10_008 పాలంగి కథలు – పాలంగీ… మా పెద్దత్తగారూ… నేనూ…

                                             అది పందొమ్మిది వందల ఏభై ఎనిమిది. రాజమండ్రి నాళం వారి సత్రం. పెళ్లికూతురును మొదటిసారి చూడ్డానికొచ్చారు మగపెళ్లివారంతా, పట్టుచీరల ఫెళఫెళలు, బంగారు నగల ధగధగలతో. ‘ ఎర్రగా, బొద్దుగా బాగుందర్రా పెళ్లికూతురు…’ అంటూనే నా మెడలోని నెక్లెస్‌ పట్టుకుని చూస్తూ, ‘ అవును, నువ్వు సంగీతం పాడతావుటగా, నాతో పోటీకొస్తావేమిటి…’ ఆప్యాయంగా, ఆత్మీయంగా నవ్వుతూ అంటున్నావిడ ఎవరా అని పరీక్షగా చూశాను. కాళ్లకి కడియాలు, గొలుసులు, నడుముకి వడ్డాణం, కాశపోసి కట్టిన చీరలో పల్లెటూరి తెలుగింటి సంప్రదాయ లక్ష్మిలా ఉందావిడ కలుపుగోలుగా మాట్లాడుతూ. ఆవిడ మా పెద్దత్తరగారట. అంతలోనే ‘ ఇదిగో ఆ పిల్లను నీ మాటలతో హడలగొట్టకు ’ అంటూ వచ్చారొకాయన. ఆయన మా పెద మామగారట. వాళ్లిద్దరూ ఎక్కడుంటే అక్కడ బోలెడంత సందడి. మా పెళ్లి ఇప్పటిలా హడావుడిగా కాకుండా చాలా సావకాశంగా జరిగిందేమో, భమిడి వారి పరాచికాలు, పెద్దత్తగారు పాడే పెళ్లి పాటలు… మాకు మద్రాసు లాంటి పట్నవాసంలో తటస్థపడని వాతావరణం. మావాళ్లంతా ఎంతో ఆసక్తిగా ఆస్వాదించసాగారు ఆ వాతావరణాన్ని. రెండువైపులా పెళ్లివారి పాటలు తానే పాడి తనకు పోటీ ఎవరూ లేరనిపించారు కూడా ఆవిడ. మొదటినుండీ ఆవిడకు తన పెద్దరికమే పెట్టని కోట.

ఆ తర్వాత పాలంగి కాపురానికొచ్చిన నాకు చాలా విషయాల్లో ఆవిడే స్ఫూర్తి. ఆవిడలో బద్ధకమన్నది కనబడదు. ఆరోజుల్లో పనివాళ్ల చేత అన్ని పనులూ చేయించుకోవడం ఉండేది కాదు. చీకటింటే లేచి ఇళ్లూ, వాకిళ్లూ తుడుచుకోవడంతో ప్రారంభించి చెరువుకెళ్లి బట్టలుతుక్కోవడం, చెర్లోంచి నీళ్లు, బావికెళ్లి మంచినీళ్లు తెచ్చుకోవడం, పొయ్యిలు అలుక్కోవడం…ఇలా సాగేవి పనులు. ఆవిడ కూతుళ్లంతా పెళ్లిళ్లయి అత్తారింటికి వెళ్లిపోవడం, పెద్ద కోడలు దూరదేశాల ఉండటంతో తనే పనులన్నీ చకచకా చేసుకునేవారు. స్నానం చేసి మడిగట్టుకునే ముందు అప్పుడోసారి ( బహుశా అది పని విడుపేమో!! ) తోటికోడళ్లందరినీ పలకరించి ‘ ఏం చేస్తున్నారర్రా? నీ కూతురికి ఆ సంబంధం గురించి ఏం చేశారు?… నువ్వెప్పుడొచ్చావే, ఏమన్నా విశేషమా ఏమిటి? పిల్లాడు అలా ముసముసలాడుతున్నాడేమిటే? నాలుగు కస్తూరి మాత్రలు ఏమైనా వెయ్యకపోయావా? పొలాన్ని గోంగూర ఉందేమిటే సుబ్బులూ? ’ వగైరా ప్రశ్నలతోనూ, పలకరింపులతోనూ ఓ అరగంట కాలక్షేపం చేసి ( బహుశా రిలాక్సయి! ) అబ్బా, వంటకాలస్యం అయిపోతోంది బాబూ అనుకుంటూ వెళ్లి మడికట్టుకుని వంట ప్రయత్నంలో పడేవారు. పిల్లలెవరికైనా ఒంట్లో బాగోలేకపోయినా, సలహా కావలసి వచ్చినా చెబుతూ తనదైన ప్రత్యేకతను నిలుపుకునేవారు. కంటెలూ, జాగినీ గొలుసులు, వడ్డాణాలూ, కాసులపేర్లూ, కాళ్లకి నాలుగైదు రకాల వెండిపట్టాలు, కడియాలూ, గొలుసులతో ఘల్లుఘల్లుమంటూ!! తోటికోడళ్ల పుట్టింరోజులన్నీ ఆవిడకి గుర్తే! ‘ మామ్మా…నా పుట్టినరోజెప్పుడో చెప్పవూ?’ అంటూ ఆవిడ్నే అడిగేవారు.

