10_007 వాగ్గేయకారులు – మహాపండితుడు ముత్తుస్వామి దీక్షితర్

——————————————————————————-

1775-1835

వెంకటమఖి వంశస్తుడు, సంగీత కుటుంబానికి చెందిన ముత్తు స్వామి దీక్షితార్  తంజావూరు రాజా అచ్యుతప్ప నాయకుని మరియూ రఘునాథ నాయకుని ముఖ్యమంత్రి అయిన  గోవింద దీక్షితుని వంశజుడు.  వీరు పుట్టిన తేదీ  24 మార్చ్, 1776 గా చారిత్రాత్మకంగా నమోదు కావటం హృద్యమైన విషయం.  సంగీత త్రిమూర్తులుగా భావించే త్యాగరాజు, శ్యామశాస్త్రి, దీక్షిత త్రయంలో ముత్తుస్వామి దీక్షితులు చిన్నవారు. చిన్నవయసు నుంచీ భగవన్నామ జపంలో ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నందువలన, ఆ రోజుల ఆనవాయితీ ప్రకారం ఒక చక్కని పిల్లను చూసి పెండ్లి చేసి, వారి మనసు ఐహిక సంసారం పట్ల మళ్లించే ప్రయత్నం జరిగింది. అయినప్పటికీ వారికి భక్తి యందున్న ఆసక్తి ఇసుమంతయినా తగ్గలేదు. ఎన్నో మంత్రం సిద్ధుల శిక్షణ పొందిన ముత్తుస్వామి దీక్షితులు వ్రాసిన మొట్టమొదటి కీర్తన తిరుత్తణి లో మాయామాళవ గౌళ రాగం, ఆదితాళంలో ” శ్రీ నతాది గురుగుహో “, రెండవది ఆనందభైరవి రాగం, రూపక తాళంలో “మానస గురుగుహ “. 

నవగ్రహ కృతుల జన్మకు వెనుక ఒక చిన్న కథ ఉంది. ఒకసారి వారి శిష్యులలో ఒకనికి చాలా కడుపునొప్పి వచ్చి బాధపడుతూ ఉంటే, ఎవరో జ్యోతిష్కులు గురు, శని గ్రహములను పూజించి వారి ఆశీర్వాదం పొందితే అతడి బాధకు ఉపశమనం కలుగుతుందని చెప్పగానే, అఠాణా రాగంలో ” బృహస్పతే తారా పతే “, యదుకుల కాంభోజి రాగంలో ” దివాకర తనూజమ్ శనైశ్చరమ్ ” రచించి, వాటిని కొన్నిసార్లు మందులా పాడుకుంటూ ఉండమన్నారుట దీక్షితులవారు. కొంతకాలానికి శిష్యునికి కడుపు నొప్పి పూర్తిగా తగ్గిపోయిందట. మిగిలిన ఏడు నవగ్రహ కీర్తనలనూ తరువాత పూరించారట.  

వీరి మిగతా చరిత్ర సర్వతో విదితమైనా, ” వాతాపి గణపతిం భజేహం ” గురించి కీ. శే. శ్రీ విస్సా అప్పారావు గారి విశ్లేషణ గురించి ఇక్కడ ప్రస్తావించటం సముచితం. నా స్వంతం కాకపోయినా, వారు విశ్లేషించిన ఒక ముఖ్య విషయమైన వినాయక చవితి ఆ రోజునే ఎందుకు జరుపుకోవాలి అనే అంశం పై దీక్షితుల వారు ఈ కృతిలో ఇచ్చిన వివరాలను తప్పక అందరూ తెలుసుకోవాల్సిందే. దానిని వివరించే ఈ నా చిరు ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే అవి నావే గానీ, శ్రీ విస్సా అప్పారావు గారివి మాత్రం కాదని గమనించ ప్రార్థన. ఈ వ్యాసం చదివి నేను అర్థం చేసుకున్నది ఇదీ. 

