10_008 కథావీధి – రావిశాస్త్రి రచనలు

ఇంటి ఆర్ధిక పరిస్థితులూ, ఇల్లు నెట్టుకు రావడం కోసం తండ్రి పడుతున్న అగచాట్లూ, అర్ధం చేసుకున్న సరళ బుచ్చి, తండ్రి బాధలు తగ్గించడానికి తన వంతు సాయంగా తాను ఒక స్థితిమంతుడైన కుర్రవాడిని ప్రేమించి పెళ్ళి చేసుకుంటే సరి అనే తీర్మానానికి వచ్చి ఆ ప్రయత్నాలలో ఉండగా విషయం గ్రహించిన ఒక గండు కోయిల స్నేహం కలుపుతుంది. గండుకోయిల బీద స్నేహితుడు ఒకతను వీరి మధ్య ప్రేమలేఖలు బట్వాడా చేస్తూ అనుసంధానకర్త గా ఉంటాడు.

 

కొంతకాలానికి ఒకరాత్రి గండుకోయిల కూత విని సరళ బుచ్చి ఇల్లు విడిచి బయటకు వస్తుంది. వారం రోజులకి మోజు తీరిన గండు కోయిల సరళ బుచ్చి ని వదిలించుకోబోగా, అనుసంధానం చేసిన బీద స్నేహితుడు అడ్డం పడతాడు, అప్పుడు గండుకోయిల అడ్డం తిరిగి ఇంతకు మునుపే బీద స్నేహితుడికీ, సరళ బుచ్చి కీ ఆ సంబంధం ఉంది అనీ, అది కప్పి పుచ్చుకోవడం కోసం స్నేహితుడు తనకి వలవేసి, సరళ బుచ్చిని తార్చే ప్రయత్నం చేస్తున్నాడనీ ఆరోపించి అల్లరి పెడతాడు. అనంతర పరిణామాలు ధనికుడైన గండుకోయిలని క్షేమంగా ఇంటికి చేర్చగా బీద స్నేహితుడు జైలు పాలవుతాడు. సరళ బుచ్చి సముద్రుడుని ఆశ్రయించగా కొంతసేపటికి ప్రాణం లేని ఆమె శరీరం గట్టు పైకి వస్తుంది. సరళ తండ్రి తనకు మిగిలిన ఏకైక సంపద ఐన ” పరువు ” ను కూడా కోల్పోవలసి వస్తుంది. 

 

మూడో కూతురు విమల గుండె ధైర్యం, తెగువ, వివేకం కల మనిషి. మంచితనం, మనుషులపై నమ్మకం ఉన్న మనిషి అవడం చేత ఆమె సరళ బుచ్చిని అనుమానించలేదు. 

ఇది జరిగిన మూడో రోజునో, నాలుగో రోజునో విమల గండుకోయిల ని తన కాలి చెప్పులతో సత్కరిస్తుంది.

 

సరళ కార్యక్రమాలకి వచ్చిన మిల్లు యజమానీ, సౌందర్య పిపాసీ ఐన పెద్దల్లుడు విమల అందానికి ముగ్దుడై, తాను ఆమెను పెళ్ళి చేసుకుంటాను అని అందరిముందూ నిస్సిగ్గుగా ప్రకటించి విమల చేత అవమానింపబడి, తన పెళ్ళాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు.

 

విమల తెగువ కల మనిషి కావడంతో  తాను త్వరగా తేరుకుని, తల్లి తండ్రులని ఒక దారి లోకి తీసుకుని వస్తుంది. తాను చిన్న పిల్లలకి ప్రైవేట్లు చెప్పుకుంటూ, తండ్రిని కూడా ఆ వ్యాపకం లోకి దింపుతుంది. విమల, ఆమె కుటుంబం గురించి తెలిసిన ఆ వాడ వారు తమకి చేతనైన సాయం చేస్తారు.

 

కోలుకున్న విమల తండ్రి విమల పెళ్ళి త్వరగా చేయాలనే పట్టుదల తో ఉంటాడు. ఆర్ధిక పరిస్థితి సహకరించదు.

