10_011 వాగ్గేయకారులు – జయదేవకవి

.

జయదేవ కవి – ప్రపంచపు ప్రథమ సంగీత రూపక రచయిత

  ” గీత గోవిందం” ఒక రచన – సంస్కృత భాషా సౌందర్యానికి అద్భుత ప్రతీక  

 

ప్రపంచపు మొట్టమొదటి సంగీత రూపకాన్ని 12వ శతాబ్దంలో రచించిన గొప్ప సంగీత వాగ్గేయకారుడు మన దేశానికి చెందిన వాడు కావటం, అదీ అత్యంత ప్రాచీన భాషైనా సంస్కృతంలో దానిని రచించటం ఒక గమనార్హమైన అంశమే కాక, మన సంస్కృతీ, సంగీత, సాహిత్య నృత్యాలు ఎంతగా పరిణతి చెందాయో చూస్తే ఆశ్చర్యం కలుగక మానదు. 

 

భక్త జయదేవుని గురించి వ్రాసే ముందు సంస్కృత భాషను గురించి చెప్పటం సబబు అనుకుంటాను.

అతిక్లిష్టమైన భాషగా భావించబడే ఈ భాష, ఎంతో క్లుప్తత మరియు స్పష్టత గల భాషని నా అభిప్రాయం. చిన్న పదంలో ఎంతో అర్థాన్ని ఇముడ్చుకుని, దీర్ఘ వివరణకు చాలా అనువుగలది. క్లిష్టత అని అంటున్నానే గానీ, భాషకు సరళతలేదని కాదు. జయదేవుని ఏకైక రచన అయిన “గీత గోవిందం” సంస్కృత భాషకు గల ఈ సౌందర్యాన్ని, పదపటిష్టతనూ నర్మగర్భతనూ, సంగీతానికి, తాళానికీ చక్కగా అమరిపోయే గుణాన్ని అతి లాఘవంగా ఎత్తిచూపుతుంది. 

 

జయదేవుని జీవితంలోని ముఖ్యాంశాల గురించి ఎక్కువగా తెలియకపోయినా, తూర్పు భారతదేశానికి చెందిన ఒక అద్భుతకవిగా పేరుగాంచాడు. ఒడిశా సంగీతంలో జయదేవుని అష్టపదులు ముఖ్యాంశం. ఒడిశి నృత్యంలో కూడా ఇవి చాలా ముఖ్యమైనవి. జయదేవుడు ఇంకా ఇతర రచనలు ఏమైనా చేశాడేమో తెలియదు కానీ,  “గీత గోవిందం” మాత్రం ఒక సాటిలేని, అద్వితీయ రసగుళిక.

 

15వ శతాబ్దంలో పశ్చిమ బెంగాలుకు చెందిన చైతన్య మహాప్రభు భక్తిని ఒక ఉద్యమంగా కొనసాగించటానికి దాదాపు మూడు శతాబ్దాల ముందే జయదేవ కవి, ఈ కృష్ణ భక్తి కావ్యాన్ని రచించి ప్రపంచపు అత్యుత్తమ సంగీత నాటక రూపకర్తగా (ఆపెరా) ప్రసిద్ధికెక్కాడు. బెంగాలులో నవద్వీపకు రాజైన లక్ష్మణదేవ్ ఆస్థాన విద్వాంసునిగా ఉండేవారు. ఇతడు బ్రాహ్మణ కులంలో జన్మించాడని మాత్రమే తెలియవస్తోంది. అతడు పుట్టిన సంవత్సరం గురించి అనేక వివాదాలున్నాయి.  గీత గోవిందం లో అయన పుట్టిన ఊరు “కిందుబిల్వం” అనితెలుస్తోంది. ప్రస్తుత ఒడిశా రాష్ట్రంలో పూరి జగన్నాధం కి దగ్గరగల కిందుబిల్వ గ్రామంలో భోజదేవుడు, రాధాదేవి అనే దంపతులకు  జన్మించాడు. రామాదేవి అని కూడా అంటారు కొందరు. కొన్ని వ్రాతప్రతుల్లో జయదేవుని తల్లి పేరు వామాదేవి అని కూడా పేర్కొనబడి ఉంది.

గీతగోవిందపు 12 వ సర్గలో జయదేవుడు తనను గురించి ఇలా చెప్తాడు:

 

” శ్రీ భోజదేవ ప్రభావస్య రాధా/రామా

దేవీ సుత శ్రీ జయదేవ కస్య

పరాశరది ప్రియవర్గ కంఠే

శ్రీ గీతగోవిందా కవిత్వమస్తు ” .