ఆరోజుల్లో…ఊళ్లో ఎవరిళ్లల్లో అయినా పెళ్లిళ్లూ, కార్యాలూ జరిగితే పెద్ద పెద్ద వంటగిన్నెలు ఒకరివొకరు పట్టుకెళ్లి వాడుకుని తిరిగివ్వడం అలవాటు. అలా ఎవరైనా వచ్చి అడిగితే ఎవరో వచ్చి తీసివ్వాలి అనకుండా వెంటనే నిచ్చెన వేసుకుని చకచకా సామాను దింపే ఆవిడ హుషారే నాకు స్ఫూర్తి. పెద్దలనుంచి నీకు స్ఫూర్తి కలిగించే అంశాన్ని వెదుక్కుని నేర్చుకో అనేవారు మా నాన్నగారు ’. వారి ఆదేశమే నన్ను ఎన్నో విషయాలు నేర్చుకుని ఆచరించేలా చేసింది. అందే ఎత్తులో ఉన్న కొబ్బరి చెట్లకి నిచ్చెన వేసుకుని కాయలు కోసి, గునపంతో వలిచే నా అలవాటుకి మూలం అదే. సుబ్బారాయుడి షష్టి, భీష్మ ఏకాదశి వంటి రోజుల్లో అటు ఉండ్రాజవరంలో, ఇటు తణుకులోనూ జరిగే తీర్థాలు, ఊళ్లో జరిగే పేరంటాలు – ఇవే ఆ రోజుల్లో ఆడవాళ్లకి ఆటవిడుపు. వీటిని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ ఎంజాయ్‌ చేసేవాళ్లం అందరం కలిసి. ఆయా సందర్భాలకి పాటలు పాడే తీరు ఆవిడ పెద్దరికానికే వన్నె తెచ్చేది. ఇంతకీ ఆ పాటలు ఎవరి మెప్పుకోసమో కాక కేవలం తనకు వచ్చును కనుకనూ, అది సందర్భం కనుకనూ పాడటం వల్లనే కాబోలు ఎన్నాళ్లయినా స్మృతిపథంలో నిలిచి ఉండటానికి కారణం అనిపిస్తుంది.

మనసుకి వయసు రానంతవరకూ మనిషి ఆరోగ్యంగా ఉన్నట్టే! దీపావళి వచ్చిందంటే మతాబులు, చిచ్చుబుడ్లు, సిసింద్రీలు వంటివి కట్టడం కోసం పిల్లలతో కలిసి బగ్గులు తయారుచేసి నూరడం, మతాబు గుల్లలు చుట్టి ఎండబెట్టడం, సిసింద్రీలు, జువ్వలు కూరడం…అబ్బో ఎన్ని పన్లో! క్షణం తీరికుండేది కాదు. ఇంత ప్రయత్నంతోనూ చేసినవాటిని కాల్చేటప్పుడు ఉన్న ఆనందం పిల్లలతో పంచుకోవడం – నిజంగా అది అనుభవైకవేద్యం. అదావిడకి బాగా తెలుసు.

