.
” వడ్డెర చండీ దాస్ ” అనే కలం పేరుతో కేవలం కొన్ని ( సుమారుగా పది లోపే ) పుస్తకాలు మాత్రమే రచించి, సాహితీ రంగంలో ఒక కొత్త ఒరవడి దిద్ది, అనితర సాధ్యమైన రచనాశైలి, శిల్పాలతో తనదైన ముద్రను వేసుకున్న శ్రీ చెరుకూరి సుబ్రహ్మణ్య్వేశ్వర రావు గారు 1937 నవంబర్ 30 వ తేదిన కృష్ణా జిల్లా పామర్రు మండలం పెరిశేపల్లి గ్రామంలో ఒక వ్యవసాయ దారుల కుటుంబం లో జన్మించారు. 2005 జనవరి 30 వ తేదీన విజయవాడ లోని నాగార్జున ఆసువత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. విద్యార్హత తత్వ శాస్త్రం లో డాక్టరేట్. ఉద్యోగం తిరుపతి లోని శ్రీ వేంకటేశ్వర విశ్వావిద్యాలయం లో తత్వ శాస్త్ర అధ్యాపకత్వం.
.
వీరి కలం పేరు వడ్డెర చండీ దాస్. ఇందులోని వడ్డెర అనే ఇంటి పేరు కాయకష్టం చేసుకుని బ్రతుకు బండి నడుపుకునే పేద వర్గానికి ప్రతీక గానూ, చండిదాస్ అనే పేరు 15 వ శతాబ్దపు బెంగాలీ విప్లవ కవి అని చెప్పబడే చండీ దాస్ పేరు నుంచి తీసుకున్నారని అంటారు.
.
ఇక్కడ విప్లవం అనే పదానికి నిఘంటువు లో చెప్పబడిన అర్ధం కాకుండా, ఎర్ర భావజాలం వారు రుద్దిన భావార్ధం అని గ్రహించుకోవాలి.
.
త్రిపుర, బుచ్చిబాబు గార్ల వలే చండీ దాస్ గారి శైలి కూడా చైతన్య స్రవంతి బాణీ లో సాగుతుంది. కథ, కథనం ఎక్కువగా పాత్రల ఆలోచనలలో, అంతఃచేతన లో సాగుతాయి. కొంతవరకూ సంభాషణల లో కథ సాగుతుంది. రచయిత నేరుగా కథ చెప్పడం తక్కువ. త్రిపుర, బుచ్చిబాబు గార్ల రచనలలో ప్రస్పుటం గా కనిపించే మానవ సంబంధాల విశ్లేషణే, చండీ దాస్ గారి రచనల లోనూ కనిపిస్తుంది.
.
ఇది యాదృశ్చికం కావచ్చు, లేక నా అసమగ్ర అసంపూర్ణ పరిజ్ఞానం కావచ్చు. కానీ నాకు ” శరత్ బాబు గారి శ్రీ కాంత్, త్రిపుర గారి భాస్కీరియో, బుచ్చిబాబు గారి దయానిధి పాత్రల ప్రభావం చండీదాస్ గారి పాత్ర ల మీద ఉంది ” అని అనిపిస్తుంది. అలాగే శ్రీకాంత్, భాస్కీరియో, దయానిధీ, కృష్ణ చైతన్య లు మాతృ వియోగం అనుభవించిన వారే. వారి పైన తల్లి ప్రభావం చాలా ఉంది.
.
కాశీ మజిలీ, పంచతంత్రం మొదలుగా నేటి కాలం వరకూ ఏ సాహిత్య ప్రక్రియ ను పరిశీలించినా, ప్రధాన విషయం మానవ సంబంధాలు గానే ఉంటుంది.
.
మానవ సంబందాల గురించి రాయబడిన మనో వైజ్ఞానిక పుస్తకాలలో విశ్వనాథ సత్యనారాయణ గారి ” చెలియలి కట్ట ” అగ్రస్థానం లో నిలుస్తుంది. విశ్వనాథ వారి తీరే వేరు. కాలచక్రాన్ని రెండు వందల సంవత్సరాలు వెనక్కి తిప్పి తాను వ్రాసిన బాష ని పాఠకుల చేత ఇష్టం గా చదివించి కవుల నిరంకుశత్వానికి నిలువెత్తు నిదర్శనం గా నిలిచిన కవి సామ్రాట్టులు.
చండీదాస్ గారు రాసిన పుస్తకాలు తెలుగు లో హిమజ్వాల, అనుక్షణికం, చీకటి లోంచి చీకట్లోకి, ప్రేమతో, ఇంగ్లీష్ లో DESIRE AND LIBERATION.
.
తెలుగు పుస్తకాలు హిమజ్వాల, అనుక్షణికం ఈ రెండూ ఆంధ్రజ్యోతి వార పత్రిక లో ప్రచురించబడి విశేషం గా ప్రశంసలూ, విమర్శలూ అందుకుని పుస్తకాలు గా ముద్రణలు, పునర్ముద్రణలూ పొందాయి. ఆసక్తి ఉన్నవారు అమెజాన్ వారి ద్వారా పొందవచ్చు.
.
ఇంగ్లీష్ భాష లో రాయబడిన మూడవ పుస్తకాన్ని చాలామంది చదివారు. వారిలో కాళిదాసు భట్టాచార్య అనే ఒక బెంగాలీ ఆయన ఈ పుస్తకాన్ని చదివి విషయం గ్రహించి ఆ విషయాన్ని తన ఆక్స్‌ఫర్డ్ పరిచయస్తులకు చెప్పగా వారు ఆ పుస్తకాన్ని అచ్చు వేయడం అది బహుముఖంగా ప్రశంసలు పొందడం జరిగింది.
