—
భక్తిప్రపూర్ణ భద్రాచల రామదాసును ఈ విధంగా సంబోధించటమే సబబు అనిపించి నేను రామదాసుగారిని భక్తి ప్రపూర్ణగా పేర్కొంటున్నాను. వాగ్గేయకారుల పేర్లు తలుచుకోగానే మనసుకు తోచే ప్రముఖ నామాలలో
భద్రాచల రామదాసు గారి పేరు ఒకటి. కల్మషం లేని భక్తి, రాముడిని తన వాడుగా, తనకు ఆప్తుడిగా, అయినవాడుగా ఎంచి, మంచిచెడులు కష్ట సుఖాలగురించి ఒక ఆప్తుడికి చెప్పుకున్నట్టు రామదాసుగారు వ్రాసుకున్న కీర్తనల సంపుటిలోంచి కొన్నిటిని విశ్లేషించి సోదాహరణంగా మీముందుంచే ప్రయత్నం ఇది.
రామదాసు అసలు పేరు గోపన్న. బ్రాహ్మణా కుటుంబంలో పుట్టిన గోపన్న చిరుప్రాయం లోనే తెలుగు భాషను చక్కగా ఔపోసన పట్టాడు. అతడి రామభక్తియే అతడికి రామదాసు అనే పేరును ఆపాదించింది. ఇతడికి రామభక్తి సామ్రాజ్యాన్ని పరిచయం చేసింది మరెవరో కాదు, స్వయానా సంత్ కబీరు దాసు.
రామదాసును తానిషా కారాగారంలో ఉంచే వరకూ, అతడి గురించి ఎక్కువగా తెలియదు. వ్రాసిన కవిత్వమంతా కారాగారంలో ఒంటరిగా గడిపిన సమయంలో వ్రాసినదే! ప్రచారంలో ఉన్న కథనం ఏమిటంటే రాముడు అతనికి కలలో కనిపించి రామదాసును భద్రాచలానికి తహసీల్దారుగా నియమించిబడనున్నాడని తెలియచేశాడట. అలా నియమితం కాగానే, అక్కడున్న రామాలయాన్ని పునరుద్ధరించమని ఆఙ్ఞాపించాడట.
రామాజ్ఞ శిరోధార్యమని భావించిన రామదాసు, తహసీల్దారుగా నైజామ్ తరఫున సేకరించిన రివిన్యూ ధనాన్ని వెచ్చించి రామాలయ పునరుద్ధరణ కార్యక్రమం ఆరంభించాడు. సీతా సమేత రామ లక్ష్మణ, భరతులకు నగలు మొదలైనవి చేయించాడు. నైజాం ధనాన్ని స్వకార్యానికి వాడుకున్న కారణంగా నేరారోపణ చేసి తానిషా రామదాసును కారాగారానికి పంపాడు. అతడిని చిత్రవధలకు గురిచేసిన సమయంలో కూడా రామనామ జపంతో కొరడా దెబ్బలను భరించాడట. చిట్టా చివరికి రాముడు దయదలిచి రామదాసుని సేవకులుగా మరువేషాలలో వచ్చి, రామదాసు గాయాలను స్వయంగా భరించాడట రాముడు. తానీషాను కలిసి , రామదాసు అప్పులన్నీ తీర్చి, రసీదును రామదాసుకు అప్పగించి మాయమయ్యాడట. కారాగారంనుంచి విడుదల అయిన రామదాసు, తనను రక్షించింది స్వయానా రాముడేనని గ్రహించి ఆనందోల్లాసంతో గానం చేశాడట.
రామదాసు కీర్తనలలో కానవచ్చే సరళ భాష పండిత పామరులకు సమానంగా అర్థం అయి మనసుకును రంజింప చేస్తుంది. లయ తప్పని పదసరళి, వాడుక మాటలు, మధ్య మధ్య అలవోకగా దొర్లే ఉర్దూ పదాలు ఏ భాషనైనా నాలో ఇముడ్చుకోగల శక్తి తెలుగుకు ఉందని చెప్పక చెప్తాయి.
సరళత్వానికి ప్రతీక ఈ పాట: “ఎందుకయ్యా ఉంచినావు బందిఖానాలో, రామయ్యా రామా బందిఖానాలో” ఇక్కడ బందిఖానా అనే ఉర్దూ మాటను ఎంత తేలికగా వాడాడో కదా రామదాసు!