 

బెంగాలు, ఒడిశా ఇంకా మిథిలకూ చెందిన విద్వాంసులు, పండితుల నడుమ జయదేవుడు తమ వాడేననీ, తమతమ ప్రాంతాలలో ఈ కిందుబిల్వ గ్రామం ఉందని వాదులాడటం వినవస్తూ ఉంటుంది. ఇందులో పూరి క్షేత్రానికి చెందిన కెందులి శాసనాన్ని కూడా పేర్కొంటూ ఉంటారు. ఇలాగే జయదేవ కెందులి బీర్భూమ్ జిల్లాకి చెందిన వాడనీ, ఇది ప్రస్తుత బీహార్ రాష్ట్రంలోని మిథిల దగ్గరగా గల ఝామ్ఝర్‌పుర్ కూడా చేరి ఉంది. ఇప్పటికీ జయదేవకవి ఏ ప్రాంతానికి చెందిన వాడనే అంశంపై సరైన అవగాహన లేదు. బహుశా ఊరూరా తిరిగే అలవాటు గల జయదేవుడు పూరి సందర్శించినప్పుడు అక్కడ పద్మావతి అనే పేరుగల నర్తకిని వివాహమాడి ఉండవచ్చు. దీనికీ ఒక కథ ఉంది. పద్మావతి తండ్రి అదే ఊరిలో ఉండే దేవశర్మ. ఈతడు తన మొదటి సంతానాన్ని శ్రీ పురుషోత్తమ స్వామివారికి అర్పిస్తానని మ్రొక్కారట. అదే విధంగా వారి ప్రథమ సంతానం అయిన పద్మావతిని శ్రీ పురుషోత్తమ స్వామివారికి అర్పించినారట. ఆ రాత్రి దేవస్థానం పూజారులకు స్వామివారు కలలో కనిపించి ఆ బాలికను జయదేవుని వద్దకు తీసుకువెళ్లి, అతడికిచ్చి వివాహం చేయమని చెప్పారట. తనకు వివాహమాడేంత స్తోమతు లేదని ముందు వాపోయినా, ఆ అమ్మాయి సేవలకు ముగ్ధులై వివాహం చేసుకున్నాడట. దీని గురించి కూడా నిఖార్సైన దాఖలాలు ఉపలబ్ధం కాకపోయినా, అతడి అష్టపదులకు ఆమె నర్తించేదని, ఇలా వీరు అనేక రాజదర్బారులలో కలిసి ప్రదర్శనలు చేసేవారని మనం భావించవచ్చు. 

ఇలా ఒకసారి బృందావన యాత్ర ముగించుకుని జయపురం వైపు వస్తూ ఉండగా మార్గమధ్యంలో దొంగలు దోచుకోవటమే కాక, జయదేవుని మీద దాడి చేసి, అతని కాళ్ళు, చేతులు నరికివేశారు. ఒక దయగల రాజు వీరిని చేరదీసి, జయదేవునికి చికిత్స చేయించి తిరిగి ఆరోగ్యవంతుడిని చేసాడు. ఆ తరువాత కొన్నాళ్లకు దొంగలు సాధువుల వేషంలో వచ్చి రాజుగారి ఆస్థానంలో బసచేసి, జయదేవుడికి జరుగుతున్న రాచ మర్యాదలను చూసి ఆశపడినప్పుడు, జయదేవుడు వారికీ ఆ రాజుచేత ఎన్నో బహుమతులు, ధనం ఇప్పించాడట. అయినా వారు రాజుతో ఒక అబద్ధం చెప్పారట. తమను జయదేవుడిని చంపమని ఎవరో రాజు కోరగా కేవలం కాళ్ళు, చేతులూ మాత్రమే నరికి వదిలేశామని సంజాయిషీలాగా చెప్పుకున్నారట. కానీ వారి అబద్ధానికి భూదేవి కోపించి రెండు ముక్కలుగా చీలిపోయి, ఆ దొంగలు మధ్యలో భూస్థాపితం అయిపోయారని కథనం. భూమాత దయవలన, జయదేవుని కాళ్ళు, చేతులూ మరలా బాగయిపోయాయట. 