దీపావళి హడావుడి పూర్తికాకుండానే, కార్తీకమాసమంతా స్నానాలు, దీపాలు, ఉపవాసాలు, ప్రసాదాలు…ఎంత తతంగమో! తెల్లవారుఝామున లేచి చీకట్లోనే ఒకరినొకరు పిల్చుకుంటూ అందరినీ కలుపుకుని పదిమందికి పైగా చేల మధ్య కాలిబాట వెంట చేతుల్లో లాంతర్లు పట్టుకుని గోవింద నామాలు పాడుకుంటూ రామలింగేశ్వరస్వామి గుడికి వెళ్లేవాళ్లం. అక్కడ చెర్లో స్నానం చేస్తూ ఏం మంత్రాలు చెప్పుకోవాలి, నీళ్లల్లో ఎలా అర్ఘ్యం ఇవ్వాలి, ముగ్గులెలా వెయ్యాలి, చెర్లో దీపాలు ఎలా వదలాలి…అన్నీ ఈవిడ చెబుతూ ఉంటే కుతూహలంగా నేర్చుకున్నాను. చెర్లో వదిలిన దీపాలు నీళ్లల్లో కదులుతూ మెరుస్తూ పోతూ ఉంటే ఆ దృశ్యం అలౌకిక ఆనందాన్ని కలిగించేది. కార్తీకమాసం చివరిరోజున ‘ పోలిస్వర్గం ’. ఆరోజు తెల్లారగట్ట చలిలో చెర్లో స్నానం అయ్యాక ‘ చాకలి పోలి కథ ’ ఆవిడే చెప్పాలి. తల పైకెత్తి చాకలిపోలి విమానం మీద వెళిపోతున్నట్టు ఊహించుకుంటూ నావరకూ నేను ఆమెలా భగవంతునిపై ఏకాగ్రత ప్రసాదించమని ప్రార్థించేదాన్ని. దానికి నేపథ్యం పెద్దత్తగారి కథాకథన నైపుణ్యమే. క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసికోటలో ఉసిరికొమ్మ పాతి, విష్ణుమూర్తిని పూజించి, దీపాలు పెట్టి అటుకులూ, బెల్లం నైవేద్యం పెట్టి పిల్లలందరికీ ప్రసాదంతోపాటు కాణీ, అర్థణా దక్షిణ ఇవ్వడం ఇప్పటికీ అందరూ గుర్తుచేసుకుంటుంటారు. ‘‘నాకు మూడు చిల్లికానీలొచ్చాయోచ్‌! నాకు రెండు అర్థణా బిళ్లలు, నాకు పెద్ద కానీలు 2 ’’ ఇలా పదే పదే లెక్కెట్టుకుని మురిసిపోయేవారు పిల్లలు.

తులసికోటలో తులసివెన్నులు ఎక్కువగా వేసినప్పుడు శుక్రవారం, మంగళవారం, ఏకాదశి, ద్వాదశి కాకుండా మిగతా రోజుల్లో పొద్దుటిపూట వాటిని చక్కగా తుంచాలట! అలా చేస్తే తులసీదేవి తలంటి పోసినంత ఆనందపడుతుందట. అప్పుడావిడ అయిదోతనం, కడుపుచలవా ఇచ్చి కాపాడుతుందట. ఈవిడ చెప్పే ఇలాంటి విషయాలు నాకెప్పటికీ గుర్తుండిపోయాయి.

