—
1963 లో మెకానికల్ ఇంజినీరింగ్ పట్టా చేత పుచ్చుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటి పారుదల శాఖ ( ప్రాజెక్ట్స్ విభాగం లో ) జూనియర్ ఇంజినీర్ గా ఉద్యోగం లో ప్రవేశించాను. తొలిసారిగా పాదం మోపినది శ్రీశైలం ప్రాజెక్ట్ లో. ప్రాజెక్ట్ నిర్మాణం మొదలు పెట్టిన ప్రాధమిక దశ కావడం తో పని భారం చాలా ఎక్కువగా ఉండేది. రాత్రి, పగలు, పండుగలు, ఆదివారాలు అంటూ విరామం అసలు ఉండేది కాదు. అయితే తీరిక దొరికిన సమయాలలో కాస్త మార్పు, వెసులుబాటు కోసం పుస్తకాలు, పాటలు, స్నేహితులను ఉత్తరాల ద్వారా పలకరిస్తూ ఉండడం… వీటిని ఎంచుకోవడం జరిగింది. నిజం చెప్పాలంటే, అసలు నాకు ఉత్తరాలంటే పరమ ప్రీతి. తెలిసిన స్నేహితులు అనేకులు ఉన్నప్పటికీ, కొత్త స్నేహితులకోసమని వెంపరలాడేవాళ్ళం – అదీ ఉత్తరాల ద్వారా. మరొక రకం గా చెప్పాలంటే pen friends — కలం స్నేహితులు అన్నమాట…ఆ స్నేహితులు కేవలం ఇండియా లోనే కాకుండా విదేశాలలో కూడా ఉండేవారు. ఉదాహరణ కి… అమెరికా, ఇంగ్లాండ్, జర్మనీ, శ్రీలంక, నేపాల్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, గ్రీస్, జపాన్, ఫిజీ మొదలైన దేశాలు. ఇక ఇండియా లో పెన్ ఫ్రెండ్స్ కూడా ఒక్క మన రాష్ట్రంలో వారితో బాటు ఇతర రాష్ట్రాల వారు కూడా అనేకులు స్నేహితులయారు. ఆ రకం గా కేరళ రాష్టం లో ఎర్నాకుళం నుండి శ్రీ మరుదాచలం ( చంద్రన్ ) తో స్నేహం ఏర్పడింది. అప్పటికి — అంటే 1965 నాటికి చంద్రన్ ఇంకా విద్యార్థి దశ లోనే ఉన్నాడు. ఎర్నాకుళం కి సమీపాన కొత్తమంగళం లో ఇంజినీరింగ్ చదువులో ప్రవేశించాడు — సివిల్ ఇంజినీరింగ్ విభాగం లో — అయినా, తరచుగా ఉత్తరాలు వ్రాస్తూ ఉండేవాడు. తన చదువు గురించిన సలహాలు, సంప్రదింపులు… అందలి విశేషాలు. నేను అంత ప్రాంప్ట్ గానూ ఉచిత సలహాలను ఇస్తూ ఉండేవాణ్ణి. నా ఉద్యోగానుభవాన్ని దృష్టి లో పెట్టుకుని అవి తనకు నచ్చేవని అతని ఉత్తరాలు చెబుతూ ఉండేవి. 1968 లో నేను ఉద్యోగం లో బోర్ కొట్టి నేను ఒక నెల శెలవు పెట్టి దక్షిణ దేశ యాత్ర కి బయలు దేరాను. అందులో భాగం గా మైసూరు లో ఉన్న మరో కలం స్నేహితుడు పార్థసారధి ని కలిసి వాళ్ళ ఇంట్లో మూడు, నాలుగు రోజులుండి పార్ధు దగ్గర శెలవు తీసుకుని ఊటీ, కొడైకెనాల్ చుట్టబెట్టి, అలప్పీ, క్విలన్, కొచ్చిన్ ల మీదుగా ఎర్నాకుళం చేరాను. అక్కడ తొలిసారిగా మరుదాచలం ని కలుసుకుని వారింట ఆతిధ్యాన్ని స్వీకరించడం మరపురాని, మరువలేని తీయని అనుభూతి. ఇద్దరం చుట్టుపక్కల యాత్రాస్థలాలని ఎన్నిటినో చూసాము. దగ్గరలో ఉన్న ఒక సినిమాహాల్లో ఇద్దరం కలిసి ‘ సత్య హరిశ్చంద్ర ’ తమిళ సినిమా చూడడం విశేషం. నా తరువాత మజిలీ తిరువనంతపురం. చివరిగా ఎర్నాకుళం లో నాతో బస్‌స్టాండ్ కి కూడా వచ్చి, నన్ను తిరువనంతపురం వెళ్లే బస్ ని ఎక్కించి తను నాకు వీడ్కోలు చెప్పాడు.