 

గీతగోవిందం లో 12 సర్గలు, 24 రచనలు ఉన్నాయి. ఇవి కాక శ్లోకాలు కూడా ఉన్నాయి. ఒక్కొక్క పాటలో 8 చరణాలు ఉండటం చేత వీటిని “అష్టపదులు” అని  పిలవటం జరుగుతోంది. ఈ సంగీత నాటకంలో ముఖ్యంగా మూడు పాత్రలు కానవస్తాయి. విరహతప్త రాధ, విశ్వంలో సర్వోత్తమ ప్రేమికుడు శ్రీ కృష్ణుడు, గోపికలు ( ఎంతమంది  గోపికలుగా ఈ నాటకంలో నటించారో / నటించవచ్చో తెలియదు ) మరియు ఒక సూత్రధారి. ఈ సూత్రధారి జరిగే కథనాన్ని వర్ణిస్తూ రాధాకృష్ణులు, సఖియల మధ్య జరిగిన కథనాన్ని తనదైన శైలిలో చక్కగా స్వరపరుచుకోగల సరళ సంస్కృతంలో భావగర్భితంగా వ్రాశాడు. 

 

దర్శన అష్టపది :

 

జయదేవకవి పదవ సర్గలోని 19వ అష్టపది వ్రాస్తూండగా, అయన భావుకత ఒక విచిత్రమైన ధోరణిలో నడిచి, కృష్ణునిచే రాధను ఇలా కోరేలా చేశాడట. “స్మరగరళ ఖన్ధానం, మామ శిరసి మండనం, దేహి పద పల్లవముదారం” అంటూ “ప్రియే చారుశీలే ” అనే అష్టపదిలో వ్రాశాడు. “రాధా, ప్రేమనే విషం నా తలకెక్కి నర్తిస్తోంది,  అందుచేత నీ కోమలమైన పాదాలను నా శిరస్సున ఉంచు, అప్పుడే ఆ విషం క్రిందికి దిగుతుంది” అని అర్థిస్తాడు కృష్ణుడు. కానీ ఆ విధంగా పరమాత్ముని గురించి వ్రాయటం అపచారమని ఎంచి, ఆ పంక్తులు కొట్టేశారట. అయన స్నానం చేసి వచ్చి, పద్మావతిని తాను వ్రాసిన ప్రతిని తెచ్చిమ్మని కోరి, అందులో తాను కొట్టివేసిన పదాలు తిరిగి యథాతథంగా ఉండటాన్ని గమనించి పద్మావతిని ఎవరు ఇవి వ్రాశారని అడిగారట. ఆశ్చర్యపడిన పద్మావతి, ” మీరేగా మళ్ళీ వచ్చి ఇవి రాసి వెళ్లారు! మీ చేతి కున్న నూనె కూడా ఇక్కడ అంటినదే ” అని అందట. స్వయంగా శ్రీకృష్ణుని దర్శనం పొందిన పుణ్యశీల పద్మావతి అని తెల్సుకుని, ఆ అష్టపది దర్శన అష్టపదిగా పేరుగాంచింది. ఇందులో ఎనిమిదవ చరణములో ” పద్మావతీ రమణ జయదేవకవి భారతీ ఫణితమితి గీతం ” అని తన పేరుకు ముందుగా పద్మావతి పేరును చెప్పారు.  

 

సంజీవని అష్టపది :

 

అక్కడే ఉంటూ ఉండగా, రాణిగారు పద్మావతి ప్రేమను పరీక్షించటానికి, జయదేవుడు రాజుగారితో వేటకు వెళ్ళినప్పుడు ఒక క్రూర మృగం చేతిలో హతమయ్యాడని అబద్ధం చెప్పిందట. ఇది వినగానే పద్మావతి నేలకూలి  మరణించింది. అది చూసిన జయదేవుడు శ్రీ కృష్ణుని ప్రార్థించగా, పద్మావతి తిరిగి జీవితురాలైంది. అప్పుడు చేసిన రచనయే ” వదసియది కించిదపి దంతరుచే కౌముది “. ఈ అష్టపదిని, శ్రీకృష్ణపరమాత్ములు స్వయంగా  వ్రాసినట్లూ,  పద్మావతిని పునర్జీవితురాలుగా చేసినదీ అని అంటారు. అందుకే దీనికి “సంజీవని అష్టపది” అని కూడా పేరుంది. తరువాత ఆమె శాశ్వతంగా కన్నుమూసిన తరుణంలో భార్యా వియోగ దుఃఖం భరించలేక, జయదేవుడు తన గ్రామం అయిన కెందులికి వెళ్ళిపోయాడు. అక్కడ జయదేవ కవి సమాధి నేటికీ ఉంది.  

