10_011 పాలంగి కథలు – ప్రియమైన శ్రీవారికి…

.

షష్టిపూర్తి శుభాకాంక్షలతో కమల–

పెళ్లికి ముందూ, పెళ్లైన కొత్తలోనూ పుంఖానుపుంఖాలుగా ఉత్తరాలు(ప్రేమలేఖలు?!) రాసుకునేవాళ్లం! గుర్తుందా? తర్వాత్తర్వాత…. అదీ ఇంక మన ఊరు వచ్చేసి, మీరు ఫ్యాక్టరీ ఉద్యోగంలో చేరాక వాటి అవసరం తగ్గిపోయిందనుకోండి. అదీ కనీసం 10 రోజులపాటు పుట్టింటికెళ్లడం కూడా తగ్గిపోయాక ఆ ఒకటీ అరా ఉత్తరాలు కూడా లేకుండా పోయాయ్‌. చాలారోజుల (అహ…కాదు సంవత్సరాల తర్వాత) తర్వాత ఇంట్లోనే ఉన్నా కావాలనే పోస్టు చేస్తున్నా. ఈ ఉత్తరం ఆ రోజుల్ని గుర్తుచేసుకుంటూ!!

వచ్చే బుధవారమే మీ రిటైర్మెంట్‌(పదవీవిరమణ) కదూ? ఇప్పటికైనా ఫ్యాక్టరీని వదిలి బైటి ప్రపంచంలోకి రారాదూ? వస్తారనే ఆశతో(ఉద్దేశంతోనే) ఈ ఉత్తరం రాస్తున్నాను. మీరు మొట్టమొదట మదనపల్లి ఉద్యోగంలో చేరినప్పుడు కొత్త ఊరు, కొత్త కాపరం గురించి కూడా ఇలాగే ఉత్తరం రాశాను. ఆనందంగా గడిచాయ్‌ ఆ రోజులు, ఆ 3  సంవత్సరాలు. మీరు రిటైరయ్యాక టైమూ, రోజులూ ఎలా గడపాలో బోల్డు ప్లాన్‌ చేశాను…చెప్పనా?!

ప్రతిరోజూ ఉదయాన్నే ఇద్దరం ఇంచక్కా కలిసి వాకింగ్‌కి వెళ్దాం. మన డాక్టర్‌ గారు ఎన్నిసార్లో మిమ్మల్ని వాకింగ్‌ చెయ్యమని చెబుతూనే ఉన్నారు. ‘ప్రైవేటు ఉద్యోగస్తుణ్ణి. నాకెక్కడ కుదురుతుందీ’ అంటూ ఎప్పుడూ ఆ ఆలోచనే చెయ్యలేదు. పోనీలెండి. ఇప్పుడైనా చెయ్యొచ్చు. అనుకుంటే!

సరే, వాకింగ్‌ కెళ్లివచ్చాక, కాఫీ తాగి పేపర్‌ చూడటమూ, వార్తలు చూడటమూ అయ్యాక, పెరట్లో మొక్కలకి నీళ్లు పోస్తూనూ, వాటి బాగోగులు చూస్తూనూ కాసేపు గడపొచ్చు!

మన పెళ్లయిన కొత్తలో–ఇంకా ఉద్యోగం రానిరోజుల్లో…గుర్తుందా?  పొద్దున్నే ఓసారి పొలం వెళ్లి వచ్చి 9 గంటలకి కూర్చుని వీణ వాయించేవారు? కావాలనే ఆ గదిలో ఉండటానికోసం, బట్టలు మడతపెడుతూ, ఇస్త్రీ చేస్తూ, నేనూ పాడేదాన్ని! ఇంతకీ నేచెప్పొచ్చేది…అలా మీరు వీణ సాధన మొదలెడుదురుగాని! ఇప్పుడు నేనూ వాయంచగలనుగా వీణ?! మీ వీణతోపాటు–పెళ్లై బొంబాయి(అమెరికా?) వెళ్లిపోయిన  నా శిష్యురాలు వందన మనింట్లో వదిలి వెళ్లిన వీణ కూడా ఉంది. ఎదురు వీణల మీద ఇద్దరం మళ్లీ మొదటినుంచీ సాధన చేదాం. ఏం? సరేనా?

డిసెంబర్‌ నెలలో చెన్నై వెళ్లి మార్గళి సంగీత కచ్చేరీలు ఓ పది రోజులపాటైనా విని వద్దామండీ. అన్నట్లు తిరువయ్యార్‌ నేను వెళ్లానుకానీ మీరు వెళ్లలేదుగా? అందుకే ఈ ఏడాది పుష్యబహుళ పంచమికి తిరువయ్యార్‌ వెళ్లి వద్దాం ఇద్దరం.

మరే…హరిద్వార్, ఋషికేశ్‌ వెళ్లి వద్దామండి. హిమాలయ సానువులూ, గంగానదీ ఎంత బాగుంటాయో! అంటూ మీ స్నేహితులు సత్యం గారూ, వాళ్లావిడా వెళ్లి వచ్చి ఎంతగా వర్ణించారో గుర్తుందిగా! ఇంకా మీకు ఆసక్తి ఉంటే బదరీ, కేదార్‌లు కూడా వెళ్లగల్గితే ఇంకా బాగుంటుంది. ఇద్దరం అలా గంగ ఒడ్డున, దేవాలయాల ప్రాంగణాల్లోనూ కలిసి కూర్చుని ప్రకృతినీ, పరమాత్మ విభూతినీ ఆస్వాదిద్దాం…ఏవంటారు?