మరొక ఉర్దూ ఉదాహరణ:
“ఆవు మీ హమారా భేటీకి చల్ మీ “
కొన్ని సంస్కృతంలో కూడా ఉన్నాయి
ఉదాహరణకి “శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ భాండ తండోపతండ కరండమండల శాంతోద్దీపిత సుగుణ నిర్గుణాతీత సచ్చిదానంద పరాత్పర తారక బ్రహ్మాద్వయ దశదిశ ప్రకాశం…” అంటూ కొనసాగే ఈ చూర్ణిక రాజదర్బారుల్లో భట్రాజులు చేసే పొగడ్తల్లా అనిపిస్తుంది.
ఎలా చూసినా రామదాసు కీర్తనలు భక్తిమయమే.
“అంతా రామమయం, ఈ జగమంతా రామమయం “
లేదా
“భజరే శ్రీరామం హే మానస భజరే రఘురామమ్” – ( వసంతలక్ష్మి గారి స్వరంలో ఈ క్రింద…. )
–
తనను కావరమ్మని ఎంతపిలిచినా పలుకని రాముడికి నచ్చచెప్పమని సీతమ్మను కోరటం హృద్యంగా ఉంటుంది;
“నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ ..”
అంటూ ఏయే వేళల్లో అయితే అయన నమ్య మనస్కుడై ఉంటాడో ఆమెకు తెలియచేసాడు.
ముందుగా సీతమ్మను కూడా “నారీశిరోమణి” అంటూ బాగా పొగిడి ఆ తరువాతే, వారి ఏకాంత సమయంలో, రాముడు సీత చెక్కిలి నొక్కే సమయంలోనో, లేదా
“చక్కగా మరుకేళి చొక్కి ఉండెడు వేళ”
ననుబ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ ననుబ్రోవమని చెప్పవే”
అని తన ప్రస్తావనను ఆ నాజూకయిన సమయం లో ప్రస్తావించి, సిఫార్సు చేయమని కోరతాడు
మరొక చోట రాముడిని తన స్నేహితుడిలాగా, చెలికానిలాగా, బ్రతిమాలుతూ
“పలుకే బంగారమాయెనా కోదండపాణి పలుకే బంగారమాయెనా
పలుకే బంగారమాయె పిలచీన పలుకవేమి
కలలో నీ నామస్మరణా మరువ చక్కని తండ్రి” అంటూ బుజ్జగించటం చూస్తాము.
ఇదే చనువుతో రాముని దెప్పుతూ కూడా కీర్తిస్తాడు రామదాసు. మరి రాముడే సర్వస్వమూ అనుకున్నాడాయే !
“సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము రామచంద్రా
ఆ పతకమునకు పట్టె పదివేల వరహాలు రామచంద్రా “
తానిచ్చిన లంచాలను ఏకరువు పెడుతూ మధ్యలో ఎక్కడో పశ్చాత్త్తాపం కలిగి
“అబ్బా తిట్టితినని ఆయాసపడవద్దు రామచంద్రా
ఈ దెబ్బలకోర్వక అబ్బా తిట్టితినయ్యా రామచంద్రా “
అంటూ అనునయిస్తాడు.
చివరిగా రామదాసు వ్రాసిన హారతులు మంగళాలు చాలా లోకప్రియమైనవి. వీటిలో అత్యంత ప్రముఖమైనది,
“రామచంద్రాయ జనక రాజజా మనోహరాయ
మామకాభీష్ట దాయ మహిత మంగళం”
ఇవి గాక , రామదాసు రచించిన దాశరథీ శతకం (104 పద్యాలూ) చిరపరిచితమే. అందులో ప్రతి పద్యం చివరన, “దాశరథీ కరుణాపయోనిధీ” అంటూ రాముడిని కీర్తిస్తూ, తనదైన ముద్రను వేసి, రామభక్తి సామ్రాజ్యానికి తలమానికమై చిరకీర్తి సంపాదించాడు కంచర్ల గోపన్న ఉరఫ్ భద్రాచల రామదాసు. భారతీయ భక్తి సాంప్రదాయంలో ఒక విషయం మన ముందుకు వస్తుంది. భక్తుడికీ, దైవానికి మధ్యనున్నది ఎంతో వ్యక్తిగతమైన సంబంధం. ఇదే, ఒక భక్తుడు తన దైవాన్ని దూషించినా, ప్రేమించినా, ఆప్తుడిగా, అయినవాడిగా భావించి కష్టమూ, సుఖమూ చెప్పుకున్నా అన్నీ క్షంతవ్యాలే. అందుకే, త్యాగయ్యకు కాపాడే దైవమైతే, క్షేత్రయ్యకు ప్రేమికుడు. అలాగే భక్త రామదాసుకు అతడు స్నేహితుడు, మార్గదర్శి, ఆంతరంగికుడు, సర్వాంతర్యామి. మనకు సర్వదా స్మరణీయుడు.
*****************************************************