10_011 గతకాలము మేలు

.

“ అబ్బబ్బబ్బ ఏమిటే నీ పట్టుదల! అప్పుడెప్పుడో పెద్దది స్కూల్ లో చేరినప్పుడు, రెండో వాడు తప్పటడుగు లు వేసినప్పుడు, చిన్నది దోగాడు తున్నప్పుడు పంటి కిందికి పనికొస్తాయి కాస్త పాలకాయలు (కృష్ణాష్టమి బియ్యప్పిండి తో చేసే రాయల సీమ పిండి వంటకం రేక్కాయల్లా గుండుగా ఉంటాయి) అని గోముగా అడిగితే ఇప్పుడు కాదు కుదిరినప్పుడు చేస్తా అంటూ ఊరించావు ….ఆ యిప్పుడు ….నీకు ….ఇప్పటికి అని నాకు …… ఇప్పుడే తెలిసింది 60 వ పడి లో పడి రిటైర్ అయిన నెల్లాళ్ళకు దవడ లు నొప్పి పెట్టేటట్లు సరిగ్గా నీకు తీరిక దొరికింది అంటూ చేసి పట్టుకొచ్చి తినమని నీ పట్టు, ఆపై నువ్వేది చేసినా నేను ఈ మధ్య తినట్లేదని పైనుంచి సాధిం పొకటి!! ” వాచిన దవడ ను చేతి గుడ్డ తో ఒత్తుకుంటూ అరిచినంత పని చేశాడు కొండలరావు..

.

“ ఔన్లెండి! ఏమీ తోచక, స్నేహితులు కలవటానికి లేక, ఒంటరిగా యింట్లోనే కాలక్షేపం చేస్తున్నారని జాలిపడి, పైగా నేనే పిండి వంటలు చేసుకుని, మొగుడి కింత పెట్టకుండా మొత్తం తినేస్తున్నానని, వంటల సువాసన తెగ పీలుస్తూ పక్కింటి పంకజం తెగ జాలి పడి పోతుందేమో అని జాలి పడి ఒక్కదాన్నే మెక్కక .. పోనీలే అని పట్టుకొస్తే ఆ మురిపెం, ముచ్చట లేదు, ప్రేమ గా తెచ్చి యిచ్చాను చూడు, నన్ను నేను తిట్టు కోవాలి ఖర్మ ఖర్మ!! మీ దవడ నొప్పి కి నన్నాడి పోసుకోవడం మామూలే! బంగారం లాంటి పిండి వంట పెద్దతనం వలన కాస్త ఘట్టి గా కుదిరింది గానీ రెడీమేడు పిండి వల్ల అది అలా అయ్యిందని తెలుసుకోక ఇన్ని మాటలు.. ముఖం చిట్లింపొకటీ.. హుఁ ! ఇటివ్వండి! నేనే హాయిగా తింటా.. ” అంటూ విస విసా ఆ పిండివంట ప్లేట్ లాక్కుని ” మొగుడి దారి మొగుడిది, పెళ్ళాం దారి పెళ్ళాంది ” అనే సీరియల్ చూట్టానికి టీవీ రూం లోకి నడిచింది ఛాయాదేవి..

.

అదేమీ పట్టనట్టు చెంప ఒత్తుకోసాగాడు కొండల్‌రావు.. ఏం చేస్తాం? మొన్న మొన్న కళ్ళ ముందు కదలాడిన పిల్లలు ఇంతలోనే ఎంత మార్పు? వీళ్ళ పెంపకం, కార్పొరేట్ స్కూల్ చదువులు, ఫారిన్ కంపెనీ ఉద్యోగాలు ఆ ఖర్చుల కోసం తను చేసిన అప్పులు వీటి మధ్య లో భార్యకు తను కొని ఇస్తానన్న వడ్డాణం వాగ్దానం అలానే ఉండిపోయింది. పిల్ల పెళ్లికి చేయిద్దామనుకుంటే, సన్నగా ఉన్న ఛాయాదేవి నడుం కాస్తా పర్వతం లా తయారు అయ్యింది. ఇహ అది మనసులో పెట్టుకుని తను యిలా నన్ను ఏడిపిస్తుందేమో అనిపిస్తుంది… పైగా ఇప్పుడున్న పరిస్థితి లో బయట తిరగలేము కదా కనీసం ఫ్రెండు యింటికి కూడా వెళ్ళలేని దౌర్భాగ్యం!

.

అప్పట్లో ఎంత బాగుండేది !! పిల్లలు తమిద్దర్ని వాళ్ళ దగ్గర కి పిలిపించుకుని విదేశాల్లో వింతలన్ని చూపించి పంపారు ఆ విశేషాలు అన్నీ తను టీ కొట్టు వద్ద, జిలేబీ సెంటర్ వద్ద, పునుకుల బండి వద్ద ఎక్కడ పడితే అక్కడ తన కాలనీ ఫ్రెండ్స్ తో చెబుతుంటే వాళ్ల ముఖాల్లో మెరుపులు, అవీ చూసి తాను కొనిచ్చిన జిలేబీ లూ బజ్జీలు తింటూ ఆనందించే వారితో ఎంత హాయిగా ఉండేది .. అలాంటి జీవితం లో ఒక్కసారిగా ఈ మార్పు… ఇప్పుడు ఒక్కసారిగ తమ బోటి వృద్ధులకు బిగ్ క్వశ్చన్ .. చిన్న చిన్న రుగ్మతల కీ ఏదైనా ఆసుపత్రి గడప తొక్కాలంటే నే భయం భయంగా ఉంటోంది తనలానే కాక ఇంకా ఎక్స్‌రే పరీక్షలు, స్కానింగులు రక్త పరీక్షకి ఎందరికి ఎన్ని ఇబ్బందులో… దేవుడా! మళ్ళీ అందరికి మంచి రోజులు వస్తాయా? అని ఆలోచిస్తూ అబ్భా! అని నొప్పి తో లాగుతున్న దవడ పట్టుకుని అనుకున్నాడు తను.

.

ఇలా…. గత కాలము మేలు వచ్చు కాలము కంటెను… తెలుగు మాస్టారు వల్లె వేయించిన పద్యం బుర్ర లో తిరుగుతుండగా…. నిట్టూర్చాడు మరోపక్క ఛాయాదేవి మాత్రం అదృష్టం ఉండాలి పెళ్ళాం చేసి పెట్టే పిండి వంట తినటానికైన.. అని గొణుగుతూనే ఉంది అప్పుడప్పుడు.. పాపం ఆమె తాపత్రయం ఆమెది…. ఇదివరకు పంకజానికి పెట్టేది, ఇప్పుడు మనిషికి మనిషే దూరం…..

.

*********************************************