వదినా, మరిదీ ( మా మామగారు ) ఇద్దరిదీ ఒకేరోజు పుట్టినరోజు. ప్రతీ సంవత్సరం పుట్టినరోజునాడు చక్కగా తలంటి పోసుకుని, కొత్త చీర కట్టుకుని వచ్చి ‘ ఇవాళ నాదీ, మా మరిదీ పుట్టినరోజర్రా. సూన్నారాయణా చక్కగా తలంటి పోసుకో. ఏం సుబ్బులూ వింటున్నావా, తలంటిపోయి సుమా మా మరిదికి ’ అంటూ ‘ ఎలాగుందే ఈ కొత్త చీర? ఆ మధ్య వెళ్లినప్పుడు పెట్టాడు మా పెద్దాడు ’ అంటూ అంచులు సాపు చేసుకుంటూ మురిపెంగా చెప్పే ఆవిడలోని ఈ చిన్న చిన్న ఆనందాల్ని తనకు తానే అందుకోవడంలోనే ఉంది జీవితసాఫల్యం! తనకెవరో విషెస్‌ చెప్పాలని అనుకోదావిడ. ఏవేవో స్వీట్లు తెచ్చి ఏనాడూ పంచిపెట్టలేదు. అయినా తన తృప్తి తనదే! ‘ తన సంతోషమే తనకు రక్ష ’.

శీతాకాలం వెళ్లిందంటే మొదలు…. అప్పడాలు, వడియాలు పెట్టుకోవడం, కొబ్బరి ముక్కలుగా తరిగి ఎండబెట్టి కొబ్బరి నూనె ఆడించుకోవడం, తిరగలి వేసి బియ్యం నూక విసురుకోవడం, కొబ్బరి ఈనెలు తీసి చీపుళ్లు కట్టుకోవడం లాంటి పనులుండేవి. ఇవన్నీ అవసరమైనప్పుడు ఒకళ్లకొకళ్లు సాయం చేసుకుంటూ, కబుర్లాడుకుంటూ పాటలు నేర్చుకుంటూ, పాడుకుంటూ చేసుకునే పనులు అందరిళ్లలోనూ కూడా. అన్నట్టు ఓ విషయం గుర్తుకొస్తోంది…పెరటి వసారాలో రోకళ్లతో దంచుకుంటుంటే… ‘కోడలా కోడలా కొడుకు పెళ్లామా’ అంటూ ఘంటసాల పాడిన పాట రేడియోలో విని నేర్చుకున్నావు కదూ అది పాడవే కమలా బాగుంటుంది – అంటూ హుషారిచ్చే వారీవిడ. ఎన్ని పనులు చేసుకున్నా ఇలా సరదాగా గడిచిపోయేది. డబ్భయ్యో దశకంలో గ్రామాల్లో మహిళా మండళ్ల ఏర్పాట్లు చురుగ్గా సాగిన రోజులవి. స్వతహాగానే మనం ఉన్నచోట ఏదో విధంగా నలుగురికి ఉపయోగపడే పనులు చేయాలన్నది నా తపన. పెరవలి సమితిలో మెంబర్‌గా ఉన్న నేను ఊళ్లో మహిళా మండలి స్థాపన కోసం సహజంగానే తాపత్రయపడ్డాను. నిజానికి ఊళ్లో జనాన్ని సానుకూల పరచడానికి చాలానే శ్రమ పడవలసివచ్చింది. సెక్రటరీగా పనులన్నీ నేనే చేస్తాను. మరి ప్రెసిడెంటుగా ఎవరు? అన్నప్పుడు మా అత్తగారితో సహా అందరూ ఈ సీతామహాలక్ష్మిగారినే ప్రపోజ్‌ చేశారు. ఆవిడ నాయకత్వ లక్షణం అది. మొదటిసారి ఇద్దరం ఏలూరు వెళ్లి రిజిస్టారాఫీసులో ‘‘ బాలా త్రిపురసుందరి మహిళా మండలి ’’ రిజిస్టర్‌ చేయించి, సంతకాలు పెట్టి రావడం ఎంత పెద్ద విషయమో ఆరోజుల్లో! ‘‘ ఇదిగో, ఇంతకీ డబ్బు లావాదేవీలేవీ లేకుంటేనే మా ఆవిణ్ణి ప్రెసిడెంటుగా ఉండనిస్తాను ’’ అన్న పెద్ద మామగారితో ‘‘ అలాంటిదేమీ ఉండదులే పెదనాన్నా. అవన్నీ కమల చూసుకుంటుందిగా ’’ అంటూ మా ఆయన భరోసా ఇచ్చాక ఒప్పుకున్నారు. ప్రతీ శుక్రవారం చేసే భజన కార్యక్రమానికి ఆవిడకున్న పబ్లిక్‌ రిలేషన్స్‌ ఎంతగానో తోడ్పడ్డాయి. అంతేకాదు ఆవిడ కమాండింగ్‌కి కూడా చాలా శక్తి ఉంది. మొత్తం మీద పాలంగి మహిళా మండలి చాలా విజయవంతంగా నడిచిందనడం నిజం!