ఇవన్నీ అప్పుడప్పుడు చేసేవి. ఇహ రోజంతా ఎలా గడపాలంటారా? చెబుతాగా! ఇద్దరం కలిసి సూపర్‌ మార్కెట్‌కీ, కూరలు కొనడానికీ వెళ్తుందాం. మన పెళ్లయ్యాక ఎంఏ రెండో సంవత్సరం మీరూ, డిగ్రీ చివరి సంవత్సరం పూర్తి చెయ్యడానికి మా పుట్టింట్లో నేనూ ఉన్నప్పుడు తెలుగు సాహిత్యం ఎంతల్లా చదివేవారమో గుర్తుందా? ఉత్తరాల్లో పేజీలకి పేజీలు చెప్పుకునే వారం వాటిగురించి. మధ్యలో అన్నీ అటకెక్కాయ్‌. పోన్లెండి, కానీ ఇప్పుడు మళ్లీ కలిసి కావ్యాలు చదువుదాం. పోతన భాగవతం చాలా బాగుంటుంది. వీలైనప్పుడల్లా చదువుదాం. భారతం, భగవద్గీతలు మీకు ఆసక్తి ఉంటే చదవొచ్చు. ఇలా వరసగా అన్నీ లిస్టు చదూతున్నానని కంగారు పడకండి. నాకు నచ్చినవన్నీ చెప్పాను. మీకేవి నచ్చితే అవే ఒక్కొక్కటీ మొదలుపెట్టి మెల్లిగా చదవ్వొచ్చు!

మీ స్నేహితులు సోమయాజులు మేస్టారూ, సుబ్బారావ్‌గారూ, రిటైరైన ప్రొఫెసర్‌గారూ, ఇంకా కొంతమంది సాయంత్రం అయేసరికి ఆర్ట్స్‌ కాలేజీ గ్రౌండ్స్‌లో సిమెంటు బెంచీల మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటూంటారు. ఆమధ్యే రిటైరైన ఎంఎస్‌ రావుగారు కూడా వాళ్లతో కలిసి కబుర్లు చెప్పుకోవడం గురించి మన చిన్నబాబు చెప్పినప్పుడు అనిపించింది. మీరు కూడా అలా రిలాక్స్‌డ్‌గా వాళ్లతో సాయంత్రాలు అలా కాలక్షేపం చేస్తే? అని. మీరంతా చిన్నప్పుడు కలిసి స్కూల్‌కెళ్లి చదూకున్నాం అంటుంటారుగా! అందుకే. ఇప్పుడు మళ్లీ మీరంతా కలిసి గడపడం బాగుంటుందని నా భావన.

సూర్యోదయం, సూర్యాస్తమయం చూసి, ఎన్నేళ్లయిందో గుర్తుందా మీకు? పిల్లలు నిద్రలేచేసరికి వెళ్లిపోయే మీరు, మళ్లీ రాత్రి 8 గంటలకి పిల్లలు నిద్రపోయాకే రావడం ఇంటికి. ఆదివారాలు శలవే కదా అనుకుంటే, ఆరోజు కూడా ఉదయం ఆఫీసుకి వెళ్లి 12 గంటలకి వచ్చేవారు. ఇహ సాయంత్రాలు వీధి అరుగు మీద మీ పెదనాన్నలూ, బాబయ్యలతో కలిసి కబుర్లాడుకునేసరికి రోజు గడిచిపోయేది!

మీకెప్పుడూ చెప్పలేదు కానీ, మన పెద్దాడికి అమ్మా నాన్నలతో కలిసి సినిమా కెళ్లాలని ఎంతో కోరికగా ఉండేది. వాడికి ఆ మాట మీతో చెప్పడానికే అవకాశం ఉండేది కాదు. ఎప్పుడో ఓసారి సినిమా ప్రస్తావన తెస్తే, పిల్లలందర్నీ కలిసి వెళ్లమను. నీకు కావలస్తే నువ్వూ తక్కిన ఆడాళ్లతో వెళ్లు. నా జోలెందుకు? నాకెక్కడ కుదురుతుంది? అంటూ చికాగ్గా ముఖం పెట్టారు. మళ్లీ ఏనాడూ ఈ ప్రస్తావన తేలేదు మీ ముందు. ఇంతకీ వాడి కోరిక తీరకుండానే పెద్దవాడై, ఉద్యోగస్థుడు కూడా అయ్యాడు!

ఎంతసేపూ ఫ్యాక్టరీ, ఇల్లూ, అప్పుడప్పుడు పొలం! అంతే. మరో ప్రదేశమే ఎరగకుండా గడిపేశారు. పోన్లెండి. గతంగతః! ఇంతకీ సుదీర్ఘమైన నా ఆలోచనల అక్షరరూపం ఎలాగుంది? సరేనంటారా? ఆమోదిస్తారా? అన్నట్లు అన్నింటికంటే ముందు, రిటైరవగానే వీలైనంత త్వరలో మీ అమ్మగారినీ, నాన్నగారినీ తీసుకుని కాశీ వెళ్లి  విశ్వేశ్వరుణ్ణి దర్శించుకుని వద్దాం. ఎప్పటినించో అంటున్నారు మీ అమ్మగారు. వాళ్ల సంతోషం మనకి రక్ష. సో, అలా మొదలెడదాం మీ రిటైర్మెంట్‌ సెలబ్రేషన్స్‌. ఓకే?

పదవీ విరమణ శుభాకాంక్షలతో,

మీ అర్ధాంగి

కమల