 

విమల తండ్రిగారి ఊరి లో ఉన్న ఒక చిన్న తాటి తోపు ని చూసి ముచ్చట పడ్డ ఒక మాంగనీసు మార్వాడీ షాహుకారు దాన్ని సొంతం చేసుకోదలచి క్రయం చేసే నిమిత్తం ఆ తోపు యజమాని కోసం ఆ ఊరి కరణం గారిని వాకబు చేయగా, ఆయన అది విమల తండ్రిది అని గ్రహించి మునసబు గారి తో సలహా చేసి, క్రయవిక్రయాలతో పనిలేకుండా పని జరిపిస్తాననీ, తనకు కొంత ప్రతిఫలం ఇమ్మనీ షాహుకారు తో బేరం పెట్టగా అది ఇష్టం లేని షాహుకారు వేరే దారిలో విమల తండ్రి ని కలుసుకునే ప్రయత్నం లో ఉండగా విషయం తెలుసుకున్న మునసబు, కరణాలు విమల అన్నలతో లాలూచీ పడి షాహుకారుని అడ్డుకునే ప్రయత్నం చేసినా, షాహుకారు వీళ్ళందరినీ తొక్కి పెట్టి విమల తండ్రి చేతిలోనే క్రయధనం పెట్టి కాయితాలు రాయించుకుంటాడు. మునసబు, కరణాలతో లాలూచీ పడ్డ విమల అన్నలు వాటాల లెఖ్ఖలు తప్పుగా చూపించి విమల తండ్రి దగ్గర ఎక్కువ మొత్తం తీసేసుకుంటారు. చెల్లిలి పెళ్ళి కి తాము సాయం చేయబోమనీ, వాటాగా వచ్చిన ధనాన్ని వృధా గా కూతురి పెళ్ళి కి వ్యయం చేయవద్దనీ, ముందుగా తన సంగతి చూసుకొమ్మనీ తండ్రికి సలహా చెప్పి విమల అన్నలు తమ దారి తాము చూసుకుంటారు. 

 

చేతిలో ఉన్న డబ్బుతో విమల పెళ్ళి చేసేయాలని నిర్ణయించిన తండ్రి తన స్నేహితుడు రిటైర్ద్ రైల్వే ఉద్యోగి ద్వారా ఒక సంబంధం కుదురుస్తాడు. వియ్యంకుడు చిన్న ఉద్యోగే కానీ పై సంపాదన విషయం లో దిట్ట. ధైర్యం గా డబ్బు తీసుకోవడం, అంతకన్నా ధైర్యం గా పని చేయడం లో సమర్ధుడు. ఖరాఖండీ మనిషి. అతని వాగ్ధాటి ముందు ఒరియా దేశపు చచ్చటి మనుషులు ఎందుకూ పనికిరారు. అతనికి విమల తండ్రి మీద మంచి అభిప్రాయం లేదు. కానీ కొడుక్కి ఇప్పటి దాకా వచ్చిన సంబంధాలలో విమల సంబంధమే మంచిదీ, ఎక్కువ కట్నం వచ్చేదీ దీన్ని తిరగ్గొడితే ఇహ పైన సంబంధాలు వచ్చే అవకాశం తక్కువ అవడం చేత ఒప్పుకున్నాడు. పెళ్ళికొడుకు తన పెద్ద బావకు డిట్టో లా వుండడం చేత విమలకు నచ్చలేదు. కానీ తండ్రి మాటకు ఎదురుచెప్పి, బాధ పెట్టడం ఇష్టం లేక ఊరుకుంటుంది. విమల ఈ పెళ్ళికి ఒప్పుకోవడానికి గల ఏకైక కారణం తన పెళ్ళి చేయడం ద్వారా తండ్రికి తన భాధ్యతను నిర్వర్తించాను అనే ఆనందం కలుగుతుంది అనే.

 

పెళ్ళికి ముందు విమల తల్లి చనిపోవడం తో పెళ్ళికోసం దాచివుంచిన మొత్తం లో కొంత ఖర్చు ఐపోతుంది. విమల తండ్రి అధైర్యపడతాడు. విషయం గ్రహించిన స్నేహితుడు పెళ్ళి ఆపవద్దనీ, కాబోయే వియ్యంకుడు ఒకప్పుడు తన కింది ఉద్యోగే కనక తాను సర్ది చెపుతాననీ, తక్కువపడ్డ మొత్తం నెమ్మదిగా సర్ది ఇద్దామనీ, ధైర్యం చెప్పి దగ్గరుండి ముహుర్తాలు పెట్టించి ఆ ఊరి చివరన ఉన్న రాములవారి గుడిలో పెళ్ళికి ఏర్పాట్లు చేసి ఉంచుతాడు. పెళ్ళి రోజు రానే వచ్చింది. రాత్రి ముహూర్తం.