దీక్షితర్ తన కృతి వాతాపి గణపతిం భజేహంలో వినాయకుడిని ” త్రికోణ మధ్యగతం ” అని అభివర్ణిస్తారు. అంటే ఇచ్ఛ, జ్ఞానం, క్రియ అనే మూడు శక్తివంతమైన కోణాలకు నడిమధ్యలో ఉండే కేంద్రమే గణపతి అని అర్థం. మనం వినాయకుడిని వర్ణించినప్పుడు పెద్ద తల ఉండటం జ్ఞానానికి, చిన్నకళ్ళుండటం సునిశిత దృష్టికి, పొడవాటి తొండం జిజ్ఞాసకు, పెద్ద చెవులు ఎవరు చెప్పినా వినతగునని, ఇలాంటి గుణగణాలు అలవరుచుకోవాలని నేర్చుకున్నాం. అదే విషయాన్ని ఒక కృతి రూపంలో దీక్షితార్ ఈ విధంగా తెలియచేశారు. 

నవగ్రహ కీర్తనలు, షోడశ గణపతి కృతులు, నవావర్ణ కృతులు. పంచలింగస్థల కృతులు ఇలా ఎన్నెన్నో రచనలు స్వరసహితంగా వ్రాశారు. వీరి రచనలన్నీ కొంచెం కష్టమైన సంస్కృత భాషలో, భాషా కాఠిన్యానికి అనువైనట్లు క్లిష్టమైన రాగ ప్రకరణలు, గమకాలు, ఝటకాలు కలిగివుండటం వీరి ప్రత్యేకత కావటంతో, త్యాగరాజు గారిది ద్రాక్షా పాకమయితే, వీరిది నారికేళ పాకంగా ప్రసిద్ధికెక్కింది. వీరి రచనలలో ఎంతో ప్రసిద్ధికెక్కిన నవావరణ కృతులను గూర్చి కొద్దిగా ఇక్కడ తెలియచేస్తాను. తిరువారూర్ ఆలయానికి గల తాంత్రిక ప్రాముఖ్యత, శ్రీ చక్రాన్ని విశిష్టతనూ పేర్కొనే వర్ణనలు ఈ ‘ కమలాంబా ‘ అని సంబోదించే ఈ కృతులలో సంస్కృత భాషలో గల ఎనిమిది విభక్తులనూ ప్రతిబింబిస్తుంది. ఎక్కువగా సంస్కృతంలోనూ, మణిప్రవాళ భాషలోనూ వీరి రచనలు కానవస్తాయి ( తమిళం మరియు సంస్కృతం భాషల సంగమం ). వీరి కృతులకు ముద్ర ” గురుగుహ “. 