‘‘ పాలంగి భమిడి వారు ’’ ఎక్కడ ఉన్నా, వాళ్ల కుదుళ్లు పాలంగిలోనే! ఒక్కచోటే లేకపోయినా ఆత్మీయంగా పలకిరించుకోగలిగే ‘ఉమ్మడిభావన’ ఈ విశాల కుటుంబానిది. కాపరానికి వచ్చినప్పటినుంచి పాలంగి లేదా తణుకు లోనే ఉండటం వల్లనూ, చాలాకాలంపాటు పాలంగిలోనే ఉన్న ‘ కోడల్ని ’ నేనే కావడం వల్లనూ, యాభై సంవత్సరాలనుంచి ఇక్కడే ఉంటూ అందరిమీదా అభిమానం పెంచుకునే నా స్వభావం వల్లనూ కూడా కావచ్చు. భమిడి వారి కుటుంబాలు అన్నిటితోనూ, అందరితోనూ నాది ఆత్మీయ బంధమే. ఆమధ్యావిడను చూడ్డానికి హైదరాబాద్‌ వెళ్లినప్పుడు చేతిలో రెండు పిప్పరమెంట్‌ బిళ్లలు పెట్టి ‘‘ ఇదిగో, కమలా! విమానం ఎక్కి ఢిల్లీ వెళ్లొచ్చానే. నువ్వెక్కావా విమానం? ఆమధ్య నీ పెద్ద కొడుకు అమెరికాలో ఉన్నాడని వెళ్లావుట కదూ? మర్చిపోయా. విమానం ఎక్కినా భయం వెయ్యలేదు సుమా! అందుకే బహుకాలం బతికితే బహువింతలు కళ్ల చూడచ్చమ్మా. ఊరికే అన్నారా పెద్దలు! ’’ అంది.

ఇంతకీ ఇప్పుడు మా పెద్దత్తగారి శతమానం వేడుకలు! కొడుకులూ, కోడళ్లూ, కూతుళ్లూ, అల్లుళ్లూ, మనవలు, మునిమనవలు నాలుగు తరాల సంతానాన్ని చూసుకోగలిగిన ఆవిడ అదృష్టాన్ని మనసారా అభినందిస్తూ… భమిడివారి కోడలు కమల(కమలా విశ్వనాథశర్మ), తణుకు.

బంధువర్గానికంతా, ముఖ్యంగా భమిడివారికంతా తీపిగురుతుగా మిగిలిపోయేలా ‘అమ్మ’ శతమానం వేడుకల్ని ప్లాన్‌ చేసి, జరిపి జ్ఞాపికగా ఈ జ్ఞాపకాల పుస్తకాన్ని అందించిన మరిది ‘రామం’కి నా శుభాభినందనలు.

– కమల వదిన

(  2012లో మా పెద్దత్తగారు శ్రీమతి సీతామహలక్ష్మి గారి ‘శతమానం వేడుకల’ సందర్భంగా ప్రచురించిన ‘జ్ఞాపిక’లో ప్రచురితం అయిన వ్యాసం )