అలా కొంత కాలం గడిచాకా, ముందు నేను, తరువాత తానూ గృహస్థులం అయ్యాము. నా పెళ్ళికి కానుక గా తాను మద్రాస్ గవర్నమెంట్ లాటరీ టికెట్ ను కానుక గా పంపడం తమాషాగా అనిపించింది. అయితే ఆ లాటరీ టికెట్ కి డ్రా లో బహుమతి అంటూ ఏమీ రాలేదనుకోండి…అది వేరే సంగతి !. తాను తన పెళ్ళికి నన్ను ఆహ్వానిస్తూ పెళ్లిపత్రిక ను పంపాడు. వాళ్ళ కాబోయే శ్రీమతి కౌసల్య పెళ్లి నాటికి స్కూల్ టీచర్ గా పని చేసేవారు. అయితే, నేను నా ఉద్యోగం లో తీరిక లేక శెలవు దొరక్కపోవడంతో కోయంబత్తూరు లో జరిగిన వారి వివాహానికి స్వయం గా వెళ్లలేకపోయాను.
తరువాత, మా మధ్య స్నేహం మరింత బలపడి ఉత్తర ప్రత్యుత్తరాలు, అప్పుడప్పుడు ఫోను సంభాషణలు జరుగుతూ ఉండేవి. ఇలా ఉండగా, ఉద్యోగం లో నేనూ, కోయంబత్తూర్ లో మోడర్న్ బిల్డింగ్ డిజైనర్స్ పేరుతో ఒక గృహ నిర్మాణ సంస్థ ను నెలకొలిపి ఆ సంస్థ కార్యకలాపాలలో క్షణం తీరికలేనంత బిజీ గా తానూ ఉండేవాళ్ళం. నేను నా ఉద్యోగమూ, ట్రాన్స్ఫర్లు, సంసార బాధ్యతలు… వీటితో క్షణం తీరిక లేకుండా ఉండేవాడిని, క్రమేపీ మా మధ్యన స్నేహ సంబంధాలకు కొంత బ్రేక్ పడింది. ఇక మరికొన్ని నెలలయేసరికి ఆ బంధం విడిపోయినట్లుగా అయిపోయింది.
మరికొన్ని సంవత్సరాలు అలా గడిచిపోయాయి. అలా కొన్నాళ్ల, కొన్నేళ్ల బ్రేక్ అనంతరం ఎంతో దీర్ఘ ప్రయత్నం చేయగా, చేయగా దైవ సంకల్పం తో అతని వివరాలను రాబట్టగలిగాను. తానూ ఇండియా వదలి దుబాయ్ కి కుటుంబం తో సహా మూవ్ అయినట్లు. ” అమ్మయ్య ” అనుకుని దీర్ఘంగా నిట్టూర్చాను. అయితే ఈ లోగా నాకూ జీవితం లో అనూహ్యమయిన కొన్ని పరిణామాలు సంభవించాయి. 2004 జూన్ లో నా శ్రీమతి సీతాదేవి కాలం చేయడం తో నేనూ తరచుగా ఇండియా నుండి మా పిల్లలు స్థిరపడిన ఇంగ్లాండ్, యూ. కె. ల మధ్య తిరుగుతూ ఉండడం తో మా మధ్య కాంటాక్ట్ కొంతకాలం లేదనే చెప్పాలి. నేను అమెరికా లో ఉండగానే ఒక సందర్భం లో ఫేస్‌బుక్ పుణ్యమా అని అతని తాజా వివరాలను సేకరించగలిగాను. తానూ ఇండియాకి వచ్చినట్లు, తిరుచిరాపల్లి లో కుటుంబం తో స్థిరపడినట్లు — రోహిణి హౌసింగ్ కనస్ట్రక్షన్ కంపెనీ ని స్థాపించి, నిర్వహిస్తూ ఉన్నట్లు, ఆ సమాచారం అందిస్తూ నేను ఇండియాకి వచ్చీ రాగానే తిరుచి కి ప్లాన్ చేసుకుని రమ్మనమని ఆహ్వానించాడు. అక్కడ ఒక విశాలమయిన ఇంటిని నిర్మించుకుని సకుటుంబంగా స్థిరపడినట్లు చెబుతూ, ఆ గృహప్రవేశ వేడుకలకు సంబంధించిన ఫోటోలను కూడా నాకు పంపాడు.