దాదాపు 300 వందల కృతులకు పైగా గల వీరి రచనల్లో వీరికి యోగ మరియు తంత్రం పై గల గాఢమైన అవగాహన కొట్టవచ్చినట్లు కానవస్తుంది. ” అసంపూర్ణ మేళ ” ప్రణాళికలో భాగంగా 72 మేళకర్త రాగాల్లో కృతులను రచించి, ఆయా రాగాలను వాటి లక్షణాలనూ తరువాతి తరాలకు పొందుపరిచారు. వీరు అందులో ఇచ్చిన కొన్ని రాగాల పేర్లను యధాతథంగా కూడా వాడారు. అంతేకాక, ఏడు జాతి తాళాల్లోనూ కృతులను రచించిన ఏకైక వాగ్గేయకారుడు. వీరి ” నోటు స్వర సాహిత్యం ” లో సెల్టిక్ మరియు బరోక్ అనే పాశ్చాత్య సంగీత ప్రభావం కూడా కనిపిస్తుంది. పిల్లలు సులభంగా పాడగల గీతాలు కొన్ని ఈ శైలిలో శంకరాభరణం రాగంలో వీరు రచించారు. ” వరశివ బాలం వల్లీ లోలం ( వోల్జ్ వౌస్ డాన్స్ పద్ధతి ), శక్తి సహిత గణపతిం, శ్యామలే మీనాక్షి ” చాలా లోకప్రియమైనవి. ఇవి మొత్తం 40 ఉన్నాయి. ” రామ అష్టపది, ఉపనిషద్ బ్రహ్మేంద్రల్ ” అనే రచనలు కూడా వీరు చేసినట్లు చెబుతారు కానీ అవి ఇంతవరకూ లభ్యం కాలేదు. వీరి రచనలు ముఖ్యముగా సంస్కృతంలో ఉండటం, ఆపైని అవి అతి క్లిష్టమైన పదాలతో కూడి ఉండటంతో, పామర జనానికి ఎక్కువగా అర్థం కాకపోవటం, ఇవన్నీ వెరసి, వారి రచనలను ” నారికేళ పాకం ” గా పేర్కొంటూ ఉంటారు. నారికేళం అంటే కొబ్బరికాయ. దాని పీచులు వొలిచి, కొట్టి, ఆ నీటిని త్రాగేక, కొబ్బరిని కూడా తింటేనే గానీ దాని మాధుర్యం తెలియదని అర్థం. కానీ తెలుసుకోవాల్సిన ఒక వాస్తవం ఏమిటంటే, సంస్కృత భాషకు అతి తక్కువ పదాలలో అత్యంత నిగూఢమైన విషయాలను పొందుపరచగల సామర్ధ్యం ఉండటం వలన కూడా, సంస్కృత రచనలన్నీ కష్టంగా అనిపిస్తూ ఉండటం సహజం. ఆ భాష తెలిసిన వారికి అవి అంత కష్టమనిపించకపోవచ్చు. ఇది సంస్కృత భాషకున్న ప్రత్యేకతగా కూడా పేర్కొనవచ్చు. ఏమంటారు ?

——————————————————

వీరి ప్రముఖ రచనలు:

  • షోడశ గణపతి కృతులు 
  • నవగ్రహ కృతులు 
  • నవావర్ణ కృతులు 
  • పంచలింగస్థల కృతులు 

హిందుస్తానీ సంగీతాన్ని కూడా చక్కగా ఆకళింపు చేస్తుకున్న వీరి రచనల్లో ‘ ద్రుపద్ ‘ ప్రభావం చాలా కనిపిస్తుంది. దీక్షితుల వారు వీణను ఎంతో చక్కగా వాయించేవారట. అందుచేతనే వారి రచనలు మరియు గమకాలలో వీణకు అనువుగా ఉంటూ, అందంగా వినిపిస్తూ, వీణా వాయిద్యపు  ప్రభావం కలిగి ఉంటాయని చెప్పవచ్చు. వాస్తవానికి వారి ‘ బాల గోపాలా ‘ అనే కృతిలో తనను ఒక వైణికునిగా ప్రకటించుకున్నారు కూడా. దీక్షితుల వారు పాశ్చాత్య వాయిద్యమైన వయోలిన్ తో కూడా ప్రయోగాలు చేసినారు. తంజావూర్ క్వార్టెట్ అనే ఒక బృంద సభ్యులయిన వడివేలు వీరి శిష్యుడు. ఈ వయోలిన్ వాయిద్యాన్ని కర్ణాటక సంగీతంలోకి ప్రక్క వాయిద్యంగా ప్రవేశ పెట్టిన ఘనత కూడా వడివేలు, అతడి  తమ్ముడైన బాలస్వామి దీక్షితర్ కే దక్కుతుంది. నేడు వయోలిన్ కర్ణాటక సంగీతంలో విడదీయరాని, కచ్చేరికి ప్రాణం పొసే వాయిద్యం అంటే ఆశ్చర్యం లేదు.  

వీరి 241 జన్మతిథిని పురస్కరించుకుని భారత ప్రభుత్వం ఒక స్టాంపును విడుదల చేసింది. 

**********************