఈయన వివాహమాడారు. వీరికి సంతానం ఒక అబ్బాయి రాబిన్, అమ్మాయి నిషా. అబ్బాయి దురదృష్టవశాత్తు 1951 లో మరణించాడు. అమ్మాయి నిషా చెన్నైలోనే నివసిస్తుంది. ఈమె కు ఒక కుమార్తె — తారా Top Tea Garden.

నేను 1997 లో చెన్నై, అడయార్ లోని థియోసాఫికల్ సొసైటీలో నా శ్రీమతి సీతాదేవి Ph. D. పని మీద కొంతకాలం మకాం చేయడం జరిగింది. ఆ సందర్భం లో Madras Musings అన్న స్థానిక పత్రిక లో న్యూస్ ఐటమ్ చదివాను. హేరీ మిల్లర్ కి అంతర్జాతీయ స్థాయి లో ఆయన చేసిన ప్రకృతి పరిశోధనా సేవకు గాను ఆయనకు Man of the Year అవార్డు ని అమెరికా లో ఒక సంస్థ – ప్రకటించినట్లు. నేను అంతకుముందే హేరీ మిల్లర్ గురించి ఆయన ప్రకృతి, జీవ సంరక్షణ రంగాలలో చేసిన విశేష సేవ గురించి విన్నాను. ఈ వార్త తెలిసి ఆయనను అభినందిస్తూ ఆయనకు ఒక లేఖ వ్రాసాను. ఆ నా లేఖ కు ప్రత్యుత్తరమే ఈనాటి తోక లేని పిట్ట. 

ఈ ఉత్తరం లో ఆయన చాలా ఆసక్తికరమైన విషయాన్ని ప్రస్తావించారు. అది చదివి ఆశ్చర్యపడడం నా వంతు అయింది. మీరు కూడా ఈ ఉత్తరాన్ని చదివితే తప్పకుండా ఆశ్చర్యానికి లోనవుతారు. ఈనాటి ప్రపంచం ఎన్ని మోసాలకు, కుతంత్రాలకు నిలయమయిపోయిందా అని. అసలు ఈనాడు కుట్ర, కుతంత్రం, మోసం మానవ జీవితం లో అంతర్భాగం అయిపోయాయంటే అతిశయోక్తి కాదు. పాత రోజులలో నీతి, 

నిజాయితీ రాజ్యమేలాయి. మరి ఈనాడో ?! పరిస్థితి అంతా పూర్తిగా తారుమారు అయింది. అన్యాయం, అక్రమం – ఇవే నేటి జీవన ప్రమాణాలు, జీవన మార్గాలు.

సన్మానం కి కొలబద్దలు మారిపోయాయి. ధనం, పలుకుబడి ఉంటే చాలు, తిమ్మిని బమ్మి చేయడానికి. ఇది కేవలం అటు రాజకీయ రంగానికి మాత్రమే పరిమితం కాలేదు. అన్ని చోట్లా, అన్ని రంగాలలోనూ వ్యాప్తి చెందింది. 

హేరీ మిల్లర్ తన జీవితకాలం లో అధిక భాగాన్ని ప్రకృతి, ప్రకృతి జీవ పరిరక్షణ గురించి శ్రమించారు. అది కూడా నిస్వార్థమైన సేవ. ఆయన కృషికి తగినంత గుర్తింపు రాలేదనే చెప్పాలి. ఇది చాలా బాధాకరమైన విషయం. 

జీవితానికి చక్కటి భాష్యాన్ని తాను అనుసరించి చెప్పిన హేరీ మిల్లర్. తన 75 వ ఏట — 1998 వ సంవత్సరం లో ( అక్టోబర్ 5 న ) కన్నుమూయడం విషాదకరం. ఆయన స్మృతి కి నా నివాళులను అర్పిస్తూ, మీ నుండి ప్రస్తుతానికి శెలవు తీసుకుంటున్నాను. 

<><><>*** నమస్కారములు – ధన్యవాదాలు ***<><><>