.
శ్రీ పి. నాగేశ్వరరావు ~
నాగేశ్వరరావు — ఎవరండీ ఈయన ? ఆర్టిస్టా ? గాయకుడా ? రచయితా ?….
అని మీరు అడుగుతారని నాకు తెలుసును – అసలు మీరు అడగకపోయినా చెప్పవలసిన ధర్మం నాదనుకోండి. అయితే ఇక్కడ సస్పెన్స్ ఏమంటే–
ఆయన నటుడు కాదు – చిత్రకారుడు కాదు – రచయితా కాదు. ఒక సామాన్యుడు… కాని అసామాన్యుడు. పెద్దగా చదువుకున్న వాడు కాదు. వయసులో మరీ పెద్దవాడు కాదు. పెద్ద ఉద్యోగి కానే కాదు. కానీ మానవతా విలువలను పుణికి పుచ్చుకున్నవాడు. అందుకనే అసామాన్యుడు అని అంటున్నాను.
నాగేశ్వరరావు చేసేది పోస్ట్‌మేన్ ఉద్యోగం…!
ఓస్… ఈ మాత్రానికేనా ఆయనని ఏదో అసామాన్యుడు అంటున్నారు అని ఎవరైనా అనుకోవచ్చును. కానీ నాగేశ్వరరావు లో కష్టపడే స్వభావం ఉంది. చేసే పనిలో చిత్త శుద్ధి ఉంది. ఉద్యోగపు బాధ్యతలను చక్కగా, నిష్కామంగా నిర్వహించగలిగిన సామర్ధ్యం, నిర్వహించే అలవాటు ఉంది. అవతలివారిని గౌరవించి, ఆప్యాయంగా మాట్లాడుతాడు.
నేను నివాసమున్న స్థలం విజయవాడ లో లాండ్‌మార్కు అనదగ్గ బెంజ్ సర్కిల్ కి సమీపాన చంద్రబాబు కాలనీ లో ఒకే కాంపౌండ్ లో ఉన్న మూడు independent blocks లో ఒకటైన కనకదుర్గ అపార్ట్ మెంట్స్ లో. మూడు బ్లాకులలో కలిపి మొత్తం 90 అపార్ట్మెంటులు ప్రతీ బ్లాకు లో ఇండిపెండెంట్ గా లెటర్ బాక్స్ లు ఉన్నాయి.
ఈ రోజుల్లో అయితే ఉత్తరాలు, వగైరాలు ఎక్కువగా రావడం లేదు కానీ అప్పట్లో అంటే 15 ఏళ్ల క్రితం పరిస్థితులు వేరుగా ఉండేవి. పోస్ట్ లో వచ్చిన ఉత్తరాలను, బుక్ పేకెట్స్ ని చాలా జాగ్రత్తగా చిరునామాదారులకి అందజేసేవాడు నాగేశ్వరరావు.
ఒక పర్యాయం – ఏమైందంటే వేసవి లో ఒక మిట్ట మధ్యాహ్నం వేళ నేను బయట పనుండి ఇంటినుండి బయలుదేరి రోడ్ మీద నడుస్తున్నాను. నా చేతిలో బ్యాగ్ – దానిలో కొత్త కేప్ ఉన్నాయి. ఈలోగా ఎదురుగా సైకిలు తొక్కుకుంటూ చెమటలు కారుకుంటూ ఎదురయ్యాడు నాగేశ్వరరావు. అతన్ని ఆ స్థితి లో చూసేసరికి నాకు కొంచెం బాధ కలిగింది. వెంటనే ఏదో ఆలోచన నా మనసులో స్ఫురించి అతడిని ఆగమని చెప్పి బేగ్ లో ఉన్న టోపీ ని అతనికి ” ఎండగా ఉంది. పెట్టుకో ” అని ఇచ్చాను. తాను దానిని తీసుకోడానికి ముందు కొంత మొహమాటపడినా, చివరకి నా మాట ని కాదనలేక నాకు ధన్యవాదాలు చెప్పి దానిని తీసుకున్నాడు. నాకు ఆనందం కలిగింది.
అతనికి ముగ్గురు సంతానం… ఆడపిల్లలు… ముగ్గురూ బుద్ధిమంతురాళ్ళే… చక్కగా చదూకుంటున్నారని నేను అతని నుంచి ఆరా తీస్తే తెలిసింది. ఆర్ధిక అవసరాలను దృష్ట్యా, సాయంత్రం డ్యూటీ దిగాకా పార్ట్ టైం మీద కొరియర్ ఆఫీస్ లో అతను పని చేస్తున్నాడని తెలిసింది.
కొన్ని రోజులకి నేను మా పిల్లల దగ్గరకి ఇంగ్లాండ్, అమెరికాలకు బయలుదేరి వెళ్లడం జరిగింది. వెళ్లే ముందు నాగేశ్వరరావు కి ఈ విషయం చెప్పి, నాకు వచ్చే పోస్ట్ ని జాగ్రత్త పెట్టమని చెప్పాను ” ” అల్లాగే సార్ తప్పకుండానండీ ” అన్నాడు వినయంగా.
వెళ్లేముందు అతని అడ్రెస్ తీసుకుని ఇంగ్లాండ్ చేరాకా అతనికి క్షేమసమాచారాలను అడుగుతూ ఉత్తరం వ్రాసాను. అందులో నా మెయిల్ విషయం మరోమారు గుర్తు చేసాను.
కాగా, అతని మంచితనాన్ని ఇక్కడ ప్రస్తావించాలి. ఏమంటే, నేను ఊహించని విధంగా అతను నాకు ఉత్తరం వ్రాయడం. ఆ రోజుల్లో ఎనిమిది రూపాయల ఏభై పైసలు ఖరీదు చేసే ఏరోగ్రామ్ ని కొని అతను నాకు బదులుగా ఉత్తరాన్ని వ్రాయడం నిజంగా విశేషమే !… ఆ ఉత్తరమే ఈనాటి తోక లేని పిట్ట. చక్కటి దస్తూరీ అతనిది.
నేను ఇండియా కి తిరిగివచ్చాకా అతని గురించి వాకబు చేస్తే తెలిసింది… అతనికి ప్రమోషన్ ఇచ్చి హెడ్ పోస్ట్‌ఆఫీస్ కి బదిలీ చేశారని. ఒకసారి నేను వేరే పని మీద అటువైపు వెళ్లడం, అనుకోకుండా పోస్ట్‌ఆఫీస్ లో అతనిని కలుసుకుని పలకరించడం జరిగాయి… ఎంతో ఆనందపడ్డాడు నేను తనని కలిసినందుకు… పిల్లలు సెటిల్ అయ్యారని సంతోషపడుతూ చెప్పాడు.
తరువాత రిటైర్ అయి, ఆ ప్రాంతాలలోనే సంసారం తో సెటిల్ అయి ఆనందం గా జీవిస్తున్నాడు.
ఇదండీ, పోస్టుమాన్ నాగేశ్వరరావు జీవిత కథనం !
పోస్టుమాన్ అంటే ఆ రోజులలో పరమాత్ముడికి ప్రతిరూపం గా భావించే వారు. అతని జీవిత నేపథ్యం లో తెలుగులో ఒక సినిమా కూడా నిర్మింపబడింది కూడాను. దాని పేరు “ దేముడు చేసిన పెళ్ళి ”. అందులో శోభన్‌బాబు, శారద నటించారు.
<><><>*** ధన్యవాదములు + నమస్కారములు ***<><><>