 

“గీత గోవిందం” గురించి మరొక సంఘటన కూడా ఉంది. ఒరిస్సా రాజైన పురుషోత్తముడు జయదేవునిపై ఈర్ష్యతో తానుకూడా గీతగోవిందాన్ని పోలిన ఒక రచనను “అభినవ గీతగోవిందం” అనే పేరుతో రచించి, ప్రజలు దానినే గానం చేయాలని నిర్బంధం చేశాడట. కానీ ప్రజలు జయదేవకృత గీతగోవిందాన్నే పాడటానికి మొగ్గు చూపటంతో, రెండు రచనలలో ఏది గొప్పదో నిర్ణయించటానికి రెండిటినీ, పూరీ జగన్నాధ దేవాలయంలో ఉంచి తలుపులు మూయించి వేశాడట. మరునాడు ఉదయం చూడగా, జయదేవుని రచన స్వామివారి కరకమలాలలో విలసిల్లుతూనూ, రాజుగారి రచన గుడిలో ఒక మూలంగానూ కానవచ్చాయట. అప్పుడు రాజుగారు తన తప్పును తెలుసుకుని, జయదేవుని భక్తి మర్యాదలతో చూసుకున్నాడట.

 

గీతగోవిందం లోని అష్టపదులు అన్ని సమయ సందర్భాలలోనూ, పెద్ద కచ్చేరీలలోనూ, లలిత సంగీతంగానూ కూడా పాడుకోదగిన రచనలు. అందుచేత దీనిని “జీవ ప్రబంధం” అని కూడా పిలవవచ్చు. మొదటి ప్రారంభ మంగళ శ్లోకం యమునా నదీ తీరాన్ని ఇలా హృద్యంగా వర్ణిస్తుంది.

 

” మేఘై ర్మేదురమంబరం వనభవన శ్యామస్తమాలదృమైహి 

నక్తం భీరురయం త్వమేవ తదిమం రాధే! గృహం ప్రాపయా

ఇత్థమ్ నందనిదేశతశ్చలితయో  ప్రత్యధ్వకున్జద్రుమం 

రాధా మాధవయోర్జయంతి యమునాకూలేరహః కేళయః ||

 

నందుడు ఒకరోజున రాధను ఈ విధంగా కోరతాడు. ” ఆకాశంలో మబ్బులు దట్టంగా క్రమ్ముకున్నాయి. అరణ్యమంతా కానుగు చెట్ల నీడతో నల్లగా మారింది. కృష్ణయ్యకు చీకటి అంటే భయం. నీవు వెళ్లి అతడిని

వెంట పెట్టుకుని తీసుకురా ” అనే పురమాయింపుతో ఈ సంగీత నాటకం మొదలౌతుంది. అలా వెళ్లిన రాధ యమునా తీరంలో పొదరిళ్లలో రాధ మరియు శ్రీకృష్ణుల రాసక్రీడలే దీని కథాంశం.

 

కృష్ణ పాత్రకు 3 అష్టపదులు, రాధకు 8, సఖియలకు 9 అష్టపదులు కేటాయించినట్టు తోస్తుంది. విడిగా లేదా బృందగానంగా పాడదగిన మరొక 4 అష్టపదులలో “ప్రళయ పయోధి జలే”, దశావతార వర్ణన గల ” శ్రిత కమలా కుఛ మండల ” చాలా ప్రాచుర్యం పొందినవి. ఇవి పాశ్చాత్య సంగీతంలో/ సాహిత్యంలో గ్రీక్ కోరస్ అనే పద్ధతిలో నాటకం మధ్యలో బృందగానం రూపంలో జరుగుతున్న కథను వర్ణించే విధానాన్ని తలపిస్తాయి.

 

ఒక తాళపత్ర గ్రంథంలో శ్రీముఖ నామ సంవత్సరం, మార్గశిర, కృష్ణపక్ష ఏకాదశి నాడు దివంగతులైనట్లు కోటిర కృష్ణ పండాజీ అనే పండితుని వద్ద నుంచి లభించిన తాళపత్ర గ్రంథం నుంచి తెలియవస్తోందని ప్రొఫెసర్ శ్రీ పి. సాంబమూర్తిగారు పేర్కొన్నారు. అంటే ఇది 28 డిసెంబర్, 1153 ఏ.డి అయిఉండొచ్చని అవగతమౌతుంది. ఇవి రచించిన స్థలానికి జయదేవపురమని పేరు వచ్చిందని ప్రొఫెసర్ పి. సాంబమూర్తిగారు వ్రాశారు. ఏటా కిందుబిల్వంలో ఉత్సవాలు జరిపి, అక్కడ ఈ అష్టపదులు గానం చేస్తారు.

