.
జాతీయ యువజన దినోత్సవం ( 12 జనవరి, స్వామి వివేకానంద జయంతి) సందర్భంగా….
.
సనాతన ధర్మ స్ఫూర్తిని, భారత దేశ ఆథ్యాత్మిక, సాంస్కృతిక ఘనతను ప్రపంచానికి చాటిన స్వామి వివేకానంద జీవితం యువతరంపై ఆనాడు చూపిన ప్రభావం అంతా ఇంతా కాదు. ఆయన చెప్పిన ప్రతి మాటా ఆచరించి చూపారు కాబట్టే అవి తరతరాలుగా యువతను ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. ఆయన జయంతి సందర్భంగా, యువతను ఉద్దేశించి చెప్పిన మాటలను, ఒకసారి గుర్తు చేసుకుందాం. నేటి తరంలో వాటి ఆచరణ ఎంతవరకు ఉందో ఆలోచిద్దాం.
.
” లేవండి! మేల్కొనండి!
లక్ష్యాన్ని చేరుకొనేవరకు ఆగకండి!”
.
కథోపనిషత్తు స్ఫూర్తిగా ఇచ్చిన ఈ సందేశం ఆయన చెప్పిన అన్నిటికీ తలమానికం అంటారు. లక్ష్యాన్ని చేరుకొనేవరకు ఆయన విశ్రమించలేదు. ఎన్నో ఆటుపోట్లను సమర్థవంతంగా ఎదుర్కొని సనాతన ధర్మం, ఆచరణ గొప్పదనాన్ని ప్రపంచానికి చాటారు. ఇక, ఆయన తరం యువత ఈ మాటకు బాగా ప్రభావితం అయ్యింది. వాళ్ళలో చాలామంది ఈ సూక్తిని జీర్ణించుకున్నారు కాబట్టే ఆ స్ఫూర్తి తరువాతి తరాలకు కూడా అందింది. అందుకే ప్రత్యేకంగా బోధించాల్సిన పని లేకుండా ఈ తరం యువత ఆ లక్షణాలను కనబరుస్తున్నారు. చదువు, ఉద్యోగాలు, ఆవిష్కరణలు, సంస్థల ఏర్పాటు వంటి విషయాల్లో యువతరం అవకాశాలు ఉపయోగించుకుంటూ, అవకాశాలు లేనిచోట్ల వాటిని కల్పించుకుంటూ ముందుకెళ్తూంది.
.
” ఇనుప కండరాలు
ఉక్కు నరాలు
వజ్ర సంకల్పం
ఉన్న యువతే ఈ దేశానికి అవసరం ”
.
ఇందుకు ఆయనే ఒక ఉదాహరణగా నిలిచారు. దృఢమైన శరీరం, మొక్కవోని సంకల్పం కలిగి ఉండేవారు. ఆరోగ్యం విషయంలో ప్రస్తుతం మిశ్రమ ఫలితంగా ఉందని చెప్పాలి. కొంతమంది శరీర దారుఢ్యానికి బాగా ప్రాముఖ్యత ఇస్తుండగా అనేకమంది gadgets మీద ఎక్కువ దృష్టి పెడుతూ ఆరోగ్యం గురించి అంతగా పట్టించుకోవడం లేదు.
.
లేచి పడుతున్నందుకు కాదు,
పడినా లేస్తున్నందుకు “
.
” ఒక ఆలోచనను స్వీకరించండి.
దాని గురించే ఆలోచించండి.
దాని గురించే కలగనండి.
ఆ ఆలోచనను మీ నరనరాల్లో జీర్ణించుకుపోనీయండి.
మిగతా ఆలోచనలను పక్కనబెట్టండి.
ఇలా చేస్తే విజయం మిమ్మల్ని తప్పక వరిస్తుంది ”
.
ముందే చెప్పినట్లు, ఎన్నో ఆటుపోట్లను అధిగమించి గమ్యాన్ని చేరుకున్నారు. యువతరం కూడా అనేక సవాళ్ళను ఎదుర్కొని, మళ్ళీ మళ్ళీ ప్రయత్నించి ధృతి, దృష్టి ఉందని సంకల్పాలను నెరవేర్చుకోవడం ద్వారా నిరూపించుకుంటోంది.
.
” యువత భగవద్గీత చేత పట్టుకొని తిరగడంకన్నా ఫుట్‌బాల్ కోర్టులో ఉంటే చూడడం నాకిష్టం ”
.
ఆథ్యాత్మికత అంటే స్తబ్దుగ ఉండడం కాదు, క్రియాశీలంగా ఉండడం అన్నది నేటి యువతీయువకుల అభిప్రాయం అన్నది తెలుస్తూనే ఉంది.
.