 

ఊరి చివరి రామాలయం ఒకప్పుడు ఊరి కి మధ్యలోనే ఉండేది. ఊరు వేరే వైపు కి పెరగడంతో గుడి చివరికైంది. పాత పడింది. కొంచెం పక్కగా కొత్తగా వెలసిన వేంకటేశ్వరస్వామి వారు విద్యుత్ దీపాల వెలుగు లో గుడి చుట్టూ దుకాణలూ, గుడి నిండా భక్తులతో కళ కళ లాడుతూ, తళతళలాడి పోతూండగా రాముల వారు నూనె దీపాలతో అరకొర భక్తులతో మిణుకు మిణుకుమంటున్నారు. రాముల వారి పాదాలని నమ్ముకున్న వారిలో ముగ్గురే మిగిలారు. గుడి పూజారి గారు, గుడి బయట గుడ్డి దీపాల పళ్ళ కొట్టు యజమానీ, పకోడీల బండి ఆసామీ. బండి దగ్గర చివికి పోయిన పైజామా, చిరిగిపోయిన చొక్కాతో, మాసిపోయిన యువకుడొకడు, బండిలో మిగిలిపోయిన చచ్చు పకోడీలని సాగదీసుకుంటూ, నములుతూ, గుడిలోనుంచి వచ్చే నీరసపు సన్నాయి వాద్య ఘోషని వింటో, పెట్రోమాక్సు లైటు వెలుగులో జరుగుతున్న విమల వివాహ వేడుకలని తిలకిస్తున్నాడు. మంత్రాలు అతనికి శ్రావ్యం గా వుండడం తో ఆదమరచి వింటున్నాడు. అప్పటికి అతను భోజనం చేసి ఐదారు రోజులు మాత్రమే అయ్యింది. ఆ వాతావరణం అతన్ని ఏవో చిన్నతనపు బంగారు జ్ఞాపకాలలోకి తీసుకుని వెళ్ళడం తో అతను తన్మయావస్థ లో వున్నాడు. చల్ల గాలి మోసుకొస్తున్న పెళ్ళిపందిరి మల్లెపూల పరిమళాలు అతన్ని ఏవో తెలియని లోకాలలోకి తీసుకుని వెడుతున్నాయి.  

 

ఉన్నట్టుండి ఒక్కసారిగా అల్లరైపోయింది. “ లాంఛనాల డబ్బుని కట్నం లో కలిపేస్తారా? అందులో సగమే ఇప్పుడు చేతిలో ముష్టి పడేసి మిగతాది ఎగ్గొట్టేస్తారా? ” అంటూ పెళ్ళికొడుకు తండ్రి గట్టిగా రంకెలు వేయడం, “ నువ్వొక్కసారి నేను చెప్పేది శాంతం గా వినరా శేషూ ! ” అంటూ విమల తండ్రి స్నేహితుడు అతనిని బతిమాలడం, వాతావరణం చిలికి చిలికి గాలివానగా మారడం, సందిగ్దం లో ఉన్న పెళ్లికొడుకు తన తండ్రి గదమాయింపులకు వణుకుతూ పెళ్ళి పీటల మీంచి లేవబోతూండగా, తోపులాటలో ఎవరో పెట్రోమాక్సు దీపాన్ని తన్నేయడం ఆ మంటల వెలుగుల్లో పెద్దింటమ్మోరు లా మారిన పెళ్ళికూతురు “ నాకు మొగుడు గా వుండడానికి పనికిరాకపోతే నా పెళ్ళాంగానైనా బతుకు ” అంటూ పెళ్ళికొడుకు చేతిలో నుంచి తాళి బొట్టును లాక్కుని అతని మెడలో కట్టడం జరిగిపోయాయి. ఆ ఎర్రటి మంటల మధ్య నుంచి రోదిస్తూ పెళ్ళికూతురు చిరుగుల చొక్కా కుర్రాడిని దాటుకుంటూ వెళ్ళిపోయింది.

 

అలా జీవిత సమరం లోకి దూకింది వియత్నాం విమల. జైలు నుంచి బయటకు వచ్చిన సరళ బుచ్చి బీద స్నేహితుడు కాలక్రమంలో పోస్ట్‌మాన్ ఉద్యోగం సంపాదించి అదే ఊరి లో ఉంటూ, విమల కుటుంబంతో స్నేహం గా ఉంటూ ఉంటాడు.

 

ఈ కథలో విమలకి రచయిత పెట్టిన పూర్తి పేరు వీరవల్లి విమల కాగా ఆయన వ్యవహరించిన పేరు వియత్నాం విమల.అప్పట్లో రావిశాస్త్రి గారి మీద సంజకెంజాయి రంగుల ( ఈ మాట వారిదే ) ప్రభావం వుండేది. అమెరికా వారి దాడిని ధైర్యం గా ఎదుర్కొన్న వియత్నాం వారిని, సంజకెంజాయి రంగుల వారు మెచ్చుకునేవారు. నిజానికి ఈవిడ పేరు వీరవల్లి విమలైనా, వాడపల్లి కమలైనా, యెండుమల్లి అమలైనా కథాగమనంలో ఏమీ తేడా రాదు. మనిషి పేరుకీ ఆ పేరు గల మనిషి స్వభావానికీ పోలికలు చాలా అరుదుగా వుంటాయి.