 

ఇక్కడ ఒక విషయాన్ని ప్రస్తావించటం చాలా అవసరమని అనుకుంటున్నాను. 1977 / 78 లో ఆకాశవాణి భోపాల్ వారు, అప్పటి స్టేషన్ డైరెక్టర్ శ్రీ జోసెఫ్ వెణ్ణియూర్ గారి ప్రోత్సాహంతో ఈ గీత గోవిందం కావ్యాన్ని ఒక చక్కటి సంగీత రూపకంగా రేడియోలో ప్రసారం చేయటమే కాక, భోపాల్ నగరంలో ఉన్న రవీంద్ర భారతి భవనం లో ఒక నృత్య సంగీత రూపకంగా ప్రదర్శించారు. దాదాపు 40 అడుగుల రంగస్థలాన్ని, రెండు భాగాలుగా విభజించి,  వెనుక సగం భాగంలో షాడో ప్లే విధానంలో ఈ రూపకాన్ని నృత్య విధానంలో ప్రదర్శిస్తూ, ముందరి భాగంలో ఫ్లడ్ లైట్ల క్రింద గాయనీ గాయకులు రూపకంలోని ఆయా పాత్రలను పోషిస్తూ, పూర్తి రేడియో ఆర్కెస్ట్రా సహాయంతో పాడటం ఒక అద్భుతమైన  విషయం. ఈ రూపకంలో రాధ అష్టపదులను నేను పాడగా, శ్రీకృష్ణుని  పాటలను కీ.శే. రామకృష్ణ చందేశ్రీ, సూత్రధారిగా కీ.శే. శ్రీ జగదీశ్ సింగ్ ఠాకూర్, సఖియలుగా శ్రీమతులు సురేఖా కోర్డే, జయశ్రీ తట్టే, కుసుమ్ బడోద్కర్ ఆలపించారు. దీనికి సంగీతాన్ని సమకూర్చింది నేను ( అసిస్టెంట్ ప్రొడ్యూసర్/సంగీత రచన ),  కీ. శే.  బిరాజ్ భూషణ్ బసు, శ్రీ రామకృష్ణ చందెశ్రీ. ఈ సంగీత రూపకాన్ని గురించి అన్ని ఇంగ్లీష్ వార్తా పత్రికలూ ఎంతో కొనియాడాయి. దీని విజయం తరువాత, ఏటా జరిగే కాళిదాస్ మహా సమారోహ్ లో కూడా ఇది ఆకాశవాణి కళాకారులచే మళ్ళీ ప్రదర్శించబడింది. తిరిగి జబల్ పూర్ లో కూడా ప్రదర్శించిన తరువాత,  అల్ ఇండియా రేడియో ఢిల్లీ నుంచి ఇది జాతీయ కార్యక్రమంగా ప్రసారం చేయబడింది. టెలివిజన్ సౌకర్యం లేని ఆరోజుల్లో, ఒక అనుపమానమైన షాడో ప్లే ద్వారా, గీత గోవిందం వంటి సంస్కృత సంగీత రూపకానికి ఒక నాటకీయతను ఆపాదించి, ప్రజలకు ఈ సంస్కృత భాషలో అందాన్ని అందచేసిన ఆలిండియా రేడియో భోపాల్ కి నా కృతఙ్ఞతలు ఈ పత్రికా ముఖంగా కూడా తెలియచేసే అవకాశం నాకు కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది.

 

మరొక విశేషం ఏమిటంటే, జయదేవ కవి యొక్క ఈ రచనలను గురించి, సిక్కుల పవిత్ర మతగ్రంథమైన గురుగ్రంథ్ సాహెబ్ లో ప్రస్తావించినట్లు దాఖలున్నాయి. భారత ఉపఖండంలో ప్రాథమిక మతగ్రంథం గా ఇది భావించబడుతుందనే విషయం అందరికీ తెలిసినదే.

ఏది ఏమైనా, జయదేవుని గీతగోవిందం నాకెంతో ప్రియమైన సంస్కృత కావ్యం.

.

అందరూ మెచ్చినది :

” రాధా విహార ” – స్వరకల్పన మరియు గానం : కె. ఎస్. వసంతలక్ష్మి

.

నాకు నచ్చినది :

” రాధాష్టమి ” – స్వరకల్పన మరియు గానం : కె. ఎస్. వసంతలక్ష్మి