.
సిద్ధాంతాలు సమాజాన్ని కట్టడి చేస్తాయి. సిద్ధాంతాచారణ కోసం కొంత వ్యక్తిగత స్వేచ్ఛ ని బదలాయింపు చేయాలి. సమాజాన్ని ఆర్థిక కొలమానం ప్రకారం మూడుతరగతులు గానూ, లింగ భేద న్యాయం ప్రకారం రెండు ( ఇది కూడా సమీప భవిష్యత్ లో 3 అవుతుంది ) తరగతులు గానూ విభజించినప్పటికీ, అసలైన విభజన జనాన్ని ప్రభావితం చేసే వారూ ప్రభావితం అయ్యేవారూ అనే ! అయితే ఇది అంతర్లీనం. సమాజాన్ని ప్రభావితం చేయగలిగిన వారికి సమాజ కట్టుబాట్ల నియమాలు పెద్దగా వర్తించవు.
.
” మనసు వెళ్లిన చోటికల్లా మనిషి వెళ్ళకూడదు, మనిషి వెళ్లిన చోటికల్లా మనసును తీసుకొని వెళ్ళకూడదు ” అని ఒకాయన అన్నారు. తప్పనిసరి పరిస్థితులలో తరుణోపాయం గా ” నికలో న బే -నకాబ్, జమానా ఖరాబ్ హై ” అని ముమ్ తాజ్ రాషీద్ అనే గజల్ కవి గారి ఉపదేశాన్ని పాఠించాలి.
.
బుచ్చిబాబు గారి చివరకు మిగిలేది లో డాక్టర్ దయానిధి, ఆమె – నీడ కథ లోని నాయకుడు, త్రిపుర గారి కథా నాయకుడు భాస్కిరియో ల వలే చండీదాస్ గారి పాత్రల గమనం కూడా ఎండమావుల వైపే ! అన్వేషణ అందులోని నీళ్ల కోసమే ! మనం ‘ మనకి కావాలి ’ అనుకున్నవారి ఆలోచనా ధోరణి తో మన ఆలోచనా స్రవంతిని సమన్వయం, చేసుకుంటాం. దీనినే సర్దుకుపోవడం అంటారు. సహజీవనం చేయడానికి ఇది అత్యవసరం. ఇందులో అహంభావం / ఇగోయిజం ప్రసక్తి లేదు. ఇది వ్యక్తిత్వం చంపుకుని రాజీ పడడం కాదు. త్యాగం అంతకన్నా కాదు. ఒక అవసరం మాత్రమే!
.
బుచ్చిబాబు గారి దయానిధి అమోఘమైన ఆలోచనా శక్తి కలిగినప్పటికీ, దానిని ఆచరణ లో పెట్టే ధైర్యం లేని వ్యక్తి కావడం వలన నిష్క్రియా ప్రియుడిగా మిగిలిపోయాడు. పైన చెప్పుకొన్న విధంగా సర్దుకుపోవడం అనే సహజ నియమం అతని వ్యక్తిత్వం లో లేదు. ఎందుకంటే సర్దుకుపోవడానికి కూడా ధైర్యం కావాలి.
.
దయానిధి తో సంబంధం ఉన్న అమృతం, కోమలి, ఇందిర మొదలైనవారు బయట ప్రపంచానికి, దయానిధి కీ సామాన్యం గా కనిపిస్తూనే అవసరం పడ్డప్పుడు అసాధారణం గా ప్రవర్తించారు. వారికి ఉన్న ఈ తెగువా, ధైర్యం దయానిధి కి లేవు. అతనికి ఆలోచనలు అనంతం. ఆచరణ దాకా వచ్చినప్పుడు పిరికితనం, దానికి నీతి నియమాల ముసుగు. ఫలితం మింగలేకా, కక్క లేకా లెక్కకి అందనంత క్షోభ.
.
ధైర్యం లేని మనిషికి వేరే ఎన్ని మంచి గుణాలు ఉన్నప్పటికీ రాణించవు. కారణం ఏమిటంటే వాటన్నిటినీ, ప్రకటించడానికీ, ఆచరణలో పెట్టడానికీ, అతని ధైర్య లేమి అడ్డుపడి అతన్ని నిష్క్రియా పరుణ్ణి చేస్తుంది. తత్‌ఫలితం గా అతను అసమర్ధుని గా ముద్ర వేయించుకుని అసహ్యించుకోబడతాడు.
.
చండీ దాస్ గారి కృష్ణ చైతన్య దీ ఇదే ధోరణి.
.
చండీదాస్ గారికి కొందరు రచయితలతో సామ్యం, భావజాలం వరకే పరిమితం అనుకుని సర్దుకున్నా పాత్రల చిత్రీకరణ / లేక పాత్రల ప్రవర్తన కూడా కొందరు రచయితలు సృష్టించిన పాత్రలను పోలి ఉండడాన్ని పాఠకులే ఏదో విధంగా సరిపెట్టుకోవాలి.
మిగిలిన ప్రత్యేకతలు వారి రచనలు చదువుతున్నప్పుడు భోదపడతాయి. ఈ ఉపోద్ఘాతం ఒక అవగాహన కోసం రాయబడింది.
.
**************************
తరువాయి వచ్చే సంచికలో……