అయితే, యువత చేస్తున్న కృషి, చూపిస్తున్న పట్టుదల, కనబరుస్తున్న నిజాయితీ ఎక్కువగా వేటి పట్ల ఉంటూంది? ఎక్కువ మార్కులు రావడం, పోటీల్లో నెగ్గడం, పెద్ద జీతాలిచ్చే బడా ఉద్యోగాల విషయంలో ఉంటూంది. సామాజిక విషయాల్లో కూడా బాగా ఉంటోంది. ఆన్లైన్ వేదికగా జరిగే అనేక ఉద్యమాలు ఎక్కువగా యువతరంతో కూడినవే. అంటే, వ్యక్తిగత ఎదుగుదల, సామాజిక స్ఫూర్తి మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నట్టు స్పష్టంగా తెలుస్తూంది. ఇక్కడే ఒక సూక్ష్మాన్ని గ్రహించాలి. నిజాయితీ అనేది తన పట్ల తనకి ఎంతగా ఉందన్నది పరిశీలించాలి. ఎక్కడో ఎవరికో అన్యాయం జరిగితే ఎలా స్పందిస్తున్నామన్నది ఎంత ముఖ్యమో, తన చుట్టూ జరుగుతున్నది, కుటుంబంలో జరుగుతున్నది పరిశీలించి తగు విధంగా స్పందించడం అనేది అంతకంటే ముఖ్యం.
.
” హృదయానికి, మెదడుకు మధ్య సంఘర్షణ తలెత్తితే, హృదయాన్నే అనుసరించండి ”
.
అన్న స్వామీజీ మాటను తనకు, ఇంటి విషయాలకు, ఆర్థిక విషయాలకు తప్పకుండా అన్వయించుకోవాలి. మరీ ఎక్కువగా లక్ష్యాల మీద గురి పెట్టడం, అదొక్కటే ధ్యాస అన్నట్లుండడం తగ్గించుకోవాలి. మధ్యమధ్య తగినంత విరామమిస్తూ ఉండాలి. ఎదుర్కొనే ప్రతి సందర్భాన్ని, సవాలును విశ్లేషించి పరిష్కరించుకుంటే తరువాతి మెట్టు ఎక్కడం జరుగుతుంది. అంతేగాని,
” ఫలితంపై ఎంత శ్రద్ధ చూపిస్తారో దాన్ని పొందే పద్ధతుల్లోనూ అంతే శ్రద్ధ పాటించాలి ”
అని స్వామీజీ చెప్పినట్టు, ఫలానా విషయంలో ఫలితం రావడం ముఖ్యం, దానికోసం ఎటు వెళ్ళినా, ఎలా వెళ్ళినా ఫరవాలేదు అనే ధోరణి కూడదు. ఇలా చెయ్యడం వల్లే నేరాలు పెరిగిపోతున్నాయి.
.
” రోజుకు ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి. లేకపోతే, ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతారు ” అని ఆయన ఉపదేశించినట్టు, ఇలా మాట్లాడుకోవడం అనేది ఆత్మ పరిశీలనకు, విమర్శకు దారి తీస్తుంది. ‘ నేను సంజాయిషీ ఇవ్వాల్సినది ఎవరికో కాదు, నాకే ! ‘ అని అర్థమవుతుంది. ఈ స్థాయి వచ్చిందా, ఇక తిరుగుండదు. ఈ మానసిక స్థితి, ఈ నిశ్చింతే ఏకాగ్రతను ప్రసాదిస్తుంది.
.
” కొందరు మాటలు కూడబలుక్కొని చదువుతారు
కొందరు ఒక వాక్యం వెంట ఇంకొకటి చదువుతారు
నేను అమాంతం పుస్తకాలనే ఒకదాని తరువాత ఒకటి గబగబా చదివేస్తాను “
అన్న అర్థంలో స్వామీజీ ఆత్మవిశ్వాసంతో చెప్పుకున్నట్టుగా మీరూ చెప్పుకోవచ్చు.
యువతరం ఈ విధంగా ఎదగాలంటే అత్యంత ముఖ్యమైనది తల్లిదండ్రుల, శిక్షకుల పాత్ర.
.
” వివేకానందుడి తల్లి ఆయనను శిక్షించడం శిక్షణ రూపంలో చేసింది కాబట్టే ప్రపంచానికి వివేకానందుడు దక్కాడు ” అన్నారు గరికపాటి నరసింహారావు. ఇది శిరోధార్యంగా తీసుకొని, సంస్కారం అబ్బితేనే చదువుకు సార్థకత, ఇందుకు సంస్కృతి తోడ్పడుతుంది అని నమ్మి తల్లిదండ్రులు కనుక పిల్లలను సాకితే…. రహదారి మీదో, ఇంట్లోనో అయినవాళ్ళ శవం ఉన్నా, ఆరోజే పోటీ పరీక్షకి వెళ్ళడమే కర్తవ్యమని, అలా చేస్తే అదే గొప్ప అన్నట్టు అమితమైన ప్రచారం కల్పించే సమాజాన్ని కాదని మనుషులుగా ఎదుగుతారు. అవకాశాలనేవి అనంతం, మానవత్వమే ముందు అవసరం అని అర్థం చేసుకొంటారు.
.
” మిమ్మల్ని శారీరకంగా, మేధోపరంగా, ఆథ్యాత్మికపరంగా బలహీనపరిచే దేన్నైనా విషంగా భావించి తిరస్కరించండి ” అని స్వామీజీ అన్న మాటను పాటిస్తారు. ఆయన చెప్పినట్టుగా ” దేశాన్ని / ప్రపంచాన్ని నిర్మించే ధైర్యం, తెగువ, స్వచ్ఛమైన మనసు కలిగిన యువత అనే పునాది ” ఎప్పటికప్పుడు ఏర్పడుతుంటుంది.
.
********* లోకా సమస్తా సుఖినో భవంతు *********