 

ఈ విషయం ప్రత్యేకం గా ఎందుకు రాయవలసి వచ్చింది అంటే, తెలుగు రచయితల పుణ్యమా అని సుబ్బారావు, అప్పారావు లాంటి పేర్లు వినగానే వారు అమాయకులనీ, సినిమాలలో కనిపించే హాస్య పాత్రలను పోలి వుంటారనీ జనాలకి ఒక అభిప్రాయం వచ్చింది. నిజానికి ఆ పేర్లు కల వారిలో చాలామంది మేధావులు వున్నారన్న విషయం అందరికీ తెలిసినదే ! ఇక చాలామంది నవలామణులు తమ నవలలోని పాత్రలకు పేర్ల తో బ్రాండ్ ఇమేజ్ ని తెప్పించారు. వినీల్, సునీల్ అనగానే నాయక పాత్రలు అనీ… వీర్రాజూ, అప్పారావూ అనగానే వారి విదూషక స్నేహితులు అనీ… ప్రియ భాందవీ, అమలలోచనా అనగానే కథానాయికలు అనీ… సీత, పార్వతి అనగానే నాయికల చెలికత్తె పాత్రలనీ… భుజంగం, పానకాలూ అని వినగానే దుష్ట పాత్రలు అనీ,… సుబ్బులూ, రత్తాలూ అనగానే దాసి పాత్రలు అనీ పరంధామయ్యగారో, సీతారామయ్యగారో, మహలక్ష్మమ్మ గారో, అనసూయమ్మగారో అనగానే తల్లి తండ్రుల పాత్రలనీ ఒక తరం పాఠకులు సులభం గానే అంచనా కట్టేసేవారు. పుస్తకాల బయట ఈ పేర్లు గలవారు, పుస్తకాలలో ఈ పేర్లు వున్న వారిలా వుండడం అసాధ్యం.

రావిశాస్త్రి గారి లాంటి ట్రెండ్ సెట్టర్ కూడా పాత ట్రెండ్ ని ఎందుకు ఫాలో అయ్యారో మరి. 

 

బంగారి గాడి కథ

 

నన్ను బంగారిగాడంటేనే జనానికి తెలుస్ది. ఉంకోలా తెల్దు. మబ్బేసినప్పుడాకాసెం మెరుస్ది. ఏ రెండు మెరుపులూ ఒకేనాగుండవు. ఈరులూ, సోరులూ కూడా అంతే. ఏ ఇద్దరూ ఈరులూ ఒకేనాగుండరు. మాత్మా గాందీ కొందరికి ఈరో, అల్లూరి సీత్రామ్రాజు కొందరికి ఈరో. ఎవరి లెక్కాళ్ళకుంటాది. సెప్పొచ్చేదేతంతే ఎవరి ఈరో లాల్లకుంతారు.

 

ఈరులెలా గుంతరో, సోరులూ అనాగే వుంతరు. ఏ ఇద్దరు సోరులూ ఒకేనాగుండరు. ఎవడి మోడసాడి కుంతది ( మోడస్ ఒపేరాండీ అనగా నేరం చేసే పద్ధతి ). వుప్మాకరావు గాడు వుద్దోగాలిపిస్తననే డబ్బులు దండుకుంతడు. ఆండాలమ్మ లండనెళ్ళినా ముండల కంపినీయే ఎడత్ది, పోలీసోణ్ణే వుంచుకుంటది. మన రికాటి ( నా రికార్ద్ ) బంగారం తో మొదలైంది. తరాత జేబు దొంగతనాలూ,  ట్రాఫిక్ దిమ్మలు అమ్మడం, దొంగ లోట్లు మార్సడం ఇనా సానా వున్నాయి. 

 

సిన్నప్పుడిల్లొదిలీసిన నాకు పెద్దైనాక అమ్ములు మీద మనసైంది. అమ్ములు మా సుట్టాలమ్మాయి, దానికి నీనంటే రోకు ( మోజు, ఇస్టం ) సిన్నప్పుడది నన్ను చాలా సార్లడ్డీసీది, నీనే తప్పుకు తిరిగేటోణ్ణి.

అప్పుడమ్మలి కొంటినిండా బంగారమే. నాకు దాని బంగారం కావాలి.      

తరువాయి వచ్చే సంచికలో…

*******************************************