ఈ సంఘటన జరిగిన కొన్ని రోజులకి నేను అమెరికా నుండి ఇండియాకి తిరుగు ప్రయాణానికి సన్నాహాలను చేసుకున్నాను. ఒకరోజు ఫేస్ బుక్ లో మరుదాచలం కుమార్తె అనిత పోస్ట్ పెట్టింది ” డాడీ.. నువ్వు ఎక్కడ వున్నా ఎప్పుడూ మా మనసులలోనే ఉంటావు…! ” అని. ఎందుకో గానీ నా మనసు కీడుని శంకించింది !?. వెంటనే సందేహ నివృత్తి కోసం సింగపూర్ లో ఉంటూన్న మరుదాచలం కుమార్తె అనిత కి మెస్సేజ్ పెట్టాను. దానికి తాను వెంటనే స్పందించింది. కొంతకాలం క్రితం వాళ్ళ నాన్న గారు మరుదాచలం గారు తన సంస్థ లో కొందరితో కలిసి నేపాల్ విహారయాత్ర ను తలపెట్టి వెళ్లారని నేపాల్ లోని ఎవరెస్టు శిఖర సందర్శన కోసం ఛార్టర్డ్ ఫ్లైట్ లో ఖాట్మండు నుండి వెళ్ళారని, తిరుగు ప్రయాణం లో వారి విమానం ఖాట్మండు విమానాశ్రయం లో ల్యాండ్ అవుతూండగా ప్రమాదానికి లోనై కూలిపోయిందనీ దురదృష్టవశాత్తూ ఆ విమానం లోని విమాన సిబ్బంది, ప్రయాణీకులు యావత్తూ మృతి చెందారని పిడుగులాంటి వార్త — వార్త తెలుస్తూనే క్షణకాలం నేను నిశ్చేష్టుణ్ణి అయ్యాను. తరువాత ఆ షాక్ నుండి తేరుకుని, విమాన ప్రమాద వివరాలను వింటూ ఉంటే, నా మనసులో దిగులు వ్యాపించింది. చాలాకాలానికి కలుసుకుంటున్నామన్న ఆశ, ఆనందం, ఒక్క క్షణంలోనే ఆవిరి అయిపోయాయి ! అంతే మరి… మనం ఒకటి తలిస్తే, దైవం వేరొకటి తెలుస్తుందని కదా పెద్దల సూక్తి ..!
రెండేళ్ల క్రితం అనుకుంటాను…
నేను తిరుచ్చి, శ్రీరంగం యాత్ర లో భాగం గా తిరుచ్చి లో మరుదాచలం ఇంటికి వెళ్లాను. మరుదాచలం కుమారుడు ఆనంద్ నన్ను బస్టాండులో రిసీవ్ చేసుకుని వారి ఇంటికి తీసుకువెళ్ళాడు. అక్కడ శ్రీమతి కౌసల్య గారిని, కుటుంబాన్ని కలిసి వారికి నా ప్రగాఢ సానుభూతి ని తెలియజేయడం జరిగింది. మరుదాచలం భౌతికం గా నాకు కనుమరుగయినా, నా ఆలోచనలలో, తాను సదా చిరంజీవే !
మరుదాచలం కి సమాజంలో ఒక గుర్తింపును తెచ్చినది చిత్రకళలో ఆయనకున్న ప్రావీణ్యం. ఉదాహరణకు, ఆయన స్వయంగా వేసి నాకు కానుకగా పంపిన ప్రకృతి వర్ణచిత్రాన్ని దయచేసి గమనించండి.
<><><>*** నమస్తే…ధన్యవాదాలు ***<><><>